సంగ్రామం: బారులు తీరిన అబద్ధాలు

23 Feb, 2014 04:27 IST|Sakshi
సంగ్రామం: బారులు తీరిన అబద్ధాలు

 ‘యుద్ధంలో చేరండహో!’ అని పోలీసు, మిలటరీ బ్యాండ్లు మోగిస్తూ ఊరేగింపులు జరిగాయట.  క్రొయడాన్‌లోనే మిష్రామ్ రోడ్డులో ఉన్న బ్యారెక్స్‌కు వెళ్లాడు కూపర్డ్. వేల సంఖ్యలో, కిలోమీటర్ల మేర  బారులు తీరి ఉన్నారు జనం. తీరా, ‘‘పందొమ్మిదేళ్లు రావాలి! రేపు రా! వస్తాయేమో!’’ అన్నాడట సార్జెంట్.
 
 ‘అబద్ధాలాడే అబ్బాయిలు ఎక్కడికి వెళతారో తెలుసా?’
 వ్యంగ్య చిత్రంలో సైనికాధికారి అడుగుతున్న ప్రశ్న.
 ఇందుకు ఆ బాలుడి సమాధానం- ‘ఫ్రంట్‌కే సార్!’
 
 మొదటి ప్రపంచ  యుద్ధంలో సైనికుల ఎంపిక తీరుతెన్నులు ఎంతటి ప్రహసన ప్రాయమో చెప్పడానికి ‘పంచ్’ కార్టూన్ పత్రిక (1841-2002) ప్రచురించిన (ఆగస్టు 11, 1916) ఈ ఒక్క కార్టూన్ చాలు. ఎఫ్.హెచ్. టౌన్సెండ్ గీసిన ఆ వ్యంగ్య చిత్రం ఇరవయ్యో శతాబ్దం ఆరంభం నాటి ఇంగ్లండ్ యుద్ధ కండూతికి గీటురాయి. అబద్ధాలాడితే నరకానికి పోతారన్న నీతిని బోధించడం ఆ అధికారి ఉద్దేశం. తన వయసు 13 సంవత్సరాలయితే, ఆ కుర్రాడు పదహారు అని అబద్ధం ఆడాడు. అప్పటిదాకా అక్కడ జరిగినదంతా అబద్ధాల కవాతే. దానిని బట్టి ఆ కుర్రాడు, సార్జెంట్ ప్రశ్నకు జవాబుగా నరకం అని చెప్పకుండా, ‘ఫ్రంట్‌కే సార్!’ అన్నాడు. ఫ్రంట్ అంటే, వెస్ట్రన్ ఫ్రంట్. బెల్జియం- ఫ్రాన్స్ దేశాల మధ్య దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల యుద్ధభూమి. నిజానికి వెస్ట్రన్ ఫ్రంట్ నరకానికి నకలేనని కొద్ది రోజుల్లోనే సైనికులందరికీ అనుభవానికి వచ్చింది.
 
 బ్రిటిష్ సైన్యంలో చేరడానికి నిబంధనలు కఠినంగా ఉండేవి. ఐదడుగుల ఆరు అంగుళాల పొడవు తప్పనిసరి. ఛాతీ చుట్టుకొలత 35 అంగుళాలు ఉండాలి. పద్దెనిమిది నిండితేనే సైన్యానికి ఎంపిక చేసేవారు. కానీ విదేశాలలో జరిగే యుద్ధానికి వెళ్లాలంటే పందొమ్మిదేళ్లు తప్పనిసరి. మోన్స్ యుద్ధంలో ఇంగ్లండ్ పలాయనం తరువాత ఎంపిక నిబంధనలన్నీ సడలిపోయాయి. ఐదడుగుల ఆరు అంగుళాలు కాస్తా, ఐదూ మూడుకూ, ఆ పై ఐదడుగులకూ కుదించారు. వీళ్లనే బంటామ్ దళం అనేవారు. అంటే పొట్టివాళ్ల సైన్యం. కనీస వయో పరిమితిని పందొమ్మిదేళ్ల నుంచి పదిహేనుకు తగ్గిం చారు. గరిష్ట వయో పరిమితి 40 సంవత్సరాలకి పెంచారు. ఇన్ని సడలింపులతో కొత్తగా ఐదు లక్షల మందిని చేర్చుకున్నారు. యుద్ధ కార్యదర్శి హెచ్ హెచ్ కిష్నర్ లక్ష్యం పూర్త యింది. ఏడు లక్షలున్న ఇంగ్లండ్ సైన్యం అప్పటికి పదమూడు లక్షలకు చేరింది. కవులు, చిత్రకారులు, ఆటగాళ్లు ఎవరూ బయట మిగలలేదు. ఒక్కొక్క దళం పేరుతో యుద్ధంలో చేరారు. ఆర్టిస్ట్స్ రైఫిల్స్ ఇందుకు మంచి ఉదాహరణ.
 
 ఆగస్టు 4, 1914న జర్మనీ మీద ఇంగ్లండ్ యుద్ధం ప్రకటించి, మొదటి ప్రపంచ యుద్ధంలో అడుగు పెట్టింది. తటస్థ దేశం బెల్జియం మీద జర్మనీ దాడిని ఖండిస్తూ ఇంగ్లండ్ ఆ దేశం మీద యుద్ధం ప్రకటించింది. కానీ ఆగస్టు 14నే జర్మనీ, ఇంగ్లండ్ సేనలు మొదటిగా మోన్స్‌లో  తలపడ్డాయి. ఇంగ్లండ్ మొదటి అడుగే తడబడింది. దీనితో ఆ జాతి కుంగిపోయింది. దీనికి తోడు పోస్టర్లు, తెల్ల ఈకలతో కుర్రాళ్లు సొంతూళ్లలో ఉండడానికి భయపడిపోతూ సైనిక ఎంపిక కేంద్రాల వైపు పరుగులు తీశారు. 1914 సెప్టెంబర్ మొదటి వారంలోనే ఇంగ్లండ్‌లో రెండు లక్షల మంది సైన్యంలో చేరిపోయారు. ఒక్క లండన్ నగరంలోనే 21,000 మంది చేరారు. నిజానికి శాంతి వేళ ఒక సంవత్సరానికి ఇంగ్లండ్‌లో 25,000 నుంచి 30,000 మందిని చేర్చుకునేవారు. బ్రిటన్ వలస దేశాలలో కూడా ఈ హడావుడి నియామకాలు జరిగాయి. ఆస్ట్రేలియా, కెనడా, భారత్‌లలో ఇది చూడొచ్చు. భారతదేశంలో పంజాబ్ మొదటి ప్రపంచ యుద్ధం మీద మోజు పెంచుకుని, శ్వేత పాలన పట్ల వీరభక్తిని ప్రదర్శించింది. 1910 ప్రాంతానికి 69,458 మంది పంజాబీలు బ్రిటిష్ ఇండియా సైన్యంలో పని చేస్తున్నారు. ఈ సంఖ్య యుద్ధారంభానికి 3,62,027కు (రెండు కోట్ల జనాభాలో 1.8 శాతం) చేరుకుంది. ఇలాగే దేశమంతా ప్రత్యేక నియామకాలు జరిగాయి. ఆ యుద్ధం కోసం ఫ్రాన్స్‌కు 1,38,000, మెసపటోమియాకు 6,75,000 మంది, ఈజిప్ట్‌కు 1,44,000 మంది భారత సైనికులు వెళ్లారు.
 
 ఇంగ్లండ్ చేర్చుకున్న ఐదు లక్షల మంది స్వచ్ఛంద సైనికులలో సగం మంది బాలురే. ఇంగ్లండ్‌లోనే కాదు, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, రష్యా, జర్మనీలలో కూడా పెద్ద సంఖ్యలో బాలురు చేరారు. ఇంగ్లండ్ బాలలు ఎలాంటి అబద్ధాలు చెప్పారో తరువాత వారు రాసుకున్న లేఖలతో, జీవిత చరిత్రలతో, ఆ సైనికుల కుటుంబ సభ్యుల ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. పిల్లలు చెబుతున్నది పచ్చి అబద్ధమని సైనికాధికారులకి పూర్తిగా తెలుసు. హ్యారీ పాచ్ అనే అబ్బాయి ఎంపిక కేంద్రానికి వెళ్లాడు.
 
  వయసు అడిగితే చటుక్కున ‘పదహారు’ అని నిజం చెప్పేశాడు. దీనితో ఎంపిక అధికారి, ‘పద్దెనిమిది నిండాక మళ్లీ రా!’ అని చెప్పి పంపేశాడు. అలాగే  వచ్చాడు పాచ్- అదే క్యూలో వెనుక నిలబడి. పద్దెనిమిదేళ్లు అని చెబితే, వెంటనే అదే అధికారి చేర్చుకున్నాడు. టామీ గ్రే అని మరో బాలుడి అనుభవం ఇంకా నవ్వు తెప్పిస్తుంది. పదహారేళ్ల టామీ తడుముకోకుండా ‘పద్దెనిమిది’ అని చెప్పాడు. దానికి అధికారి, ‘సైన్యంలో చేరేవాళ్లు ఎలా ఉండాలని మేం అనుకుంటామో, అలాగే ఉన్నావ్!’ అంటూ ఎంపిక చేసుకున్నాడు. ఇలా ఎంపికై యుద్ధరంగానికి వచ్చిన బాలురలో అతి పిన్న వయస్కుడు జార్జి మాహెర్. ఇతడి వయసు కేవలం పదమూడేళ్లు. సొమ్మె అనే చోట జరిగిన ఒక యుద్ధంలో ఇతడు పాల్గొ న్నాడు. నిజానికి, హోరెస్ అనే ఇంకో బాలుడి రికార్డుని బద్దలుకొట్టి మాహెర్ చరిత్రలో నిలిచాడు. హోరెస్ వయసు పద్నాలుగేళ్లే. మాహెర్ తన 91వ ఏట 1999లోనే కన్నుమూశాడు. 1917లో రాయల్ లాంకాస్టర్ రెజిమెంట్‌లో చేరిన మాహెర్ అసలు వయసు యుద్ధభూమిలో బయటపడింది.
 
  ఒక షెల్ దగ్గరగా వచ్చి పడడంతో ‘అమ్మా!’ అంటూ బావురుమన్నాడట మాహెర్. దీనితో ఇంటికి పంపేశారు. మాహెర్ తన రికార్డును బద్దలుకొట్టే ఇంకో వాస్తవం బయటపెట్టాడు. ఇలాంటి పిల్లలే  ఐదురుగురుని రెలైక్కించి లండన్ పంపారట. ఆ ఐదుగురిలో ఒక బాలుడి వయసు కేవలం పన్నెండేళ్లు. ‘ట్రెంచ్ బయట ఏం జరుగుతోందో నిన్ను ఎత్తుకుని చూపించేవారా?’ అంటూ మిగిలిన పిల్లలు రైల్లో జోక్ చేశారట. రిచర్డ్ డిక్‌ట్రాఫోర్డ్ అనే మరో బాల సైనికుడి కథ ఇంకా చిత్రం. ఇతడి వయసు పదిహేనేళ్లే. కానీ పద్దెనిమిదేళ్లని చెప్పాడు. నాకు నమ్మకం లేదన్నాడు అధికారి. కావాలంటే బర్త్ సర్టిఫికెట్ తీసుకువస్తానని దబాయించాడు రిచర్డ్. దానితో పక్కనే ఉన్న అధికారి ఆ కుర్రాడి మాటే చాలు ఎంపిక చెయ్యమన్నాడు. బెల్జియం తమాషా, ఇంకొకటి- ‘క్షమించాలి! నీ పండ్లు సరిగ్గా లేవు. నిన్ను సైన్యానికి ఎంపిక చెయ్యలేను!’ అన్నాడట  సార్టెంట్. అందుకు చేరడానికి వచ్చిన ఆ యువకుడు ‘నేను జర్మన్లని కొరికి చంపక్కర్లేదు. కాల్చి చంపుతాను’ అన్నాడట.
 
 జార్జి కూపర్డ్ అనే పదహారేళ్ల అబ్బాయి క్రొయడాన్ అనే చోట, అప్పటి తన అనుభవాన్ని ఒక ఉత్తరంలో వర్ణించాడు. సరాయేవోలో ఫెర్డినాండ్, సోఫీల హత్య, యుద్ధం మొదలు కావడం, మోన్స్ యుద్ధం వంటి సంగతులన్నీ కూడళ్లలో ప్లకార్డుల మీద దర్శనమిచ్చేవట. అన్నింటికీ మించి సైన్యంలో చేరి ‘హూణుల’ (జర్మన్లు) పీచమణచాలని తహతహలాడిపోయిన పిల్లలు ఎంపిక కేంద్రాల దగ్గర ఎన్ని ఇక్కట్లు పడ్డారో కూడా ఇతడి ఉత్తరంతో తెలుస్తుంది. ‘యుద్ధంలో చేరండహో!’ అని పోలీసు, మిలటరీ బ్యాండ్లు మోగిస్తూ ఊరేగింపులు జరిగాయట. దీనితో సైన్యం ఎంపిక కేంద్రానికి పరుగులు తీశానని కూపర్డ్ రాసుకున్నాడు. క్రొయడాన్‌లోనే మిష్రామ్ రోడ్డులో ఉన్న బ్యారెక్స్‌కు వెళ్లాడు. కిలోమీటర్ల మేర  బారులు తీరి ఉన్నారు జనం. తీరా, ‘‘పందొమ్మిదేళ్లు రావాలి! రేపు రా! వస్తాయేమో!’’ అన్నాడట సార్జెంట్. ఇతడు ఠంచనుగా మరునాడు వెళితే ఎంపిక చేశారు.
 
 వీళ్లలో చాలామంది పేర్లు తప్పు చెప్పారు. దొంగ చిరునామాలు ఇచ్చారు. అందుకే చాలామంది ఆచూకీ తరువాత లభించలేదు. తమ పిల్లల ఆచూకీ కోసం జీవితాంతం ఎదురుచూసిన తల్లిదండ్రులు ఎందరో!
 - డా॥గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు