మితంగా వాడితే హితమే

22 May, 2016 03:05 IST|Sakshi
మితంగా వాడితే హితమే

ఆవకాయ - ఆయుర్వేదం
ప్రకృతిలో నేరుగా లభించే ఆహార పదార్థాల పోషక విలువల గురించి, ఇతర గుణధర్మాల గురించి కూలంకషంగా వివరించింది ఆయుర్వేదం. వివిధ ద్రవ్యాల సమ్మేళనంతో మనం వండుకు తినే ఆహార పదార్థాలను ‘కృతాన్నములు’గా విశదీకరించింది. కాని, ఎక్కడా ఆవకాయ (ఊరగాయ) గురించిన ప్రస్తావన కనబడదు. కాబట్టి ఆవకాయలో ఉండే వివిధ ద్రవ్యాల గుణధర్మాలను గుర్తెరిగి మనం అన్వయించుకుని, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
 
ఆవకాయలోని పదార్థాలు
ముదిరిన పుల్లటి మామిడికాయ, ఆవపొడి (ఆవాలు), ఉప్పు, కారంపొడి (ఎండు మిరప), నువ్వులనూనె. కొంత తక్కువ పరిమాణంలో ఇంగువ, పసుపు, మెంతులు, కొన్ని ప్రాంతాల్లో వెల్లుల్లి కూడా కలుపుతారు. ఇంకొన్ని ప్రాంతాల్లో బెల్లం కూడా కలుపుతారు. ఉత్తరాది వారు ఆవకాయలో సోంపు కూడా వాడుతారు. స్థూలంగా పరిశీలిస్తే ఆవకాయలో షడ్రసాలు (మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ)  కనిపిస్తాయి.
 
మామిడికాయ: అమ్లరస ప్రధానం (పులుపు). కాబట్టి రుచి, ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి. లఘువు (సులువుగా జీర్ణమై, శరీరాన్ని తేలికపరుస్తుంది). ఉష్ణవీర్యం (వేడి చేస్తుంది). మేదస్సు (కొవ్వు) కరిగిస్తుంది. ధాతు పోషకం. కఫ, పిత్త, రక్త వర్ధకం.
 
ఆవాలు: ఇవి పసుపు, ఎరుపు, నలుపు రంగుల్లో మూడు రకాలుగా ఉంటాయి. రుచికి చేదుగా, కారంగా కూడా ఉంటాయి. తీక్ష్ణ, ఉష్ణ గుణాలు ఉంటాయి. కృమిహరము (కడుపులో క్రిములను నాశనం చేస్తాయి). అగ్నిదీప్తికరం (జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి).
 
కారం (కటురసం): సనాతన ఆయుర్వేద గ్రంథాల్లో కారానికి సంబంధించి మిరియాలు మాత్రమే కనిపిస్తాయి. మిరపకాయ క్రీస్తుశకం 17వ శతాబ్దంలో విదేశాల నుంచి మనకు సంక్రమించిన పదార్థం. కటురసం. దీపన పాచనాలు చేస్తుంది. వాపులను తగ్గిస్తుంది. తీక్ష్ణ, ఉష్ణ గుణాలను కలిగి ఉంటుంది.
 
ఉప్పు (లవణరసం): తీక్ష్ణమై చెమటను కలిగిస్తుంది. రుచికరమై జీర్ణక్రియకు దోహదపడుతుంది. శరీరంలోని కొవ్వు కంతులను కరిగించి, జడత్వాన్ని పోగొడుతుంది. అయితే, షడ్రసాలలో అతి తక్కువగా తినవలసింది లవణరసం. దీనిని ఎక్కువగా సేవించవద్దని చరక మహర్షి హెచ్చరించాడు. నిజానికి ఇది ‘హిత శత్రువు’ చక్కని రుచి కలిగించి, తృప్తినిచ్చే మిత్రునిలా ఉంటూనే వెనుక ఎన్నో రోగాలను కలిగించే శత్రువన్న మాట. ఎక్కువగా వాడితే బట్టతల, శిరోజాలు రాలిపోవడం, తలనెరపు, శరీరంపై ముడుతలు వంటి లక్షణాలు యుక్తవయస్సులోనే కలుగుతాయి. ఎముకలు, కీళ్లు బలహీనమవుతాయి. కంటిచూపు మందగిస్తుంది.
 
నువ్వులనూనె: త్రిదోషహరం. మేధావర్ధకం, దీపనం (జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది), శూలహరం (నొప్పులను తగ్గిస్తుంది).
 
ఇంగువ, పసుపు, మెంతులు, వెల్లుల్లి: ఇవన్నీ కోష్ఠశుద్ధికి (కడుపును శుభ్రపరచడానికి) పనికొస్తాయి. తీక్ష్ణ, ఉష్ణగుణాలు కలిగి ఉంటాయి. క్రిములను నాశనం చేస్తాయి. నొప్పులను తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. విడివిడిగా ఇలాంటి గుణధర్మాలను కలిగిన ద్రవ్యాలన్నింటినీ సమ్మేళనం చేసి, నిల్వ ఉంచితే తయారయ్యే ఊరగాయే ‘ఆవకాయ’.
 
ఆవకాయ ప్రభావం
ఇందులోని ఏ ద్రవ్యమైనా అతిగా సేవిస్తే అన్నీ అనర్థాలేనని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల ఆవకాయను తక్కువ పరిమాణంలో అప్పుడప్పుడు తింటే ఫర్వాలేదు. మితంగా తింటే అలసత్వం పోయి చురుకుదనం కలుగుతుంది. నోటికి రుచికరంగా ఉంటుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
 
ఎలా తినాలి?
కొందరు నెయ్యి కలిపిన పప్పన్నంతో తప్ప ఆవకాయను తినరు. ఇది చాలా మంచి పద్ధతి. ఇలా తింటే, జీర్ణకోశానికి రక్షణ కలిగి, అల్సర్లు రాకుండా ఉంటాయి.
కొందరు వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని, పైన వెన్నపూస వేసి తింటారు. వెన్నపూసలోని స్నిగ్ధత్వం ఆవకాయలోని తీక్ష్ణత్వాన్ని అణచివేస్తుంది. ఫలితంగా మనలో పుట్టే వేడి తగ్గుతుంది.
కొన్ని ప్రాంతాల్లో ఆవకాయ అన్నంలో నెయ్యి కలుపుకుంటారు. కొందరు నువ్వులనూనె లేదా వేరుశనగ నూనె కలుపుకుంటారు. ఇది కూడా ఆవకాయ అహం‘కారాన్ని’ అణచివేయడానికే.
కొందరికి పెరుగు లేదా మజ్జిగ సేవించే అలవాటు ఉండదు. అలాంటప్పుడు ఆవకాయ మన శరీరంపై తప్పక విపరీత ప్రభావం చూపుతుంది. కళ్లు మంట, మూత్రంలో మంట, మలవిసర్జన సమయంలో మంట, మలబద్ధకం, కాళ్లుపీకటం, జ్వరం, నీరసం, కడుపులో మంట వంటి లక్షణాలు కలుగుతాయి. వ్యావహారిక భాషలో దీనినే ‘వేడిచేసింది’ అంటాం.
పెరుగు, మజ్జిగతో పాటు నీళ్లు కూడా ఎక్కువగా తాగితే ఆవకాయ ఘాటు శరీరంపై తక్కువగా ప్రభావం చూపుతుంది.
శరీరానికి షడ్రసాలను అలవాటు చేయడం వల్ల బలం కలుగుతుందని, ఏకరస ప్రధానంగా ఆహారం తీసుకుంటే తగిన పోషకాలు లభించవని చరకాచార్యులు చెప్పారు. కనుక ఆవకాయను అప్పుడప్పుడు మితంగా తింటే మంచిదే.
కాని, ఈ హితశత్రువు పట్ల అప్రమత్తంగా లేకుంటే మాత్రం హైబీపీ, కీళ్లవ్యాధులు, స్థూలకాయం, కిడ్నీ సమస్యలు, మధుమేహం, పక్షవాతం, గుండెపోటు వంటివి సంభవించే అవకాశాలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా ఆవకాయలో ఎక్కువ పరిమాణంలో ఉండే ఉప్పే అసలు ముప్పు.
- డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమయూన్‌నగర్, హైదరాబాద్

మరిన్ని వార్తలు