బాబు, వైఎస్ పాలనలో.. ప్రభుత్వ ఉద్యోగులు

4 May, 2014 03:39 IST|Sakshi
బాబు, వైఎస్ పాలనలో.. ప్రభుత్వ ఉద్యోగులు

బాబు పాలన..  ‘‘ఏం? పిచ్చ పిచ్చగా ఉందా?’’ ‘‘ఏం మాట్లాడుతున్నావ్? నాతోనే వాదిస్తావా? తమాషాలు పడుతున్నావా?’’ ...ఇవి ఏ తాపీ మేస్త్రీయో తన దగ్గర పని చేసే కూలీలపై అరిచిన అరుపులు కావు. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి నోటి వెంట జాలువారిన తిట్ల దండకాలు. ‘పిచ్చ పిచ్చగా ఉందా’ అంటూ దుయ్యబట్టిందెవరినో తెలుసా? అంబేద్కర్ వర్సిటీ వైఎస్ చాన్సలర్‌ను! ఇక ‘తమాషాలు పడుతున్నావా’ అంటూ నోరు పారేసుకున్నదేమో ఏకంగా న్యాయ శాఖ అదనపు కార్యదర్శిపై! అక్కడితో ఆగకుండా, ‘నీ పరిధిలో నువ్వుండు! యాక్షన్ తీసుకుంటాను జాగ్రత్త. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
 
చంద్రబాబు చేసిన అవమానాన్ని తట్టుకోలేక అప్పటి నీటిపారుదల శాఖ ఇంజనీర్ అప్పారావు గుండెపోటుతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే! అత్యున్నత ప్రభుత్వాధికారులకే చుక్కలు చూపిన చంద్రబాబు... సాధారణ ప్రభుత్వోద్యోగుల విషయంలోనైతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు! ‘మీ గుండెల్లో నిద్రపోతాను’ అంటూ నిత్యం బెదిరించేవారు. బెదిరించడమే కాదు... తన పాలన పొడవునా వేతన జీవులు ఏనాడూ కంటినిండా నిద్ర కూడా పోకుండా చేశారు. జనం ముందు, సాటి ఉద్యోగుల ముందు వారిని దోషుల్లా నిలబెట్టి, నిలువునా పరువు తీయడాన్ని, కసురుకోవడాన్ని, సస్పెండ్ చేసి పారేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు...
 
 అదో భయానక గతం..!
 బాబు ఆర్థిక సంస్కరణలకు ప్రధానంగా బలైంది ఉద్యోగులే! ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించే పద్ధతినే చంద్రబాబు భాషలో సంస్కరణలు అంటారని సామాజిక కార్యకర్తలు ఎప్పుడూ విమర్శిస్తుంటారు కూడా. ఆయన తొమ్మిదేళ్ల పాలనంతా ఉద్యోగుల ఉసురు పోసుకుంటూనే సాగింది. ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న ఘనుడు బాబు! ఉద్యోగుల కుదింపుకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా జారీ చేశారు! 1998లో 747 మంది కార్మికులను, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందిని తొలగించారు. పైగా, ‘రిటైరైన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడమే మహా ఎక్కువ. మళ్లీ డీఏ కూడానా? ఇచ్చేది లేదు’ అంటూ అధికారంలో ఉండగా తెగేసి చెప్పిన చరిత్ర చంద్రబాబుది! తను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ ఉన్న ఉద్యోగాలనే వీలైనంతగా తొలగించిన బాబు ఇప్పుడు అధికారంకోసం కొత్త ఉద్యోగాలిస్తానంటే ఎలా నమ్ముతామని ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు!
 
 ఈ రెండు నాల్కల ధోరణేంటి బాబూ..?
 -    అధికారం కోసం కుటుంబానికో ఉద్యోగం అంటూ ఊదరగొడుతున్న బాబుకు, రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలున్నాయో తెలుసా? అసలు ఎన్ని ఉద్యోగాలిస్తారో స్పష్టంగా చెప్పరేం? అలా సంఖ్య చెబితే అన్ని ఉద్యోగాలు ఎలా సాధ్యమో కూడా చెప్పాల్సి వస్తుంది కాబట్టే ఎటూ తేల్చకుండా తెలివిగా తప్పించుకుంటున్నారన్నది నిజం కాదా?
 -    ‘ఒక వంటగది వాడుతున్న వారంతా ఒక కుటుంబం’ అనే నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని జనాభా లెక్కల సేకరణ విభాగం 2011లో చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2.1 కోట్ల కుటుంబాలున్నాయి. వాస్తవానికి నేటి లెక్క ప్రకారం కుటుంబాల సంఖ్య 3.5 కోట్ల దాకా ఉంటుంది.  
 -    ఇక ఉద్యోగ లెక్కల్లోకి వస్తే - ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ తదితరాలన్నింటినీ కలిపి కూడా రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రభుత్వోద్యోగాలు 13 లక్షలే. భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, ఐటీ, సేవ రంగం తదితరాల్లోని మొత్తం ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య 35 లక్షలు దాటదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య 50 లక్షల్లోపే. మరి కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తానని నమ్మిస్తున్న బాబు, ఈ లెక్కన మరో 3 కోట్ల ఉద్యోగాలు ఎక్కడి నుంచి సృష్టిస్తారో ఆయనకే తెలియాలి!
 
 ఉద్యోగస్థుల్ని బాబు పురుగుల్లా చూశాడు!

 ఉద్యోగులంటే బాబుకు ఏమాత్రం గౌరవముండేది కాదు. వారిని పురుగుల్లా చూసేవారు. మా సమస్యలపై విన్నవించడానికి ఎప్పుడు వెళ్లినా గద్దింపు స్వరమే సమాధానమయ్యేది. సమస్య వినకుండానే, మా చేతుల్లోని వినతి పత్రాలను లాక్కుని పక్కనే ఉన్న ఐఏఎస్ అధికారుల చేతుల్లో పెట్టి వెళ్లిపోయేవారు. కనీసం కూర్చోబెట్టే మర్యాద కూడా తెలియదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వుుఖ్యవుంత్రి అయ్యాక ఐదున్నరేళ్ల కాలం ప్రభుత్వ ఉద్యోగులకు సువర్ణయుగంలా గడిచింది. అసలు ప్రభుత్వోద్యోగిని మనిషిగా చూడటం వైఎస్ పాలనలోనే జరిగింది. ఏ సమస్యపై వెళ్లినా చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పేరుపెట్టి పలకరించే వారు వైఎస్! ఆ రోజులు మాకిప్పటికీ గుర్తే!
 - గోపాల్‌రెడ్డి, ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు
 
 బాబు ‘మనసులో మాట’...

 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం వృథా. ప్రభుత్వోద్యోగం అనగానే శాశ్వతం, భద్రం అనే భావన పనిచేయనీయకుండా చేస్తున్నది. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల వల్ల ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితికి దారితీసింది. జీతభత్యాల బిల్లు పెరగడానికి జీతాల పెరుగుదలే కాక ఉద్యోగుల సంఖ్య పెరగడమూ ముఖ్య కారణం. ఉద్యోగుల పెరుగుదలతో సామర్థ్యం పెరగడం లేదు.     (పేజీ. 63)
 
 కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ సిబ్బంది సంఖ్యను తగ్గించడంలో ఉత్తమమైన మార్గం... ఉన్న ఉద్యోగాలను స్తంభింపచేయడం. అంటే రిటైరైన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేయకుండా ఉండడం. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల స్తంభీకరణ కిందితరగతి ఉద్యోగాల స్థాయిలో జరిగింది.     (పేజీ.66)
 
 రాజన్న రాజ్యం

 ఉద్యోగ ఖాళీల భర్తీ డిమాండ్‌ను 2000 డిసెంబర్ 26న విపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో లేవనెత్తారు. అందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. నిరుద్యోగుల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని 2001 జనవరి 9న వైఎస్ సందర్శించారు. దీక్షలో ప్రాణాలొదిలినా బాబు కరకు హృదయం కరగదని, తాను అధికారంలోకి వస్తే ఖాళీలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. 2004లో తాను అధికారంలోకి రాగానే ఆ హామీని నిలబెట్టుకున్నారు. 1999 గ్రూప్-2 నోటిఫికేషన్‌లో ఖాళీలు చూపించిన 1,500 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగుల సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెరదించారు. తర్వాత పలు గ్రూప్ 1, 2, 4 నోటిఫికేషన్లు ఇచ్చారు. జూనియర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేశారు. భారీగా ఉపాధ్యాయ పోస్టులు, కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టులు భర్తీ చేశారు. వైఎస్ ఐదేళ్ల హయాంలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు!
 
 జగన్ సంకల్పం
 రాష్ట్ర విభజన ద్వారా తలెత్తిన ఉద్యోగుల సమస్యలను, పెన్షనర్ల సమస్యలను ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పటం ద్వారా త్వరితగతిన పరిష్కరిస్తాం. వారికి అండగా నిలుస్తాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పాటు పదవీ విరమణ చేసిన వారికి కూడా వర్తింపజేస్తాం. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంటును ప్రోత్సహిస్తాం.
 -    వైయస్‌ఆర్ గర్వపడేలా పిఆర్‌సీ
 ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. బాబు హయాంలో ఉద్యోగులకు పిఆర్‌సీ 16 శాతం వచ్చింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిగారి హయాంలో 39 శాతం పిఆర్‌సీ ఇచ్చారు. ఏ లోకంలో ఉన్నా రాజశేఖరరెడ్డిగారు గర్వపడేలా పిఆర్‌సీని ఇస్తాం.’
 -    ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ సొంత ఇల్లు
 ప్రతి ఉద్యోగికీ ఇల్లు ఒక హక్కుగా ఇవ్వాలి.  ప్రతి ఉద్యోగికీ ఇల్లు వచ్చే ఏర్పాటు చేస్తాం. క్లాస్-4 ఎంప్లాయిస్‌కు కూడా ఇల్లొచ్చేలా చేస్తాం.
 -    ఆరోగ్యశ్రీ తరహాలో క్యాష్‌లెస్ పాలసీ..
 ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్‌మెంట్ ఉద్యోగులకు క్యాష్ లెస్ హెల్త్ పాలసీని తెస్తాం.
 -    కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్
 కాంట్రాక్టు ఉద్యోగస్తులు చలా బాధలుపడుతున్నారు. జీతాలు తక్కువ, రిటైర్మెంట్ తర్వాత వారికి పెన్షన్లు రావు. ప్రతి కాంట్రాక్టు ఉద్యోగికీ హామీ ఇస్తున్నాం... అధికారంలోకి వచ్చాక ఓ కమిటీ వేస్తాం. అర్హత ఉన్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగినీ రెగ్యులరైజ్ చేస్తాం.
 -    వయో పరిమితి 40 ఏళ్ళు
 ప్రభుత్వోద్యోగ నియామకాల వయోపరిమితిని 34 నుంచి 40కి (వన్‌టైమ్) పెంచుతాం. ఎస్సీ ఎస్టీలకు కూడా తదనుగుణంగా వయో పరిమితిని (వన్‌టైమ్) పెంచుతాం.   ఏపీపీఎస్సీని సమూలంగా తీర్చి దిద్దుతాం.
 -    సమైక్యతకు సలాం
 రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేసిన సమ్మెను ప్రత్యేకమైనదిగా పరిగణించి, ప్రభుత్వోద్యోగులందరికీ సమ్మె కాలానికి జీతాన్ని చెల్లిస్తాం.

మరిన్ని వార్తలు