పంచామృతం: వాళ్ల పేరే ఒక బ్రాండ్..!

11 May, 2014 04:01 IST|Sakshi

అనేక రకాల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తూ వాటి మార్కెట్ రేంజ్‌ను పెంచుతూ, కోట్ల రూపాయల  పారితోషకం తీసుకొంటున్న సెలబ్రిటీల సంగతి తెలిసిందే. తమకున్న ఫేమ్‌ను ఉపయోగించి రకరకాల బ్రాండ్‌ల  విలువను పెంచడానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు ప్రయత్నిస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో కొంతమంది సెలబ్రిటీల స్థాయి మరింత ఎక్కువ! ఎంత అంటే వాళ్ల పేరే ఒక బ్రాండ్. ప్రత్యేకంగా ఏదో ఒక బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రమోట్‌చేయాల్సిన పని కాకుండా, సొంత పేర్లతోనే బ్రాండ్‌లను నెలకొల్పి మార్కెటింగ్ చేస్తున్న వాళ్లు కొంతమంది ఉన్నారు. సాదాసీదా సెలబ్రిటీలకు సాధ్యం అయ్యే పని కాదిది. కొందరికే సాధ్యం. వారెవరంటే...
 
 షరపోవా...
 ఈ రష్యన్ బ్యూటీ తన పేరును కొంచెం మార్చి క్యాండీల బ్రాండ్‌ను నెలకొల్పింది. ‘షుగర్‌పోవా’ పేరుతో క్యాండీలను ప్రమోట్ చేస్తోంది. ఆ మధ్య ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వరకూ తన పేరును ‘షుగర్ పోవా’ అని మార్చుకొంటానని నిర్వాహకులను రిక్వెస్ట్ కూడా చేసుకొంది షరపోవా. అయితే వాళ్లు అనుమతించలేదు. అయినప్పటికీ ఇప్పుడు ‘షుగర్‌పోవా’ స్వీట్స్ కు యూరప్‌లో మంచి గుర్తింపు ఉంది. తమ అభిమాన టెన్నిస్ తార పేరు మీద తయారైన వీటిని అక్కడి వాళ్లు తెగ చప్పరించేస్తున్నారు.
 
 వీరేందర్ సెహ్వాగ్...
సచిన్ ఎమ్‌ఆర్‌ఎఫ్ తో ఫేమస్, గంగూలీ బ్యాట్ మీద బ్రిటానియా స్టిక్కర్ అందరికీ గుర్తే... మరి అలాంటి స్టార్ ఆటగాళ్లందరి కన్నా వీరేందర్ సెహ్వాగ్ ఒక విధంగా గ్రేట్. ఎందుకంటే వీరేందర్ సెహ్వాగ్ పేరు మీదే ఒక బ్యాట్ ఉంది కాబట్టి. భారత్ తరపున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో తొలిసారి త్రిబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ వీరూ. పాకిస్తాన్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో అతడూ 309 పరుగులు చేశాడు. ఆ స్ఫూర్తితో ‘ఎస్‌ఎస్’ బ్యాట్ల కంపెనీ ‘వీ 309’ పేరుతో బ్యాట్లు తయారు చేసింది. వీ ఫర్ వీరేందర్ అంటూ వాటిని మార్కెట్‌లోకి విడుదల చేసింది. సెహ్వాగ్ కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆ బ్యాట్‌లనే వాడుతుంటాడు.
 
 బెక్‌హమ్...
 ఆటకన్నా స్టైల్స్‌తోనే ఎక్కువ గుర్తింపు ఉంది ఈ సాకర్‌స్టార్‌కు. ఎన్నో బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా మార్కెట్‌లో మోస్ట్ హాట్ సెలబ్రిటీగా పేరు పొందిన బెక్‌హమ్ పేరుతోనూ బ్రాండ్‌ఉంది. ఫుట్‌బాల్‌కు బాగా క్రేజ్ ఉన్న దేశాల్లో డేవిడ్ బెక్‌హమ్ స్టైల్స్ పేరిట డిజైనర్ వేర్‌లు అందుబాటులో ఉంటాయి.
 
 శిల్పాషెట్టి...
ఎస్ 2 పేరుతో శిల్పాషెట్టి సుగంధాలు వెదజల్లుతోంది. బిగ్ బ్రదర్ ఎపిసోడ్ తర్వాత శిల్పకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. అదే ఊపులో శిల్పాషెట్టి పేరు మీద సెంట్‌లు విడుదల అయ్యాయి. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో శిల్ప సెంట్‌ల సువాసనల ఘాటు తక్కువే కానీ... వ్యక్తిగతంగా తన పేరు మీద బ్రాండ్‌ను కలిగి ఉన్న అరుదైన సెలబ్రిటీగా శిల్పకు గుర్తింపు దక్కింది.
 
 జస్టిన్ బీబర్
 జే-బీబ్ పేరుతో ఒక జెంట్స్ ఫెర్ఫ్యూమ్ ఉంది. కెనడియన్ పాప్‌గాయకుడు జస్టిన్ బీబర్ పేరు మీద ఈ బ్రాండ్‌మార్కెటింగ్ అవుతోంది. మ్యూజిక్ ఆల్బమ్స్ తో వచ్చిన కీర్తి, డబ్బుకు అదనంగా సంపాదించడానికి బీబర్ ఈ బ్రాండ్‌ను మొదలు పెట్టాడు. బీబర్ పాటకు అడిక్ట్ అయిన వాళ్లు ఈ బ్రాండ్ ఫెర్ప్యూమ్‌కు కూడా అడిక్ట్ అవుతున్నారు.

మరిన్ని వార్తలు