ప్రాణం పోయినా సరే... పని జరగాలి!

28 May, 2017 00:19 IST|Sakshi
ప్రాణం పోయినా సరే... పని జరగాలి!

‘ఎక్కడ ఉన్నా సరే మసూద్‌ భాయ్‌ మనకు కావాలి.మన ప్రాణాలు పోయినా సరే’ లివాటు వ్యవహారం, పెంకితనం, మూర్ఖత్వం కలగలిసిన ‘ఆకాశ్‌’గా ‘ఛత్రపతి’లో నటించినా, ప్రాణాలు పోయినా సరే అనుకున్నది సాధించాలనే కరడుగట్టిన ఉగ్రవాది అజార్‌గా ‘ఖడ్గం’ సినిమాలో కనిపించినా... దుర్మార్గంలోని రకరకాల ఫ్లేవర్స్‌ను నేర్పుగా ప్రకటించగలిగే నటుడు షఫీ. ఢిల్లీలోని ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’లో  చదువుకున్న ఈ చంద్రగిరి కుర్రాడు పెద్ద పెద్ద వాళ్ల దగ్గర నటనలో మెళకువలు నేర్చుకున్నాడు.

ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయేంత నైపుణ్యాన్ని సాధించాడు. ‘ఖడ్గం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన షఫీ, ‘ఛత్రపతి’ సినిమాలో విలన్‌తో చేతులు కలిపిన కథానాయకుడి తమ్ముడు ‘ఆకాశ్‌’గా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు.‘‘నేను రైటర్, డైరెక్టర్, యాక్టర్‌ని’’ అని చెప్పుకునే షఫీలో ‘నేను ఇలా అనుకుంటున్నాను. ఇలా మాత్రమే నటిస్తాను’ అనే పట్టింపులేమీ లేవు. ఆయన దృష్టిలో రచయితకు, దర్శకుడికి మంచి ప్రాధాన్యత  ఉంది. రచయిత ఊహలకు డైరెక్టర్‌ ఒక రూపం కల్పిస్తే నటుడు దానికి ప్రాణం పోస్తాడు అని నమ్ముతాడు షఫీ.

‘నా నుంచి డైరెక్టర్‌ తీసుకున్నట్లే...
డైరెక్టర్‌ నుంచి కూడా నేను తీసుకుంటాను’ అంటాడు. అంత మాత్రాన భారం మొత్తం ఆ ఇద్దరి మీదే వేయడు. తాను చేస్తున్న పాత్రలో జీవం తీసుకురావడానికి రకరకాలుగా కసరత్తులు చేస్తుంటాడు.‘శ్యామ్‌గోపాల్‌వర్మ’ సినిమా కోసం ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో మంది వ్యక్తులను ఇంటర్వూ్య తీసుకొని నోట్స్‌ రాసుకున్నా, ‘కమ్లీ’ సినిమాలో రేడ్యా పాత్ర కోసం మహబూబ్‌నగర్‌ కూలీలను కలిసి వారి వేషభాషలు అధ్యయనం చేసినా, ‘ఖడ్గం’ సినిమా కోసం చార్మినార్‌ ప్రాంతంలో  అద్దెకు ఉన్నా.... ఒక పాత్ర పండించడం కోసం చేయాల్సినంత హోంవర్క్‌ చేయడంలో ముందుంటాడు షఫీ.

‘డబ్బులు ముఖ్యం కాదు...సంతృప్తి ముఖ్యం’ అంటున్న షఫీ ఆచితూచి పాత్రలను ఎంచుకుంటాడు. ఒక్కసారి ఓకే అన్నాక...దానికి వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ‘ఖడ్గం’లో అజార్‌ నుంచి ‘శివమ్‌’లో ముస్తాఫా వరకు, ‘రెడీ’లో నాగప్ప నుంచి ‘ఖలేజా’లో సిద్దప్ప వరకు రకరకాల పాత్రలను విజయవంతంగా  పండించాడు  షఫీ.‘నటుడు తెల్లటి కాన్వాస్‌లాంటి వాడు’ అంటున్న షఫీ  ఆ కాన్వాస్‌పై ‘విలన్‌’ అనే పెయింటింగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది ‘ఉత్తమ విలన్‌’ అనిపించుకున్నాడు.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు