‘ఏమ్రా లొల్లిబెడుతున్నవ్‌?’

23 Jul, 2017 00:22 IST|Sakshi
‘ఏమ్రా లొల్లిబెడుతున్నవ్‌?’

రౌతాల గురించి మీకేమైనా తెలుసా? అయితే వినండి...ఆరడుగులకు  పైగా  హైట్‌ ఉండే రౌతాల... అరాచకాలకు తిరుగులేని అడ్డా. తాను చెప్పిందే నిజం. తన నోటి నుంచి వచ్చిందే శాసనం. తాను నేరాలు, ఘోరాలు చేస్తున్నాడని పోలీసులకు తెలిసినా సరే...‘కేసు ఏమని రాసుకోమంటారు?’ అని భయంతో కూడిన వినయంతో అడుగుతారే తప్ప... ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు.‘గెట్ల రాస్తావు?రాస్కోరాస్కో’ అని పోలీసులకు ఆర్డర్‌ వేసే రౌతాలకు ఎవరూ ఎదురు మాట్లాడడానికి లేదు. ‘నువ్వు చేస్తున్నది అరాచకం’ అని చెప్పడానికి లేదు.చెబితే?‘ఏయ్‌... ఏమ్రా లొల్లిబెడుతున్నవ్‌?’ అని గద్దించగలడు. లొల్లిని ఆపడానికి రక్తం చూడగలడు ఈ రౌతాల!
∙∙
ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా మంచి పేరు ఉన్న కోళ్ల అశోక్‌ కుమార్‌ డిక్షనరీలో ఏ మూలలోనూ ‘నటన’ అనే పదం లేదు. బియ్యపు గింజ మీద తినేవారి పేరు రాసి ఉన్నట్లుగానే... ప్రతి పాత్ర మీద నటుడి పేరు రాసి ఉంటుందేమో! లేకపోతే నటన మీద ఆసక్తి లేని,  నాటకాల్లోనైనా చిన్న పాత్ర వేయని అశోక్‌ కుమార్‌ 70 సినిమాల్లో నటించడం ఏమిటి?
ఇంతకీ ప్రొడ్యూసర్‌ అశోక్‌ కుమార్‌ ‘విలన్‌ అశోక్‌ కుమార్‌’ ఎలా అయ్యారు? తాను నిర్మిస్తున్న ‘చెవిలో పువ్వు’ సినిమాలో నటించమని దర్శకుడు కోడి రామకృష్ణని అడిగారు అశోక్‌.

‘‘అలాగే నటిస్తానుగానీ... నువ్వు నా సినిమాలో నటించాలి’’ బదులుగా అన్నారు  రామకృష్ణ.‘‘నేను నటించడం ఏమిటండీ... నాకు బొత్తిగా నటన రాదు. పైగా బోలెడు సిగ్గు’’ అన్నారు అశోక్‌.‘‘అదంతా నేను చూసుకుంటానుగానీ... నువ్వు నా సినిమాలో నటించు’’ అంటూ అశోక్‌ కుమార్‌ను తొలిసారిగా ‘భారత్‌బంద్‌’లో నటింపజేశారు.అలా అశోక్‌ కుమార్‌ కాస్తా రౌతాల అయిపోయాడు.

 విలన్‌గా బోలెడు గుర్తింపు వచ్చింది. ‘ఒసేయ్‌ రాములమ్మ’ సినిమాలో అశోక్‌ చేసిన దొర కొడుకు పాత్ర ఆయనకు మరింత గుర్తింపు తెచ్చింది. నిజానికి ఈ పాత్రను చరణ్‌రాజ్‌ చేయాల్సింది. ఎందుకనో అది అశోక్‌ను వరించింది.‘అశోక్‌ కుమార్‌కు టైలర్‌మేడ్‌ పాత్ర’ అన్నారు అందరు.‘‘నటన అంటే భయంగా ఫీలవ్వను. ఆ క్యారెక్టర్‌ ఊహించుకొని అందులోకి వెళ్లిపోతాను’’ అనే అశోక్‌ కుమార్‌ బాడీ లాంగ్వేజ్‌తో విలనిజాన్ని పండించడంలో దిట్ట అనిపించుకున్నారు. అందుకే అంటారు... ఆయన జుట్టు కూడా నటిస్తుందని!
 

మరిన్ని వార్తలు