ఈ టిట్లాకు తిక్క రేగితే!

30 Apr, 2017 02:36 IST|Sakshi
ఈ టిట్లాకు తిక్క రేగితే!

 ఉత్తమవిలన్‌
తన శత్రువును తాను ఎలా ద్వేషిస్తాడో మిగిలిన వాళ్లు కూడా అలాగే ద్వేషించాలి. తన శత్రువుపై తాను ఎలా కసితో రగిలి పోతాడో మిగిలిన వాళ్లు కూడా అలాగే రగిలి పోవాలి. లేకుంటే  తేడాలు వస్తాయి.

ఇళ్లు కాలిపోతాయి.
‘నెత్తి మీద టోపీ. చేతిలో పవరు... మూతి మీద మీసం ఉందని... దేవుడు...దేవుడు అని భజన చేశారు. ఏకీ సీ గోలిసే...’ అంటూ మాటలతో మంటలు రేపగలడు టిట్లా.‘టిట్లా’ అంటే మాటలా?మాటల్లోనే తూటాలు పేలుతుంటాయి!‘విక్రమార్కుడు’ సినిమాలో ‘టిట్లా’గా.... వేషంతో సహా క్రూర హావభావాలతో భయపెట్టించాడు అజయ్‌.

‘ఖుషి’ సినిమాలో ఈవ్‌ టీజర్‌గా ప్రేక్షకుల దృష్టిలో పడ్డ అజయ్‌  ‘ఒక్కడు’ ‘ఛత్రపతి’ సినిమాలలో ఆవేశం మూర్తీభవించిన పాత్రలలో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘విక్రమార్కుడు’ సినిమాలో ‘టిట్లా’ అనే గట్టి విలన్‌గా ప్రేక్షకుల దృష్టిలో మిగిలిపోయాడు.

విజయవాడలో పుట్టి పెరిగిన అజయ్‌ ఎమ్‌సెట్‌ కోచింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాడు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆ కాలేజీ పరిసరాల్లో తరచుగా సినిమా షూటింగ్‌లు జరుగుతుండేవి. షూటింగ్‌లను ఆసక్తిగా చూసేవాడుగానీ ‘నటించాలి’ అని  పెద్దగా అనుకోలేదు. ఆ తరువాత మాత్రం నటించాలనే కోరిక బలపడడంతో ఒక ఫిల్మ్‌  ఇన్‌స్టిట్యూట్‌లో  చేరాడు.

‘కౌరవుడు’ సినిమా డైరెక్టర్,  అజయ్‌ నాన్నకు తెలిసిన వ్యక్తి కావడంతో ఆ సినిమాలో నటించే ఛాన్సు దొరికింది. ‘పెద్దగా స్ట్రగుల్‌ కాకుండానే సినిమాల్లో నటించే ఛాన్సు వచ్చింది. ఇక ‘నల్లేరు మీద నడకే’ అనుకున్నాడు. అయితే  తొమ్మిది నెలలు గడిచినా  ఏ సినిమాలోనూ నటించే ఛాన్సు రాలేదు. ‘ఖుషి’ సినిమా సెలెక్షన్‌కు వెళ్లి, సెలెక్ట్‌ అయిన  తరువాత మాత్రం ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రాజమౌళి ‘సింహాద్రి’ సినిమాలో చిన్న విలన్‌ రోల్‌ పోషించాడు.

షూటింగ్‌లో పాల్గొనడానికి కేరళకు వెళ్లినప్పుడు ‘మీ సినిమాలో గుర్తుండిపోయే పాత్రలో నటించాలని ఉంది’  డైరెక్టర్‌తో రిక్వెస్ట్‌గా అన్నాడు. ఆయన నుంచి  ఎలాంటి స్పందన లేదు. ఆతరువాత మాత్రం ‘సై’ సినిమాలో విలన్‌ తమ్ముడిగా అజయ్‌కి పవర్‌ఫుల్‌ రోల్‌ ఇచ్చాడు రాజమౌళి. ఇక ‘విక్రమార్కుడు’ సినిమాలో చేసిన ‘టిట్లా’ పాత్రతో పెద్ద గుర్తింపు తెచ్చుకున్న అజయ్‌ ‘ఉత్తమ విలన్‌’గా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు