-

ఆ మనుషుల్లో మంచితనం...

12 Jul, 2015 01:18 IST|Sakshi
ఆ మనుషుల్లో మంచితనం...

తెలుగునాట సాటిలేని మేటి హాస్యనటుల్లో ఒకరైన అలీ గోదావరి ఒడ్డున ఉన్న రాజమండ్రిలో పుట్టిపెరిగారు. ఆయన బాల్యం అక్కడే గడిచింది. బాల నటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టి, కమేడియన్‌గా, కామెడీ హీరోగా అంచెలంచెలుగా ఎదిగిన ఆయనకు గోదావరితో విడదీయలేని బంధం ఉంది. ఇప్పటికి మూడు పుష్కరాలు చూసిన అలీకి ఇవి నాలుగో పుష్కరాలు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన ‘ఫన్‌డే’తో పంచుకున్న అనుభూతులు ఆయన మాటల్లోనే...
 

మనుషుల్లో మంచితనానికి, పరిసరాల్లో పచ్చదనానికి మారుపేరు గోదావరి తీరం. గోదావరి ఒడ్డునే ఉన్న రాజమండ్రిలో పుట్టిపెరిగాను. నా బాల్యమంతా అక్కడే గడిచింది. చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఇక్కడి పుష్కరాలకు వచ్చేవాణ్ణి. ఇప్పటికి మూడు పుష్కరాలు చూశాను. నాలుగో పుష్కరంలోకి ప్రవేశించాను. రాజమండ్రి, ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న దాదాపు వంద సినిమాల్లో నటించాను. ఉభయ గోదావరి జిల్లాల నుంచి విశాఖ వరకు కలుపుకుంటే ఆ పరిసరాల్లో షూటింగ్ జరుపుకున్న దాదాపు రెండువందల సినిమాల్లో నటించాను.
 
గోదావరి ఒడ్డున షూటింగ్ జరుపుకొనే సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. ఏఎన్నార్‌గారు నటించిన ‘మూగమనసులు’, నా చిన్నతనంలో కృష్ణగారు నటించిన ‘ఊరికి మొనగాడు’, శోభన్‌బాబుగారు నటించిన ‘దేవత’ వంటి సూపర్‌హిట్ సినిమాలు గోదావరి తీరంలో షూటింగ్ జరుపుకొన్నవే. ‘దేవత’లోని ‘ఎల్లువొచ్చి గోదారమ్మ..’ పాట అప్పట్లో సూపర్‌హిట్. సినిమారంగంలో ప్రతి హీరోకి గోదావరితో అనుబంధం ఉంది. గోదావరి ఒడ్డున వందలాది సినిమాలు షూటింగ్ జరుపుకొన్నాయి.

ఒకప్పుడు గ్రామీణ నేపథ్యంలో ఉన్న సినిమాలన్నింటికీ షూటింగ్ కోసం గోదావరి పరిసరాలకే వచ్చేవారు. బాపుగారు, వంశీ, ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకులు గోదావరి తీరంలో చాలా సినిమాలు తీశారు. బడ్జెట్ సమస్యల వల్ల చిన్న సినిమాలు గోదావరి తీరంలో షూటింగ్ జరుపుకోలేకపోతున్నాయి. అయితే, గ్రామీణ నేపథ్యంలో సాగే పెద్ద సినిమాల షూటింగ్‌లన్నీ ఇప్పటికీ గోదావరి తీరంలోనే జరుగుతున్నాయి.
 
పుష్కరాలంటే పెద్దసంఖ్యలో జనాలు ఇక్కడకు వస్తారు. ఇక్కడకు వచ్చే జనాలకు తగినట్లుగా ప్రభుత్వం ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి. ఇక్కడకు వచ్చే యాత్రికులు శుభ్రతపై శ్రద్ధ చూపితే కాలుష్యం జరగకుండా ఉంటుంది. అలాగే స్థానికులు కూడా సహకరించాలి. లేకుంటే, పుష్కరాల తర్వాత వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పుష్కరాలకు వచ్చే జనాలు పరిసరాల శుభ్రతపై దృష్టి పెడితే బాగుంటుంది. ప్రభుత్వం కూడా వారి కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది.    
     
అదే... నేటి సఖినేటిపల్లి!
శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతా లక్ష్మణ సమేతంగా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామిని అర్చించుకుని, వశిష్ట మహాముని ఆశీస్సులు పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అక్కడి నుంచి శ్రీరాముడు సీతా సమేతంగా గోదావరిని దాటి అవతలి పల్లెకు చేరే సమయానికి చీకటి పడింది. ఇక ఆ రాత్రికి అక్కడే బస చేయాలనుకున్న రాముడు ‘సఖీ! నేటికీ పల్లె’ అన్నాడట. అదే కాలక్రమంలో ‘సఖినేటిపల్లి’గా రూపాంతరం చెందినట్లు స్థానికులు చెబుతారు.

మరిన్ని వార్తలు