నా పేరు జక్కా... పెద్ద ఎదవని

5 Mar, 2017 00:24 IST|Sakshi
నా పేరు జక్కా... పెద్ద ఎదవని

‘ఈయన చాలా స్ట్రిక్ట్‌ ఆఫీసర్‌లా ఉన్నాడు. నేను సంతకం పెట్టను...అంటున్నాడు’అలాగా! అదిగో జక్కా వస్తున్నాడు చూడండి...ఎడమ చేత్తో చేతిలోని సిగరెట్‌ను సై్టలిష్‌గా విసిరేసి ఆ అధికారితో జక్కా ఏమంటున్నాడో చదవండి...

‘నా పేరు జక్కా. పెద్ద ఎదవని.
మా మామయ్య నా కంటే పెద్ద ఎదవ.
నీకు కారుందా?
సొంతబిల్డింగ్‌ ఉందా?
ఏమీ లేని వాడివి ఉన్నవాడితో పెట్టుకుంటే...
ఉండే ప్రాణాలు కూడా ఉండవు’
పొడవాటి జుత్తుతో సై్టలిష్‌గా కనిపిస్తూనే ‘కృష్ణ’ సినిమాలో ‘జక్కా’గా ప్రేక్షకులను తెగభయపెట్టించాడు ముకుల్‌దేవ్‌.


ముకుల్‌దేవ్‌ పక్కా ఢిల్లీబాయ్‌. నాన్న పెద్ద పోలీస్‌ ఆఫీసర్‌. అమ్మ స్కూలు టీచర్‌. అమ్మ విషయం ఎలా ఉన్నా నాన్న మాత్రం తన కొడుకు ఏదైనా ఒక పెద్ద గవర్నమెంట్‌ ఉద్యోగం చేయాలని, యూనిఫాం ధరించాలని అనుకునేవాడు. అది సాధ్యం కాలేదుగానీ, రాయబరేలిలోని ‘ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్‌ అకాడమీ’లో కమర్షియల్‌ పైలట్‌గా శిక్షణ తీసుకున్నాడు.బాలీవుడ్‌ సినిమాలంటే ఇష్టపడే ముకుల్‌దేవ్, స్నేహితుల దగ్గర  హీరోలను సరదాగా అనుకరించి చూపేవాడు. ఇంతకు మించి దేవ్‌కు నటన గురించి పెద్దగా తెలియదు.కమర్షియల్‌ పైలట్‌గా తన కెరీర్‌ మొదలుకాకముందే, మహేష్‌భట్‌ ‘దస్తక్‌’ సినిమాలో నటించే బంగారు అవకాశం ముకుల్‌దేవ్‌కు వచ్చింది.‘‘చాలామందిలా బాలీవుడ్‌లో ప్రవేశించడానికి నేనేమి కష్టపడలేదు. పాకెట్‌ మనీ కోసం సరదాగా యాడ్స్‌ చేస్తున్న సమయంలో ప్రఖ్యాత దర్శకుడు మహేష్‌భట్‌ కంట్లో పడ్డాను.

అలా దస్తక్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్‌లో నాది రెడ్‌కార్పెట్‌ వెల్‌కమ్‌’’ అని తన బాలీవుడ్‌ ప్రవేశం గురించి చెబుతాడు దేవ్‌.‘దస్తక్‌’లో దేవ్‌ పోషించిన ఏసీపీ రోహిత్‌ మల్హోత్ర పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది.నటనలో ఓనమాలు తెలియకపోయినా, ఒక్కో సినిమాతో తన నటనను మెరుగు పరుచుకుంటూ వెళ్లాడు ముకుల్‌ దేవ్‌.‘ఖిలా’ సినిమాలో దిలీప్‌ కుమార్‌తో పని చేయడం దేవ్‌కు ఒక అద్భుత అనుభవంగా మిగిలింది . ఒక నటదిగ్గజంతో నటించడం వల్ల, తనకు తెలియకుండానే పాఠాలు నేర్చుకున్నాడు దేవ్‌. ‘తెలుసుకోవడం ద్వారా మాత్రమే కాదు నటిస్తూ పోవడం ద్వారా కూడా నటన పట్టుబడుతుంది’ అంటాడు ముకుల్‌దేవ్‌.

‘దస్తక్‌’ సినిమాతో లక్కీచాన్స్‌ కొట్టేసిన దేవ్‌ తన కెరీర్‌ ఎక్కడికో వెళ్లిపోతుందనుకున్నాడు.రెండు సంవత్సరాల తరువాత కెరీర్‌ ఒక్కసారిగా డౌన్‌ అయింది.‘ఏంచేయాలా?’ అని ఆలోచిస్తున్న సమయం టీవీ రంగం ఆహ్వానం పలికింది.‘పెద్ద  సినిమాల్లో నటించిన నేను...టీవీలో నటించడం ఏమిటి?’ అనుకోలేదు.‘ఇప్పుడు నా చేతిలో పని లేదు. ఆ పని టీవీ ఇస్తుంది’ అనుకొని రకరకాల సీరియల్స్‌లో నటించి టీవీరంగాన్ని ఆస్వాదించాడు ముకుల్‌. టీవీ రంగంలో విజయవంతమైన దేవ్‌కు సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ స్వాగతం పలికింది. 2008లో వచ్చిన రవితేజ చిత్రం ‘కృష్ణ’లో ‘జక్కా’గా కనిపించి, తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు ముకుల్‌ దేవ్‌. ఏక్‌నిరంజన్, అదుర్స్, కేడీ, మనీ మనీ మోర్‌ మనీ, బెజవాడ, నిప్పు, భాయ్‌...మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు దేవ్‌.

తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు తెలుగు తెలిసినవాళ్లనే అసిస్టెంట్‌గా పెట్టుకునేవాడు. దీని ద్వారా క్రమక్రమంగా  తెలుగు భాష నేర్చుకునే అవకాశం ఏర్పడింది. మూడు, నాలుగు సినిమాలు పూర్తయ్యేలోపు తెలుగులో సంభాషించే లెవెల్‌కు చేరుకున్నాడు!రాహుల్‌ దేవ్‌ (అతడు, తులసీ, ఎవడు, నాయక్‌... మొదలైన తెలుగు చిత్రాల్లో నటించారు)కు ఈ ముకుల్‌దేవ్‌ స్వయాన సోదరుడు. అన్నలాగే తమ్ముడు కూడా ‘ఉత్తమ విలన్‌’గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు