ఆ మౌనానికి పరిహారం

23 Sep, 2018 00:59 IST|Sakshi

పురానీతి

అంపశయ్యమీద ఉండి భీష్ముడు విలపిస్తూ ఉన్నాడు. అది చూసి పాండవులు కృష్ణుడిని రహస్యంగా ‘‘కృష్ణా! ఇదేమి వింత! మహాజ్ఞాని, సర్వసంగ పరిత్యాగి అయిన భీష్మపితామహుడు, రాబోయే మృత్యువు గురించి ఆలోచించి ఎందుకు విలపిస్తున్నాడు?’’ అని అడిగారు. అందుకు శ్రీ కృష్ణుడు చిద్విలాసంగా నవ్వుతూ, ‘ఎందుకు విలపిస్తున్నాడో భీష్ముడినే అడగండి’  అన్నాడు. పాండవులు వెంటనే భీష్ముడి దగ్గరకు వెళ్లి, ‘తాతా! నువ్వు ఎందుకని విలపిస్తున్నావు? కారణం ఏమిటి ...?’ అని అడిగారు. అందుకు భీష్ముడు, ‘‘నాయనలారా! నాకు చావు వస్తుందని ముందే తెలుసు. ఎప్పుడు చావాలో కూడా నాకు తెలుసు. స్వచ్ఛంద మరణమనే వరమూ ఉంది. అయితే, నేను దిగులు పడేది, నాకు రాబోయే చావు గురించో, ఒళ్లంతా గుచ్చుకున్న బాణాల వల్ల సలుపుతున్న గాయాల గురించో కాదు. ‘‘భగవంతుని లీలలు వేటినీ తెలుసుకోలేక పోతున్నానే అని. అందుకోసమే నేను ఇంతగా విలపిస్తున్నాను. అంతేకాదు, సర్వాంతర్యామి అయిన శ్రీ కృష్ణుడు మీకు తోడునీడై ఉండి, మిమ్మల్ని అడుగడుగునా ఆపదలు నుండి కాపాడుతున్నాడు. అయినప్పటికీ మీ కష్టాలకు అంతే లేదు అని ఆలోచించి శోకిస్తున్నాను’’ అని సమాధానమిచ్చాడు.

అయితే, ఆయన విలపించడానికి కారణం వేరే ఉంది. ప్రపంచంలో దేనికయినా ఆలంబనం ధర్మమే! భీష్ముడు ఒకసారి ధర్మం తప్పాడు. అది ఎప్పుడంటే, దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి ఈడ్చుకు వచ్చి వలువలు ఊడదీశాడు. అలా ఊడదీస్తుంటే ఆమె ఒక ప్రశ్న వేసింది. ‘ఈ సభలో భీష్మ ద్రోణులు ఉన్నారు. వాళ్లకి ధర్మం తెలుసు. నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా? ధర్మం చెప్పవలసింది’ అని అడిగింది. అపుడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి ధర్మరాజు చేసినది దోషమే – ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని ఒడ్డే అధికారం లేదు అని ఉంటే వెంటనే మహాపతివ్రత అయిన ద్రౌపదీ దేవి శపిస్తే, «ధృతరాష్ట్రుని సంతానం అంతా తన కళ్ళముందు నశించిపోతారు. పోనీ చెప్పకుండా ఉందామంటే ఎదురుగుండా ఒక మానవతికి ఒక మహా పతివ్రతకి వలువలు ఊడుస్తున్నారు. కాబట్టి ఏమి చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా, తెలియక చెప్పాడా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ‘ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మమూ అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపదీ’ అన్నాడు. అలా ధర్మం తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణలో వైక్లబ్యమే! ఈ దోషానికే ఆయన అంపశయ్యమీద పడి ఉండవలసి వచ్చింది! అది తలచుకునే ఆయన విలపిస్తున్నది.

ధర్మం తప్పటం, అసత్యం ఆడటం కొద్దిసార్లే చేసి ఉండవచ్చు. దాని పర్యవసానం వెంటనే ఒక్కోసారి వెంటనే అనుభవిం^è క పోవచ్చు. కానీ, ఒక్కోసారి జీవితంలో చివరి దశలో దాని ఫలితం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ధర్మాచరణను ఎప్పుడూ ఉల్లంఘించరాదు. చిన్న అబద్ధమే కదా, చిన్న అధర్మమే కదా అనుకోవడానికి వీలు లేదు. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

మరిన్ని వార్తలు