ఈ ఆటోడ్రైవర్‌ అందరివాడు!

27 Aug, 2017 01:17 IST|Sakshi
ఈ ఆటోడ్రైవర్‌ అందరివాడు!

ఢిల్లీలో ఒక సాయంత్రం...కల్‌కాజీలో ఒక ప్రయాణికుడిని దింపి తిరుగు ప్రయాణమైన ఆటోడ్రైవర్‌ అనీల్‌ కుమార్‌కు ఒక దృశ్యం కంటపడింది. రోడ్డు పక్కన ఒకచోట కూర్చున్న నాలుగు సంవత్సరాల పిల్లాడు ఏడుస్తున్నాడు. ఆ పిల్లాడి ఏడుపు ఆపించడానికి అనీల్‌కు తలప్రాణం తోకకు వచ్చింది.కాస్త ఆలస్యంగా తెలిసిన విషయం ఏమిటంటే  ఆ పిల్లాడు దారితప్పాడని.‘ఎక్కడి నుంచి వచ్చావు?’‘మీ ఇల్లు ఎక్కడ?’.... ఇలా రకరకాల ప్రశ్నలు  ఆ పిల్లాడిని అడుగుతూనే ఉన్నాడు.
ఆ పిల్లాడు ఏదో చెబుతూనే ఉన్నాడు.

కానీ ఏమీ అర్థం కావడం లేదు. ఆ పిల్లాడి ఇల్లు ఎక్కడో తెలియడం లేదు.మూడు గంటల తరువాత చిన్న క్లూలాంటిది దొరికింది. ఆ క్లూ ఆధారంగా ఒక ప్రాంతానికి వెళ్లి ‘ఈ పిల్లాడు మీకు ఏమైనా తెలుసా?’ అంటూ ఇల్లిల్లూ తిరగడం ప్రారంభించాడు. ఎట్టకేలకు ఒక వ్యక్తి గుర్తు పట్టాడు. ఆ పిల్లాడి ఇంటికి తీసుకువెళ్లాడు. తప్పిపోయిన పిల్లాడి కోసం శోకాలు పెడుతున్న తల్లిదండ్రులకు ప్రాణం లేచివచ్చింది. అనీల్‌ను దేవుడిని చూసినట్లు చూశారు. అప్పుడు వారి కళ్లలో కనిపించిన కాంతి అనీల్‌లో పెద్దమార్పు తీసుకువచ్చింది. ఒక మంచిపని చేస్తే కలిగే తృప్తి ఎంత గొప్పదో తెలిసొచ్చింది.

ఇక అప్పటి నుంచి ఏ పిల్లాడు రోడ్డు మీద ఏడుస్తూ కనిపించినా, రకరకాలుగా ప్రయత్నించి వారిని ఇంటికి చేర్చే బాధ్యతను తలకెత్తుకున్నాడు. ఇది మాత్రమే కాదు... పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ‘తప్పిపోయిన పిల్లల వివరాలు ఇస్తే... వారిని ఇంటికి చేరుస్తాను’ అని చెప్పాడు. తప్పిపోయిన పిల్లలను ఇంటికి చేర్చడానికి కొన్ని సందర్భాల్లో అనీల్‌ పోలీసుల సహాయాన్ని తీసుకునేవాడు. కొన్ని సందర్భాల్లో పోలీసులు అనీల్‌ సహాయాన్ని తీసుకునేవారు.తప్పిపోయిన పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చడానికి అనీల్‌ పడుతున్న  తపన పోలీసులను ఆకట్టుకుంది.

‘‘ఈ మహానగరంలో ఒకరి గురించి మరొకరు పట్టించుకునే తీరిక ఉండదు. మంచిచెడులు, కనీసబాధ్యతల గురించి ఆలోచించుకునే సమయం కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా... తమ పనికి ఆలస్యం అవుతుందనే ఆలోచన వారిని వెనక్కిలాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనీల్‌కుమార్‌ ఎంతోమంది వ్యక్తులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు’’ అంటూ ఒక పోలీస్‌ ఉన్నతాధికారి  అనీల్‌ గురించి ప్రశంసించారు. ‘‘నేనో అసాధారణమైన పని చేస్తున్నాను అనుకోవడం లేదు. పౌరుడిగా నా వంతు బాధ్యతను నిర్వహిస్తున్నాను అంతే. తప్పిపోయిన పిల్లలను నా పిల్లలుగానే భావిస్తాను తప్ప ఎవరి పిల్లలో అనుకోను. నాకెందుకులే అనుకుంటే, రేపు నా పిల్లలు తప్పిపోయినప్పుడు కూడా వేరేవాళ్లు కూడా అలాగే అనుకుంటారు కదా’’ అంటాడు అనీల్‌ కుమార్‌.

మరిన్ని వార్తలు