నువ్వు మేకవన్నె పులివి రాజా!

22 Oct, 2016 23:44 IST|Sakshi
నువ్వు మేకవన్నె పులివి రాజా!

 మాట కంఠంలోనే  ఆపెయ్
  నీ మనసులో ఏమున్నా...
 అది లోనే దాచెయ్
 బయటికి రానీకు.
 దాటి బయటికి వచ్చిందా...

 
 వస్తే?
 బాడీ... పార్ట్స్ పార్ట్స్‌గా విడిపోవచ్చు.
 అంతా మాత్రాన... మద్దాలి శివారెడ్డి అన్నీ సూటిగా చేస్తాడని కాదు. అవసరమైతే...కాళ్లు పట్టుకుంటాడు.
 
 ‘నువ్వు నా తమ్ముడిగా ఎందుకు పుట్టలేదురా?
 నీ కాళ్లకు దండం పెడతా!’ అంటూనే కాళ్లు లాగి అవతలి వ్యక్తిని కింద పడేయగలడు.
 
 వికటాట్టహాసం ఒకటి చేసి...
 ‘మంత్రి శివారెడ్డిని
 మళ్లీ రౌడీ శివారెడ్డిగా మార్చావు కదరా
 ఇది రౌడీ శివారెడ్డి పవర్’ అని తన పవర్ ఏమిటో చూపగలడు.
 ‘రేసుగుర్రం’ సినిమాతో మద్దాలి శివారెడ్డిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సరికొత్త విలన్ రవి కిషన్.

 
 ‘లక్’ సినిమాలో రవి కిషన్ డెరైక్టర్ సురేందర్‌రెడ్డికి బాగా నచ్చాడు. ముఖ్యంగా కళ్లు. అలా ‘రేసుగుర్రం’ సినిమాతో ‘మద్దాలి శివారెడ్డి’గా తెలుగు చిత్రసీమకు ‘ఉత్తమ విలన్’గా దిగుమతి అయ్యాడు.
 
 ‘కిక్-2’లో సోల్మాన్‌సింగ్ ఠాకూర్, ‘సుప్రీమ్’ సినిమాలో బీకుగా రవికిషన్ మనకు మరింత దగ్గరయ్యాడు.
 హీరోగా నటించడం కంటే విలన్‌గా నటించడమే కష్టం అంటారు. ఆ కష్టం రుచి ఎలా ఉంటుందో చూద్దామనుకున్నాడేమో రవికిషన్.
 
 భోజ్‌పురి ఫిల్మ్ సూపర్‌స్టార్ అయిన రవి కిషన్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో విలన్‌గా కనిపిస్తున్నాడు. రవి శరీర దారుఢ్యానికి ఆకర్షించే కళ్లు తోడై డైలాగులు బాంబుల్లా పేలుతున్నాయి. విలనిజం ఇరగ పండుతుంది.
 
 ‘రౌడీయిజం మా నాన్న దగ్గర నేర్చుకున్న.
  రాజకీయం నీ దగ్గర నేర్చుకున్న’ అనేది విలన్‌గా రవికిషన్ డైలాగ్.
 మరి నటన ఎక్కడ నేర్చుకున్నాడు?
 నటుడు ఎలా అయ్యాడు?
  ఆ స్టోరీలోకి వెళదాం పదండి....
 
 ముంబైలోని శాంటాక్రాజ్‌లో ఒక చిన్న ఇంట్లో పుట్టాడు రవి. తండ్రికి చిన్న డైరీ బిజినెస్ ఉండేది. అన్నదమ్ముల మధ్య గొడవ రావడంతో ఆ వ్యాపారం మూతపడింది. అప్పుడు ఆయన తన మకాంను సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని జోన్‌పూర్‌కు మార్చాడు. చదువు మీద రవికి ఎంత మాత్రం ఆసక్తి ఉండేది కాదు. మరోవైపు చూస్తే...ఇంట్లో పేదరికం. దీపావళిలాంటి పెద్ద పండగలకు కూడా కొత్త బట్టలు కొనే స్థోమత ఉండేది కాదు.
 
 రవికి ఒక లక్ష్యం అంటూ ఉండేది కాదు.
 ‘గూండాగా మారుతానేమో’ ‘చనిపోతానేమో’ ‘నాకు పిచ్చిపడుతుందేమో’ ఇలా ఏవో పిచ్చి పిచ్చిగా ఆలోచించేవాడు.
  ఆరోజుల్లో అమితాబ్ బచ్చన్ సినిమాలు బాగా చూసేవాడు. ఆ సినిమాలు రవిని బాగా ప్రభావితం చేశాయి.
 ‘నా వెనకాల ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. చదువు లేదు. టీచర్ లేడు. సినిమానే నా గురువు’ అనుకున్నాడు.
 ఆ గురువే తనకు నటనలో కూడా పాఠాలు నేర్పించింది.
 పదిహేడు సంవత్సరాల వయసులో తల్లి ఇచ్చిన ఐదొందల రూపాయలు తీసుకొని ముంబైకి వెళ్లిపోయాడు.
 పాత ఫ్రెండ్ హృదయ్‌షెట్టి రూమ్‌లో ఉన్నాడు. అతడే రవిని ఎందరో దర్శకులకు పరిచయం చేశాడు.
 
 ఎన్ని కష్టాలు పడ్డాడో, తినడానికి భోజనం లేకుండా ఎన్ని రోజులు పస్తులు ఉన్నాడో తెలియదుగానీ బి-గ్రేడ్ ఫిల్మ్  ‘పీతాంబర్’లో నటించే అవకాశం వచ్చింది. ‘తేరే నామ్’ సినిమాతో రవి కిషన్‌కు కాస్త గుర్తింపు వచ్చింది. అందులో పూజారి పాత్ర వేశాడు. ఆ తరువాత కూడా పెద్ద గుర్తింపు లేదు. డబ్బులు లేవు. ఈ సమయంలోనే ఒక భోజ్‌పురి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.
 
 ‘భోజ్‌పురి సినిమా నాకు గౌరవాన్ని, గుర్తింపును, డబ్బును ఇచ్చింది. నన్ను సూపర్‌స్టార్‌ని చేసింది’ అని భోజ్‌పురి మీద కృతజ్ఞత చాటుకున్న రవికిషన్ ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడానికి  ఇష్టపడుతున్నాడు.తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ విలన్‌గా గుర్తింపు పొందుతున్నాడు.
 

మరిన్ని వార్తలు