శిష్య సమాలోచనలు

12 Jan, 2020 04:25 IST|Sakshi

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర 

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభి ర్యజత్రాః/స్థిరై రంగైః స్తుష్టువాం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః/ స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః/ స్వస్తి న స్తార్‌ కో‡్ష్య అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు
– మా మేలుకోరి పెద్దలు చెప్పే మాటలను ఒళ్లంతా చెవులు చేసుకుని వింటాము గాక! విశ్వమంతా వ్యాపించి ఉన్న పూషాత్మ మా దృష్టికోణాలయందు నిలిచి మాకు యదార్థ విజ్ఞానం అందించు గాక! శుభాశుభాలన్నింటియందు మాకు కవచంలా నిలిచి సూర్యుడు మాకు ఇంద్రియ హితాన్ని కలిగిస్తూ మమ్ము నడిపిస్తున్న విధానాన్ని వేనోళ్ల పొగుడుదుము గాక! దేవహితమైన మార్గమందే జ్ఞానవృత్తిలో ఉన్న మాకు బుద్ధికారకుడైన బృహస్పతి ఇంద్రియ హితాన్ని చేకూర్చి ఆయుష్షును ప్రసాదించు గాక!..... శంకర శిష్యులు మాండూక్య పాఠాన్ని శాంతిమంత్రంతో ప్రారంభించారు. గౌడపాద కారికలతో కలిపి శంకర భాష్యాన్ని క్రమపద్థతిలో అధ్యయనం చేస్తున్నారు. ప్రజ్ఞానం కలిగించే చైతన్య కిరణాల విస్తృతియే స్థావర జంగమాత్మకమైన విశ్వం. ఇక్కడ జాగ్రదవస్థలో వైశ్వానరాత్మ స్థూల భోగాలను అనుభవిస్తుంటాడు. స్వప్నవేళ అతడే వాసనామయ భోగాలను అనుభవించి తైజసుడు అవుతాడు. కామములు, కలలు ఎరుగని సుషుప్తిలోని ప్రాజ్ఞుడు తనను తాను తనయందే ప్రళయం గావించుకుంటాడు. సర్వ ఉపాధులకూ అతీతుడై తురీయాత్మగా మారిపోతాడు. ఆ తురీయునికి నమస్కారం అని అర్థం వచ్చే శంకరభాష్య మంగళాచరణ శ్లోకాలను తొలిగా పఠించారు.
అది ఆషాఢ బహుళ విదియ నాటి మధ్యాహ్న వేళ. మాహిష్మతీ నగర సరిహద్దు అటవీ ప్రాంతం. ఒకవైపు ఉపనిషత్‌ అధ్యయనం సాగుతుండగా మరోవైపు ఒక చెట్టునీడన కూర్చుని ఉన్న గురువు వద్దకు పద్మపాదుడు, హస్తామలకుడు, విష్ణుశర్మ చేరి సమాలోచనలు సాగిస్తున్నారు. శంకరుడు కేవల సాక్షిగా ఉంటూ వారి మాటలను ఆలకిస్తున్నాడు.
‘‘నాకో అనుమానం’’ అంటూ విష్ణుశర్మ ప్రారంభించాడు. ‘‘మన ఆచార్యునికి కూడా తెలియని విషయాలంటూ ఉంటాయా? ఈయన సర్వజ్ఞులని కదా మన అభిప్రాయం?!’’ అన్నాడు.
‘‘అందులో సందేహం ఏముంది?’’ అన్నాడు పద్మపాదుడు.
‘‘ఆవిడేమో తెలుసుకో తెలుసుకో అంది. ఈయనేమో అలాగేమ్మా అంటూ వచ్చేశారు. పోనీ అంటే ఆవిడ తెలుసుకోమన్న గొప్ప సంగతి పరమ ప్రయోజనకరమైనదా అంటే ఆ లక్షణమేమీ కనబడడం లేదు. అన్నీ పిచ్చి ప్రశ్నలే... ఒక సన్యాసిని అడగకూడని ప్రశ్నలే. ఏమిటదీ... ఆ మన్మథ కళలేవి అన్నది మొదటి ప్రశ్న’’ అని ఆగాడు విష్ణుశర్మ.
‘‘శ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మదనోత్పాదిని, మద, మోహిని, దీసిని, వశకరి, రంజని... అనే పదిహేనూ మన్మథ కళలు’’ పద్మపాదుడు సమాధానమిచ్చాడు.
‘‘అవి ఉండే స్థానాలేవి? అన్నది రెండో ప్రశ్న.’’
‘‘పాదాంగుష్ఠం నుంచి శిరస్సు వరకు. కాలిబొటన వేలు, పాదం, చీలమండ, మోకాలు, కటి, నాభి, పొట్ట, బాహుమూలం, కంఠం, చెక్కిలి, పళ్లు, వదనం, కన్నులు, నుదురు, శిరస్సు అనే పదిహేను స్థానాల్లో పంచబాణుని పదిహేను కళలు నిత్యమూ ఒక్కొక్కచోట సంచరిస్తూ ఉంటాయి.’’
‘‘పద్మపాదాచార్యా! మీక్కూడా  తెలిసిన ఈ సమాధానాలు మన గురువుకు తెలియదంటే నమ్మడమెలా? ఈ సమాధానాలేవో ఆవిడతో చెప్పేస్తే ఈ రొష్టంతా తప్పేది కదా! అక్కడున్నంతసేపూ ఈయన అంత డొంకతిరుగుడుగా ఎందుకు మాట్లాడారంటావ్‌?’’ విష్ణుశర్మ ప్రశ్నించాడు.
‘‘విష్ణూ! మన సమాలోచనం లౌకికం. వారి సంవాదం పారలౌకికం. దీనికి దానికి హస్తిమశకాంతర భేదం ఉంది. తరువాతి ప్రశ్న అడుగు. ఒక చిక్కుముడి విడుతుంది’’ అన్నాడు పద్మపాదుడు.
‘‘శుక్ల, కృష్ణపక్షాలలో చంద్రకళలను అనుసరించి మన్మథ కళలు స్త్రీలలో ఎలా వెల్లడవుతాయి?’’
‘‘ఇదీ మొదటి చిక్కు. వాత్సాయనుడు ఇక్కడే స్త్రీలలో పద్మిని, హస్తిని, చిత్రిణి, శంఖిని అనే నాలుగు జాతిభేదాలుంటాయని చెప్పాడు. ఆయా జాతులను అనుసరించి బొటనవేలి నుంచి శిరస్సు వరకూ కళలు శుక్ల, కృష్ణపక్షాలలో ఊర్ధ్వ అధోముఖాలుగా సంచరిస్తుంటాయన్నాడు. వీటిని ఒక్కొక్కదగ్గర ఒక్కోరకంగా వర్ణించి, సామాన్యులు కళ్లు తేలేసేలా లెక్కలు చెప్పాడు.’’
‘‘సరిపోయింది.’’ 
‘‘నిజంగా అక్కడితో పోలేదు. చతుర్విధ శృంగార నాయకులలో అనుకూలుడు శ్రేష్ఠుడు. దక్షిణుడు మధ్యముడు. ఇక దిట్టతనం కలిగిన ధృష్టుడు, కపటులైన శఠులకు కామాతురత మాత్రమే కానీ స్త్రీలను రంజింపచేసే శక్తి నిజానికి ఉండదు. నాయకులలో మొదటి ఇద్దరికి మాత్రమే ఈ కళాస్థానాలు పట్టుబడతాయన్నాడు. ధూర్తులైన వారికి తన శాస్త్రం అర్థం కాకుండా వాత్సాయనుడు చేసిన ఏర్పాటిది’’ విడమరిచాడు పద్మపాదుడు. 
‘‘అర్థమవుతూనే ఉంది కదా! ఇంక తగాదా ఎక్కడుంది?’’ విసుగ్గా అన్నాడు విష్ణుశర్మ.
‘‘శాస్త్రాన్ని చెప్పిన అసలు మహర్షికి ఆషాఢభూతుల్లాంటి శిష్యులు ఇప్పుడిప్పుడే తయారవుతున్నారు. గాఢతను సరళం చేస్తున్నాం అనుకుంటూ... ముఖ్యంగా ఈ కళాస్థానాలను గురించి చవకబారు ప్రతిపాదనలు చేస్తున్నారు’’ చెప్పాడు పద్మపాదుడు.
‘‘వాళ్ల పాపాన వాళ్లు పోతారు. మనకేల?’’
‘‘అలా అనుకుంటే కాదు. మామూలు మనుషులకంటే జగద్గురువుల బాధ్యతలు పెద్దవి కదా. తరువాతి ప్రశ్న కూడా అడుగు. అసలు చిక్కు తెలుస్తుంది’’ అన్నాడు పద్మపాదుడు.
‘‘ఏమున్నది అడగడానికి? పురుషులలో కనిపించే పదిహేను కళాస్థానాలను, చంద్రకళలను అనుసరించి చెప్పాలి’’ అన్నాడు విష్ణుశర్మ.
‘‘అదిగో అది అసలు చిక్కు. స్త్రీలలో ఆ కళాస్థానాలు ఏ సమయాల్లో ఎలా ఉంటాయో చెప్పాడు కానీ వాత్సాయనుడు, పురుషులలో అవి ఎక్కడెక్కడ ఉంటాయో... శుక్ల కృష్ణపక్షాలలో వాటి సంచారం ఎలా ఉంటుందో మాత్రం చెప్పలేదు’’ అన్నాడు పద్మపాదుడు అసలు సమస్యను ముందుంచుతూ.
‘‘ఏం ఎందుచేత? బహుశా అదికూడా చెప్పాలని అతగాడికి తట్టలేదేమో?!’’ అన్నాడు విష్ణుశర్మ వ్యంగ్య ధోరణిలో.
‘‘అంతమాటనకు. వాత్సాయనుడు పాపం శాస్త్రరచన కోసం తన జీవితాన్ని ధారపోశాడు. ఘోటక బ్రహ్మచారియై తపించి జగత్తుకు అరుదైన విజ్ఞానాన్ని అందించాడు. పురుషుని యందుండే కళలు అతడికి అనుకూలవతి అయిన స్త్రీకి మాత్రమే తొలిగా గోచరిస్తాయని చెప్పాడు. ఆమెకు ప్రత్యేక బోధన అవసరం లేదన్నాడు’’ వివరించాడు హస్తామలకుడు.
‘‘చూస్తుంటే స్త్రీ ద్వేషిలా ఉన్నాడు. పాపం వాళ్లకు అన్యాయం చేశాడు’’ నిరసించాడు విష్ణుశర్మ. 
‘‘కాదు... మన మహర్షులే కాదు. మన సనాతన ధర్మమే స్త్రీ పక్షపాతం వహించింది. పురుషుడు కర్మబద్ధుడు. కామతంత్రంలోనే కాదు... ధర్మార్థాలలో కూడా అతడు అస్వతంత్రుడే. గృహిణి అనుమతి లేనిదే ఆ మూడింటిలోనూ అతడు అడుగు ముందుకు వేయడానికి లేదు. ఇక మోక్షమంటావా... స్త్రీ నిత్యముక్తురాలు. ఆనుషంగికంగా వచ్చిపడే కర్మఫలం నుంచి విముక్తుడయ్యేదాకా పురుషునికి మాత్రం స్వాతంత్ర్యమే లేదు. భోగాల పట్ల ఆసక్తిని తుదముట్టజూసి వదిలించుకోవడానికే శాస్త్రం కానీ, పెంచుకోవడానికి కాదు’’ కీలకమైన వ్యాఖ్య చేశాడు హస్తామలకుడు.
కొద్దిసేపు అక్కడెవరూ మాట్లాడలేదు. ఆ మధ్యాహ్నవేళ అక్కడ పిట్ట అరుపు, పురుగు అలికిడి కూడా కలగడం లేదు. ఎదురుగా ప్రవహిస్తున్న చిన్నివాగులో అప్పుడప్పుడు విష్ణుశర్మ వేస్తున్న మట్టిబెడ్డలు బుడుంగుమనడం మినహా అక్కడంతా నిశ్శబ్దంగానే ఉంది.
‘‘అయితే దీనికి సమాధానం వాచ్యంగా చెప్పడం కుసంస్కారమే అవుతుందన్నమాట. మరి  చెప్పనవసరం లేని విషయాన్ని ఆవిడ తెలుసుకోమనడం ఎందుకు? ఈయన తెలుసుకుంటాను అని తలవూపి రావడం ఎందుకు?’’ మునిగే ముందొక మట్టిబెడ్డ నీళ్లలో ముందుగానే విచ్చిపోవడాన్ని దీక్షగా చూస్తూ ప్రశ్నించాడు విష్ణుశర్మ.
‘‘తృతీయ పురుషార్థమైన కామాన్ని పొందడానికి అవినీతికర మార్గాలు తొక్కితే ఆర్షధర్మం అంగీకరించదు. ఇటీవలి కాలంలో కొత్త శాస్త్రాలు పుట్టుకొస్తున్నాయి. సంప్రదాయవాదులు చెప్పడానికి నిరాకరించిన విషయాలను ఈ కొత్తవారు నిర్లజ్జగానూ, ముందస్తు ఆలోచన లేకుండానూ వెల్లడిస్తున్నారు. దాంతో ధర్మగ్లాని ఏర్పడుతోంది. ఆ అవినీతి పరుల క్రీనీడ పరకాయ ప్రవేశాది ప్రాచీన విద్యలపై కూడా పడుతోంది. వారు అనుసరించే విధానాలు తొలిదశలో అమాయకులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఈ అనైతికతను వివిధ దశల్లో సరిచేయండి.... దుర్మార్గులను శిక్షించి సద్వర్తనులను రక్షించే బాధ్యత తీసుకోండి అన్నదే ఉభయ భారతీదేవి ఆ ప్రశ్నలు వేయడం వెనుక ఉన్న అసలు మర్మం’’ చిట్టచివరిగా చెప్పాడు పద్మపాదుడు.
‘‘ఇటువంటి వాటికి సర్వసంగ పరిత్యాగులేం చేస్తారు?’’ వాగు దగ్గర నుంచి కదలకుండానే వెనుకకు తిరిగి ప్రశ్నించాడు విష్ణుశర్మ.
‘‘సద్వర్తనులకు శ్రేయస్సు కలిగేలా విద్యను బోధించడమూ, అది అల్లరిమూకల చేతికి చిక్కకుండా చేయడమూ అనే రెండు పనులూ గురువు బాధ్యతలే’’ అన్నాడు పద్మపాదుడు.
విష్ణుశర్మ ఒకసారి అర్థనిమీలిత నేత్రుడై పద్మాసనంలో కూర్చుని ఉన్న ఆచార్య శంకరుని వంక చూశాడు. ‘‘నిత్యానిత్య వస్తువివేకం, ఇహాముత్రార్థ ఫలభోగ నిరాసక్తి, శమదమాది షట్కసంపత్తి, ముముక్షత్వం అనే సాధన చతుష్టయాన్ని పొందిన వాడికే గానీ... తన బోధలు పూర్తిగా అంతుబట్టవని మన ఆచార్య శంకరులు శాసనం చేసిన సంగతి అందరికీ తెలిసినదే. అంతమాత్రం చేత ఆయన ఎవరిపైనా నిషేధాలు విధించలేదు. ఉత్తమ, మధ్యమ, మందాధికారులకు అందరికీ అందుబాటులోనే ఉంటానని బాస చేశారు. ఏదైనా ఒక విద్యను ఒకరికి నేర్పను పొమ్మనడం, ఒకరు నేర్చుకోబోతే నిషేధాజ్ఞలు పెట్టడం గురువులు చేయాల్సిన పనేనా? ఇది సమంజసమేనా?!’’ హేతుబద్ధమైన ప్రశ్న వేశాడు విష్ణుశర్మ.
‘‘పూర్తిగా సమంజసమే. ఎవరికైనా స్థాయిని బట్టే విద్య పట్టుబడుతుంది. శిష్యుని స్థాయి గురువుకు మాత్రమే తెలుస్తుంది.  ఇందాక చెప్పిన పరకాయ ప్రవేశ విద్యనే ఉదాహరణగా తీసుకుందాం. దీని గురించి పతంజలి మహర్షి స్పష్టంగానే చెప్పాడు. వ్యాకరణం తెలియకపోయినా, యమ నియమాదులను తట్టుకోలేకపోయినా ఈ కాలపు వారికి సిద్ధులు సాధించేయాలన్న ఆరాటం జాస్తిగా ఉందని తన కాలంనాడే ఆయన వాపోయాడు. అంతమాత్రం చేత యోగం ద్వారా సాధించగలిగే సిద్ధవిద్యలను గురించి చెప్పకుండా వదల్లేదు. కాయవ్యూహాన్ని అనుసరించడం ద్వారా ఎవరైనా పరకాయ ప్రవేశం చేయడం సాధ్యమేనన్నాడు...’’ 
పద్మపాదుని మాట ఇంకా పూర్తికానేలేదు. అంతలోనే అందుకుని, ‘‘సాధ్యమేనంటే సమస్యే లేదు. ఎవరికైనా హక్కుంటుంది కదా!’’ అన్నాడు విష్ణుశర్మ విషయాన్ని తేల్చేస్తూ.
‘‘విద్యతో పాటే పరిమితులు కూడా తెలుసుకోవాలి. పరకాయ ప్రవేశం చేసిన యోగికి గతం తెలుస్తుంది ఒక కలలాగా. వర్తమానం కూడా తెలుస్తుంది కొద్దిపాటి వ్యవధానం తరువాత మాత్రమే. భవిష్యత్తు మాత్రం అసలు తెలియదు. అంటే తాను విడిచివచ్చిన దేహానికి గానీ, ఈ కొత్త దేహంలో కానీ తదుపరి ఏర్పడబోయే పరిణామాలు, ప్రమాదాలు ముందుగా తెలియవు. కాలుజారితే పాతాళమే... ఇదీ  ఈ విద్యకు పరిమితి’’ అసలు కీలకం చెప్పాడు పద్మపాదుడు.
‘‘పసిగట్టలేకపోతే ప్రమాదమేనే... రక్షించేవారెవరు?’’
‘‘హఠయోగమూ కొన్ని మార్గాలు చెప్పింది. కానీ వారు చేసే కసరత్తులను యోగమనడానికి శంకరమార్గం అంగీకరించదు’’ చెప్పాడు పద్మపాదుడు.
‘‘అయితే ఈ విద్య సాధించడానికి సరైన మార్గమేది?’’ ప్రశ్నించాడు విష్ణుశర్మ.
 ‘‘విష్ణూ! పరకాయ ప్రవేశం అల్పవిద్యయే కానీ, అల్పులకు పట్టుబడే విద్య కాదు. స్థూలదేహం నుంచి సూక్ష్మదేహాన్ని విడదీయడం నేర్చుకున్న యోగులు ప్రయోగదశలో మరణించిన వ్యక్తి దేహాన్ని ఎంచుకుంటారు. దానిలోకి తమ జీవచైతన్యాన్ని ప్రవేశింప చేసి శవాన్ని నడిపిస్తారు. మాట్లాడిస్తారు. ఏదైనా మహత్తర ప్రయోజనాన్ని ఆశించినప్పుడు మాత్రమే సిద్ధులు ఈ మార్గాన్ని ఎన్నుకుంటారని చరిత్ర చెబుతోంది. అప్పటివరకూ నిరక్షరాస్యునిగా, నిరర్థకంగా బతికినవాడు కాస్తా ఎవరో సిద్ధుడు తన దేహంలో ప్రవేశించడంతోనే మహాభక్తుడిగా, గొప్ప గురువుగా మారిపోయిన సంఘటనలున్నాయి. అయితే ఈ విధానంలో ఇతరుల దేహాలలోకి ప్రవేశించిన సిద్ధులకు తమ అసలు దేహాలపై మోజుండదు. పాత వాటిలోకి తిరిగి వెళ్లాలని వారు ఎన్నడూ అనుకోరు. ’’
‘‘ఒకవేళ తిరిగి వెళ్లాలనుకుంటే...’’
‘‘కొత్తదేహం యోగసాధనకు అనుకూలంగా మారేవరకూ వేచివుండాలి. బాహ్యంగా జరగకుండా ఆగిన అగ్ని సంస్కారం ఈ కొత్త దేహానికి యోగి తన యోగాగ్నితో నిర్వర్తించాలి. అందుకు చాలా సమయమే పట్టవచ్చు.’’ 
‘‘చాలా సమయమే అంటే...’’
‘‘కౌళ శైవాన్ని ప్రబోధించిన మత్య్సేంద్రనాథుడు మనకు మరీ ప్రాచీనుడేం కాదు. ఆయన ఒక మరణించిన రాజు దేహంలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అతడి రాణితో సంసారం చేశాడు. ఇద్దరు పిల్లలను కూడా కన్నాడు. చివరకు గురువును వెనక్కు రప్పించాలనే ఆశయంతో గోరక్షనాథుడు చాలానే పాట్లు పడ్డాడు. కొత్తదేహంతో మత్సే్యంద్రనాథుడు కన్న సంతానం మరణించినట్లుగా గోరక్షనాథుడు మాయ కలిగించాడట. అది చూసి విలవిలా విలపిస్తుంటే, మత్సే్యంద్రునికి పాతదేహంలోకి తిరిగి రమ్మని శిష్యుడు చెప్పాడట. ఈ వృత్తాంతాలను మనవారు అనేక రీతుల్లో చెప్పుకుంటారు కానీ అసలు జరిగింది ఇదీ’’ అన్నాడు పద్మపాదుడు.
‘‘ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడంటే ఆయనకు దాదాపు రెండేళ్లకు పైగా పట్టిందన్నమాట. అంతవరకూ అసలు దేహం పాడైపోకుండానే ఉంది మరి’’ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు విష్ణుశర్మ.
‘‘అంతేకదా. కానీ విష్ణూ! మోక్షాన్ని కోరుకునేవాడు ఎప్పుడూ దేహాత్మ భావనను విడిచిపెట్టాలి. బాల్యాది వృద్ధాప్య పర్యంతమైన దశలను బాధామయాలుగానే దర్శించేవారు మాత్రమే పరకాయ ప్రవేశం వంటి అల్పవిద్యల కేసి మొగ్గు చూపుతారు. గురుకటాక్షం ఉంటే ఏ దశలో అయినా తరించే మార్గం సులభంగానే దొరుకుతుందని గ్రహించలేని మూర్ఖులు వాళ్లు. వారి సంఖ్యకూడా ఈకాలంలోనే పెరుగుతూ వస్తోంది. కొంచెం తర్కించి చూస్తే... మత్సే్యంద్రుని కథ మనకు అందించే సందేశాలు చాలానే ఉన్నాయి. తనది కాని దేహంలోకి ప్రవేశించడం ఒక తప్పు. వేరొక జీవుని భార్యను అందునా ఒక విధవరాలిని కోరడం మరో తప్పు. భర్త మరణంతో అశౌచం కలిగిన స్త్రీతో సంపర్కం పెట్టుకోవడం అతిపెద్ద తప్పు. ఈ విధంగా చేసిన ప్రయోగంలో యోగశక్తి పూర్తిగా నిర్వీర్యం అవుతుందనడంలో అనుమానం ఏముంది? ఇక దీనిని ఆచరించినవాడు ఎంతటి సిద్ధుడయినా ఆ కొత్తదేహంలో శాశ్వత బందీగా మారిపోతాడంటే ఆశ్చర్యం ఏముంది?’’ అని ముగించాడు పద్మపాదుడు.
మధ్యాహ్నపు నిటారు ఎండ క్రమంగా వాలుగా మారుతోంది. – సశేషం

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా