దేశం సిగ్గుపడి, గర్వించింది!

20 Mar, 2016 17:24 IST|Sakshi
దేశం సిగ్గుపడి, గర్వించింది!

దేడ్ కహానీ - నో వన్ కిల్డ్ జెస్సికా
ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్ గమనం...


అనగనగా ఒక దేశం. సంస్కృతికి, సంప్రదాయానికి పెట్టింది పేరు. స్త్రీలను గౌరవించడంలో ప్రపంచంలోనే తలమానికం. సాక్షాత్తూ అమ్మవారి నుదుటి కుంకుమ ఆ దేశమేనని వేదాలు, పురాణాలు, కవితలు ఘోషిస్తాయి. ఆ దేశ రాజధాని మాత్రం ‘నిర్భయ’గా కామాంధులు రక్కసి కోరలు చాచి, అతివల మానభంగ భక్షణ చేసి, శిక్ష లేకుండా విడుదల కాగలిగిన విచ్చలవిడి నగరం. అయిదేళ్ల బాలికలైనా, అరవయ్యేళ్ల వృద్ధురాలైనా ఆ నగరంలో కాదేదీ మాన హరణకు అనర్హం అన్నట్టు ఉంటుంది. నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే నిర్హేతుక కృపా సర్పాల లాంటి నీచ రాజకీయ నాయకులంతా దండిగా ఒకే దగ్గిరుండి కాపు కాస్తుంటారు ఆ నగరంలో. ప్రపంచమంతా ధీర గంభీరంగా ఎదుగుతున్న ఆధునిక యువతి జీవితం... ఆ నగరంలో మాత్రం ఓ మందు గ్లాసు (బాటిల్ కూడా కాదు, గ్లాసే) విలువ కూడా చెయ్యదు.

 
సరిగ్గా 1999లో అలాంటి సంఘటనే జరిగింది. జెస్సికాలాల్ అనే ఓ అందమైన, వర్ధమాన మోడల్... సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాల కోసం కలలు కంటూ, పార్ట్ టైమ్‌గా ఓ రెస్టారెంట్‌లో బార్ టెండర్‌గా పనిచేస్తోంది దేశ రాజధాని ఢిల్లీలో. హర్యానాకి చెందిన బడా వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడి కొడుకు మనుశర్మ అనేవాడు స్నేహితులతో కలిసి ఆ రెస్టారెంటుకొచ్చాడు పార్టీకి. 12 గంటల తర్వాత మద్యం అమ్మకూడదన్న నియమం వలన మనుశర్మకి జెస్సికాలాల్ మరో గ్లాసు మద్యం అమ్మడానికి నిరాకరించింది. మాటా మాటా పెరిగి, ఆవేశంగా రివాల్వర్ తీసి రెండు బుల్లెట్లతో జెస్సికాలాల్‌ని చంపేశాడు మనుశర్మ. అప్పటి హర్యానా ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుని జెస్సికా అక్క పెట్టిన కేసులో సాక్ష్యాలన్నీ కొనేసి, తారుమారు చేసేసి ఆరు సంవత్సరాల కాలయాపన తర్వాత 2006లో జెస్సికా లాల్‌ని ఎవరూ చంపలేదని (?) మనుశర్మ నిర్దోషని సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. 

యావత్ భారతావని ‘సిగ్గుపడింది’. కుంచించుకుపోయింది. కానీ ప్రభుత్వాలు, చట్టం ఇక్కడ మర్చిపోయిన విషయం ఒకటుంది. 1999 తర్వాత 2000 నుంచి మిలీనియమ్‌లో భారతీయ సమాజంలో యువతరం అంతకుముందులా లేరని, టెక్నికల్‌గా ఎదుగుతూ సంఘటిత చైతన్య శక్తిగా సామాజిక మాధ్యమాల్లో ఎదుగు తున్నారని. ఇంటర్నెట్ ద్వారా, మొబైల్ ద్వారా అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చి దేశ భవితవ్యాన్ని నిర్ణయించే బలంగా మారుతున్నారని.

జెస్సికాలాల్‌ని మనుశర్మ చంపాడని, ఆ కేసులో రాజకీయ నాయకుల ప్రోద్బలం వల్లే దోషులు విడుదలయ్యారని ఎస్సెమ్మెస్‌ల ద్వారా జాతిని, మీడియాని మేలుకొలిపింది యువత. మీడియా సపోర్ట్‌తో సుప్రీంకోర్టుని, అప్పటి ప్రధాని, రాష్ట్రపతిని బలవంతంగా కదిలించింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానం మూసేసిన కేసును తిరిగి తెరిచేలా, ప్రభుత్వం తలవంచి ఆ దుష్టుడి మెడ వంచేలా వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేదాకా యువ భారతం కదం తొక్కింది. ఈసారి సాక్ష్యాలను పోలీస్ డిపార్‌‌టమెంట్ కాకుండా మీడియా సంపాదించింది. దోషులు ఖైదీలయ్యారు. దేశం ‘గర్వించింది’.

ఇది జరిగిన కథ. ఇందులో సిగ్గుపడే ఫస్ట్ హాఫ్ అంతా మరణించిన జెస్సికాది, ఒంటరిగా పోరాడి ఓడిపోయిన ఆమె అక్కది. గర్వించిన సెకండ్ హాఫ్ అంతా మీడియా తరఫున ఒక జర్నలిస్టుది. చైతన్యవంతమైన యువ భారతావనిది. వాటన్నిటికీ చిత్రరూపమే... ‘నో వన్ కిల్డ్ జస్సికా’. 2006లో న్యూస్ పేపర్‌లో వచ్చిన హెడ్డింగే ఈ సినిమా టైటిల్. అదే ఈ కథని రాసుకోవడానికి దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తాని ప్రేరేపించింది. మరణించిన జెస్సికాలాల్‌గా మైరా కర్ణ్ అనే అమ్మాయి నటిస్తే, ఆమె అక్క సబ్రినాలాల్‌గా విద్యాబాలన్ జీవించింది. దిగువ, మధ్యతరగతి అమ్మాయి తాలూకు అబలత్వాన్ని, నీరసాన్ని, గమ్యం లేని పోరాటాన్ని, బలహీనతల్ని, అణుచుకున్న ఆవేశాన్ని, నిస్సహాయతని అడుగడుగునా ప్రదర్శించేసింది విద్యాబాలన్. ఈ పాత్రకి పూర్తి విరుద్ధంగా ఆధునిక భారతదేశ వీర వనితగా, సబలగా, ఎదురు లేని జర్నలిస్టుగా మీరా గైటీ అనే పాత్రలో రాణీముఖర్జీ ఈ చిత్రం సెకండ్ హాఫ్‌కి ప్రాణం పోసింది. చాలా ఎలక్ట్రిఫయింగ్ నటన ఆమెది. అందుకే ఆ ఏటి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డును సొంతం చేసుకుంది.

ఒక సమస్యని ప్రతిబింబిస్తే... ఆ కథకుడో, దర్శకుడో దాని పరిష్కారాన్ని తమ మేథస్సుతో సూచించాలి. పరిష్కారం కూడా లభించని దేశ అత్యున్నత సమస్యని తీసేటప్పుడు కథకుడు, దర్శకుడు ప్రేక్షకుల ఆదరణ చూరగొనాలంటే చాలా జాగ్రత్తగా స్క్రిప్టు రాసుకోవాలి. అదే చేశాడు రాజ్‌కుమార్ గుప్తా. ఆ సమస్యని, పరిష్కారాన్ని తక్కువ చూపెట్టి, వాటి మధ్యనున్న పాత్రల డ్రామాని వస్తువుగా తీసుకున్నాడు. అందుకే తెలిసున్న కథే అయినా ప్రేక్షకులు 9 కోట్ల బడ్జెట్‌కి ఆరు రెట్లు కలిపి 58 కోట్ల వసూళ్లిచ్చారు నిర్మాత రోనీ స్క్రూవాలాకి. అమిత్ త్రివేది సంగీతం, అనయ్ గోస్వామి కెమెరా, ఆరతీ బజాజ్ ఎడిటింగ్ మూడూ ఒక వ్యక్తే చేసినంత సింక్‌లో ఉంటాయి ఈ సినిమాకి. అనురాగ్ కశ్యప్ దగ్గర బ్లాక్ ఫ్రైడే, నో స్మోకింగ్ అనే సినిమాలకి అసోసియేట్‌గా పనిచేసిన రాజ్‌కుమార్ గుప్తా దర్శకుడిగా నాలుగు సినిమాలు చేశాడు. కానీ ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ మాత్రమే ప్రేక్షకాదరణని చూరగొంది. ఆ దర్శకుడి ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేసింది.

విద్యాబాలన్‌ని, రాణీముఖర్జీ ఇండియా గేట్ దగ్గిర క్యాండిల్స్‌తో నివాళి అర్పించడానికి రమ్మనే సన్నివేశం నిజంగా నిస్తేజానికి, చైతన్యానికి మధ్య సంఘర్షణ. ఒక పక్క బాధ, మరో పక్క ఆవేశం రెండు పాత్రల ద్వారా, వాటి మధ్య మాటల ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు. టేకింగ్ పరంగా ఇవాళ్టి సమకాలీన దర్శకులంత బాగా సినిమా ఉండకపోయినా కంటెంట్ బలంగా ఉండటం వల్ల ప్రేక్షకుడు ఆ అంశాన్ని పెద్దగా పట్టించుకోడు. నిజంగా జరిగిన ఘటన కాబట్టి సహజంగానే చిత్రీకరించాడు. ఈ ఘోరానికి సమాజం పట్ల అసహ్యం వేసినా, మళ్లీ యువ సమాజం ఆ తప్పుని సరిదిద్దిన వైనానికి హ్యాట్సాఫ్ చెప్తూ...

నవ్య సమాజ నిర్మాణానికి నడుము బిగించి కదం తొక్కే ప్రతి యువతికి, యువకుడికి అభినందనపూర్వక నమస్సుమాలర్పిస్తూ...  భారతీయ మహిళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడికీ ఉందని గుర్తు చేస్తూ ముగిస్తున్నాను.

మరిన్ని వార్తలు