ప్రకృతి గీసిన ఐదు రంగుల చిత్రం!

15 Dec, 2013 02:04 IST|Sakshi
ప్రకృతి గీసిన ఐదు రంగుల చిత్రం!

 అన్వేషణం
 ప్రకృతి ఎన్ని రకాల సొబగులతో మురిపిస్తుందో కదా!  కొండలు, గుట్టలు, లోయలు, నదులు, చెట్లు, కొమ్మలు, ఆకులు, పూలు... అసలు అందం లేనిదేది? ఆకట్టుకోనిదేది? అలా తమ అందాలతో కనువిందు చేసేవి ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి... ఫైవ్ ఫ్లవర్ లేక్. ఈ పేరే కాస్త విచిత్రంగా ఉంది కదూ! పువ్వులేంటి, అయిదు రకాలుండటమేంటి, వాటికీ సరస్సుకీ సంబంధమేంటి అనిపిస్తుందా! అదే మరి దీని ప్రత్యేకత!
 
 చైనాలో ఉన్న వుహుయా జిహాయ్‌గో నేషనల్ పార్క్‌లోని ప్రాకృతిక సౌందర్యాన్ని చూడాలంటే పెట్టిపుట్టాలేమో అనిపిస్తుంది. అందుకే ఆ పార్క్‌ని ఫెయిరీ ల్యాండ్ అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. అంటే దేవతలు నివసించే స్థలమని వారి ఉద్దేశం. ఆ పార్కు అందం ఒకెత్తయితే... అందులో ఉన్న ‘ఫైవ్ ఫ్లవర్ లేక్’ అందం మరొకెత్తు. స్వచ్ఛమైన సరస్సు, చుట్టూ పచ్చని మొక్కలు, రంగురంగులు పూలతో... ప్రఖ్యాత చిత్రకారుడు ప్రతిష్టాత్మకంగా గీసిన చిత్రంలా ఉంటుంది.
 
 అసలు దీనికి ఆ పేరు ఎందుకొచ్చిందో తెలుసా? ఈ సరస్సు చుట్టూ ఎన్నో రకాల పూలమొక్కలు ఉంటాయి. వాటన్నిటి పూలనూ పరిశీలిస్తే ప్రతిదానిలోనూ నాలుగు రంగులు ఎక్కువగా ఉంటాయి. ఏపుగా పెరిగిన ఆ చెట్ల నీడ స్వచ్ఛమైన నీటిలో పడి, ఆ పూలరంగు సరస్సులో ప్రతిఫలిస్తుంది. నీటికి ఉన్న నీలిరంగుతో పాటు... పసుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు రంగులు మిళితమై అయిదు రంగుల్లో మెరిసిపోతుంటుంది. అందుకే దీనికి ఫైవ్ ఫ్లవర్ లేక్ అనే పేరు వచ్చింది.
 
 మరో విశేషమేమిటంటే, ఈ సరస్సు చుట్టూ ఉన్న మొక్కలు సంవత్సరమంతా పూస్తూనే ఉంటాయి. అసలు పూలు లేకపోవడమన్నదే ఎప్పుడూ ఉండదు. దాంతో ఈ సరస్సు ఏడాది పొడవునా అలా రంగురంగులుగానే కనిపిస్తుంది!
 
  ఈ ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?
 
 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించి, పైసా పైసా కూడగట్టినా ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. అయితే బ్రిటన్‌కు చెందిన మైఖేల్ బక్ అనే ఆయన కేవలం 150 పౌండ్లతో ఇల్లు  కట్టేశాడు.
 
     మైఖేల్ పేదవాడేమీ కాదు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. కానీ ఎంత ఉన్నా ఆడంబరంగా బతకాల్సిన అవసరం లేదన్నది అతడి ఉద్దేశం. తన ఇంట్లోవాళ్లు ఆడంబరాలకు పోయి మితిమీరిన ఖర్చు చేయడం నచ్చలేదతనికి. మనిషి తలచుకుంటే చాలా సింపుల్‌గా బతకగలడని నిరూపించాలనుకున్నాడు. దాని ఫలితమే అతడు తన గార్డెన్‌లో కట్టిన ఈ ఇల్లు. ముందుగా సహజసిద్ధమైన కలప, ఆకులు, మట్టి, ఈనెలు తదితర వస్తువులన్నీ సమకూర్చుకున్నాడు మైఖేల్. పైకప్పు వేయడానికి అవసరమైన నట్లు, మేకుల వంటి వాటికి మాత్రం ఓ నూట యాభై పౌండ్లు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఒక్కసారి హోటల్‌కి వెళ్లి భోంచేసినా ఇంకా ఎక్కువ బిల్లు అవుతుందేమో. కానీ ఆ మాత్రం డబ్బుతో ఇల్లు కట్టేశాడు. ఎనిమిది నెలలపాటు ఒక్కడే కష్టపడి దీన్ని కట్టుకున్నాడు మైఖేల్. అలా అని ఆషామాషీగా కట్టలేదు. చూశారుగా ఎంత బాగుందో! అంత తక్కువ సొమ్ముతో ఇంత అందమైన ఇంటిని కట్టడం ఇంకెవరికైనా సాధ్యమా!
 

మరిన్ని వార్తలు