నా పాట నాతో మాట్లాడుతుంది

18 Jan, 2015 00:32 IST|Sakshi
నా పాట నాతో మాట్లాడుతుంది

అవును.... పాట కాగితంపైకి రాబోయే ముందు, రాస్తున్నప్పుడు, రాసిన తర్వాత నాతో మాట్లాడుతుంది. పూర్వం ధన్వంతరి దగ్గరకు ఎవరైనా వ్యాధిగ్రస్తులు రాగానే వారి శారీరక, మానసిక పరిస్థితి తెలుసుకుని, తన   ఔషధమూలికల వనములోకి వెళ్లి నిశితంగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చూసేవాడట. ఆ వ్యాధి తగ్గించగల ఔషధమూలిక తన కొమ్మలనో, రెమ్మలనో ఊపి, ‘ధన్వంతరీ నేను పనికొస్తానా చూడు’ అనేదట. అలా నా సన్నివేశానికి తగిన పల్లవినిస్తూ పాట నాతో మాట్లాడడం మొదలు పెడుతుంది.

మైకేలేంజిలోతో శిల మాట్లాడినట్టు, కృష్ణశాస్త్రితో ప్రకృతి మాట్లాడినట్టు, రవివర్మతో కుంచె మాట్లాడినట్టు, అమరశిల్పి జక్కన్నతో ఉలి మాట్లాడినట్టు, సచిన్ టెండూల్కర్‌తో బ్యాట్ మాట్లాడినట్టు... పాట తన కవితో మాట్లాడుతుంది.  నాతో మాత్రమే కాదు ఏ పాటల రచయితతోనైనా పాట మాట్లాడుతుంది. సంకల్పాన్ని పరమ ప్రాణంగా భావించుకునే ప్రతి వ్యక్తి ఆత్మకణం బ్రహ్మకణంతో ట్యూన్ అవుతూనే ఉంటుంది. అలాగే కవికి పాటకి ఒక తపస్సంబంధం ఉంటుంది. కనుకనే పాట నాతో మాట్లాడుతుంది అంటున్నాను.
 
డా॥సుద్దాల అశోక్‌తేజ,పాటల రచయిత
 
‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలోని
‘నీలిరంగు చీరలోన...’  : పాట
 
పాటమాలి
నానక్‌రాంగూడలో ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్ జరుగుతోంది. కృష్ణవంశీ కబురు పంపాడు. వెళ్లాక ఆయన  అన్నమాట: ‘మీరు రాయబోయే పాట ఈ సినిమాకి గుండెకాయలాంటిది’.
‘ప్రతి పాట గురించి డెరైక్టరు ఇలాగే అంటారు...’ అని నవ్వాను నేను. ‘ఈ పాటలో జీవితం ఉండాలి, పండుగలుండాలి, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఉండాలి... అలాగని సుత్తిపాట కాకుండా అట్రాక్ట్ చేసేవిధంగా మొదలెట్టాలి’ అన్నాడు.
 
నాలుగురోజుల తర్వాత ఒక పాట తీసుకెళ్లాను. కృష్ణవంశీకి నచ్చలేదు. ఆ పాటలో ‘నీలిరంగు చీర’ అన్న పదమొక్కటే నచ్చిందన్నాడు. మళ్లీ ఆలోచనలో పడ్డాను.  ఇప్పుడు ‘నీలిరంగు చీర...’ అనేది కేంద్ర బిందువు. పాట పాడేది ప్రకాశ్‌రాజ్, జయసుధ. హీరో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది కాని పాడడు.
 ఇక్కడ జీవితం గురించి చెప్పాలి... అదే సమయంలో అట్రాక్షన్‌గా ఉండాలన్నది నాకు బాగా నచ్చింది. జీవితం గురించి  అట్రాక్షన్‌గా చెప్పలేం. ‘ఒకటే జననం... ఒకటే మరణం...’ అన్నట్టు వెళ్లిపోతుంది. సీరియస్‌నెస్ ఉన్నదగ్గర ఆకర్షణ ఎక్కడ ఉంటుంది? మలేరియా బిళ్లను షుగర్ కోటింగ్‌తో ఇవ్వాలి.
 
‘నీలిరంగు చీర...’ అమ్మాయి కట్టుకునే వస్త్రం. ఆ సమయంలోనే నా మనసు పలికిన విషయం... ‘ఒరేయ్ అశోక్‌తేజా, జీవితానికి మించిన హొయలొలికించే జాణ ఇంకోటేదైనా ఉంటుందా!’ అని. ఇలాంటి సందర్భాన్నే నా పాట నాతో మాట్లాడుతుందని అన్నాను.
 జీవితాన్ని మించిన నెరజాణ లేదు. ఎప్పుడు ఏడిపిస్తుందో, నవ్విస్తుందో... ఎప్పుడు శిఖరానికి తీసుకెళుతుందో... పాతాళానికి పడేస్తుందో...
 
పాపం అమ్మాయిల్ని నెరజాణలంటారుగానీ, అమ్మాయికంటే లక్ష రెట్లు ఎక్కువ నెరజాణ జీవితమే. ఇలా ఆలోచిస్తుండగా ఓ అర్ధరాత్రి వచ్చిన ఆలోచన ఏంటంటే... ‘అమ్మాయి గురించి చెబుతూ చెబుతూ వెళ్లి... అమ్మాయి కాదురా అమాయకుడా... జీవితంరా ఇది’ అని చెబితే ఎలా ఉంటుంది అని ఫిక్స్ అయ్యాను.
 ‘‘నీలిరంగు చీరలోన/ చందమామ నీవె భామా
 ఎట్ట నిన్ను అందుకోనే/ ఏడు రంగులున్న నడుము
 బొంగరంలా తిప్పేదానా/ నిన్ను ఎట్ట అదుముకోనే’’
 
మామూలుగా స్త్రీకి ఏడు రంగులుండవు.  కానీ స్త్రీలో కేవలం శృంగారమే ఉండదు. అమ్మ ఉంది. తోబుట్టువుంది. స్నేహితురాలుంది. చిన్నారి వేలు పట్టుకుని నడిచే కూతురుంది.  అందుకే ఏడు రంగులున్న నడుము అన్నాను. స్థిరంగా ఉన్నదాన్ని కౌగిలించుకుంటాం గానీ తిరుగుతున్నదాన్ని ఎలా కౌగిలించుకుంటాం. జీవితం కూడా ఒకే దగ్గర ఉండదు.
 ‘‘ముద్దులిచ్చి మురిపిస్తావే/ కౌగిలిచ్చి కవ్విస్తావే
 అంతలోనే జారిపోతావే’’
 
పదేళ్లకిందటి నా జీవితం ఎక్కడుంది! ఎప్పుడో నా చేజారిపోయింది.
 ‘‘మెరుపల్లె మెరిసే జాణ/ వరదల్లె ముంచే జాణ
 ఈ భూమిపైన నీ మాయలోన/ పడనోడు ఎవడే జాణ’’
 ‘‘జాణ అంటే జీవితం.. జీవితం నెరజాణరా
 దానితో సైయ్యాడరా ఎదురీదరా/ ఏటికీ ఎదురీదరా’’
 
ఈ పల్లవి చూపించగానే కృష్ణవంశీ బిగ్గరగా కౌగిలించుకున్నాడు. ‘అద్భుతమైనటువంటి ట్విస్ట్ ఇచ్చావు అశోక్.. ఇక చరణాల్లో ఏం చేస్తావో నీ ఇష్టం’ అన్నాడు. మరొక వారం రోజుల్లో చరణాలు రాసుకుని వెళ్లాను. చరణాలు నచ్చాయి. కానీ మద్రాసులో మ్యూజిక్ డెరైక్టర్‌కి ఇచ్చాక... ఆయననుకున్న ట్యూన్లకి, నేను రాసిన చరణాలు పొంతన కుదర్లేదు. మ్యూజిక్ డెరైక్టర్ యువన్‌శంకర్‌రాజా. ‘చరణాలకు నేను ముందు ట్యూన్ ఇస్తాను. దానికి తగ్గట్టు మార్చ’మన్నాడు.
 
నేనూ, కృష్ణవంశీ మద్రాసులో హోటల్ రూం తీసుకుని వారంరోజులుండి ఆ పనికానిచ్చాం. కృష్ణవంశీ ఇల్లు ఆ పక్కనే ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి కలిసేవాడు. మొదటి చరణంలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చెప్పమన్నాడు. ఈ పాటకు సంబంధించి నా లక్ష్యమొక్కటే, అటు సి.నారాయణరెడ్డిగారికీ కనెక్ట్ అవ్వాలి, ఇటు సామాన్యుడికీ అర్థంకావాలి.

 చరణం: 1
 ‘‘రాక రాక నీకైవచ్చీ పున్నమంటి చిన్నది ఇచ్చే
 కౌగిలింతె బతుకున వచ్చే సుఖమని’’
 ‘‘పువ్వులాగ ఎదురే వచ్చి ముల్లులాగ ఎదలో గుచ్చీ
 మాయమయ్యె భామవంటిదే కష్టమనుకో’’
 ‘‘ఏదీ కడదాకా రాదని/ తెలుపుతుంది నీ జీవితం
 నీతో నువు అతిథివనుకోని ’’
 మనిషికి తనను మించిన అతిథి, ఆత్మీయుడు మరొకరు లేరు.
 ‘‘జాణకాని జాణరా - జీవితం నెరజాణరా
 జీవితం ఒక వింతరా - ఆడుకుంటే పూబంతిరా’’
 బంతి మనల్ని ఆడుకుంటదా, మనం బంతితో ఆడు కుంటామా అనేది మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది.
 
చరణం: 2
 ‘‘సాహసాల పొలమే దున్నీ/ పంట తీసే బలమే ఉంటే
 ప్రతిరోజు ఒక సంక్రాంతి అవుతుందిరా’’
 ‘‘బతుకు పోరు బరిలో నిలిచీ/ నీకు నువ్వే ఆయుధమైతే
 ప్రతీపూట విజయదశమీ వస్తుందిరా’’
 
నీకు నువ్వే ఆయుధమవ్వాలనడంలో రెండు అర్థాలున్నాయి. ఒకటి ప్రపంచంతో పోరాడి గెలవాలి. నీలో ఉన్న బలహీనతలతోనూ పోరాడి గెలవాలి. ఇందులో ప్రతి మాట యూత్‌కి కౌన్సెలింగ్‌లా ఉపయోగపడాలి. అందుకే రామ్‌చరణ్‌తేజ స్టేజ్‌పై ‘ఇంతవరకూ చాలా సినిమాలు చేశాను అంకుల్. కానీ నాకు ఇంత మంచి పాట ఇచ్చింది మీరే’ అన్నాడు.
 ‘‘నీపై విధి విసిరే నిప్పుతో ఆడుకుంటే దీపావళి’’
 
దీపావళి నిప్పుతో ఆడుకునే పండగ. ప్రమాదంతో ఆడుకోవడం. మనిషి జీవితంలో విధి ఎప్పుడూ నిప్పులు జల్లుతానే ఉంటుంది.
 ‘‘చెయ్ రా ప్రతి ఘడియ పండుగే/ చెయ్‌ర...చెయ్‌ర...చెయ్
 జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా
 జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా
 జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా’’
 
రంగులరాట్నంలో ఒకడు గుర్రంమీద ఎక్కుతాడు, ఒకడు గాడిద మీద ఎక్కుతాడు. ఎవరు ఏ వాహనం ఎక్కినా అందరినీ ఒకేవిధంగా తిప్పుతుంది. ఒకే గమ్యానికి చేర్చుతుంది. ప్రతి ఒక్కరి ప్రారంభం ఒక్కటే, ప్రస్థానం ఒక్కటే. జీవితం ఒక ఉత్సవంలాంటిది. జాతర చేయడానికే వచ్చాం. అందుకే జాతర చేయడానికే ఈ జన్మరా... అని ముగించాను.
 రిపోర్టింగ్: భువనేశ్వరి

మరిన్ని వార్తలు