ఈ వినాయకుడు చాలా తెలివైనవాడు

1 Sep, 2019 08:42 IST|Sakshi

వినాయకచవితి ప్రత్యేకం

మా వినాయకుణ్ని చవితినాడు దర్శించుకోని వారంతా పరమపాపాత్ములన్నట్టుగా ఊళ్లో పేరు పడీవారు. అలాంటి వాళ్ల ముఖాన్ని చూడ్డానికీ ఎందరో ఇచ్చగించీవారు కాదు. 
గణపతి చతుర్థివేళ గ్రామంలో వెలిసిన విఘ్నేశ్వరునికి మొక్కి నెత్తుటి చారికల కాళ్లతో ఇళ్లకి చేరేవారికే గౌరవం. అలాంటి వారికే మర్యాద. వాళ్లే ఆ లంబోదరుని కృపకు పాత్రులయినట్టు.  
గుడికెళ్లిన భక్తజనం ఇంటికి వచ్చేప్పుడు ప్రసాదం పట్టుకొస్తారు. అంటిపళ్లు తింటూ వస్తారు. తీర్థం గ్రోలి వస్తారు. స్తోత్రం వల్లెవేసి వస్తారు. బొట్టుతో వస్తారు. చెవుల్లో పువ్వులు పెట్టుకుని వస్తారు. అంతేగానీ రక్తపు అడుగులతో రావడం ఏంటట?.. అక్కడే ఉంది మరి కథంతాను. విశాఖపట్నానికి ఒకమాదిరి దాపున ఉండే చోడవరం పల్లెటూళ్లో ఉద్భవించిన వినాయకుడి వ్యవహారం చిన్నది కాదు. ఆయన స్వయంభువు. భూమిలోనుంచి వెళిపొచ్చీసేడు. కాబట్టే భక్తులు విరివిగా పూజిస్తుండీవారు. ఆర్తుల పాలిట ఆయన కొంగు బంగారమని ప్రతీతి కూడాను.

ఊళ్లో గుళ్లకి లోటు లేదు. కొత్తూరు దాటేక శివాలయం, జవహర్‌ క్లబ్‌ దగ్గిర కేశవాలయం, పీర్లపంజా దరిన రామాలయం, వెలంవీధిలో లక్ష్మమ్మ కోవెల, పాకలవారి వీధి మొగన కన్యకాపరమేశ్వరి మందిరం, చీడికాడ రోడ్డులో నూకాల్తల్లి గుడి, కందర్ప కోలనీలో వెంకటేశ్వరస్వామి దేవళం. ఇలా ఎంత మంది దేవుళ్లున్నా మా బొజ్జ గణపయ్యకున్న ప్రత్యేకత వాళ్లెవరికీ లేదుగాకలేదు. ఈయనగారి కోవెల్లో ప్రతీ రోజూ సందడే.  మామూలు రోజుల్లోనే ఇన్ని దర్శనాలయితే చవితినాడిక చెప్పీదేముంది. జనాలు కుమ్మీసీవారు. అలా కుమ్ముకొచ్చిన వాళ్ల కాళ్లన్నీ కన్నాలడిపోతుండీవి. చవితినాడు బహు చిత్రమైన పల్లేరు పద్ధతొకటి మావూళ్లో అమలవుతుండీది.

ఆ రోజున ఊరి పిల్లలందరూ ఎక్కెడెక్కడి గరువుల్లోంచీ పల్లెరుగాయలూ ఏరుకొచ్చి విఘ్నేశ్వరుడి గుడి ముంగిట దట్టంగా జల్లుతుండీవారు. గుంటసావాదిగాళ్లు ఆ రకంగా చేయడం తప్పుకదా. వచ్చిపోయేవాళ్లకి ఇబ్బంది కదా. అయినాగానీ వాళ్లని ఎవ్వరూ వారించీవారే కాదు. పైపెచ్చు పెద్దఎత్తున పల్లేరు తెమ్మనమని పెద్దలే ప్రోత్సహిస్తుండీవారు. దీంతో ఊరి గుంటజట్టంతాను చవితి పండక్కి వారం రోజుల ముందునుంచీ పల్లేరు ఏరడం కోసం చెట్లంట, పుట్లంట, తోట్లంట, దొడ్లంట తిరిగీది. కొందరు మహాభక్తులయితే చవితి పండగనాడు గుడి ముందర తమ పిల్లల చేత పల్లేరు పరిపిస్తామని మొక్కులు కూడా పెట్టీవారు.

మా వినాయకుడు చాలా తెలివైన వాడు. అందుకే ఊరికి దూరంగానో ఊరికి సంబంధం లేకుండానో ఊరు వెలివేసినట్టుగానో అవతరించలేదు. సరిగ్గా ఊరి మయాన పీఠం వేస్సేడు. మెయిన్‌ రోడ్డు పక్కనే జానలు మూరలు కొల్చుకుని మరీ తిష్ట వేస్సేడు. రోడ్డు మీంచి వెళ్లే ప్రతీ ఒక్కడూ తనకో నమస్కారం పారీకుండా వెళ్లలేని స్థితిలో జాయిగా నిలబడిపోయేడు. అంత తెలివైన ఈ గణపతి ఆచూకీ తొలీతగా తీసిందెవరంటేను మట్టి పని చేసీ ఉప్పర్లేను. వాళ్లే నేల పొరల్లో ఉన్న ఈ ఏకదంతుణ్ని పైకి తేల్చి తెచ్చేరు. సరిగ్గా ఎన్నేళ్లయిందంటే మనం గట్టిగా చెప్పలేం గానీ చాలా ఏళ్లయిందని మాత్రం గట్టిగా చెప్పగలం.

నాటి కాలాన చోడవరంలో విపరీతమైన కరువు కాటకాలు వచ్చిపడ్డాయిట. చుక్కనీరు లేక జనం అల్లాడిపోయే స్థితి వచ్చీసిందిట. అత్యవసరంగా దాహం బాధ తీరాలంటే నుయ్యో గొయ్యో తవ్వాలని పెద్దలు తలకట్టేరట. ‘నుయ్యెందుకు పెద్ద చెరువే తవ్వితే పోతుంది కదా..’ అనుకుంటూ ఉప్పర్లను రంగంలోకి దించేరు ఆ పెద్దవారు. గ్రామానికి అభిముఖంగా శ్రీరామపట్నానికి వెళ్లే దారిన ఎకరాలకొద్దీ పడున్న ఖాళీ జాగాలో చెరువు తవ్వకం ఆ రకంగా మొదలైపోయింది. గునపాలు గునగునా పనిచేసేయి. పారలు పరపరా పరుగులు తీసేయి. తట్టలు చకచకా మట్టిని మోసేయి. అలా భూమి లోలోపలికి వెళ్తూ వెళ్తూ చెరువు తవ్వుతున్న కూలీలకి నెలరోజుల తర్వాత ఒక వింత కనిపించింది. గునపం పడిన చోటునుంచి ధారలు ధారలుగా నెత్తురేదో ఎగజిమ్మడం మొదలెట్టింది. వాళ్లు హడలెత్తిపోయేరు. బెంబేలెత్తిపోయేరు. ఎర్రని చిక్కటి ద్రావకం తవ్వుతున్న కొద్దీ బయల్పడుతుండటంతో వాళ్ల కచ్చల్లో కందులు వేగిపోయేయి. వాళ్ల పుచ్చెల్లో పురుగులు పాకిరిపోయేయి. వెనువెంటనే ఊరి పెద్దల కాళ్ల దగ్గరకి  వచ్చిపడ్డారు.

‘‘చెరువు తవ్వితే వస్తే గిస్తే నీళ్లు బయటకి రావాలి. నెత్తురు రావడం ఏంట్రా.’’ అంటూ పెద్దలందరూ చెరువు గట్టుకు చేరేరు. ఈ వింత తెలుసుకుని ఊరి జనాభా కూడా విడ్డూరంగా వారి బాటే పట్టింది. గట్టు మీద ప్రజాళి పేరుకోగా పెద్దల నేతృత్వంలో ఉప్పర్లందరూ ధైర్యాన్ని కూడదీసుకుని మళ్లీ తవ్వకం మొదలెట్టేరు. అయినా అదే స్థితి. లాభం లేదనుకుని పంచాయితీ ప్రెసిడెంట్‌ మంగు సాంబుడు, కరణం వాడ్రేవు వేంకటేశ్వరరావు, పురోహిత శ్రేష్టుడు వారణాసి జగన్నాథశాస్త్రి, జ్యోతిష్యరత్న చుండూరు శ్రీమన్నారాయణ నడుం బిగించేరు. పంచెలు ఎగ్గట్టి, గట్టు దిగ్గొట్టి తవ్వకం జరిగే స్థలానికి చేరారు. ఉప్పర్లు గోలపెడుతున్నదంతా నిజమే. నెత్తురు ఉబికివస్తున్నట్టుగా ఆ ప్రాంతమంతా రుధిరధారలతో చిత్తడినేల అయిపోయింది. చిన్నపాటి రణక్షేత్రంలా అవుపించింది. పెద్దబుర్రలకీ ఇది ఆశ్చర్యమే. కింకర్తవ్యం. ఆలోచనలో పడ్డాయవి. జనాలంతా ఆ బుర్రలచుట్టూ చేరి బుర్రలు గోక్కోడం మొదలెట్టేరు.

ఇంతలోనే వారణాసి జగన్నాథశాస్త్రి కలగజేసున్నారు. ఆ ప్రదేశాన్ని మరింత పరిశీలనగా చూసేరు. తవ్వుతున్న చోట మట్టి పక్కకు తొలగిపోగా బోరుబావి గొట్టంలాంటి పొడవయిన రాతి ఆకృతిని ఆనవాలు కట్టేరు. దాని మీద గునపం పడితేనే ఎర్రెర్రని ప్రవాహమేదో తన్నుకొస్తున్నట్టుగా తీర్మానించేరు. పొడవయిన ఆ రాయి మరింతగా కళ్లకు కట్టేలా ఉప్పర్ల చేత మట్టి తీయించేరు. ఇంకేముంది. నల్లటి తొండంలాంటిదొకటి భారీగా బయటపడింది. వారణాసి పంతులుగారికి ఆలోచన అందినట్టయింది. ఆ తొండం పక్కనున్న మట్టిని తొలగిస్తూ, అది ఎంత దూరం ఉంటే అంత దూరమూ చివర్లంట తవ్వుకు పోవాలన్నారు. ఆ ప్రకారమే చేసేరు ఉప్పర్లు. ఎప్పటికీ దానికో అంతూ దరీ మటుకు కనిపించలేదు.

ఒక్క రోజు కాదు. పదిరోజులు పట్టుగా తవ్వేరు. ఉప్పర్లతో పాటు గ్రామప్రజలూ కలిసేరు. చేతికందిన వస్తువుతో మట్టి తొలగించే పని చేపట్టేరు. దాదాపుగా ఆ వ్యవహారం మైలు దూరం వరకూ సాగిపోయింది. మట్టి తీస్తున్నకొద్దీ రాతిఆకృతి స్పష్టమైన ఏనుగు తొండంలా దర్శనమిచ్చింది. ఆ సమయంలోనే వారి మనస్సుల్లో భక్తి భావనా మొగ్గతొడిగింది. వాళ్ల భక్తిశ్రద్ధలను వీలయినంతగా పెంచి పోషించేరు పంతులుగారు. పదకొండో రోజు ఉదయం గంటపాటు గునపాలు పారలు పనిచేశాక ఛాతీ వరకూ కనిపించే పెద్ద విగ్రహమొకటి పెద్దపెద్ద చెవులతో భూమి లోపలి నుంచి బయటికి పొడుచుకొచ్చింది. ఇంతవరకూ కనిపించిన తొండం ఆ విగ్రహానిదేనని తేలిపోయింది. ఆ విగ్రహంతోనే ఈ తొండం కలిసి ఉందనీ తెలిసిపోయింది. జనం హడావుడి పడిపోయేరు.

అందరూ కొండని తవ్వి ఎలకని పడితే మావాళ్లు చెరువుని తవ్వి ఏనుగుని పట్టేరు. బానయ్య కోనేరు నుంచి నీరు అండాలతో వచ్చిపడింది. విగ్రహాన్ని జగన్నాథశాస్త్రి ఆధ్వర్యంలో బ్రహ్మసమూహం వేదం చదువుతూ కడుక్కొచ్చింది. ఆ కడుగుడు అంతా అయ్యీసరికి ఎల్లరూ విస్మయులయ్యేలా అది పెద్ద గణపతి ప్రతిమగా కళ్లకు కట్టీసింది. ఊరి మీద ప్రేమతో పార్వతీ తనయుడే స్వయంగా వెలిసేడని వారణాసివారు ప్రకటించేరు. బోరవరకూ కనిపించిన దేవుణ్ని అలాగే కొలవాలని, ఇంకా కిందకి తవ్వి ఆయన కింద భాగాన్ని చూడకూడదనీ అనీసేరు. ఆ మాటతో విగ్రహానికి జనం దండాల మీద దండాలు పెట్టడం మొదలెట్టేరు. భక్తిప్రపత్తులతో నృత్యాలు చేయడం ఆరంభించేరు. రంగులు జల్లుకున్నారు. పూలు తెచ్చి పోస్సేరు. కొబ్బరికాయలు పటపటలాడించేరు. పెద్ద కోలాహలమే జరిగింది.

ఆ మీదట, కొమ్ములు తిరిగిన వేదపండితుందరూ పంచాయితీ సావిట్లో కొలువుదీరేరు. కొత్తగా వెలిసిన వినాయకుణ్ని ఏం చేయాలన్న దానిపై చర్చలు జరిపేరు. స్వస్తి వాచకం చదివేరు. పంచాంగాలు చూసేరు. వేళ్లు కదుపుతూ గణనలు కానిచ్చేరు. చివరికి వారంతా చేసిన నిర్ణయాల మేరకు మైలు పొడవున విస్తరించిన తొండాన్ని మళ్లీ భూమిలోకే చేర్చే విధంగా తవ్విన మట్టిని ఉప్పర్లు దాని మీదనే పోసీసేరు. దాన్ని పైకి కనబడకుండా చేసీసేరు. గణనాథుని రూపాన్ని భుజాల వరకూ అగుపించేలా మట్టిపని పూర్తి చేసేరు. చుట్టూ చదును చేస్సేరు. విగ్రహానికి తాటి కమ్మలతో చిన్నపాటి పందిరి కట్టేరు. అందులో నిత్యమూ ధూపదీపనైవేద్యాలు జరిగేలా వారణాసివారు చర్యలు చేపట్టేరు.

తవ్విన ప్రాంతాన్ని పూర్తిగా వదిలిపెట్టి, ఆ తర్వాత కాలాన చెరువు తవ్వకం కొనసాగింది. ఆ చెరువే పెద్దచెరువుగా మావూళ్లో ప్రఖ్యాతమైంది. కాలానుగుణంగా మరికొన్ని కొత్త చెరువులూ ఏర్పడినందువల్ల పాతచెరువుగా జనం నోట మిగిలిపోయింది. స్వయంగా పుట్టిన గణపతి గనక స్వయంభూ విఘ్నేశ్వరస్వామిగా పండితులు మా ఊరి గణపతికి నామకరణం చేసేరు. కొందరు పండితప్రకాండులు మాత్రం, ‘నెత్తురు గణపతి.. అనే పేరు పెటొచ్చుకదా! లేకపోతే నెత్తురయ్య.. అని పిలవొచ్చుకదా!’ అంటూ పిడివాదనకి దిగేరు. అలాంటి పేరు భక్తుల్లో ప్రతికూలభావాలు కలుగజేయవచ్చని మరికొందరు ప్రతివాదనలు పెట్టేరు. తమ మాట నెగ్గించుకున్నారు. దీంతో రుధిర గణపతి, ఎర్రటేనుగు వంటి పేర్లు మా విఘ్నపతిని తాకలేదు.

కానీ, ఈ స్వయంసిద్ధుడు రక్తంతో భూమిలోనుంచి బయటకి వచ్చాడన్న సంగతి తెలిసిన భక్తజనం ఊరుకుంటారా. అందుకేమరి, పల్లెరుగాయలు వెదజల్లే కార్యక్రమానికి తెరతీస్సేరు. వినాయకచవితిరోజున పల్లేరు తెచ్చి గుడికి వెళ్లే దారిలో పారబోయడం మొదలెట్టేరు. ఊరి యువకులకి ఇదంతా బాగానే అంటుకుపోయింది. పాదాలకు పల్లేరు గుచ్చుకుని నెత్తురు కారడాన్ని నాటి నెత్తుటి గణపతి కథకు తెలివిగా జత చేశారెవరో. నమ్మకాలు పెంచి పోషించబడ్డాయి. అప్పటినుంచీ పల్లేరు పాలబడి గణపతి చతుర్థినాడు భక్తులు గిలగిలమంటుండీవారు. ఇదంతా పుణ్యఫలమేనని తీవ్రాతి తీవ్రంగా భావించీవారు. చాలా ఏళ్లు ఈ విధంగా పల్లేరు గుచ్చుళ్లతో చవితి పండగ చోడవరాన అద్భుతమై అలరారింది.

కాలం మెల్లగా మారుతూ వచ్చింది. ఇప్పుడయితే ఆ మార్పులు మరీ వేగంగా జరిగిపోతున్నాయి. ఒకనాడు ఊళ్లోనూ ఊరిబయటా ఎటు చూసినా తోటలూ దొడ్లూ అగుపించీవి. గరువులూ చేలూ కనిపించీవి. పంటలతో పాటు పల్లేరుగాయలూ కావలిసినన్ని దొరికీవి. నేడు రియల్‌ఎస్టేట్‌ వేపారం పొటమరించిపోయింది. ఊళ్లో సిమెంటు కట్టడాలు. ఊరిబయట లే అవుట్లు. పల్లేరుగాయలు ఇంకెలా దొరుకుతాయి. ఇప్పటివేళ చవితి పూట మా వినాయకుడి గుడికి  వెళ్లేవారు నిర్భయంగా పోవొచ్చు. రావొచ్చు. వాళ్ల కాళ్లకి ఒక్కటంటే ఒక్క పల్లేరూ గుచ్చుకోనే గుచ్చుకోదు. దీనికి మేం హామీ. 
పల్లేరుగాయలు పోయినా ఈ కథ నేటికీ మావూరి ప్రజల్లో స్థిరంగా నిలిచి ఉంది. నెత్తురు చిందిన తర్వాతే మా వినాయకుడు పుట్టేడన్న గాథ వారి గుండెల్లో బలంగా దిగబడి ఉంది. పాదాలకు నాటుకున్న పల్లేరును చప్పున తీసీవొచ్చు. మనసుకి నాటుకున్న విశ్వాసాలను తీసీడం అంత సుళువా!   
– చింతకింది శ్రీనివాసరావు

మరిన్ని వార్తలు