ఐయామ్‌ కనకాంబ్రం... బ్రదర్‌ ఆఫ్‌ ఏకాంబ్రం

6 Aug, 2017 00:55 IST|Sakshi
ఐయామ్‌ కనకాంబ్రం... బ్రదర్‌ ఆఫ్‌ ఏకాంబ్రం

ఏకాంబ్రం తమ్ముడి పేరు  కనకాంబ్రం.పేరులో బంగారం  ఉండొచ్చుగానీ ఆయన మనసు మాత్రం విషమయం. ఎప్పుడూ ఎవరి మీదో ఒకరి మీద నిప్పులు కక్కుతూనే ఉంటాడు.‘సాలా మర్గయా’ అని అరుస్తూనే ఉంటాడు.తనకు తానే నిప్పుతో వాతలు పెట్టుకుంటూ ‘రా...యు...డూ’ అని పెద్దగా అరుస్తున్న అతడి పేరు భూపతి. అతనికేమైనా పిచ్చా? కాదు కసి!  ఎవరి మీద? ఇదిగో ఆయన మాటల్లోనే వినండి.‘ఆ రాయుడు వంశం మీద నా పగ చల్లారకుండా రగులుతూ ఉండడానికి ఈ వాతలు పెట్టుకుంటున్నాను’.

చెవిని కిందికిలాగుతూ విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చే కనకాంబ్రంగా ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాలో, అవమానభారంతో రగిలిపోయే అగ్నిపర్వతంలా కనిపించే భూపతి పాత్రలో ‘పెదరాయుడు’లో కనిపించిన ఆనంద్‌రాజ్‌ తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత విలన్‌. బాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యాక్షన్‌ జాక్సన్‌’తో బాలీవుడ్‌కు కూడా పరిచయమైన ఆనంద్‌రాజ్‌ పాండిచ్చేరిలో పుట్టి పెరిగాడు. తండ్రి వ్యాపారవేత్త. మంచి ఫిజిక్‌ ఉండడంతో కుమారుడు పోలీస్‌ ఆఫీసర్‌ కావాలనుకునేవాడు తండ్రి. కానీ ఆనంద్‌కేమో సినిమాలు ఇష్టం.

ఒక ఫైన్‌మార్నింగ్‌...
‘‘నాకు నటన మీద ఆసక్తి ఉంది’’ అని ఆనంద్‌రాజ్‌ చెప్పడంతో తల్లిదండ్రులేమీ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అలా మద్రాస్‌లోని ఒక ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు. ఇక్కడ శివరాజ్‌ కుమార్‌ (కన్నడ హీరో) ఆనంద్‌కు సహ విద్యార్థి.కమలహాసన్‌తో సహా రకరకాల క్రాఫ్ట్‌లకు సంబంధించిన ప్రముఖులు గెస్ట్‌ లెక్చర్‌ ఇవ్వడానికి వస్తుండేవాళ్లు. అలా వచ్చిన వారిలో కొందరు, విద్యార్థులను పరిశీలిస్తూ ‘నువ్వు భవిష్యత్‌లో హీరో అవుతావు’, ‘విలన్‌ అవుతావు’ అని జోస్యం చెప్పేవాళ్లు. అయితే ఆనంద్‌ విషయంలో మాత్రం ఎవరూ ఏమీ చెప్పలేదు. దీంతో డీలాపడిపోయేవాడు ఆనంద్‌.

యాక్టింగ్‌ కోర్సు పూర్తికాగానే అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయిని భావించాడు. అయితే అలాంటిదేమీ జరగలేదు.సత్యరాజ్‌ విలన్‌ పాత్రల నుంచి హీరో పాత్రలు చేస్తున్న కాలం అది. అంటే విలన్‌ సీటు ఖాళీగానే ఉంది. ఈ టైమ్‌లోనే ‘ఒరువర్‌ వాళుమ్‌ ఆలయం’, ‘ఉరిమై గీతం’ సినిమాలతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు ఆనంద్‌రాజ్‌. ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్లు అయినప్పటికీ పి.వాసు సినిమా ‘ఎన్‌ తంగై పడిచ్చవ’ సినిమాతో మంచి బ్రేక్‌ వచ్చింది.

‘‘హీరో పాత్రలో ఎంత దమ్ముందో... నువ్వు చేస్తున్న విలన్‌ పాత్రల్లో కూడా అంతే దమ్ముంది’’ అంటూ తన ఆరాధ్య నటుడైన శివాజీ గణేషన్‌ తనకు ఇచ్చిన కాంప్లిమెంట్‌ను ఎప్పుడూ గుర్తు చేసుకునే ఆనంద్‌రాజ్‌... ముద్దుల మామయ్య, లంకేశ్వరుడు, ఒంటరి పోరాటం, బావాబావమరిది, శుభాకాంక్షలు, పెదరాయుడు, గ్యాంగ్‌లీడర్‌... మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.

మరిన్ని వార్తలు