వొదిలెళ్లిన జోళ్లు

2 Nov, 2014 04:22 IST|Sakshi
వొదిలెళ్లిన జోళ్లు

కథ: ఈమధ్య ఈ జోళ్లంటే ఎందుకో ఆసక్తి పెరిగిపోయింది. అవి ఏమి మాట్లాడుకుంటున్నాయో వినాలనే ఆసక్తి. అయినా చెప్పులేం మాట్లాడుకుంటాయి నా పిచ్చి కాకపోతే. ‘‘జోళ్లు మాట్లాడుకోవటం ఏమిటి? నాతో అంటే అన్నారు కాని, ఇంకెవ్వరితో అనకండి. మీకు పిచ్చి పట్టిందని వాళ్లకు తెలిసిపోతుంది’’ అనింది మా ఆవిడ. అంటే నేను పిచ్చివాడినని మా ఆవిడ ఫిక్స్ అయినట్టుంది. ఇక తనతో ఈ విషయం మాట్లాడటం దండగ అనిపించింది. నాలాగే మా తాత ఉండేవాడంట. కాదు కాదు ఆయనలాగే నేను ఉన్నానంటేనే నాకు ఇష్టం. చిన్నప్పుడు నాకు మా తాతే అన్నీ. ఆయన చెప్పిన చిట్టి చిట్టి కథలు అన్నీ జ్ఞాపకాలే. అసలు చిక్కంతా ఎక్కడ వచ్చిందంటే, ఆ జోళ్ల మూలంగానే. ఓసారి సెలవలకు మా అమ్మమ్మ వాళ్ల వూరికి వెళ్లా. ఏమీ తోచక పాత అల్మరా సర్దుతుంటే మా తాత వాడిన జోళ్లు కనబడ్డాయి. చూడగానే తెలియని అనుభూతి. గుర్తుగా వుంటాయిలే అని నాతో పాటే తెచ్చుకున్నా. అక్కడి నుండి మొదలైంది అసలు కథ.
   
 ఎర్రటి ముదురు రంగు తోలు, దాని చుట్టూ తెల్లటి దారంతో కుట్టిన అంచు, బాగా వాడిన తరువాత పుట్టే అందం, ఒక మూలన పడేసిన మా ఆవిడ నిర్లక్ష్యం... వాటి మాటెవ్వరు పట్టించుకోని తీరులో అవి అక్కడే ఉంటాయి. ఆ జోళ్లను చూసినప్పుడల్లా ఏవో గుసగుసలు వినిపిస్తుంటాయి. నిజమే ఏదో గుసగుస. నాకు అర్థం కాని గుసగుస. కాని ఎవరితో చెప్పను! ఎవరితో అన్నా వీడికి పిచ్చిపట్టిందంటూ గొడవ చేస్తారని భయం. ఏది నమ్మినా, నమ్మకపోయినా ఒక మనిషి పిచ్చివాడంటే ఇట్టే నమ్మేస్తుంది లోకం.  ఈమధ్య ఈ జోళ్లంటే ఎందుకో ఆసక్తి పెరిగిపోయింది. అవి ఏమి మాట్లాడుకుంటున్నాయో వినాలనే ఆసక్తి. అయినా చెప్పులేం మాట్లాడుకుంటాయి నా పిచ్చి కాకపోతే. 

ఒకసారి మా అమ్మమ్మను అడిగా: ‘‘అమ్మమ్మ... తాతయ్య ఏం చేసేవాడు?’’ అని. అమ్మమ్మకు ప్రశ్న వేస్తే చేస్తున్న పని ఆపి చేతులు కొంగుకు తుడుచుకుంటుంది. ఆ రోజు కూడా అలానే తుడుచుకుంటూ ‘‘మాట్లాడేవాడ్రా’’ అంది. ‘‘ఏంటీ... మాట్లాడటం కూడా ఒక పనా?’’ అన్నాను ఆశ్చర్యపోతూ. ‘‘మరి?’’ అని కొనసాగించింది. ‘‘ఆయన తాను పండించిన పైరుతో మాట్లాడేవాడు. తాను నడిచే దారితో మాట్లాడేవాడు. తాను చేతిలో పెట్టుకున్న బెల్లం ముద్దను మా రాముడికి, అంటే ఒక కర్రెద్దులే, దానికి తినిపిస్తూ మాట్లాడేవాడు. పువ్వుతో మాట్లాడేవాడు. పెరట్లో గుమ్మడి పిందె కనిపిస్తే దానితో మాట్లాడేవాడు. ఇప్పుడెక్కడివి? తెచ్చిన వడ్లరాశిని గాదెలో నింపుతున్నప్పుడు పిచ్చుకలు ఎన్ని వచ్చేవని? వాటితో మాట్లాడేవాడు. ఆఖరుగా నాతో మాట్లాడేవాడు. అట్టా... ఆయన మాట్లాడటం వింటుంటే మాట్లాడటం కూడా ఇంత మంచిపనా? అనిపించేది’’ అంది.

 నేను కుతూహలంగా ‘‘ఇంకా...?’’ అన్నాను.  మా అమ్మమ్మ చాలా దయగా నవ్వి, ‘‘అన్నీ నేనే చెప్పేస్తే నువ్వేం తెలుసుకుంటావురా సన్నాసి’’ అంది. ఆ తర్వాత నేను తాత గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఏమీ తెలియలేదు. కనీసం ఈ చెప్పులైనా ఎంతోకొంత చెప్పకపోవా...? అని నా పిచ్చి. రోజురోజుకు ఈ జోళ్ల మీద ఆసక్తి మరీ ఎక్కువైపోతుంది. ఆఫీస్‌కు వెళ్తూ బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తున్నా. ఎప్పుడు ఖాళీ దొరికినా జోళ్ల గుసగుస వినడమే. అప్పటికే ఆఫీస్‌లో అందరూ నాకు ఏమైందన్నట్టుగానే కొత్తగా వింతగా చూస్తున్నారు. ఇంట్లో పడుకునేటప్పుడు పక్కలో పెట్టుకొని పడుకుంటున్నా. దుప్పటి ముసుగుతన్ని నేను, నా పక్కలో జోళ్లు. రాత్రంతా ఒకటే ఆశ. చెవులు రెండు రిక్కించి మరీ వినడం. ఏదో గుసగుస అర్థం కాదు. నా పద్ధతి చూసి మా ఆవిడ నాతో మాట్లాడటం పూర్తిగా మానేసింది. రోజులు గడుస్తున్నాయ్.
   
 ఆ రోజు ఎందుకో జోళ్లు తొడుక్కోవాలి అనిపించి, నా రెండు కాళ్లకు తొడిగి చూసుకున్నా, అంతే! నాలో తెలియని ఉత్సాహం, ఉద్వేగం...రెండు అడుగులు వేశానంతే. ఈ ప్రపంచాన్ని చుట్టానన్న తృప్తి. నాలుగో అడుగుకు శరీరం అంతా చాలా తేలికగా గాల్లో ఎగురుతున్నట్టుంది. గాల్లో ఎగురుతున్నట్టు కాదు గాల్లోనే ఉన్నా. గాలిపటంలా గాలి ఎటు వీస్తే అటు ఎగురుతున్నా. ఎక్కడికో వెళ్తున్నా. అంతుచిక్కడం లేదు. దూరంగా నున్నగా కొండలు కనబడుతున్నాయి. ఆ కొండల నడుమ నారింజ రంగులో ఉదయిస్తున్న సూర్యుడు. ఒకదాని మీద ఒకటి వెండి పరుపులా పరుచుకొని ఉన్న మేఘాలు. మేఘాల అంచులు నారింజ రంగుతో కొత్త సరిగ చీర అంచుల్లా ఉన్నాయి. నారింజ వర్ణంలో కనిపించేంత మేర పరుచుకున్న నీళ్లు... ఒక అద్భుతం... చూసి తీరాల్సిందే. దట్టంగా పొగమంచు కప్పుకొని ఉంది. కనుచూపు మేరలో మనుషులు గాని, ఇళ్లు గాని ఏమీ లేవు. బహుశ అడవిలో ఉన్నట్టున్నా. నెమ్మదిగా అక్కడ దిగా.
 
 చుట్టూ మహావృక్షాలు మంచును చీలుస్తూ. చెట్టుకు వేలాడుతున్న ఊడలు. దూరంగా మినుక్ మినుక్‌మంటూ ఏదో వెలుగు. అటువైపుగా నడిచా. దగ్గరికి వచ్చేసరికి మంటలా అనిపించింది. అది చలిమంటలా ఉంది. ఎవరో మనుషులు కూడా ఉన్నట్టున్నారు, నలుగురు మనుషులు. ఒక ఆడ, మగ, ఇద్దరు పిల్లలు చలిమంట చుట్టూ కూర్చొని ఉన్నారు. పిల్లలేమో దబ్బపళ్లలా భలే ఉన్నారు. మగ మనిషేమో తల ఎత్తకుండా చలిమంట వైపు చూస్తున్నాడు, ఆడ మనిషేమో లేచి ఇంట్లోకెళ్లి ఓ బుట్టతో వచ్చింది. ఆ బుట్టలో ఏవో కాగితాల్లా ఉన్నాయి. చలిమంట కోసం లావుంది. పిల్లలిద్దరికీ గుప్పెడు గుప్పెడు కాగితాలిచ్చింది. వాళ్లేమో ఇష్టంగా మంటలో వేస్తున్నారు. కొద్దిగా దగ్గరికి వచ్చి చూశా. అంతే! ఆశ్చర్యం... ఆమె బుట్ట నిండా డబ్బుల నోట్లు. కుటుంబం అంతా ఇష్టంగా కాలుస్తున్నారు. వీళ్లు చేస్తున్న పనికి నాకు నోట మాట రావడం లేదు. తెలతెలవారుతోంది. నలుగురూ లేచి ఇంట్లోకి వెళ్లారు.
 
 వాళ్లు నన్ను గమనించినట్టు లేరు. ఇల్లు కూడా భలే వింతగా ఉంది. తలుపులు లేవు, కిటికీలకు ఊచలు లేవు. చూస్తే పేకలతో కట్టిన ఇల్లులా ఉంది. సూర్యుడు ఒకే ఊపులో అలా పైకి లేచాడు. చుట్టూ పచ్చదనం చిక్కటి ఆకుల వనంలా  ఉంది. వాటి మధ్యలో అక్కడక్కడా పేకలతో కట్టిన ఇళ్లు. ఇక్కడ మనుషులంతా ఒకే వర్ణం... నారింజ రంగు. మనలా నలుపు, తెలుపు, చామనచాయ వర్ణాలు కాదు. అందరూ ఒకటే వర్ణం... నారింజ రంగు. మనుషులు కూడా ఆరు అడుగుల ఎత్తు, గాజుకళ్లు లాంటి కళ్లు. ఆడవాళ్లు అయితే అదొక తెలియని అందం. పిల్లలైతే దబ్బపళ్లలా ఉన్నారు. అదేమి విచిత్రమో, అందరూ నారింజ రంగు వర్ణంలో ఉన్నారు.
   
 ఆడా మగ అందరూ ప్రకృతితో మిళితమైన పనులు చేస్తున్నారు. ఒకడు నాగలి పట్టి దుక్కి దున్నుతున్నాడు. కొంతమంది ఆడాళ్లు నాట్లు వేస్తున్నారు. ఇద్దరేమో ఆవుల్ని తోలుకెళ్తున్నారు. తెల్లని ఆవుల మంద ఆకుపచ్చని వనంలో కళ్లు మిరిమిట్లు గొలుపుతోంది. ఆ ఆవులతో ఒకడేదో మాట్లాడుతున్నాడు. అదీ వాడితో మాట్లాడుతోంది. ఏంటి విచిత్రం! ఒకడు చెట్లెక్కి పండ్లు కోస్తున్నాడు. చూడ్డానికి ఆ పండ్లు మెరుస్తూ భలే వింతగా ఉన్నాయి. పిల్లలందరూ అరుగు మీద కూర్చున్న పేదరాసి పెద్దమ్మ చెప్పే కథలు వింటున్నారు. ఇద్దరేమో మట్టిని కువ్వలా పేర్చి, చెరోపక్క కూర్చొని చుకుచుకు పుల్ల ఆట ఆడుతున్నారు. ఆడపిల్లలేమో జట్టుగా కూర్చొని అచ్చంగాయ్ ఆడుతున్నారు. ఇంతలో జుయ్య్‌మంటూ ఒక సీతాకోకచిలుక ఒక బుడ్డోడిని వీపునేసుకొని పువ్వుపై వాలి, తేనె లాగి వాడి నోట్లో పోస్తోంది. నేనేమో ఈ వింతలన్నీ వింతగా చూస్తుండిపోయా.
 
 మరికాసేపటికి సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. అందరూ హాయిగా చెట్ల నీడలో వంట చేసే కార్యక్రమం మొదలెట్టారు. పిల్లలేమో ఆకుకూరలు, కాయగూరలు అవీ ఇవీ కోసుకొని వస్తున్నారు. ఆడ, మగ అందరూ కలిసి భోజనాలు వండేదానికి సిద్ధం అవుతున్నారు. ఊరందరికీ సరిపడ పెద్ద బానలో బియ్యం వేస్తున్నారు. పిల్లలు తెచ్చిన కూరగాయలను పేదరాసి పెద్దమ్మ, వయసు పైబడినవాళ్లు కడిగి ముక్కలు కోస్తున్నారు. ఆడ, మగ అందరూ కలిసి భోజనాలు తయారుచేశారు. బాదంచెట్టు ఆకుల్లా పెద్దగా ఉన్నాయి... వాటిల్లో పెట్టుకొని భోజనాలు చేశారు. మళ్లీ ఎవరి పనులకు వాళ్లు వెళ్లారు.
 సాయంత్రానికి ఏటిగట్టు మీద వయసు కుర్రాళ్లు చేరి ఈతలు కొడుతున్నారు. ఒక్కొక్కరు ఆకాశం అంత ఎత్తు ఎగిరి దూకుతున్నారు. వయసుకొచ్చిన కన్నెపిల్లలేమో ధైర్యంగా అబ్బాయిల ముందు నుంచే నీళ్లు తోడుకెళ్తున్నారు. పిల్లలేమో పిల్లకాలువ దగ్గర కాగితపు పడవలొదులుతున్నారు... అదీ ఎందుకూ పనికిరాని పచ్చనోట్లతో!
 చీకటిపడుతున్న వేళ అందరూ ఇళ్లకు చేరారు. ఆడాళ్లేమో దీపాలు వెలిగించారు. ఇంతలో కొందరు పిల్లలు ఆకాశం పెకైగిరి చందమామను అందుకున్నారు. అందులో ఒకడు చందమామలో ఉండే కుందేలును చెవులతో పట్టుకున్నాడు. వాడ్ని అందరూ భుజాలపై మోస్తూ కిందకు దిగారు. చంటిపిల్లలను ఎత్తుకొన్న అమ్మలేమో ఆకాశం నుంచి నక్షత్రాలను చేత్తో పట్టుకొని చంటాళ్లకు చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. నక్షత్రాల వెలుగుకి తల్లి, పిల్లాడు వెండి వెలుగులో మెరుస్తున్నారు. ఊరంతా ఒక దగ్గర చేరి చలిమంట వేసుకున్నారు. అందరూ తెచ్చిన పచ్చనోట్లతో మంటను వెలిగించారు. ఒక్కొక్క నోటు చాలాసేపు మండుతోంది.
 ఆ వెలుగులో ఒక స్వరం... ఒక అలజడి... ఒక ఉద్రేకం...
 ఎవరిదో ఒక గొంతు కాదు కాదు కొన్ని వేల గొంతులు...
 అది ఒక సామూహిక బృందగాన సమ్మోహనం...
 ఆ పాటే నన్ను తలకిందుల చేస్తోంది. నాకు ఆ పాట అర్థం కావట్లేదు. కాని వెన్నెలంతా చినుకులై వర్షంలా కారుతోంది. నాలో తెలియని ఆవేదనంతా తడిసి చల్లారిపోయింది. అందరూ పాటలు పాడుకొని, ఎవరిళ్లకి వారు వెళ్లారు. నేను మాత్రం వెన్నెల వానలో తడుస్తూనే ఉన్నా.
   
 మెలకువ రాగానే కళ్లు నలుపుకొని చూశా. బెడ్ లైట్ కాంతిలో అంతా ప్రశాంతంగా ఉంది. కాళ్లవైపు చూసుకున్నా. కాళ్లకి జోళ్లు లేవు. మూలగా చూశా. అవి అక్కడే ఉన్నాయి. ఈ మధ్య నాకు పిచ్చి ముదిరిందని మా ఆవిడ పక్క రూమ్‌లో పడుకుంటోంది. టైమ్ చూస్తే 5.30 అయ్యింది. జోళ్ల గుసగుసలు ఏమైనా వినబడుతాయేమోనని జోళ్ల దగ్గరకు వెళ్లా. అంతా నిశ్శబ్దంగా ఉంది. తెలవారబోతోంది. పొగ మంచు. ఇంట్లో నుంచి బయటకువచ్చా. అంతా నిర్మానుష్యంగా ఉంది. మంచుని చీల్చుకు కనబడుతున్న కాంతి. మసగ్గా టీ బంక్‌లా ఉంది... చుట్టూ నలుగురు ఉన్నారు. నేను టీ తాగాలని జేబులో చూశా. డబ్బులు లేవు. డబ్బు లేకుంటే ఈ లోకంలో ఏదీ నీ సొంతం కాదు... ఆఖరికి టీ కూడా, అని మనసులో అనుకుంటూ నడుస్తున్నా. తెల్లారింది.
 
 అలా నడుచుకుంటూ సిగ్నల్ దగ్గర ఆగా. ట్రాఫిక్ పెరిగింది. సిగ్నల్ పడింది. నేను నడుచుకుంటూ రోడ్ క్రాస్ చేస్తుండగా, ఆగిన బెంజ్ కార్. అందులో సూట్ వేసుకొని కూర్చున్న బిజినెస్‌మ్యాన్. కార్ పక్కనే బైక్‌పైన భార్య, భర్త ఆఫీసులకు లాగుంది. పక్కనే స్కూటీపై ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న పదహారేళ్ల ఆడపిల్ల కాలేజ్‌కి వెళ్తున్నట్టుంది. చివరగా పిల్లలందరినీ కుక్కిన ఓ పసుపురంగు స్కూల్ వ్యాన్. నేను రోడ్డు దాటాను. సిగ్నల్ పడింది అంతే. రణ గొణ ధ్వనుల మధ్య కొన్ని వేల ఆర్తనాదాలు. ఇవేవి వినబడట్లేదు నాకు. ఎక్కడో... ఒక స్వరం... ఒక అలజడి... ఒక ఉద్రేకం...   ఎవరిదో ఒక గొంతు కాదు కాదు కొన్ని వేల గొంతులు... అది ఒక సామూహిక బృందగాన సమ్మోహనం... ఆశగా అడుగులు వేస్తున్నా... ఆయన వొదిలెళ్లిన జోళ్లతో... ఇంతలో కొందరు పిల్లలు ఆకాశం పెకైగిరి చందమామను అందుకున్నారు. అందులో ఒకడు చందమామలో ఉండే కుందేలును చెవులతో పట్టుకున్నాడు. వాడ్ని అందరూ భుజాలపై మోస్తూ కిందకు దిగారు.
 - మహి బెజవాడ

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు