రావత్... వెండితెర రావణ్!

4 Sep, 2016 01:46 IST|Sakshi
రావత్... వెండితెర రావణ్!

ఉత్తమ విలన్
కొన్ని సంఘటనలు ‘చిత్రం’గా జరుగుతాయి.
 సూచనప్రాయంగా కూడా చెప్పకుండా జరుగుతాయి.
 ‘ప్రదీప్ రావత్ ఎవరు?’ అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కాస్తో కూస్తో ఆలోచించవచ్చుగానీ...మన తెలుగు వాళ్లు మాత్రం టకీమని చెబుతారు. వీలైతే అతని డైలాగును ఒకసారి ఇలా గుర్తుతెచ్చుకుంటారు.

 ‘ఒక్క
 ముక్క చెప్పి ఉండాలి.
 చెప్పలే.
 అంటే...లెక్కలే!
 నేనంటే లెక్కలేని వాన్ని
 నా లెక్కలో ఉంచడం ఇష్టం లేదు’
   
రాజమౌళి ‘సై’ సినిమాకు ఒక విలన్ కావాలి. ఆషామాషీ విలన్ కాదు. గట్టి విలన్ కావాలి.
 సినిమా విజయానికి విలనే కీలకం!
 అందుకే రాజమౌళి విలన్‌ల వేటలో ఉన్నాడు. ఎందరినో... స్క్రీన్‌టెస్ట్, అడిషన్ టెస్టులు చేస్తున్నాడు. కానీ ఎవరూ నచ్చడం లేదు. దీంతో ‘నాకో మాంచి విలన్ కావాలి’ అంటూ తన అసిస్టెంట్‌ను ముంబైకి పంపించాడు. ఆ అసిస్టెంట్ ఎక్కడెక్కడ తిరిగాడోగానీ ఆరోజు అమీర్‌ఖాన్ ‘లగాన్’ సినిమా చూద్దామని డిసైడైపోయాడు.
 అతను అలా డిసైడై ఉండకపోతే....ప్రదీప్ రావత్ ఎవరో మనకు తెలిసి ఉండేది కాదు. మనకు ఒక ఉత్తమ విలన్ తెర మీద పరిచయమయ్యేవాడు కాదు!
 
‘లగాన్’ సినిమాకు కృతజ్ఞతలు.
 ‘లగాన్’లో దేవా అనే సర్దార్  పాత్ర పోషించాడు రావత్.
 మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ పట్టణంలోని యు.సి.ఒ. బ్యాంకులో కొంత కాలం పని చేసిన ప్రదీప్ రామ్‌సింగ్ రావత్ ‘మహాభారత్’ టీవీ సీరియల్‌లో అశ్వత్థామ పాత్రతో  నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తరువాత ‘యుగ్’ టీవీ సీరియల్‌లో బ్రిటీష్  ఇన్‌స్పెక్టర్‌గా, ‘సర్ఫ్‌రోష్’ సినిమాలో ‘సుల్తాన్’గా నటించాడు. మళ్లీ ‘లగాన్’ దగ్గరకు వద్దాం.
 ‘లగాన్’లో దేవా దూకుడు రాజమౌళి అసిస్టెంట్‌కు  బాగా నచ్చింది. ‘నేను వెదుకుతున్న విలన్ ఇతడే’ అనుకున్నాడు.

రావత్‌ను సంప్రదించాడు. సౌత్ సినిమాలలో నటించడానికి విముఖంగా లేడుగానీ తనలో చిన్న సందేహం... ‘‘నాకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. భాష రాకపోతే బొమ్మలా నటించాల్సిందే...’’
 అయితే ఈ సందేహాన్ని పక్కన పెట్టి అడిషన్ టెస్ట్‌కు హాజరయ్యాడు. ఓకే అనిపించుకున్నాడు. అలా తెలుగు వెండితెరపై బిక్షు యాదవ్‌గా అలరించాడు.
 నోటిలో పెద్ద చుట్ట.
 ముక్కుకు రింగు.
 కాటుక కళ్లు.
 పే...ద్ద మీసాలు.
 నాలుక మడతెట్టి వార్నింగ్ ఇచ్చే మ్యానరిజం... చూసీ చూడగానే తెలుగు ప్రేక్షకలోకానికి చేరవయ్యాడు రావత్.
 ఆ తరువాత...
 ‘భద్ర’లో వీరయ్య, ‘అందరివాడు’లో సత్తి బిహారి, ‘ఛత్రపతి’లో రాస్ బిహారి, ‘దేశముదురు’లో తంబిదురై, ‘యోగి’లో నరసింహ పహిల్వాన్, ‘జగడం’లో మాణిక్యం... ఇలా ఎన్నో పేర్లతో ఉత్తమ విలన్‌గా స్థిరపడ్డాడు రావత్.
 ఇక ‘గజినీ’ సినిమాలో రావత్ చెడ్డ విలనిజానికి మంచి పేరు వచ్చింది. రామ్-లక్షణ్‌గా సౌత్‌లో, ధర్మాత్మగా నార్త్‌లో ఆయన విలనిజానికి బోలెడు ‘చెడ్డ’ పేరు వచ్చింది.
 ‘‘బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటించకపోవడానికి కారణం ఏమిటి?’’ అనే ప్రశ్నకు-
 ‘‘అవకాశాలు రాకపోవడమే’’ అని చెప్పే రావత్ తనకు అవకాశం ఇచ్చిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ‘ఉత్తమ విలన్’గా గట్టి పేరు సంపాదించుకున్నాడు.
   
 ‘లగాన్’లో దేవ పాత్ర ముఖేష్ రుషి చేయాల్సింది. అయితే డేట్స్ సమస్య వల్ల ఆ పాత్రను ముఖేష్ వదులుకోవాల్సి వచ్చింది. ఆ అవకాశం రావత్‌కు వచ్చింది.
 ‘లగాన్’లో సర్దార్జీ పాత్ర ముఖేష్ చేసి ఉంటే....రావత్ ‘లగాన్’లో నటించేవాడు కాదు. ‘లగాన్’లో నటించకపోతే...రాజమౌళి దృష్టిలో పడి ఉండేవాడు కాదు. రాజమౌళి దృష్టిలో పడి ఉండకపోతే... సౌత్‌లో స్టార్ విలన్‌గా పేరుతెచ్చుకొని ఉండేవాడు కాదు... ఎంత చిత్రం!

మరిన్ని వార్తలు