వ్యాపార దక్షత

27 Jun, 2015 22:38 IST|Sakshi
వ్యాపార దక్షత

పిల్లల కథ
రఘునాథపురంలో శీనయ్య అనే యువకుడు ఉండేవాడు.
చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోతే వాడి నానమ్మ వాడిని పెంచి పెద్ద చేసింది.
నానమ్మ గారాబం వలన శీనయ్య ఏ పనీ చేయకుండా పెరిగాడు.
స్వతహాగా తెలివితేటలు ఉన్నా పనిచేయవలసిన అవసరం లేక సోమరిలా తయారయ్యాడు.


‘‘ఒరే శీనూ! నేను పెద్దదాన్ని అయిపోయాను. ఇక పనిచేసే ఓపిక నాకు లేదు. కనుక నువ్వే ఏదన్నా పనిచేసి డబ్బు సంపాదించి తీసుకురాకపోతే ఇల్లు గడవడం కష్టం’’ అంది ముసలావిడ. ఎప్పుడూ అంత గట్టిగా మాటాడని నానమ్మ అలా అనేసరికి ఆలోచనలో పడ్డాడు శీనయ్య. నిజమే నానమ్మ పెద్దదైపోయింది. పాపం ఇంత కాలం అక్కడ ఇక్కడ పనిచేసి నెట్టుకొచ్చింది. ఇక లాభం లేదు, తనే ఏదో పనిచేసి డబ్బు సంపాదించాలి.

కాని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఊరి మధ్యనున్న శివాలయం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న సాధువుతో శీనయ్య తన కుటుంబ పరిస్థితి వివరించి, ‘ఏం చేయాలో తెలియడం లేదు’ అన్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి, జోలినించి ఓ పచ్చి మామిడికాయ తీసి శీనయ్య చేతిలో పెట్టాడు. ‘‘నాయనా! ఇది పెట్టుబడిగా వ్యాపారం ప్రారంభించు. అనతికాలంలోనే మంచి జరుగుతుంది’’ అని దీవించాడు. సాధువు ఇచ్చిన మామిడికాయతో ఇంటికి చేరి, జరిగినదంతా నానమ్మకు చెప్పి, కారం, ఉప్పు, రెండు డబ్బాలలో పోసుకుని, మామిడికాయతో ఊరి మధ్యనున్న కూడలి వద్దకు చేరుకున్నాడు.

మామిడికాయను సన్నగా తరిగి, ఉప్పు, కారం చల్లి, ‘‘ముక్క పావలా’’ అంటూ గట్టిగా అరుస్తూ, అందరినీ ఆకర్షించాడు. ఒక అరగంటలోనే శీనయ్య దగ్గర మామిడికాయ ముక్కలన్నీ అయిపోయాయి. శీనయ్యకు అయిదు రూపాయలు వచ్చాయి. దానిలో మూడు రూపాయలకు పచ్చిసెనగలు తీసుకున్నాడు శీనయ్య, మిగతా రెండు రూపాయలతో ఇంటికి చేరుకున్నాడు.
 సెనగలు నానబెట్టి, ఊరు చివరనున్న మామిడి తోటకు పోయాడు శీనయ్య. తోటమాలితో బేరమాడి, తన దగ్గర ఉన్న రెండు రూపాయలకి, నాలుగు పెద్ద మామిడికాయలు కొన్నాడు.
 
మరుసటిరోజు ఊరిలో గౌరమ్మ సంబరం. సెనగలను ఉడకబెట్టి, ఉప్పు, కారం చల్లి గుడి దగ్గర అమ్మాడు. ఈ సారి శీనయ్య చేతికి యాభై రూపాయలు వచ్చాయి. మొదటినించి ఓ మామిడి పండ్ల వ్యాపారి శీనయ్యను గమనిస్తున్నాడు. శీనయ్య దగ్గరకు వచ్చి ‘‘బాబూ! నా పేరు పరంధామయ్య. నేను ప్రతి వేసవిలో మామిడిపళ్ల వ్యాపారం చేస్తుంటాను. ఎప్పుడూ లాభాలు రాలేదు. నువ్వు వ్యాపారం బాగా చేస్తున్నావ్. నా వ్యాపారం ఇద్దరం చూసుకుందాం. పెట్టుబడి నాది, లాభాలు ఇద్దరివి’’ అన్నాడు పరంధామయ్య. ‘‘సరే నే చెప్పినట్టుగా చేస్తానంటే ఒప్పుకుంటాను’’ అన్నాడు శీనయ్య.
 
ఒకేసారి లాభాలు ఆర్జించాలి అనే ఆశతో పరంధామయ్య మామిడిపళ్లను రేటు ఎక్కువ చెప్పడంతో పెద్దగా వ్యాపారం జరిగేది కాదు. ఇదంతా తెలుసుకున్న శీనయ్య ఒక ఉపాయం ఆలోచించాడు. ఉదయం తోట నుండి పరంధామయ్య తెచ్చిన మామిడిపళ్లను చెరి సగం చేశాడు. రోజులానే పరంధామయ్యను తన వ్యాపారం తనను చేసుకోమన్నాడు. అతని దగ్గరగా మరో బండిమీద పరంధామయ్య కంటే తక్కువ ధరకే అని గట్టిగా అరుస్తూ, అన్నింటినీ అమ్మేశాడు.

ఎవరూ చూడకుండా పరంధామయ్య బండి మీదున్న పళ్లను కూడా తన బండి మీదకు చేర్చి అమ్మేశాడు. నలిగిన మామిడిపళ్లను ఇంటికి తీసుకెళ్లి రసం తీసి ఒక చాపమీద పూసి తాండ్ర తయారీ మొదలుపెట్టాడు. ‘‘ఏ వ్యాపారానికైనా పోటీ ఉండాలి. అమ్మేవాడికి పట్టు విడుపు ఉండాలి. మనం చెప్పిన ధరకే అంటే అందరికీ ఆసక్తి ఉండదు. కొంత ధర పెంచి మరల తగ్గించి కొనేవారిని ఆకట్టుకోవాలి.

అందులోనూ పండ్ల వ్యాపారం ఏ రోజుకారోజు ముగించకపోతే చాలా నష్టం వస్తుంది’’ అన్న శీనయ్య మాటలకు చాలా సంతోషించాడు పరంధామయ్య. శీనయ్య నానమ్మతో మాట్లాడి, తన కుమార్తె నాగమణిని ఇచ్చి పెండ్లి చేయడమే కాకుండా, తన వ్యాపారాన్ని కూడా శీనయ్యకు అప్పగించాడు. ఆ రోజునుంచి శీనయ్య మంచి మెళకువలతో పండ్ల వ్యాపారం అభివృద్ధి చేసి, మంచి దక్షత గల వ్యాపారవేత్తగా ఎదిగాడు.
- కూచిమంచి నాగేంద్ర

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా