నిశ్శబ్ద   విజయం 

27 Jan, 2019 01:28 IST|Sakshi

పిల్లల కథ

ఐదు అంతస్తుల భవనంలో నగరం నడిబొడ్డులో పేరున్న పాఠశాల అది. ఒక  రోజు ఉదయం  పిల్లలంతా విరామ సమయంలో ఉండగా ఒక అబ్బాయి చివరి అంతస్తులో  నిలబడి ప్రక్క భవనం వైపు చూస్తున్నాడు. ‘‘ఏమి చేస్తున్నావు?’’ అని వెనక నుంచి వినబడ్డ మాటలకు ఉలిక్కిపడి చూశాడు ఆ అబ్బాయి. పేరు  రవి.  అడిగింది సోషల్‌ మాస్టారు.  ‘‘మొబైలులో ఫోటోలు తీస్తున్నాను’’ అని చెప్పాడు రవి.  ‘‘విరామం పూర్తయినట్టుగా బెల్‌ మోగింది. వినలేదా?  క్లాసుకి నడు’’ భుజం మీద చేయి వేసి చెప్పారు మాస్టారు.  ‘‘ఒక విషయం చెప్పాలి’’ రవి చెబుతున్నా వినిపించుకోలేదు మాస్టారు. ‘‘ముందు తరగతికి నడు‘’ అన్నారు చేయి చూపిస్తూ. రవి తొమ్మిదో తరగతి అబ్బాయి. చురుకైన వాడు. ఆ రోజు ఇంటర్వెల్‌ టైములో పక్క భవనం టెర్రస్‌ మీద నలుగురు యువకులు కనబడ్డారు. వారి ప్రవర్తనలో తేడా గమనించాడు రవి. తమ ముఖాలను  రుమాలుతో సగం వరకు కప్పుకుని భయంగా ఉండడం కనబడింది రవికి. వారిలో  పొడుగ్గా ఉన్నవాడిని ఎక్కడో  చూసిన భావం కలిగింది కానీ గుర్తు రాలేదు. ఎందుకైనా మంచిదని మొబైలుతో వారి ఫోటోలు తీశాడు.   

రవికి టెక్నాలజీ  మీద ఆసక్తి వలన మొబైల్‌ వినియోగం  క్షుణ్ణంగా తెలుసు. అమ్మానాన్నలకి  తెలియని మొబైల్‌ వినియోగం కూడా వారికి నేర్పాడు. రవికి ఉన్న ఆసక్తి తెలుసుకున్న అతడి తండ్రి, తన కోసం  కొత్త ఫోను కొనుక్కుంటూ పాత మొబైలు కొడుక్కి ఇచ్చాడు. అదే ఇప్పుడు రవి చేతిలో ఉంది. ఇంటర్నెట్‌ సదుపాయం కూడా ఉంది.  మొబైల్‌ని సైలెంటులో పెట్టడం అలవాటు  రవికి.   మొబైల్‌ వినియోగదారుల కోసం కొత్తగా వచ్చిన  ఒక సదుపాయం గురించి దినపత్రికలో చదివిన రవి, ప్రక్క భవనం మీద కనబడిన మనుషుల ఫోటోల ముఖాల మీద ముసుగులు తొలగించాడు. వారిలో ఒకరిని టీవీ వార్తల్లో చూపించినట్టు గుర్తు వచ్చింది. ‘ఉగ్రవాదులు నగరంలోకి వచ్చి జనసంచారం ఉన్న చోట బాంబులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు’ కూడా చెప్పారు.  ఆ విషయం గుర్తు రాగానే పోలీసులకు చెప్పడానికి 100 నంబరుకి ఫోను చేశాడు.  అప్పుడే  సోషల్‌ మాస్టారు రవిని క్లాసుకి పంపించారు. పాఠం పూర్తయ్యే వరకు ఆగిన రవి తరువాత పోలీసులకు ఫోను చేసాడు. రవి మాటలకు ‘‘ఎవరిని చూసి ఏమనుకున్నావో’’ అని ఫోను పెట్టేశారు పోలీసులు.  మోహన్, గోపి మాస్టారులకు చెప్పడానికి ప్రయత్నించాడు రవి. వారు రవి మాటలు వినడానికి సమయం కేటాయించలేదు. లంచ్‌ బ్రేక్‌ వరకు చాలా ఆలోచించాడు రవి. పోలీసులకు రుజువులు చూపిస్తే తప్ప నమ్మరని అనుకున్నాడు. నేరుగా కమిషనర్‌గారికి చెబితే ప్రయోజనం ఉండొచ్చని గూగుల్‌లో వెతికి ఆయన నంబరు సంపాదించాడు. మనసులోనే పథకం వేసుకున్నాడు. కాసేపటి తరువాత క్రికెట్‌ బంతిని జేబులో వేసుకుని టెర్రస్‌ మీదకు వెళ్లి పక్క బిల్డింగు మీదకు పడేలా విసిరాడు. వెనక్కు తీసుకునే నెపంతో ప్రక్క భవనం మీదకు వెళ్లాలని బయల్దేరాడు రవి.  భవనం కాపలావాడు ఆపగానే పక్క భవనం మీద పడిన   బంతి కోసమని చెప్పాడు.
     
మెట్ల మీదుగా వెళ్లడమే మంచిదని ఒక్కో అంతస్తు ఎక్కుతూ చివరి అంతస్తు వరకు వెళ్ళాడు రవి. పరిసరాలు గమనించుకుంటూ వెళుతున్న రవిని అయిదవ అంతస్తుకు చేరుతుండగా ఇద్దరు వ్యక్తులు ఆపారు. బంతి కోసమని చెప్పి నమ్మించగలిగాడు రవి. వారిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు రవి. అతడికి  కొన్ని వస్తువులు కనబడడం, వాటిని ఎవరూ చూడనంత వేగంగా ఫోటోలు తీయడం జరిగిపోయింది. టెర్రస్‌ మీద నలుగురు యువకులు ఏదో పనిలో ఉన్నారు. వారిలో ఒకడు రవిని చూసి తడబడ్డాడు. ఇంకొకడు  రవి మీద కోపం అయ్యాడు. రవి మెడ మీద చెయ్యి వేసి పొడుగు వాడి ముందు నిలబెట్టి ‘‘వీడి వాలకం చూస్తే అనుమానంగా వుంది. గదిలో వేసి తాళం వేద్దామా?’’ అని అడిగాడు. ‘బంతి కోసమే వచ్చాడేమో. వీడు తిరిగి వెళ్ళకపోతే గేట్‌ మేన్‌ ఇక్కడి దాకా వచ్చేస్తాడు. వాడిని పంపించు‘ అన్నాడు పొడుగు వ్యక్తి. ఆ మాటలు వినగానే పరుగులాంటి నడకతో కిందకు చేరుకున్నాడు రవి. మొబైల్‌లో తీసిన ఫోటోలలో కొన్ని ఎంపిక చేసి ‘‘నాది అనుమానమే కావచ్చు. ఒక ప్రయత్నం పెద్ద ప్రమాదాన్ని తప్పించవచ్చు’’ అని రాసి తన వివరాలతో కమిషనర్‌గారికి వాట్సాప్‌లో పంపించాడు రవి. ఆ విషయానికి అంతటితో విరామం ఇచ్చి  క్లాసులో చెప్పిన విషయాలపై దృష్టి నిలిపాడు రవి.సాయంత్రం అయింది. బడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు రవి. పోలీసుల నుండి పిలుపు రాలేదు. ఆ విషయం ప్రాధాన్యత లేనిదేమో అనుకున్నాడు రవి. 

తరువాత రోజు ఉదయం క్లాసు జరుగుతుండగా ప్రిన్సిపాల్‌ గారు, ఒక పోలీసు అధికారిని తీసుకుని రవి దగ్గరకు వచ్చారు. పోలీసు అధికారి రవికి కరచాలనం చేసి ‘‘వెల్‌ డన్‌. అభినందనలు’’ అన్నారు.అందరూ ఆశ్చర్యపోతుండగా ‘‘రవికి అభినందనలు దేనికి?’’ అడిగారు ప్రిన్సిపాల్‌.  ‘‘రవి చేసిన సాహసం వలన పెద్ద ప్రమాదం, ఘోర ప్రాణనష్టం తప్పింది. మీడియా సమావేశంలో పరిచయం చేయడానికి కమిషనర్‌గారు రవిని తీసుకురమ్మనడంతో వచ్చాను. మిగతా విషయాలు వార్తల్లో చూడండి’’  అనేసి రవితో కలసి వెళ్ళిపోయాడు పోలీసు అధికారి.     ‘‘వేలాది పిల్లలుండే స్కూలు, అనేక దుకాణ సముదాయం ఉండడం వలన ఉగ్రదాడి జరిగితే కలిగే పరిణామాలు ఊహించడానికే భయం కలిగిస్తున్నాయి. రవి ఇచ్చిన సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రవాదులను పట్టుకున్నాము. అర్ధరాత్రి వరకు వేచి చూసి మెరుపు దాడి చేశాం. తెలివిగా ఆలోచించి, సాహసం చేసిన రవికి లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తున్నాం’’ అని ప్రకటించారు పోలీసు కమిషనర్‌.  వార్తల ద్వారా, దినపత్రికల ద్వారా స్కూలు పేరు మారుమోగింది. స్కూలుకి వచ్చిన ఉచిత పబ్లిసిటీకి సంతోషించి రవికి ఉచిత విద్య ప్రకటించింది మేనేజ్‌మెంట్‌. రవి పేరును ‘సాహసబాలుడు’ అవార్డు కోసం రాష్ట్రపతికి  సిఫారసు చేశారు పోలీసులు. ‘నిశ్శబ్దంగా గొప్ప విజయం అందించినవాడు రవి’ అని పత్రికలు అభినందించాయి.         
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు  

>
మరిన్ని వార్తలు