అనంతరం: తండ్రి బాటలోకే తిరిగొచ్చాడు...

1 Dec, 2013 04:34 IST|Sakshi
అనంతరం: తండ్రి బాటలోకే తిరిగొచ్చాడు...

 నది... పుట్టినచోటే ఉండదు. ముందుకు సాగేకొద్దీ తన నడక మార్చుకుంటుంది. ఎక్కడో మొదలై ఎక్కడికో చేరుతుంది. చిరాగ్‌ని చూస్తే నదిని చూసినట్టే ఉంటుంది. రాజకీయ కుటుంబంలో పుట్టాడు. సినిమా మీద ఆసక్తితో అటువైపు మళ్లాడు. అక్కడ కలసి రాకపోవడంతో మళ్లీ రాజకీయాలవైపు చూస్తున్నాడు. తన నడకను మార్చుకుంటూ పోతున్నాడు. అసలు అతడి గమ్యం ఏదో? అతడి పయనం ఎందాకో?
 
 2011... నవంబర్ 4. ‘మిలే న మిలే హమ్’ సినిమా రిలీజయ్యింది. హీరోయిన్ అందరికీ తెలిసిందే... కంగనా రనౌత్. అయితే ఆమె పక్కన నటించిన పిల్లికళ్ల పిల్లాడెవరో చాలామందికి తెలియదు. ‘కొత్త పిల్లాడు, బానే ఉన్నాడే’ అనుకున్నారంతా. అలా అంటారని తెలిసే ఆ అబ్బాయి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. అయితే ఫలితం మాత్రం అనుకున్నట్టుగా రాలేదు. అందుకే అతడు మళ్లీ తెరమీద కనిపించలేదు.
 
 2013... జూన్. హాజీపూర్‌లో ఒక సభ జరుగుతోంది. ఎంతోమంది వచ్చారు. వేదిక మీద ఓ యువకుడు ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు. తన తండ్రిలో ఎంత మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడో వివరంగా చెబుతున్నారు. తండ్రి తరఫున తనే హామీలు ఇస్తున్నాడు. అనుభవం ఉన్న రాజకీయవేత్తలా మాటలు వెదజల్లుతున్నాడు.
 నాటి నటుడు, నేటి ఈ యువకుడు ఒక్కరే... చిరాగ్. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు. ముగ్గురు ఆడపిల్లల మధ్య రాకుమారుడిలా పెరిగాడు. ఇంటి నిండా రాజకీయ వాతావరణం, అయినా ఆ వాసన అతడికి ఒంటబట్టలేదు. ఊహ తెలిసిన నాటి నుండీ అతడి కళ్లల్లో రంగుల కలలు మెరిసేవి. మనసు సినీ వినీలాకాశం వైపు రెక్కలు కట్టుకుని ఎగరాలని ఉవ్విళ్లూరేది. అందుకే బడిలో పాఠాలతో పాటు నటనలో మెళకువలు కూడా నేర్చుకున్నాడు. డ్రామా అంటే మనోడు ఉండాల్సిందే. ఏదో ఒక పాత్రను తన తరహాలో పండించాల్సిందే. అద్భుతంగా చేశావు అంటే అమితాబ్‌తో పోల్చినంత ఆనందం. నటుడవ్వాలన్న కోరిక ఎప్పుడు కంచెలు తెంచుకుందామా అని చూసేది. పెరిగి పెద్దయ్యేకొద్దీ ఆ ఆశ అతడి అణువణువునూ ఆక్రమించేసింది.
 
 ‘నేను హీరోనవుతాను అంటే మా వాళ్లు అంతగా షాకవలేదు’ అంటాడు చిరాగ్. ఎందుకవుతారు? మాటలు వచ్చినప్పట్నుంచీ సినిమా అన్న పేరు అతడి నోటి నుంచి ఎన్ని లక్షల సార్లు వచ్చి ఉంటుందో. అందుకే వాళ్లు షాక్ తినలేదు. కానీ కాస్త డిజప్పాయింట్ అయితే అయ్యారు. చిరాగ్‌ని పాలిటిక్స్‌లోకి రమ్మని పాశ్వాన్ ఎప్పుడూ బలవంతపెట్టలేదు. నా మార్గంలో నడవడం ఇష్టం లేకపోతే... కనీసం డాక్టరో, ఇంజినీరో అవ్వమన్నారు. కానీ చిరాగ్ ఆలోచనల్లో ఆ రెండు ప్రొఫెషన్లూ లేవు. ఉన్నదల్లా ఒక్కటే... సినిమా. తన ఆసక్తికి తండ్రి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండుని జోడించి ఎలాగయితేనేం... బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు విలాస్ వారసుడు.
 
 కానీ అవకాశం వచ్చినంత వేగంగా అదృష్టమైతే వరించలేదు. ఒక్క సినిమాతోనే చిరాగ్ కలలకు తెర పడింది. ఆ సినిమా వైఫల్యం అతడిని నిరాశలో ముంచేసింది. ఇంత వరకూ తేరుకోకుండా చేసింది. రెండేళ్లుగా తన కలలను పునర్మించుకునేందుకు శ్రమపడుతున్నా... ఫలితం మాత్రం కనిపించలేదు. దాంతో విసుగే చెందాడో... లేక తండ్రికి తన తోడే అవసరమనుకున్నాడో తెలియదు కానీ, నాన్న అడుగుల్లో అడుగులు వేయడం మొదలుపెట్టాడు.
 ప్రస్తుతం బీహార్‌లో తన తండ్రిని, ఆయన పార్టీని ప్రమోట్ చేసేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నాడు చిరాగ్. అందమైన రూపం, సినిమాలో నటించాడన్న చిన్నపాటి క్రేజ్, మాటల్లో ఉట్టిపడే ఆవేశం అతణ్ని అందరికీ దగ్గర చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన తండ్రి గెలుపునే తన లక్ష్యంగా చేసుకున్న చిరాగ్, తన అసలైన లక్ష్యాన్ని పక్కన పెట్టేశాడా? లేక కొడుకుగా తన బాధ్యతను నెరవేర్చాక మళ్లీ వెళ్దామని బ్రేక్ తీసుకున్నాడా? లేదంటే... ఇక కలసిరాని కలలను ఏరుకోవడం మానేసి, కనిపించే మార్గంలో సాగిపోవాలని నిర్ణయించుకున్నాడా? అసలు చిరాగ్ ఎటు పయనిస్తున్నాడు!
  - సమీర నేలపూడి

>
మరిన్ని వార్తలు