ఖతర్నాక్‌...కాలకేయ!

16 Apr, 2017 01:25 IST|Sakshi
ఖతర్నాక్‌...కాలకేయ!

వెండితెర అద్భుతం ‘బాహుబలి’లో బాహుబలి, భల్లాలదేవలు ఎలా గుర్తుండి పోతారో కాలకేయుడు కూడా అలాగే గుర్తుండి పోతాడు. అతడు మాట్లాడిన ‘కిలికి’ భాష కూడా అలాగే గుర్తుండి పోతుంది. నల్లరాతి కొండలాంటి దృఢమైన శరీరం, చింత నిప్పులాంటి కళ్లు...ఈ భయానక ఆహార్యానికి తోడు భయంకరమైన కంఠంతో వెన్నులో చలి పుట్టించాడు కాలకేయుడు.

‘ప్రభాకర్‌’ అనే పేరు పెద్దగా తెలియకపోవచ్చుగానీ, ‘కాలకేయుడు’ అనే పేరు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులకు తెలుసు! ఎవరీ ప్రభాకర్‌!మహబూబ్‌నగర్‌ జిల్లా హస్నాబాద్‌కు చెందిన ప్రభాకర్‌ స్వభావరీత్యా సిగ్గరి. క్రికెట్‌ ఆడడం తప్ప సినిమాల్లో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. నటిస్తాను అని ఎప్పుడు భవిష్యవాణిని అంచనావేయలేదు. మాంచి ఒడ్డూ పొడుగు ఉన్న ప్రభాకర్‌ను చూసి బంధువు ఒకరు...

‘‘హైదరాబాద్‌కు వచ్చేయ్‌... రైల్వేలో కానిస్టేబుల్‌ ఉద్యోగం ఇప్పిస్తాను’’ అన్నాడు. అయితే ఆరు సంవత్సరాలు గడిచినా అలాంటిదేమీ జరగలేదు. మహేష్‌బాబు ‘అతిథి’ సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు అనుకోకుండా ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించే చాన్సు వచ్చింది ప్రభాకర్‌కు. ‘మగధీర’ సినిమా కోసం నటులను వెదుకుతున్నప్పుడు డైరెక్టర్‌ రాజమౌళిని కలిశాడు ప్రభాకర్‌. ఆయన ఏమీ చెప్పలేదు.

అయితే తనతో పాటు రాజస్తాన్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ ‘మగధీర’ షూటింగ్‌ జరుగుతోంది. రాజస్తాన్‌లో ప్రభాకర్‌ను గమనించారు రాజమౌళి. తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన తరువాత మళ్లీ ఉద్యోగ వేటలో పడ్డాడు ప్రభాకర్‌. ఒకరోజు రాజమౌళి నుంచి పిలుపు వచ్చింది. ‘మర్యాద రామన్న’ సినిమాలో ఒక వేషం ఇస్తున్నట్లు చల్లని కబురు చెవిలో వేశారు రాజమౌళి. చా...లా గొప్ప చాన్స్‌... కానీ తనకు నటన అంతగా రాదు... ఇదే విషయాన్ని రాజమౌళితో చెప్పాడు ప్రభాకర్‌. ‘ఫరవాలేదు’ అంటూ దేవదాస్‌ కనకాల దగ్గర శిక్షణ ఇప్పించడమే కాకుండా, నెలకు పదివేలు సై్టపెండ్‌ కూడా ఇచ్చారు రాజమౌళి.

‘మర్యాద రామన్న’ సినిమాలో వేసిన బైరెడ్డి పాత్రతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్‌తో అప్పులన్నీ తీర్చేశాడు. ఇక ‘బహుబలి’ సినిమాలో వేసిన కాలకేయుడి వేషం ప్రభాకర్‌ని ఎక్కడికో తీసుకువెళ్లిపోయింది. ఈ సినిమాలో ఉపయోగించిన ‘కిలికి’ భాష కోసం రోజూ తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ప్రాక్టీస్‌ చేసేవాడు ప్రభాకర్‌. ఇది మాత్రమే కాదు... కాలకేయుడిగా ప్రేక్షకులను భయపెట్టడానికి ఎన్ని రకాలుగా కష్టపడాలో అన్ని రకాలుగానూ పడ్డాడు. ఆ కృషి వృథా పోలేదు... అని కాలకేయుడి పాత్రకు వచ్చిన స్పందన చెప్పకనే చెప్పింది.

మరిన్ని వార్తలు