గడ్డిపరకా..! నీకు కూడా చులకనయ్యానా?!

28 Jul, 2019 07:52 IST|Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

ఎన్టీ రామారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు చాణక్యుడిగా నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...
‘‘ఆ అలెగ్జాండర్‌ దేవుడి పుత్రుడట... జగజ్జేత అట కదా!’’... శిష్యుడి నోట ఈ మాట విన్న చాణక్యుడి ముఖం కోపంతో ఎర్రబారింది.
‘‘ఎవడు కూశాడురా ఆ కూత?’’ అని గర్జించాడు.
‘‘అలెగ్జాండర్‌ ప్రపంచమంతా జయించి వస్తున్నాడట కదా... మన మగధకే వస్తే’’  ఆందోళనగా అడిగాడు మరో శిష్యుడు.
‘‘నేనిప్పుడు నందరాజుల్ని చూడలిరా’’ అంటూ దేవి ప్రసాదంతో బయలుదేరాడు చాణక్యుడు.

ఒకవైపు ప్రమాదం పెనుతుపానులా ముంచుకొస్తోంది. మరోవైపు రాకుమారులు తాగితందనాలు ఆడుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ‘‘మహారాజా మహారాజా!’’ అంటూ రాజమందిరంలోకి దేవిప్రసాదంతో వచ్చాడు చాణక్యుడు.
ఆ మహానుభావుడు ఎందుకోసం వచ్చాడో కూడా చూడకుండా ఇట్లా ఎగతాళి చేయడం మొదలుపెట్టారు...
‘‘అరుస్తుంది కుక్క... మన ఆనందాన్ని పాడు చేయడానికి’’
‘‘నీ అవతారం చూడడానికి మా కళ్లు ఉన్నాయి. భౌభౌ అని అరుస్తావేం బాపడు’’
అంతేకాదు...
ఒకడు ‘‘మందు కాదు ఫలరససౌరభం చూస్తావా’’ అంటూ తన గ్లాసులోని మద్యాన్ని చాణక్యుడి ముఖంపై విసిరికొట్టాడు. నవ్వులు!
‘‘ఓయి వెర్రిబాపడా! వీరు భావి సమ్రాట్టులు. వీళ్ల కులాసాను పాడు చేసి శాస్త్రాలు చదివిన నీ కంఠాన్ని ఉరిపాలు చేసుకోవద్దు’’ అని చాణక్యుడిని హెచ్చరించాడు ఆ మదాంధ రాకుమారుల మామ.

‘‘ఏయ్‌...బుద్ధి లేదా? అలా విస్తుబోయి నుంచోక త్వరగా ఇక్కడి నుండి వెళ్లు..’’ అని చాణక్యుడిని మెడ పట్టి గెంటేడు ఒక రాకుమారుడు.
‘‘మహారాజులారా! ఆ బుద్ధే నన్ను ఇక్కడికి నడిపించింది. నాకింత ఘోర అవమానం జరుగుతున్నా మీకు నచ్చచెప్పమని పంపించింది’’ ఆగ్రహావేదనలతో అన్నాడు చాణక్యుడు.
‘‘ఏది? ఏదది కనిపించదే?’’ వ్యంగ్యంగా అడిగాడు ఒకడు.
‘‘నీకిప్పుడు ఏదీ కనిపించదు గనుకనే జ్ఞానదృష్టిని ప్రసాదించాలని వచ్చాను. కనులు తెరవండి. రానున్న ఘోరవిపత్తును గ్రహించి లెండి. స్వదేశ సంరక్షణకు సంసిద్ధులు కండి. మీ ప్రజలను, ధర్మాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోండి’’ అంత ఘోర అవమానంలోనూ శత్రువుల ముప్పు గురించి హెచ్చరించాడు చాణక్యుడు.
మళ్లీ ఎగతాళి మాటలు మొదలుపెట్టారు రాకుమారులు.
అయినా వాటిని పట్టించకుకోకుండా...
‘‘రాకుమారులారా సావధాన్‌! ప్రజలు మిమ్మల్ని రాజులుగా పరిగణించింది ఇలా తప్పతాగి తందనాలాడడానికి కాదు. ఇకనైనా మీ మత్తు, మైకం వదిలించుకోండి. అటు చూడండి... రక్తారుణ కాంతిపుంజములు. అది స్వదేశవీరుల రక్తం’’ అంటూ–
‘‘దేవీప్రసాదం స్వీకరించండి’’ అని ఇవ్వబోయాడు. అంతే! ఒకడు కాలితో ఆ ప్రసాదాన్ని తన్నాడు!!
చాణక్యుడి గుండె వెయ్యి ముక్కలైంది.

‘‘నాకురా అవమానం! చూడండి. ఈ సృష్టికి మూలశక్తుల్లారా పంచభూతల్లారా! చూసిరా ఈ దారుణం. ఏమి ఈ వికృత పరిణామం? ఏమి ఈ విలయం? నిరంతరం ధర్మనిష్ఠమైన శరీరం! అహర్నిశలు దేశసేవకై, మానవాళి సుఖశాంతులకై ఆరాటపడుతున్న హృదయం ఎట్టి నీచనికృష్ట దుర్భర అవమానానికి గురైనదో చూసినారా?... దుష్టులు, దుర్మార్గులు, పిరికిపందలు, క్షుద్రులై స్వార్థపిశాచ అవతారముల వలె రేగి ప్రజాద్రోహం చేస్తుంటే, ఆ సమస్త సృష్టికి మూలములైన పంచభూతములైన మీరు ప్రకోపించరేమి? ఆదిశక్తులు... మహాప్రళయంలో వీరిని రూపుమాపరేమి? వేదవిజ్ఞాన వైభమునకు ప్రతినిధి అయిన ఒక విప్రునకు కనివిని ఎరుగని రీతిలో జరిగిన ఈ దారుణ పరాభవం చూసి దిగ్భ్రాంతి చెంది మ్రాన్పడేవారేమో! కాని ఈ పవిత్ర ఆత్మ సహించదు. ఘోరతి ఘోరంగా ప్రతీకారం చేయక వీడదు. ఇదే నా శపథం. పరమ పవిత్రమైన రాజధర్మాన్ని విస్మరించి ప్రజాద్రోహమునకు పాల్పడిన ఈ కలుష, కర్కశ పాపజాతిని సమూలంగా సర్వనాశనం గావించినగాని ఈ కురులను ముడువను. 
నా ప్రతికారేచ్ఛ దుర్భర కాదు. అసహాయ కాదు.
నా ప్రతికారేచ్ఛ నెరవేరుతుంది. ఇది తథ్యం!’’ అన్నాడు దిక్కులు ఆదిరేలా చాణ్యక్యుడు.

చాణక్యుడు ఉదయం ఉన్న చోట మధ్నాహ్నం కనిపించడం లేదు. సాయంత్రం మాత్రం శ్మశానంలో కనిపిస్తున్నాడు. కాసేపు వణుకుతాడు. కాసేపు పిచ్చిగా మాట్లాడుతాడు.
 ఆ శ్మశానంలో ఒక కపాలం పట్టుకొని తనలో తాను ఇలా మాట్లాడుకుంటున్నాడు...
‘‘ఏ ఘనుడిదో? ఏ జటిల రాజకీయ దురంధరుడితో ఈ కపాలం? చివరకు ఈ వల్లకాటిలో మట్టిపాలు కాకతప్పదు. ఎప్పటికైనా విధి నిర్ణయం ఇదని తెలిసి కూడా మానవుడు అధికార పదవి పటాటోపంతో సుఖభోగ కేళీవిలాస లాలసుడై పశుప్రాయుడు, లోకకంటకుడు అవుతున్నాడు.
బుద్ధి అనే ప్రత్యేక పదార్థాన్ని మానవుని తలలో ప్రతిష్ఠించడం ఆ భగవంతుని ఘనత. ఆ బుద్ధిని లోకక్షేమానికి కాకుండా దురహంకారంతో స్వార్థానికి వినియోగించడం మానవుడి ఆధిక్యత.
ఇన్ని ఆలోచనలు ఉన్నా అణుమాత్రమైనా వివేకం ఈ జనుడికి ఎందుకు ఉండదు! ఆ వివేకమే ఉంటే ఈలోకం స్వర్గతుల్యమయ్యేదే!
అయ్యయ్యో! అలా అయితే ఎలా? ఈ చాణక్యుడికి లోకోద్ధరణ కోసం ఈ ప్రళయాన్ని సృష్టించాల్సిన పరిస్థితి పట్టేది కాదు’’ అంటూ ఆ కపాలన్నీ వేళ్లతో కొట్టాడు.
‘ఖంగ్‌...ఖంగ్‌’ అంటూ శబ్దం వినిపించింది.
‘‘కాల్చి పుటం పెట్టినా నీ పాపం వదిలినట్లు లేదు. మహాగంభీర శరీరాన్ని ఏ రాజ కిరాతకుడి మెడపై నువ్వు నిక్కి నిల్చినన్నాళ్లు, రత్నకిరీటం ధరించి శాసనాధికారం చలాయించిన్నాళ్లు, రాజదండం ధరంచి సర్వమానవుల అదృష్టచక్రాన్ని గిరగిరా తిప్పినన్నాళ్లు, ఇచ్ఛా విహారంలో ఎగిరిపడినావే... ఇప్పుడు ఏమైనది? బూడిద... బూడిద... ఆ బూడిద గతి ఏమైనది?
ఆ నందుల గతి కూడా ఇంతే కావాలి.
ఆ నందుల తలలు కూడా ఇలాగే ఫెళఫెళమంటూ ముక్కలు చెక్కలు కావాలి’’ అంటూ నడుస్తున్న చాణక్యుడి కాలికి ఏదో గుచ్చుకుంది.
‘‘దర్భగరిక! గడ్డిపరకకు కూడా పొగరే! తలబిరుసే! 
చూడు... ఈ నేరానికి నీ గతి ఏమవుతుందో చూడు’’ అంటూ కోపంతో ఆ దర్భగరికను మంటల్లో వేశాడు చాణక్యుడు.
ఆ తరువాత గట్టిగా నవ్వి...
‘‘నన్ను నా ధర్మాన్ని నా దేశాన్ని పరాభవించిన ఆ పాపాత్ముల గతి కూడా ఇంతే’’ అని శాపం పెట్టాడు.

సమాధానం: చాణక్య చంద్రగుప్త

మరిన్ని వార్తలు