సారెలో బందరు లడ్డు ఉండాల్సిందే...

7 Aug, 2016 10:14 IST|Sakshi
సారెలో బందరు లడ్డు ఉండాల్సిందే...

బందరు కోనేరు సెంటర్... ఈ పేరు చెప్పగానే ఎంతటివారికైనా నోరూరాల్సిందే...షుగర్ పేషెంట్లను కూడా ఆ వాసన విడిచిపెట్టదు...ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఆ రుచి చూసేద్దాంలే అనుకుంటారు...అదే బందరు లడ్డు సెంటరు.. ఒక స్వీటు ఆ ఊరి పేరుతో ప్రసిద్ధి కావడం విశేషమే కదా...
 
బందరు లడ్డుగా ప్రసిద్ధి చెందిన ఆ లడ్డు అసలు పేరు తొక్కుడు లడ్డు. ఈ లడ్డూని శనగ పిండితో తయారు చేస్తారు. దీని తయారీకి చాలాసేపే పడుతుంది. తయారుచేసి నోట్లో వేసుకున్నాక శ్రమ అంతా మర్చిపోవలసిందే. అక్కడి తాతారావు స్వీట్ దుకాణంలో బందరు లడ్డు కొనడానికి జనం ఎగబడతారు. దుకాణానికి ముందు వైపు మోడరన్ గ్లాసుతో డిజైన్ చేసి ఉంటుంది. లోపల ఇంటీరియర్ చాలా విలక్షణంగా ఉంటుంది.
 
ఎడమ పక్కన గోడ మీద డజన్ల కొద్దీ సర్విసెట్టి సత్యనారాయణ తాతారావు చిత్తరువులు ఉంటాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జగ్జీవన్‌రామ్... వంటి పెద్దలంతా ఆయన దుకాణంలోని బందరు లడ్డూ అభిమానులు. వారు నిత్య కస్టమర్లు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి బందరు లడ్డు మీద ఎనలేని ప్రేమ. ‘‘ఈ దుకాణాన్ని మా మామగారు 1951లో ప్రారంభించారు’’ అని చెప్పే తాతారావు బందరు లడ్డూ దుకాణాలను విస్తృత పరిచారు.
 
 విచిత్రమేమంటే ఈ లడ్డు తయారీ విధానాన్ని ఇక్కడకు తీసుకువచ్చినవారు ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినవారు. వాళ్లని సింఘ్స్ లేదా బొందిలీలు అంటారు. బందరులో స్థానికంగా ఉండేవారు వీరి దగ్గర తయారీ విధానం తెలుసుకున్నారు. వలస వచ్చిన ఉత్తర భారతీయులు ఈ లడ్డు తయారీని క్రమేపీ విడిచిపెట్టేశారు. స్థానికంగా ఉన్న బందరు వాస్తవ్యులు మాత్రం దీన్ని అందిపుచ్చుకున్నారు.
 
 ‘‘మా దగ్గర తయారయ్యే లడ్డూలు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్తున్నాయి. ఎక్కడ తెలుగు వారు ఉంటే అక్కడకు మా లడ్డూలు ప్రయాణిస్తాయి. బందరు లడ్డు తయారీ సామాన్యం కాదు. చాలా శ్రమతో కూడిన పని. అసలు సిసలైన ఘుమఘుమలాడే మధురమైన రుచి రావడానికి కనీసం ఆరేడు గంటల సమయం పడుతుంది’’ అంటూ వివరిస్తారు. మామూలు రుచి రావడానికి ఎక్కువ సమయం అవసరం లేదనే విషయాన్ని పరోక్షంగా చెబుతారు తాతారావు.
 తయారీ విధానంలో ఎటువంటి మార్పూ తీసుకు రాకపోవడమే తన విజయ రహస్యం అంటారు తాతారావు. ఏ విధంగా తయారుచేస్తారో చూడాలనుకునేవారిని ఆప్యాయంగా వంటగదిలోకి తీసుకువెళ్లి, అన్నీ వివరిస్తూ చూపుతారు.
 పెళ్లికూతురు, పెళ్లి కొడుకు లేకుండా అయినా పెళ్లి అవుతుందేమోకాని, బందరు లడ్డు లేకుండా ఇక్కడ ఏ శుభకార్యమూ జరగదు అని చెబుతారు అక్కడి పనివారు.  

పెళ్లికి చిలకలపూడి వెళ్లాల్సిందే...
 
బంగారం కొనాలంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి... మరి పెళ్లిళ్లకీ, పేరంటాలకీ నగలు లేకుండా వెళ్లడం ఎలా... మధ్యతరగతి వారికి నిరంతరం ఈ సమస్య వెంటాడుతూ ఉంటుంది...ఆ సమస్య నుంచి పుట్టినదే చిలకలపూడి బంగారం...
 
బంగారుపూతతో తయారైన నగలకు చిలకలపూడి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సుమారు 200 వరకు యూనిట్లు ఉన్నాయి. 30,000 మంది దాకా ఇందులో పనిచేస్తున్నారు. ఇక్కడ బంగారుపూతతో తయారయ్యే నగలను చిలకలపూడి బంగారు నగలు అంటారు. ఇక్కడ గాజులు, గొలుసులు, నెక్లెస్‌లు, చెవి రింగులు, జుంకీలు, డ్యాన్స్ నగలు, అన్ని రకాల రాళ్లతో తయారయిన నగలు విస్తృతంగా అమ్ముతారు.
 
కృష్ణాజిల్లా కేంద్రం బందరు కూడా రోల్డ్‌గోల్డ్ నగలకు పేరుపొందిన పట్టణమే. బందరులో అనేక చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. రోల్డ్ గోల్డ్ నగలు ఇక్కడ విస్తృతంగా తయారుచేస్తారు. 125 సంవత్సరాల క్రితం అప్పలాచారి అనే ఒక స్వర్ణకారుడు, బందరు నుంచి చిలకలపూడికి వలస వెళ్లి అక్కడ మొట్టమొదటగా బంగారుపూతతో నగలు తయారుచేయడం ప్రారంభించారు. బంగారు నగలు కొనే స్థోమత లేనివారి కోసం ఈ నగలు తయారుచేయడం ప్రారంభించారు. 1800 ప్రాంతంలో వ్యాపారం ప్రారంభించిన మొదట్లో వెండి మీద బంగారు పూత పూసిన నగ లు అమ్మేవారు. వాటిని ‘కట్టు నగలు’ అని పిలిచేవారు.
 
ఆ తరువాత రాగి మీద బంగారుపూత పూసి తయారుచేసేవారు. 1940 ప్రాంతంలో తోట వెంకట సుబ్బయ్య ‘ఉమ గిల్ట్’ నగల తయారీ ప్రారంభించి దేశవ్యాప్తం చేశారు. ఆ నగలకు ‘ఉమా గోల్డ్ నగలు’ అనే గుర్తింపు తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా ఉమా నగల దుకాణాలు వెలిశాయి. ఈ ఇమిటేషన్ బంగారు నగల వ్యాపారం రూ. 500 కోట్ల టర్నోవర్ దాటింది.

కానీ ప్రస్తుతం ఇవి వన్నె తగ్గుతున్నాయి. తమిళనాడు, గుజరాత్‌ల నుంచి ముడిసరుకు తెచ్చుకోవలసి రావడంతో లాభాలు తగ్గుతున్నాయి. ఇవే కాకుండా వీటి వన్నె తగ్గడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రపంచంలోనే మొట్టమొదటి ఇమిటేషన్ బంగారాన్ని కనిపెట్టిన ఘనత బందరుది, చిలకలపూడిది.

డా.వైజయంతి
 
 వేదవ్యాసుడు రచించిన  ‘స్కాందపురాణం’లోని ఆరు సంహితలలో మొదటిది సనత్కుమార సంహిత. ఇందులో మొదటి ఖండం... సహ్యాద్రి ఖండం. దీనిలో కృష్ణా నది మహాత్మ్యాన్ని అద్భుతంగా వివరించారు.

మరిన్ని వార్తలు