విజయం: చచ్చి బతికాడు... బతికి గెలిచాడు!

11 Aug, 2013 02:32 IST|Sakshi
విజయం: చచ్చి బతికాడు... బతికి గెలిచాడు!

తేరుకునేలోపే మనోజ్ ఒళ్లంతా కాలిపోయింది. స్పృహ తప్పి పడిపోయాడు. మళ్లీ కళ్లు తెరిచేసరికి మూడు నెలలు గడిచిపోయాయి.
 ఒళ్లంతా కాలిన గాయాలు.. శరీరంలో కాలని భాగం కేవలం ఐదు శాతం మాత్రమే.. చూడగానే డాక్టర్లు బతకడానికి అవకాశమే లేదని తేల్చేశారు.. మూడు నెలల పాటు కోమాలోనే ఉన్నాడు.. అతని ఒంటి మీద ఏకంగా 54 శస్త్రచికిత్సలు జరిగాయి. అసలు బతకడమే కష్టమని, మళ్లీ లేచి నిలబడటమే అసాధ్యమని అనుకున్న ఆ కుర్రాడు.. అందరిలా బయట తిరగడమే కాదు.. చదువు కొనసాగించిన ప్రతిష్టాత్మక కళాశాల నుంచి ఎంబీఏ పట్టా కూడా అందుకున్నాడు. అన్నీ ఉన్నా నిరాశలో కొట్టుమిట్టాడే వాళ్లంతా మనోజ్ రానాను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
 
 ఢిల్లీకి చెందిన మనోజ్ రానాది పదేళ్ల ముందు వరకు చాలా సాఫీగా సాగిపోయిన జీవితం. డాక్టర్ కావాలన్న కల నెరవేర్చుకునేందుకు సరిపడా డబ్బులు తండ్రి సమకూర్చలేకపోయినా.. ఏం బాధపడకుండా గ్రేటర్ నోయిడాలోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేరిపోయాడు. అయితే తన కళాశాల కల్పించిన అవకాశంతో అతనికి అమెరికాలోని పర్డ్యూ యూనివర్శిటీలో కొన్నాళ్లు పనిచేయాల్సి వచ్చింది. సంతోషంగా యూఎస్ వెళ్లాడు. అంతా సాఫీగా సాగుతోంది. అకస్మాత్తుగా ఓ రోజు తన నిద్రపోతున్న అపార్ట్‌మెంట్‌లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఓ తాగుబోతు భర్త.. భార్యాపిల్లల మీద కోపంతో వారిని గదిలో పెట్టి నిప్పు పెట్టేయడంతో మొత్తం అపార్ట్‌మెంట్ తగలబడి పోయింది. తేరుకునేలోపే మనోజ్ ఒళ్లంతా కాలిపోయింది. స్పృహ తప్పి పడిపోయాడు. మళ్లీ కళ్లు తెరిచేసరికి మూడు నెలలు గడిచిపోయాయి.
 
 చూస్తే తన అవతారం తనకే ఆశ్చర్యంగా అనిపించింది. తన పరిస్థితి చూసి తనకే జాలేసింది. ఒళ్లంతా గాయాలతో, అటూ ఇటూ కదల్లేని స్థితిలో పడి ఉన్నాడతను. చావుబతుకుల మధ్య తనను ఆసుపత్రికి తీసుకొచ్చారని.. ఆ స్థితిలో చూసిన వైద్యులు తాను బతకడం అసాధ్యమని తేల్చేశారని తెలుసుకున్నాడు. మూడు నెలలు కోమాలోనే ఉన్నానని.. అయినా తనను బతికించేందుకు వైద్యులు శతథా ప్రయత్నిస్తున్నారని.. తన ఒంటి మీద లెక్కలేనన్ని శస్త్ర చికిత్సలు జరిగాయని.. ఇంకా కొన్ని చేయాల్సి ఉందని తెలుసుకున్నాడు. ఐతే అప్పటికి తానున్న స్థితి చూసి.. అతనికి బతకాలని అనిపించలేదు. తాను ప్రాణాలతో ఉంటే కుటుంబానికి భారమే తప్ప ఏ ప్రయోజనమూ లేదని.. అందుకే తనకు మరణభిక్ష ప్రసాదించమని వేడుకున్నాడు. తల్లిదండ్రులు, వైద్యులు అతనికి ధైర్యం చెప్పారు. తాను ఉన్నంత వరకు కొడుకును చూసుకోవడం తన బాధ్యతని తల్లి చెబితే.. తనను మామూలు మనిషిని చేయడానికి చేయాల్సిందంతా చేస్తామని వైద్యులు హామీ ఇచ్చారు.
 
 వారి అండతో తన శరీరంతో తానే పోరాటం చేశాడు మనోజ్.  పోరాటం మూడేళ్ల పాటు సాగింది. అనేక రకాల థెరపీలు, వివిధ రకాల చికిత్సలతో అతని శరీరం మామూలు స్థితికి చేరింది. ఈ మధ్య వ్యవధిలో తిరిగి అతను నరకయాతనే అనుభవించాడు. అన్ని కష్టాలను దాటి తిరిగి బయటి ప్రపంచంలో నడిచే స్థితికి చేరుకున్నాడు. ఐతే ఒంట్లో కొన్ని అవయవాలు అతనికి పూర్తిగా సహకరించలేదు. ఎడమ చేయిలో కదలిక లేదు. దీంతో కంప్యూటర్‌పై పనిచేయడం సాధ్యం కాదని.. తన మజిలీని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎంబీఏ చేసేందుకు సిద్ధమయ్యాడు. జీమాట్ రాసి అందులో మంచి స్కోరు సాధించాడు. దీంతో యూఎస్‌లోని ప్రముఖ కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో సీటు లభించింది. అక్కడ ఎంబీఏలో చేరాడు. రెండేళ్లలో పట్టా కూడా పొందాడు. ఇటీవల అతను కళాశాల స్నాతకోత్సవంలో అతను ఎంబీఏ పట్టా అందుకున్న సమయంలో కళాశాల మొత్తం అతనికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. బ్యాంకింగ్ పెట్టుబడి రంగంలో ఎదగాలని ఆశిస్తున్న ఈ ఔత్సాహికుడి గురించి భవిష్యత్తులో మరిన్ని సక్సెస్ స్టోరీలు వింటాం!
 - ప్రకాష్ చిమ్మల

>
మరిన్ని వార్తలు