యోగా ఎలా మొదలైంది?

18 Jan, 2015 00:01 IST|Sakshi
యోగా ఎలా మొదలైంది?

యోగా
పదిహేనువేల సంవత్సరాల కింద హిమాలయాలలోని ఎగువ ప్రాంతాలలో ఒక యోగి ప్రత్యక్షమయ్యారు. ఆయన నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. ఆయన ఎవరో, ఎక్కడనుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. ఆయన సమక్షం చాలా అసాధారణంగా ఉండటం వల్ల చాలా మంది ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడారు. ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశతో వారంతా నెలల కొద్దీ వేచి చూసారు. అప్పుడప్పుడు ఆయన కనుల నుండి వెలువడే ఆనందభాష్పాలు తప్ప, ఆయన జీవించే ఉన్నారు అన్నదానికి వేరే సంకేతాలేమి లేవు.
- జగ్గీ వాసుదేవ్
 
అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ మానవ చేతనను పెంపొందించడానికి అంతకన్న గొప్పగా దోహదపడినవారు ఎవరూ లేరు.

ఒకరు అలా నెలల తరబడి కేవలం కూర్చుని ఉన్నారంటే అతను భౌతిక విషయాలచే ఇక ఏ మాత్రం శాసించబడటం లేదని అర్థం. అదే అద్భుతం కదా! కాని అది వారు గ్రహించలేకపోయారు. అందువల్ల ఒక ఏడుగురు తప్ప అందరూ వెళ్లిపోయారు. వారు ఆయనను, ‘మీకు తెలిసింది ఏమిటో, మాకూ తెలుసుకోవాలని ఉంది!’ అంటూ అభ్యర్థించారు. ఆయన వాళ్ళను పట్టించుకోలేదు. కాని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వారి పట్టుదలను చూసిన వారికి ఆయన ఒక చిన్న ప్రక్రియను భోధించారు.  
 
ఏడుగురూ దానిని ఎంతో అభ్యాసం చేసారు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలు అయ్యాయి, నెలలు సంవత్సరాలు అయ్యాయి. 84 ఏళ్ళ సాధన తరువాత ఆదియోగి మళ్ళీ వారిని చూడటం జరిగింది. వారు తేజోవంతులుగా, తన దగ్గర ఉన్నదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండడాన్ని ఆయన గమనించారు. ఇక ఆయన వారిని పట్టించుకోకుండా ఉండలేకపోయారు. తర్వాత పౌర్ణమినాడు ఆయన దక్షిణంవైపునకు తిరిగి ఆ ఏడుగురికీ గురువుగా కూర్చున్నారు. ఆ రోజు ఆదిగురువు ఆవిర్భవించారు. అంటే ఆదియోగి ఆదిగురువుగా మారారు.

ఇప్పటికీ ఆ రోజుని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా కృషితో మనిషి క్రమంగా పరిణామం చెందగలిగే అవకాశాన్ని ఆయన కల్పించారు. అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ మానవ చేతనను పెంపొందించడానికి అంతకన్న గొప్పగా దోహదపడినవారు ఎవరూ లేరు.
 
ఆదియోగి వారికి యోగ శాస్త్రాన్ని బోధించడం ఆరంభించారు. అందులోని ఏడు విధానాలను ఏడుగురికీ బోధించారు. మానవ జీవిత నిర్మాణాన్నీ, అది పనిచేసే విధానాన్నీ బోధించారు. మానవుడు ముక్తి పొందడానికి 112 మార్గాలను, స్పష్టమైన పద్ధతులతో అందజేసారు. ఆ సప్తరుషులను మధ్య ఏషియా, దక్షిణ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, ఆగ్నేయ ఏషియా, హిమాలయ దక్షిణ ప్రాంతాలను పంపారు.

ఒకరు ఆయనతో ఉండిపోయారు. ఆఖరివారు దక్షిణ భారతానికి వచ్చారు. ఆయనే అగస్త్యులవారు. ఆయన దక్కను పీఠభూమికి దక్షిణంగా ఉండే ప్రతి జనావాసానికీ ఆధ్యాత్మిక ప్రక్రియను బోధన, తత్వం, మతంలా కాకుండా - ఒక జీవన విధానంలా అందేట్లు చూశారు. ఈ రోజుకు కూడా మన సంస్కృతిలో ఆయన చేసిన కృషి కనిపిస్తుంది.
రిపోర్టింగ్: భువనేశ్వరి

మరిన్ని వార్తలు