ఉతికిన ఆ తెల్లచొక్కా...

1 Mar, 2015 01:01 IST|Sakshi
ఉతికిన ఆ తెల్లచొక్కా...

బెస్ట్ కేస్
విజయవాడలో ఏఎస్పీగా చేరిన కొత్తలో నాకు అంతా కొత్తగానే ఉండేది. ముఖ్యంగా గ్రామాల్లో వాతావరణం! మనుషులు అలవాటు పడటానికి సమయం పడుతుంది కదా! విజయవాడలోని నందిగామ గ్రామంలో 1975లో జరిగిన ఆ సంఘటన... నెల కూడా గుర్తుంది... సెప్టెంబర్. ఒకరోజు సాయంత్రం ఆరుగంటలకు ఓ ఇద్దరు కుర్రాళ్లు పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. అందులో ఒకతను ‘మా అమ్మను ఎవరో చంపేశారు’ అంటూ ఆయాసపడుతూ చెప్పాడు. సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే గుడిసెలో 45 ఏళ్ల మహిళ మృతదేహం రక్తపుమడుగులో పడివుంది.
 
భర్త లేడు. ఒక్కడే కొడుకు. అతనికి పెళ్లయింది. ఎవరో ఆ మహిళని చెంబుతో తలమీద మోది చంపేశారు. వెంటనే జాగిలాలను రప్పించాను. అవి గుడిసెలో నుంచి బయటకి వచ్చి ఊళ్లోకి వెళ్లాయి. అక్కడ కొంతదూరం వెళ్లాక ఆగిపోయాయి. ఆ పరిసరాల్లోనే మృతురాలి కొడుకు స్నేహితుడి ఇల్లు ఉన్నట్టు అక్కడివారు చెప్పారు.

జోస్యం కోసం...
‘‘నేను, నా భార్య, నా స్నేహితుడు, అతని భార్య... అందరం కలిసి సినిమాకి వెళ్లాం సార్. తిరిగొచ్చిచూస్తే అమ్మ ఇలా శవమై కనిపించింది’’ అంటూ బోరుమన్న పాతికేళ్ల కొడుకుని ఓదార్చి విచారణ మొదలుపెట్టాం. ముందుగా మృతురాలి వివరాలు సేకరించాం. ఆమె మంత్రతంత్రాలు తెలిసిన మహిళ. ఆ గ్రామం వాళ్లే కాదు, చుట్టుపక్కల ఊళ్లవాళ్లు కూడా ఏ చిన్న సమస్య ఉన్నా ఆమె దగ్గరికి వచ్చేవారు. కడుపులో నొప్పి నుంచి మొదలుపెట్టి, తప్పిపోయిన పశువుల ఆచూకీ వరకు అన్నింటికీ ఆమెను సంప్రదించేవారు. ఆమె మంత్రమో, అంజనమో వేసి వాళ్లకు పరిష్కారాలు సూచిస్తుందన్నమాట.

పల్లెటూళ్లలో ఇలాంటివారుండటం సహజమే కదా! రోజూ ఆమెను కలవడానికి చాలామంది వచ్చేవారు. ఆమెకు ఎవరితోనైనా తగాదాలున్నాయోమోనని ఆరా తీస్తే అలాంటివేమీ లేవని తేలింది. గుడిసెలో అణువణువూ గాలించడం మొదలుపెట్టాం. ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆమెపై దాడికి ఉపయోగించిన చెంబుపై వేలిముద్రలు కూడా దొరకలేదు. హంతకుడు చాలా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు కనిపించడం లేదని చెప్పాడు కొడుకు. ముఖ్యంగా తల్లి మెడలోని బంగారు గొలుసు!
 
ఆ పెట్టె లోపల...
గుడిసెలో ఒక మూలన చాలా పాత ఇనప్పెట్టె ఒకటి కనిపించింది. దానికి తాళం వేసి ఉంది. తాళం గురించి అడిగితే మృతురాలి కొడుకు ‘ఏమో తెలియ’దంటూ అమాయకంగా మొహం పెట్టాడు. ఎందుకో అతని సమాధానం కరెక్టు కాదని అనిపించింది నాకు. లాభం లేదని పెట్టెని పగలగొట్టాం. అందులో ఏమీ లేదు. ఒక తెల్లని చొక్కాగుడ్డ ఉంది. చూడ్డానికి చాలా కొత్తగా ఉంది. విప్పి చూస్తే అక్కడక్కడా చిన్న చిన్న రక్తపు మరకలు కనిపించాయి. ‘ఏంటి’వని అడిగితే ఆమె కొడుకు నాకు తెలియదంటాడు. అతని స్నేహితుణ్ణి పిలిచి అడిగినా అదే సమాధానం చెప్పాడు. హంతకుడు మాకోసం వదిలిన క్లూ మాత్రం అదేనని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. దానిపైనే దృష్టి పెట్టాను. ఒక టీమ్‌ని ఆ ప్రాంతంలోని బట్టల షాపుల వివరాలు కనుక్కురమ్మని పంపాను.
 
ఆ ఫొటో వెనక...
ఆ ప్రాంతంలో మొత్తం మూడే మూడు బట్టల షాపులున్నాయి. వాళ్లకి ఈ క్లాత్‌ని చూపించాం. దాన్ని అమ్మిన షాపు దొరికింది. వారికి మృతురాలి కొడుకు ఫొటో చూపించగానే ‘ఇతనే సార్, నెలరోజుల కిందట వచ్చి పెళ్లి కోసమని నాలుగైదు షర్టు పీసులు కొనుక్కెళ్లాడు’ అని చెప్పారు. నా అనుమానం బలపడింది. తిరిగి గుడిసె దగ్గరికి వెళ్లి మరింత పరిశీలనగా చూస్తే దండెంపై ఆరేసి ఉన్న తెల్లచొక్కాకి అక్కడక్కడా ఆరెంజ్ రంగు మరకలున్నట్టు కనిపించింది. దాన్ని వెంటనే ఫొరెన్సిక్ ల్యాబ్‌కి పంపిస్తే చొక్కాపై రక్తపు మరకలు పడ్డట్టూ, దాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించినట్టూ చెప్పారు.
 
విచారణలో భాగంగా మా జాగిలాలు వెళ్లిన అతని స్నేహితుడి ఇంటికి కూడా వెళ్లి అంతా సోదా చేస్తే ఆ ఇంట్లో గోడకు తగిలించిన దేవుడి పటం వెనక మృతురాలి గొలుసు దొరికింది. ఇక దొరికిన సాక్ష్యాలు చాలని చెప్పి... మృతురాలి కొడుకుని స్టేషన్‌కి తీసుకెళ్లి విచారిస్తే విషయం బయటపడింది. కన్నతల్లిని తానే స్వయంగా హత్య చేసిన వైనం చెప్పుకొచ్చాడు.
 
అక్రమ సంబంధం...
ఎప్పుడూ వెంట తిరిగే తన స్నేహితుడికీ, తల్లికీ అక్రమ సంబంధం ఉన్నట్టు అప్పటికి నెలరోజుల క్రితం బయటపడింది. తన పెళ్లయితే తల్లి ప్రవర్తన మారుతుంది కదా అని ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. అయినా ఎలాంటి మార్పూ రాలేదు. స్నేహితుణ్ణి మందలించి అతణ్ణి కూడా పెళ్లిచేసుకోమని చెప్పి దగ్గరుండి పెళ్లి చేశాడు. ఒకరోజు తల్లి ఇతని స్నేహితుడితో గొడవకు దిగింది. ‘నాతో నీకు సంబంధం ఉండగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకు తెలియదా నాకున్న మంత్రశక్తుల గురించి. నిన్నూ, నీ భార్యనూ బూడిద చేసేస్తాను...’ అంటూ తల్లి... స్నేహితుడిపై విరుచుకు పడుతుండగా కొడుకు ఎదురుపడి తల్లిని నిలదీశాడు.

దాంతో కొడుకుని కూడా అదేవిధంగా బెదిరించడం మొదలుపెట్టింది. తల్లి ప్రవర్తనతో విసిగిపోయిన కొడుకు, అతని స్నేహితుడు ఒకరోజు సాయంత్రం ఆమెను హతమార్చారు. ఇదీ విషయం. చనిపోయిన వ్యక్తి మంత్రగత్తె కావడంవల్లనేమో తెల్లవారే సరికి గ్రామస్తులంతా ఆమె గుడిసెముందు, మా పోలీస్టేషన్ ముందు ఉండేవారు. ‘సార్, హంతకుడు దొరికాడా... దొరికాడా...’ అంటూ అడుగుతుండేవారు. అలాగని విచారణకు ఏమైనా సాయం చేస్తారా అంటే ఏమడిగినా తెలియదని చెప్పేవారు.
 
తక్కువ సమయంలో...
నాకేమో అక్కడి వాతావరణం కొత్త. పల్లె ప్రజల పద్ధతులు, నమ్మకాల గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ఇలాంటి కేసుని నాలుగురోజుల్లో విజయవంతంగా చేధించినందుకు మా పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి.
రిపోర్టింగ్: భువనేశ్వరి
ఫొటో: రాజేశ్

మరిన్ని వార్తలు