అందమైన కావ్యం

1 May, 2016 02:21 IST|Sakshi
అందమైన కావ్యం

అజర్‌బైజాన్
పాక్షికంగా తూర్పు యూరప్‌లోనూ, పశ్చిమ ఆసియాలోనూ ఉన్న దేశం అజర్‌బైజాన్. 1920లో సోవియెట్ యూనియన్‌లో విలీనమైన ఈ దేశం... సోవియెట్ పతనానికి ముందు 1991 ఆగస్ట్ 30న స్వతంత్రదేశంగా అవతరించింది. 95 శాతం ముస్లిం జనాభా ఉన్న అజర్‌బైజాన్... ఆర్థికాభివృద్ధి, అక్షరాస్యతలో ఉన్నత స్థానంలో ఉంది. ఆధునిక విశ్వవిద్యాలయాలు ఉన్న ముస్లిం దేశాల్లో దీనిది రెండో స్థానం. పురాతన అశ్వజాతికి చెందిన కారాబాక్ గుర్రం వేగానికి, ఆవేశానికి, సౌందర్యానికి పేరుగాంచింది. ఇది అజర్‌బైజాన్ జాతీయ జంతువు.

అధికార భాష అయిన అజర్‌బైజానీతో పాటు డజన్ వరకు  స్థానిక భాషలు  ఈ దేశంలో మాట్లాడతారు. జీవవైవిధ్యంలో అజర్‌బైజాన్ ముందు వరుసలో  ఉంది. 106 జాతుల జంతువులు, 97 జాతుల చేపలు, 363 జాతుల పక్షులు ఈ దేశంలో ఉన్నాయి. బోలెడన్ని పురాతన నదులు, సరస్సులు ఉన్నాయి. ‘కురా’ ‘ఆరిస్’ నదులు అన్నిటికంటే ముఖ్యమైనవి.
 
ఆయిల్, గ్యాస్, బంగారం, ఇనుము, టైటానియం, మాంగనీస్... మొదలైన నిధులు ఉన్న  సుసంపన్నమైన దేశం అజర్‌బైజాన్. దేశంలో 54 శాతం వ్యవసాయ భూములే. వాటిలో చెరకు, పత్తి, పొగాకు మొదలైనవి పండిస్తారు. పాల సంబంధిత, మద్య ఉత్పత్తులు ఈ దేశ ప్రధాన ఉత్పత్తులు. విలువైన వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా స్వదేశంలోనే తయారుచేసుకునే ప్రయత్నాలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి.
 
అజర్‌బైజాన్ 1991లో స్వతంత్రదేశంగా అవతరించిన తరువాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఇస్లామిక్ డెవెలప్‌మెంట్ బ్యాంక్, ఆసియన్ డెవెలప్‌మెంట్ బ్యాంకు మొదలైన వాటిలో సభ్యత్వం తీసుకుని ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సైనిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.
 
ఒకప్పుడు అజర్‌బైజాన్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉండేది. సోవియెట్ యూనియన్ పతనం, ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో పర్యాటక రంగం దెబ్బతిని ఆకర్షణ కోల్పోయింది. 2000 సంవత్సరం నుంచి మాత్రం పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. పర్యాటక ఆదాయం పెరిగింది. అందుకే పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. భౌగోళిక విశిష్టత, అసాధారణ ప్రకృతి సంపదకు తోడు కళ, చారిత్రక, సాంస్కృతిక సంపద కూడా ఈ అగ్నితేజ దేశానికి అరుదైన ఆభరణాలు!
 
 
టాప్ 10
1. అజర్‌బైజాన్ రాజ్యాంగం ఏ మతాన్నీ ‘అధికార మతం’గా ప్రకటించలేదు.
2. మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ అజర్‌బైజాన్ రాజధాని ‘బకూ’లో జన్మించారు.
3. చమురు నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల అజర్‌బైజాన్‌కు ‘ద ల్యాండ్ ఆఫ్ ఫైర్’ అని  పేరు.
4. అజర్‌బైజాన్ అధికార నామం ‘రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్’.
5. అజర్‌బైజానీ భాషలో ఎన్నో మాండలికాలు ఉన్నాయి.
6. రాజధాని ‘బకూ’కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గొబుస్తాన్ నేషనల్ పార్క్’లో వందలాది రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి.
7. దేశంలో నూతన సంవత్సర వేడుకలను ‘నౌరోజ్’ పేరుతో జరుపుకుంటారు.
8. పరిపాలనా సౌలభ్యం కోసం అజర్‌బైజాన్‌ను పది ‘ఎకనామిక్ రీజన్’లుగా విభజించారు.
9. ‘కురా’ అనేది అజర్‌బైజాన్‌లో పొడవైన నది.
10. అజర్‌బైజాన్ ప్రజల ప్రీతిపాత్రమైన పానీయం ‘టీ’.

మరిన్ని వార్తలు