నేనొక్కసారి స్కెచ్‌ వేస్తే...

11 Jun, 2017 06:16 IST|Sakshi
నేనొక్కసారి స్కెచ్‌ వేస్తే...

చెల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకునే అన్నయ్య... ఆ చెల్లి కోసం ఎంత దుర్మార్గానికైనా తెగించే అన్నయ్యగా ‘చంటి’ సినిమాలో కనిపించినా,  ప్రత్యర్థి కోసం  ఆకలాకలిగా ఎదురుచూసే  ప్రతినాయకుడిగా ‘దమ్ము’లో కనిపించినా, బిజ్జలదేవునిగా శకుని తరహా విలనిజంతో ‘బాహుబలి’లో భయపెట్టినా... తనదైన విలనిజాన్ని చాటుకుంటున్నారు నాజర్‌.

‘‘నేను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నాను’’ అనగానే...
‘‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా సినిమాలేమిటి?’’ అనే తల్లిదండ్రులనే చూస్తుంటాం.
నాజర్‌ విషయంలో మాత్రం సీన్‌ రివర్స్‌.కడుపులో చల్ల కదలకుండా, డబ్బులకు ఇబ్బంది పడకుండా ఉండే ఉద్యోగం చేయాలనేది నాజర్‌ కల. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేయడం ద్వారా తన కలను నెరవేర్చుకున్నాడు నాజర్‌. అయితే నాజర్‌ ఉద్యోగం చేయడం తండ్రికి నచ్చలేదు. కొడుకును నటుడిగా చూడాలనేది ఆయన కల. అయితే నాజర్‌కు మాత్రం ఎప్పుడూ నటన మీద ఆసక్తి లేదు.

అప్పుడెప్పుడో చిన్నప్పుడు  పండగల సందర్భాల్లో నాటకాల్లో నటించడం తప్ప... నటన గురించి నాజర్‌కు పెద్దగా తెలియదు. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనకు ఒక స్థిరమైన ఉద్యోగం అవసరం అనుకున్నారు నాజర్‌. అందుకే ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగంలో చేరినప్పుడు చాలా సంతోష పడ్డారు. కానీ నాన్న ఆలోచన వేరుగా ఉంది. ‘‘నీ గురించి ఎన్నో కలలు కంటే ఇలా చేస్తావా!’’ అన్నారు ఆయన బాధ పడిపోతూ. ఇక చేసేదేమి లేక ఉద్యోగానికి రాజీనామా చేశారు నాజర్‌. ‘‘సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తాను’’ అన్నారు తండ్రితో.

‘‘అలా ఎలా కుదురుతుంది. శిక్షణ తీసుకోకుండా సినిమాల్లో ఎలా నటిస్తావు?  నువ్వు నటనలో తప్పకుండా శిక్షణ తీసుకోవాల్సిందే’’ అని కాస్త గట్టిగానే చెప్పారు తండ్రి. అప్పుడుగానీ అర్థం కాలేదు. తన తండ్రి తన విషయంలో ఎంత పట్టుదలగా ఉన్నాడో. ఎలాగైనా సరే, తండ్రి కలను నిజం చేయాలనుకున్నారు. అడయార్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో  చేరారు.  కె.బాలచందర్‌ ‘కళ్యాణ అగతిగల్‌’ సినిమాలో తొలి అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా ఫ్లాప్‌ కావడం కాస్త నిరాశకు గురైనా అంతలోనే తేరుకున్నారు.

‘కళ్యాణ అగతిగల్‌’ సినిమా ఫెయిల్యూర్‌ నాజర్‌ కెరీర్‌కు అడ్డంకేమీ కాలేదు. ఈ సినిమా తరువాత విలనీ ఛాయలు ఉన్న పాత్రలు చేసి శబ్భాష్‌ అనిపించుకున్నారు.  మణిరత్నం సినిమా ‘నాయకన్‌’తో నాజర్‌కు మంచి బ్రేక్‌ వచ్చింది. ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ‘విలన్‌  లేనిది హీరో లేడు’ అని చెప్పే నాజర్‌ ఎన్నో సినిమాల్లో విలన్‌ క్యారెక్టర్లు చేసి ‘ఉత్తమ విలన్‌’ అనిపించుకున్నారు.

మరిన్ని వార్తలు