అమ్మానాన్నలకు ధీటుగా..!

2 Nov, 2014 03:27 IST|Sakshi
అమ్మానాన్నలకు ధీటుగా..!

పంచామృతం:  ఆస్తి, పేరు ప్రఖ్యాతులు... ఇవి కేవలం సంపాదించుకునేవే కాదు, వారసత్వంగా కూడా వస్తాయి. ఇలాంటి వారసత్వం పుట్టుకతోనే పిల్లల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అందరిలోనూ ఆసక్తిని పెంపొందిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఫేమ్‌తో ముద్దులొలుకుతున్న పిల్లలు కొందరున్నారు. వాళ్లు ఏం చేసినా సంచలనమే అవుతోంది. తల్లిదండ్రులకు ఉన్న పేరు ప్రఖ్యాతులే వీళ్లకున్న క్రేజ్‌కు ప్రధాన కారణం. అలా ఇంకా ఏమీ సాధించకుండానే అమ్మనాన్నలకు ధీటైన ప్రచారాన్ని, ఫేమ్‌ను పొందుతున్న కొందరు పిల్లలు వీళ్లు.
 
ఆరాధ్య బచ్చన్
బహుశా మన దేశంలో ఏ సెలబ్రిటీల పిల్లలకూ రాని స్థాయిలో ప్రచారం పొందిన పాపాయి ఆరాధ్య. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ మనవరాలిగా, ఒకనాటి విశ్వసుందరి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌ల పుత్రికగా ఆరాధ్య పట్ల ఎనలేని క్రేజ్ మొదలైంది. అసలు ఐశ్వర్యరాయ్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచే ఈ పాపాయి పట్ల ఆసక్తి మొదలైంది. పుట్టిన కొత్తలో ఆరాధ్య ఫోటోలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా.. అని దేశంలో ఎంతో మంది ఎదురు చూశారు. ఇప్పటికీ అభిషేక్, ఐశ్వర్యల వెంట ఆరాధ్య కనిపించిందంటే వందల కెమెరాలు క్లిక్‌మంటాయి.
 
 అర్జున్ టెండూల్కర్
అర్జున్ టెండూల్కర్ అడుతున్న స్కూల్ మ్యాచ్‌లకు కూడా ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. స్కూల్‌స్థాయి మ్యాచ్‌లలో అర్జున్‌ఎలా ఆడుతున్నాడు, ఎంత స్కోర్ చేస్తున్నాడు, అతడి బ్యాటింగ్‌తీరు తెన్నులు ఎలా ఉన్నాయి.. అనే అంశాల గురించి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇంత వరకూ అర్జున్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు కూడా ఎక్కడా ఆడింది లేదు. అయినా అతడి ఆటతీరు గురించి ఇంతటి ప్రచారం అంటే దానికి తండ్రి సచిన్ టెండూల్కర్ నేపథ్యమే కారణం.
 
 జార్జ్ అలెక్స్ లూయిస్
బ్రిటన్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ విలియమ్, క్యాథరీన్‌ల తనయుడు. ఇప్పుడు ప్రపంచంలోని క్రేజీయెస్ట్ చిల్డ్రన్స్‌లో జార్జ్ ఒకరు. ఇతడి జననం కూడా ప్రపంచం దృష్టిని బాగా ఆకట్టుకొన్న అంశమే అయ్యింది. క్యాథరీన్ యువరాజుకు జన్మనిచ్చిందనే విషయం తెలియగానే బ్రిటన్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. దాదాపు ఏడాది వయసున్న జార్జ్ మీడియాకు ఒక సూపర్ సెలబ్రిటీ.  
 
 క్రూజ్, రోమియా
 బ్రిటన్ సాకర్ స్టార్  బెక్‌హమ్‌కు మొత్తం నలుగురు పిల్లలు. ముగ్గురు తనయులు, ఒక తనయ. వీరిలో చిన్న వాళ్లు రోమియో, క్రూజ్‌లు ఇప్పుడు చైల్డ్ సెలబ్రిటీలుగా చెలామణిలో ఉన్నారు. బెక్‌హమ్‌కు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నా... పిల్లల వల్ల మాత్రం మరింత గుర్తింపు లభిస్తోంది. మొన్నటి సాకర్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ఎంతో మంది ప్రసిద్ధ వ్యక్తులు వచ్చినా వీక్షకుల గ్యాలరీలో అర్జెంటీనా జెర్సీలు ధరించి వచ్చిన బెక్‌హమ్ పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదీ వారికున్న క్రేజ్.
 
సూరి క్రూజ్

 టామ్ క్రూజ్, కేటీ హోమ్స్‌ల ఆరేళ్ల దాంపత్య   బంధానికి ప్రతిరూపం సూరి. అమ్మనాన్నల గ్లామర్‌ను పుణికిపుచ్చుకున్న సూరి అంటే పాశ్చాత్య ప్రపంచానికి ఎనలేని క్రేజ్. నెలల వయసు నుంచే సూరికి గొప్ప ఫేమ్ వచ్చింది. ఇక కాస్తనడక నేర్చాక టామ్, కేటీల వెంట ఎక్కడైనా సూరి కనిపించిందంటే... ఫోటోగ్రాఫర్లకు పండగే! సూరి పక్కన ఉందంటే... టామ్‌ను, కేటీని పట్టించుకొనే వాళ్లు తక్కువ మంది అవుతారు. ఎందుకంటే అందరి కళ్లూ ఆ పాప మీదే ఉంటాయి. ఆన్‌లైన్‌లో సూరి ఫ్యాన్ కమ్యూనిటీలకు కొదవే లేదు! తల్లిదండ్రులకున్న ఫేమ్‌తో తనకున్న ఆకర్షణ శక్తితో ప్రపంచంలోనే అత్యంత క్రేజీయెస్ట్ చైల్డ్‌గా పేరు తెచ్చుకొంది సూరి.

మరిన్ని వార్తలు