ఏమప్పా బాలగోవిందు...నేను పొన్నుసామిని!

9 Sep, 2017 23:35 IST|Sakshi
ఏమప్పా బాలగోవిందు...నేను పొన్నుసామిని!

ఉత్తమ విలన్‌

జీవా విలనీలో మూసవాసనలు ఉండవు. భయానకం, విరుపు, వెటకారం, హాస్యం కలగలిసి ఒక్కో పాత్రలో ఒక్కరకంగా ఆ విలనీ పండుతుంది. భయానకం: ‘నాకు పెద్దగా కోరికలేమీ లేవు. మూడే మూడు కోరికలు.

1. నాలుగు కోట్లు. 2. డబుల్‌ ఏసీ రూమ్‌.
3. అందమైన ఆడపిల్ల.


చివరికి ఏమైంది? నాలుగు కోట్లు మటాష్‌. డబుల్‌ ఏసీ రూమ్‌ కాదు కదా...సింగిల్‌ ఏసీ రూమ్‌ కూడా లేక... చివరికి ఇలా అడవుల పాలయ్యాం’‘మృగం’ సినిమాలో ప్రతినాయకుడిగా ఈ డైలాగు చెబుతున్నప్పుడు జీవాలో కనిపించే కసి లోతేమిటో తెలిసిపోతుంది.అమ్మో జీవా! ‘ఆ భద్రగాడికి వేలకు వేలు ఇచ్చింది నీ మీద చేయి వేయడానికి... తీయడానికి కాదు’ అని ఆడపిల్లను వేధిస్తూ ‘కార్తికేయ’ సినిమాలో శంకరన్నగా జుగుప్సను రాజేయగలడు.

వామ్మో జీవా!! ‘ఏమప్పా బాలగోవిందు! నేను మీ నాన్న ఫ్రెండ్‌ని అప్పా.  ఇంటికెళ్లాలి... అడ్రస్‌ చెప్పు’ అని హీరోని అడిగి... అతని జవాబు విని కంగుతిన్న తంబిదురై అనుచరుడు పొన్నుసామిగా ‘దేశముదురు’ సినిమాలో కితకితలు పెట్టించగలడు.. ఏడిపిస్తూనే నవ్వించగలడు. నవ్విస్తూనే ఏడిపించగలడు. కొన్నిసార్లు ఆయన పెదవులు కాదు ఎర్రటి కళ్లు డైలాగులు చెబుతాయి.
∙∙
నాటకాలు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీ లలో నటించి నటనలో రాటుదేలిన జీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం. ఈ పేరేదో పొడుగ్గా ఉందని దయారత్నం పేరుని ‘జీవా’గా మార్చారు ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్‌. ఆయన ‘తొలి కోడి కూసింది’ చిత్రంతో వెండి తెరకు పరిచమయ్యారు జీవా. ఈ సినిమాలోని పాత్ర కోసం వేలాది మంది యువకులు పోటీ పడితే తన కళ్లతో ఆ పాత్రను దక్కించుకున్నారు జీవా. కళ్లతో దక్కించుకోవడం ఏమిటి? అనే కదా డౌటు. విషయం ఏమిటంటే ‘తొలి కోడి కూసింది’ సినిమాకు వేలాది ఫొటోలు వచ్చాయి.

గుట్టలు గుట్టలుగా పడి ఉన్న ఈ ఫొటోల్లో నుంచి ఒక ఫొటోలోని రెండు కళ్లు బాలచందర్‌ని ఆకర్షించాయి. అలా దయారత్నం కాస్త జీవా అయ్యాడు. తన నటనతో ప్రేక్షకులను  ఆకట్టుకున్నాడు. కెరీర్‌ తొలిరోజుల్లో ఆయనవేసే పాత్రల్లో విపరీతమైన కోపం, కసి కనిపించేవి. ఇప్పుడు వాటి స్థానంలో కామెడీ అంతర్లీనమై పోయింది. ‘జగ్గా హైదరబాదీ’గా ‘సత్య’ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్న జీవా... తెలుగు విలన్‌లలో చెప్పుకోదగ్గ విలన్‌. మెచ్చుకో దగ్గ విలన్‌. ఉత్తమవిలన్‌.

మరిన్ని వార్తలు