మేలు చేసిన తేనెటీగ

17 Sep, 2018 23:29 IST|Sakshi

సారంగపురంలో జనాభా పెరిగిపోయింది. నగరంలో పెద్ద భవనాలు, విద్యాసంస్థలు వెలిశాయి. రాజుగారి రథాలు, మంత్రిగారు సహా రాజ పరివారానికి చెందినవారి రథాలు, ఇతర సంపన్నుల రథాలు పోవాలంటే నగరంలోని వీధులు ఇరుకు కాసాగాయి. రహదారులను విశాలంగా తయారు చేయడానికి అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లను కొట్టించేయాలని రాజుగారి మంత్రిమండలి నిర్ణయించింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా! శరవేగంగా చెట్లు కొట్టే కార్యక్రమాన్ని అమలు చేయసాగారు. చిరకాలంగా నగర పౌరులకు నీడనిచ్చిన భారీ వృక్షాలు నేలకొరిగాయి. పచ్చని చెట్లతో కళకళలాడుతూ కనిపించే రహదారులు బోసిపోయాయి. నగరంలోనే నివాసం ఉంటున్న పుష్పరాజుకు చెట్లంటే వల్లమాలిన ప్రేమ. పుష్పరాజు నగరంలోని అనేక రహదారుల వెంబడి ఎన్నో చెట్లు నాటించాడు. పుష్పరాజు ఇంటి దగ్గర్లోనే ఉన్న మూడు పెద్ద వృక్షాలను కూడా రాజుగారి సిబ్బంది కొట్టివేశారు.

చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ పెరిగిన పుష్పరాజు, నేలకొరిగిన ఆ వృక్షాలను చూసి చాలా బాధపడ్డాడు. ఇదివరకు పచ్చగా కళకళలాడే ప్రదేశం బోసిపోయి కనిపించడాన్ని తట్టుకోలేకపోయాడు. అందుకే, నగరానికి దూరంగా వెళ్లి ఒక పెద్దస్థలంలో చిన్న ఇల్లు కట్టుకుని, చక్కని తోట వేసుకోవాలనుకున్నాడు. నగరానికి దూరంగా ఒక తటాకం పక్కన కనిపించిన స్థలం అనువైనదిగా అనిపించడంతో అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. చుట్టూ బోలెడన్ని పండ్లు, కూరగాయల మొక్కలు వేశాడు. పూల మొక్కలు వేశాడు. తటాకానికి కొద్ది దూరంలోనే ఒక పెద్ద వృక్షం కూడా ఉంది. రోజూ తటాకం నుంచి నీళ్లు తెచ్చి శ్రద్ధగా తోటలోని మొక్కలకు పోయసాగాడు. మొక్కలు ఏపుగా పెరిగాయి. కొన్ని వృక్షాలుగా ఎదిగాయి. అవి పూలు, పండ్లు, కూరగాయలు ఇవ్వసాగాయి.

ఆ అందమైన పూల సువాసన అల్లంత దూరంలో ఎగురుతున్న తేనెటీగను ఆకర్షించింది. అది ఎంతో సంతోషంతో తోటను గమనించింది. ఇంతకుముందు తేనె సేకరించాలంటే ఎంతో దూరం పోవాల్సి వచ్చేది. ఇంత అందమైన దృశ్యాన్ని ఆ తేనెటీగ ఇంతకు ముందు చూసి ఎరుగదు. అక్కడ దూరంగా ఉన్న తేనెటీగలు కూడా పూల సువాసనను గ్రహించాయి. కొద్ది దూరంలోనే ఉన్న పెద్ద చెట్టు మీద తేనెటీగలు తేనెపట్టు పెట్టాయి. అవి రోజూ పుష్పరాజు తోటలోని పూల నుంచి మకరందాన్ని సేకరించి తమ తేనెపట్టును నింపసాగాయి. పుష్పరాజు తోటలోని మకరందాన్ని సేకరిస్తున్నాయి కనుక అవి పుష్పరాజుకు ఏదైనా మేలు చేయాలని తలచాయి.

అదలా ఉండగా, దూరంగా ఉన్న అడవి నుంచి ఒక తోడేలు పుష్పరాజు ఇంటి వైపు రాసాగింది. అప్పుడే పుష్పరాజు కొడుకు చెక్కతో చేసిన చిన్న బొమ్మతో ఆడుకుంటూ తోటలోకి వచ్చాడు. తోడేలు పుష్పరాజు కొడుకు వైపు రాసాగింది. తోడేలు వల్ల ఆ బాలుడికి ఎదురవబోయే ప్రమాదాన్ని గ్రహించిన పెద్ద తేనెటీగ మిగిలిన తేనెటీగలను వెంటనే అప్రమత్తం చేసింది. అంతే! అవి గుంపుగా బయలుదేరి పుష్పరాజు కొడుకు వైపు వస్తున్న తోడేలుపై మూకుమ్మడిగా దాడి చేశాయి. తేనెటీగల కాటుకు తోడేలుకు ఒళ్లంతా బాగా వాచిపోయింది. తేనెటీగల కాట్ల ధాటికి ఒళ్లంతా మంటలు పుట్టడంతో ఆ బాధ భరించలేక కుయ్యో మొర్రో అంటూ ఆ తోడేలు దూరంగా ఉన్న అడవిలోకి పారిపోయింది. ఇక ఆ రోజు నుంచి తోడేలు పుష్పరాజు తోట దరిదాపులకు వచ్చేందుకైనా సాహసించలేదు.

పుష్పరాజు తోటలోని మకరందాన్ని గ్రహిస్తున్నందుకు కృతజ్ఞతగా తేనెటీగలు అతడి కొడుకును తోడేలు బారి నుంచి కాపాడాయి. తోడేలు పాదాల గుర్తులు గమనించి పుష్పరాజు ఇంటి చుట్టూ పెద్ద దడి కట్టించి, తన ఇంటికీ, కుటుంబానికి తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడు. మరిన్ని పూల మొక్కలు, పండ్ల మొక్కలను తీసుకొచ్చి తన తోటను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నాడు.

మరిన్ని వార్తలు