జడ్రుచులు

19 Mar, 2016 23:32 IST|Sakshi
జడ్రుచులు

హ్యూమర్

చిన్నప్పుడు మా బుజ్జిగాడికి ఒక జడ ఉండేది.  దాని వెనకో కథ కూడా ఉంది. దానితో నాకో నీతి తెలిసింది. ఆ టైమ్‌కు కలిసివస్తోంది కదా అని తొందరపడి మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. కొన్నిసార్లు మన మాటలే మనకు అడ్డం తిరిగి, మనకే ముప్పుగా మారుతుంటాయి.

 
పుట్టెంటికలు తీయకపోవడం వల్ల మా బుజ్జిగాడి జుట్టు విపరీతంగా పెరిగింది. ఇంట్లో ఆడబిడ్డ లేకపోవడం వల్ల మా బుజ్జిగాడికే జడలు వేసి తన ముచ్చట తీర్చుకుంటోంది మా ఆవిడ.  మామూలుగానే నా అభ్యంతరాలను ఎవరూ లెక్క చేయరు. పైగా ముద్దు ముద్దుగా జరిగే ఈ జడ కార్యక్రమానికి నా సంపూర్ణ కుటుంబ సభ్యుల మద్దతు ఉంది. ఫలితంగా ‘మగపిల్లాడు కదా వాటికి జడ వద్దు’ అనే నా తీర్మానం మొదట్లోనే వీగిపోయింది. 


మా బుజ్జిగాడికి నాలుగేళ్లు నిండ టంతో ఇంగ్లిష్ అక్షరాలు నేర్పిస్తున్నా. ఓ పుస్తకం కొని ఏ ఫర్ ఆపిల్, బీ ఫర్ బాల్ అంటూ చెబుతున్నా. వై ఫర్ ‘యాక్’ అనగానే దాన్ని తెలుగులో ఏమంటారని అడిగాడు. క్షణం కూడా ఆలోచించకుండా ‘జడలబర్రె’ అని చెప్పా. మా బుజ్జిగాడు కూడా క్షణం ఆలోచించకుండా అడిగేశాడు, ‘మరి దానికి జడలు లేవేమిటి? వాళ్లమ్మ జడ వేయకపోయినా దాన్ని జడలబర్రె అని ఎందుకు అంటున్నారు?’ అని. దానికి ఒకరు జడ వేయాల్సిన అవసరం లేదనీ, జుట్టు పెరుగుతూన్న కొద్దీ చివరన ఉండే జుట్టు జడ పాయల్లా పెరుగుతుందని చెప్పా.


‘‘అయితే నాకు జడ వెయ్యకండి. అలా వదిలేయండి’ అన్నాడు వాడు. వాడికి జడలు వేయడం తప్పదనీ, వాడిని సమాధానపర్చమనీ హుకుం జారీ అయ్యింది. దాంతో జడల గొప్పదనాన్ని వాడికి విడమరచి చెప్పాల్సిన అగత్యం నాకు ఏర్పడింది. ‘‘ఒరేయ్... పెద్ద పెద్ద నదులన్నీ జడలు వేసుకుంటాయి తెల్సా’’ అంటూ మొదలెట్టా. ‘‘నదులు జడలు వేసుకుంటాయా?’’ అన్నాడు వాడు.  ‘‘అవున్రా. నువ్వు కాస్త పెద్ద క్లాసులకు వచ్చాక తెలుస్తుంది. వాటినే బ్రెయిడెడ్ స్ట్రీమ్స్ అంటారు. అంటే జడలు వేసుకున్న ప్రవాహాలు అని అర్థం.  మొదట్లో నదులన్నీ అల్లరిచిల్లరిగా ప్రవహిస్తుంటాయి. ఆ తర్వాత కాస్త పెద్దరికం వస్తుంది. దాంతో నది పడక మీద ఇసుక పేరుకుపోయి  జడలు అల్లుకునట్టుగా అయిపోతుం టుంది. దాన్నే ఇంగ్లిష్‌లో బ్రెయిడెడ్ స్ట్రీమ్ అంటారు. జడలు వేసుకున్నందుకే నదికి ఆ పేరు’’ అని చెప్పా.

 
అక్కడితో ఆగలేదు. ఇంకా రెచ్చి పోయా. ‘‘మూడొందల ఏళ్ల క్రితం అలెగ్జాండర్ పోప్ అనే ఇంగ్లిషు మహాకవి జడ కుచ్చులు కత్తిరించడం మీద పెద్ద పద్యం రాశాట్ట. నాలుగు రోజుల్లోనే ఆ పద్యాల పుస్తకాలు మూడు వేలు అమ్ముడు పోయాట్ట. అదీ జడ మహత్యం’’ అంటూ వివరించా. వాడికి నమ్మకం కుదరలేదు. దాంతో ఎగ్జాంపుల్ మార్చక తప్పలేదు.

 
మొన్నీమధ్యనే టీవీలో కుంగ్‌ఫూ ఫైటింగ్ సినిమా చూశా. అందులో పెద్ద పెద్ద మాంక్స్ పొడవు పొడవు జడలు వేసుకున్నారు. ఫైటింగ్ చేసేటప్పుడు చేతులు, కాళ్లతో పాటు జడలతోనూ కొడుతుంటారు’’ అంటూ చెప్పా. అయినా వాడికి నమ్మకం కుదిరినట్లు అనిపించలేదు. దాంతో నాకిక తెలుగు సినిమా రంగానికి రాక తప్పలేదు.

 
‘‘హీరోయిన్‌లో అచ్చమైన తెలుగు దనం చూపించడానికి జడ బాగా ఉప యోగపడుతుంది. ఆమెలో తెలుగుదనం ఉట్టిపడాలంటే... జడను చేతుల్లోకి తీసు కుని అదేపనిగా తిప్పుతూ ఉండాలి. రెండు జళ్ల సీత అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో హీరోయిన్ రెండు జడలు వేయడం మాత్రమే కాదు, ఆమె జడలనే టైటిల్‌గా పెట్టడంతో ఆ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. అంతెందుకు మనం మర్రి మానులనూ, మన ఊరి మారెమ్మనూ ఎందుకు పూజిస్తామో తెలుసా? పెద్ద పెద్ద ఊడలూ, జడలూ ఉండటం వల్లనే’’ అన్నానేను. ఇక వాడికి నమ్మక తప్పలేదు. జడ  గొప్పదనాన్ని వివరిస్తూ అవాకులూ చెవాకులూ పేలుతూ ఇంతగా వాడిని నమ్మించినందుకు ఆ టైమ్‌కు నేను బాగానే ఆనందపడ్డాను.


కానీ నేను చెప్పిన మాటలే నా కాళ్లకు అడ్డం పడతాయని నాకు తెలియలేదు. తీరా తెలిసే సరికి జడ రిబ్బన్‌లాగే ముడి బిగుసుకు పోయింది. మొక్కు తీర్చాలిన టైమ్‌లో మావాడు అడ్డం తిరిగాడు. ‘‘జడలు చాలా గొప్పవి కాబట్టి వాటిని కత్తిరించడానికి వీల్లేదు’’ అంటూ ఒకే మాట మీద ఉన్నాడు. కత్తి పెట్టడం కుదరని కరాఖండీగా చెప్పడంతో గుండు కొట్టించడానికి వాడిని ఒప్పించేలోపు నాకు ఐదారు కత్తిగాట్లు పడ్డాయి.
 

- యాసీన్

మరిన్ని వార్తలు