ఈ సమయంలో ఎందుకు వస్తుంది?

26 Aug, 2018 03:15 IST|Sakshi

నేను ప్రెగ్నెంట్‌. ఎప్పుడూ లేనిది నాకు వెన్నునొప్పి వస్తోంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఇది సాధారణమేనని నా ఫ్రెండ్‌ చెప్పింది. ఈ సమయంలో వెన్నునొప్పి ఎందుకు వస్తుంది? నివారణ చర్యలు ఏమిటో వివరించగలరు? – జె.రంజని, తుని
గర్భం దాల్చిన తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మొదటి మూడు నెలల్లో హార్మోన్ల మార్పుల వల్ల, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్‌ ప్రభావం వల్ల నడుము కండరాలు లిగమెంట్‌ కొద్దిగా వదులయ్యి నడుం నొప్పి ఉంటుంది. నెలలు గడిచేకొద్ది, గర్భాశయంలో శిశువు పెరిగేకొద్ది గర్భాశయం సాగి, దాని బరువుతో పాటు తల్లి బరువు వెన్నుపూస మీద పడి, లాగినట్లు ఉండి, నడుము నొప్పి వస్తుంది. నెలలు నిండే కొద్ది శరీరం కాన్పుకోసం సంసిద్ధమవుతుంది. ఈ సమయంలో పొత్తికడుపు కండరాలు, వెన్నుపూస జాయింట్లు వదులు అవుతూ ఉండటం వల్ల నడుము నొప్పి ఇంకా పెరుగుతుంది.

నడుము నొప్పి ఉన్నప్పుడు చిన్నగా వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల, కండరాలు గట్టిపడతాయి. అలాగే నొప్పిని తట్టుకొనేశక్తి లభిస్తుంది. ఉద్యోగం చేసే మహిళలు, సుదీర్ఘంగా కూర్చొని ఉండకుండ మధ్య మధ్యలో లేచి తిరగడం, బాగా వంగి కూర్చోకుండా, వెన్నుపూసకి సపోర్ట్‌ తీసుకుని కూర్చుని పని చెయ్యడం మంచిది. కొద్దిగా వేడినీళ్లలో మసాజ్‌ చేసుకోవచ్చు. మరీ నొప్పి ఎక్కువగా ఉంటే ఎప్పుడైనా ఒకసారి నొప్పి నివారణ ఆయింట్‌మెంట్స్, స్ప్రేలు వాడవచ్చు. మరీ ఎక్కువగా ఉంటే ఎప్పుడైనా పారాసెటిమాల్‌ మాత్ర వాడి చూడవచ్చు. అలాగే విశ్రాంతి తీసుకుంటే కూడా నొప్పి కొద్దిగా తగ్గుతుంది. నొప్పి బాగా తీవ్రంగా ఉంటే, డాక్టర్‌ని సంప్రదించడం తప్పనిసరి.

నా వయసు 22 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. మాకు హోటల్‌ ఉంది. దీనిలో గ్యాస్‌స్టవ్‌తో పాటు కట్టెల పొయ్యి కూడా ఉపయోగిస్తుంటాం. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల గర్భిణులకు మంచిది కాదని ఒక్కరిద్దరన్నారు. ఇది నిజమేనా? – ఆర్‌.సంధ్య, మంగపేట
కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగలో కార్బన్‌మోనాక్సైడ్‌ వంటి హాని కలిగించే కెమికల్స్‌ ఉంటాయి. వీటిని గర్భిణి రోజూ పీల్చడం వల్ల తల్లికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దాంతో కడుపులోని బిడ్డకు ఆక్సిజన్‌ సరఫరా కొద్దికొద్దిగా తగ్గుతుంది. దీనివల్ల శిశువు బరువు సరిగా పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్సులు జరగటం,  బిడ్డ పుట్టిన తర్వాత, కడుపులో ఉన్నప్పుడు బ్రెయిన్‌కి సరిగా ఆక్సిజన్‌ అందకపోవటం వల్ల, మానసిక ఎదుగుదలలో లోపాలు వంటి ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కట్టెలపొయ్యి ఉన్నప్పుడు, దాని నుంచి వచ్చే పొగ సరిగా బయటకు వెళ్లేటట్లు చూసుకోవాలి. (వెంటిలేషన్, చిమ్నీలు సరిగా ఉండాలి) లేకపోతే పొగ ఎక్కువ పీల్చుకునే అవకాశాలు, అలాగే సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

సంతానం కోసం తీసుకునే ప్రొజెస్టెరాన్‌  హార్మోన్‌ చికిత్స వల్ల జన్మించే పిల్లలకు ఆటిజం వస్తుందని చదివాను. ఇది ఎంతవరకు నిజం. ప్రొజెస్టెరాన్‌ హార్మోన్‌ చికిత్స గురించి వివరంగా తెలియజేయగలరు. – పి.సునీత, నెల్లూరు
ప్రొజెస్టెరాన్‌ అనే హార్మోన్‌ మహిళలలో అండాశయాల నుంచి విడుదల అవుతుంది. ఇది సరైన పాళ్లలో విడుదల కాకపోతే పీరియడ్స్‌ క్రమం తప్పడం జరుగుతుంది. అలాగే గర్భం నిలబడటంలో ఇబ్బంది కలుగుతుంది. ప్రొజెస్టెరాన్‌ హార్మోన్‌ నెలలో రెండవ సగం రోజుల నుంచి ఎక్కువగా విడుదల అయ్యి గర్భాశయంలోని పొరను పెరిగే విధంగా చేస్తుంది. గర్భాశయ పొర సరిగా ఆరోగ్యంగా పెరగడం వల్ల, పిండం గర్భాశయంలోపల అతుక్కుని, అందులో పెరగడానికి ఉపయోగపడుతుంది. ఆ నెలలో ప్రెగ్నెన్సీ రానప్పుడు ప్రొజెస్టెరాన్‌ తగ్గిపోయి, గర్భాశయం పొర విడిపోయి, పీరియడ్‌ వచ్చేస్తుంది. కొన్ని కారణాల వల్ల కొందరిలో ప్రొజెస్టెరాన్‌ హార్మోన్‌ సరైన మోతాదులో విడుదల కాదు, అలా కానప్పుడు గర్భం రాకపోవడం, గర్భం పెరగకపోవడం, అబార్షన్లు అవ్వడం, నెలలు నిండకుండా కాన్పు రావడం వంటి సమస్యలు ఏర్పడుతుంటాయి.

పీరియడ్స్‌ సరిగా రాకుండా గర్భం దాల్చిన వారికి, సంతానలేమి చికిత్స తీసుకుని గర్భం దాల్చిన వారికి, ముందు అబార్షన్లు అయినవారికి, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్‌ ఉపయోగపడవచ్చు అనే అంచనాతో మొదటి రెండుమూడు నెలలు ప్రొజెస్టెరాన్‌ హార్మోన్స్‌తో చికిత్సను ఇవ్వడం జరుగుతుంది. ఇది కొందరికి ఉపయోగపడవచ్చు. మరికొందరికి ఉపయోగపడకపోవచ్చు. ఇవి టాబ్లెట్, క్రీమ్, ఇంజెక్షన్స్‌ వంటి రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రొజెస్టెరాన్‌ హార్మోన్, ప్రెగ్నెన్సీలో వాడటం వల్ల, పుట్టబోయే పిల్లల్లో ఆటిజం వస్తుంది అనేదానికి పరిశోధనల్లో నిర్ధారణ అవ్వలేదు. ఆటిజం రావటానికి కొన్ని హార్మొన్ల లోపం, జన్యుపరమైన కారణాలు, తల్లి మానసిక స్థితి వంటివి ఎన్నో కారణాలు కావచ్చు.

మా ఫ్రెండ్‌ ప్రెగ్నెంట్‌. చిన్నచిన్న విషయాలకే స్ట్రెస్‌కు గురయ్యే స్వభావం ఆమెది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదుగానీ.... మొన్నో వార్త చదివినప్పటి నుంచి భయం పట్టుకుంది. స్ట్రెస్‌కు గురయ్యే గర్భిణులకు ఎయిర్‌ పొల్యూషన్, స్మోకింగ్‌ కంటే ఎక్కువ ప్రమాదం ఉంటుందనేది ఆ వార్తలో ఉంది. ఇది ఎంత వరకు నిజం? – శ్వేత, కొలనుకొండ
గర్భం దాల్చిన తర్వాత, తొమ్మిది నెలలు, తల్లి మానసికంగా, శారీరకంగా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ, మానసిక ఒత్తిడి లేకుండా ఉంటే గర్భంలో శిశువుతో పాటు తల్లిలో కూడా బీపీ, షుగర్, ఇంకా ఇతర కాంప్లికేషన్స్‌ చాలావరకు లేకుండా ఉండి, పండంటి బిడ్డ పుట్టే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మానసిక ఒత్తిడి ఫర్వాలేదు కానీ, క్రానిక్‌ స్ట్రెస్‌.. ఎక్కువ కాలంపాటు ఉండే ఒత్తిడి వల్ల, బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవటం, నెలలు నిండకుండా కాన్పు జరగటం, కాన్పు తర్వాత బిడ్డ మానసిక ఎదుగుదలలో కొద్దిగా లోపాలు, తల్లిలో పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు గర్భిణీ సమయంలో టెన్షన్‌ లేకుండా, మనసుని ఆహ్లాద కరంగా ఉంచుకోవటం మంచిది. దీనికోసం మెడిటేషన్, ప్రాణాయామం, చిన్న చిన్న యోగాసనాలు, నడక, మ్యూజిక్‌ వినడం వంటివి చెయ్యడం మంచిది. అలానే కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం.


- డా‘‘ వేనాటి శోభ ,బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో ,హైదర్‌నగర్‌ హైదరాబాద్‌

మరిన్ని వార్తలు