రక్షాబంధనం సోదర ప్రేమకు రక్ష

13 Aug, 2016 23:45 IST|Sakshi
రక్షాబంధనం సోదర ప్రేమకు రక్ష

ఆగస్టు 18 రాఖీ పౌర్ణమి
 

ఒకసారి రాక్షసులు దేవతలపై దండెత్తారు. దేవరాజు ఇంద్రుడు రాక్షసులతో తీవ్రంగా పోరాడాడు. ఈ పోరులో రాక్షసులదే పైచేయిగా మారింది. ఇంద్రుని బలం క్షీణించి అలసి సొలసి స్పృహతప్పి నేలపైకి ఒరిగిపోయాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపి, రాక్షసులకు లొంగిపోవటం శ్రేయస్కరమని దేవగురువు బృహస్పతి హితవు పలికాడు. మహేంద్రుని భార్య శచీదేవి యుద్ధం లో విజయం సాధించడానికి తన పతికి తగిన బలం ప్రసాదించవలసిందని త్రిమూర్తులను ప్రార్థిస్తూ ఒక రక్షాబంధనాన్ని భర్త చేతికి కట్టి, ఆయనను ఉత్సాహపరుస్తూ, తిరిగి యుద్ధానికి పురికొల్పింది. రక్షాబంధన ధారణతో నూతనోత్తేజం పుంజుకున్న ఇంద్రుడు ఈసారి యుద్ధంలో అవలీలగా రాక్షసులను జయించాడు.

 రక్షాబంధన ప్రాశస్త్యాన్ని గుర్తించిన దేవతలు ఆనాడు శ్రావణ పూర్ణిమ కావడంతో నాటినుంచి ప్రతి శ్రావణ పూర్ణిమనాడూ ఎవరి శ్రేయస్సునైతే తాము కాంక్షిస్తున్నామో వారికి బలాన్ని, శక్తిని ప్రసాదించి, రక్షణనివ్వవలసిందిగా కోరుతూ వారి ముంజేతికి రక్షాకంకణాన్ని కట్టడం ఆచారంగా మారింది. దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు, తదితర విపత్తుల బారినుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా మీకు రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రక్షాబంధనం కట్టడం, వారికి తీపి తినిపించడం, ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించే ఆచారంగా రూపుదిద్దుకుంది.
 
రాఖీ ఇలా కట్టాలి
 శ్రావణ పూర్ణిమనాడు సూర్యోదయకాలంలోనే స్నానవిధిని పూర్తి చేయాలి. ఎవరిని రక్షించదలిచామో- అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా దైవశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట.

ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు- మనం ఎవరిని రక్షించడానికి అండగా నిలువదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి బహిరంగ ప్రదేశంలో కడుతూ- ‘తప్పక అండగా నిలుస్తానని ప్రమాణం చేస్తున్నా’నంటూ - బంధుస్నేహితుల మధ్య ప్రకటించి ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఇలా కట్టడాన్ని అపరాహ్ణసమయంలో (అహ్నం అంటే పగలు. అపరం అంటే మధ్యాహ్నం 12 దాటాక. కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. ఈ విధానాన్ని గర్గ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమేనని తెలుస్తోంది. రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక  వదిలేయకూడదు. మాటకి కట్టుబడి ఆ సంవత్సరకాలం పాటూ ఆమెకి అండగా నిలవాలి.
 
మరో ముఖ్య విశేషమేమిటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే. రక్షాబంధనం కట్టే సమయంలో ఈ కింది శ్లోకం చదవాలి.
 యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః
 
తేన త్వామపి బధ్నామి రక్షే! మా  చల మాచల!
రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమైపోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడా ఈ మిత్రునికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. రాజుల కాలంలో తెల్ల ఆవాలతోనూ, అక్షతలతోనూ పూజించిన రక్షికని కుల పురోహితుడు (ఇంటి పురోహితుడు) ఆ దేశపు రాజు ముంజేతికి ముడి వేసేవాడు. చక్కని సూచనలనిస్తూ ఉపాయాలు చెప్తూ రక్షిస్తూ ఉంటానని భావం.

ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో మాత్రం సరిపెట్టకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సామాజిక శ్రేయస్సు పరిఢవిల్లుతుంది.  - డి.వి.ఆర్.
 
 
రాఖీ కట్టడం పూర్తయింది కదా అని వదిలేయకూడదు. మాటకి కట్టుబడి ఆ సంవత్సరకాలంపాటూ ఆమెకి అన్నింటా అండగా నిలవాలి. ఇది స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే..!
 
 
 

మరిన్ని వార్తలు