కామెడీ హీరోలు..!

7 Sep, 2014 00:30 IST|Sakshi

పంచామృతం: విదూషకుడు బావిలో పడ్డట్టు.. అనేది నానుడి. తెరపై కమెడియన్లు పడే పాట్లు కూడా నవ్విస్తాయి. అందరినీ ఆనందంలో ముంచెత్తుతాయి. అయితే అలాంటి విదూషకులు నిజజీవితంలో పడే పాట్లు మాత్రం బాధను మిగులుస్తాయి. మనల్ని నవ్వించేది వాళ్లే ఏడిపించేదీ వాళ్లే. ఇటీవలే రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య చాలా మందిని బాధపెట్టింది. రాబిన్ మాత్రమే కాదు.. హాలీవుడ్‌లో కమెడియన్లుగా పేరు పొందిన అనేక మంది మానసికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. అయితే వాళ్లు ధైర్యంగా నిలబడ్డారు.. హీరోల్లా నిలిచారు!
 
 చార్లీ చాప్లిన్
 సెలైంట్ ఎరా సినిమా.. మాటల్లేని రోజుల్లో కూడా నవ్వించిందంటే అందుకు చార్లీ చాప్లిన్ హావభావాలే మూలం. బాధాకరంగా గడిచిన బాల్యం, ప్రేమ, వైవాహిక జీవితాల్లో పడ్డ ఇబ్బందులు.. ఇవన్నీ చాప్లిన్‌ను డిప్రెషన్‌లోకి తీసుకెళ్లాయి. ఆయనను కుంగుబాటు బాధితుడిగా మార్చాయి. అయితే చాప్లిన్ వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు.
 
 జిమ్ క్యారీ
హాస్యాన్ని అభినయించగల వాళ్లే అసలైన హీరోలు. హాలీవుడ్‌లోనైనా ఇది వర్తిస్తుంది. అందుకు జిమ్ క్యారీనే రుజువు. హాలీవుడ్‌లోని స్టార్‌లలో ఒకరిగా నిలదొక్కుకొన్న ఈ కెనడియన్ సంతతి వ్యక్తిని గతానుభవాలు ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయట. ఈయన కూడా డిప్రెషన్ బాధితుడే. సినిమాల్లో నిలదొక్కుకోక ముందు జిమ్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశాడు. అప్పుడు మొదలైన మానసిక ఒత్తిడి జిమ్‌పై ఇప్పటికీ కొనసాగుతోందని వైద్యులు చెబుతున్నారు. అయితే జిమ్ మాత్రం అలాంటి ఒత్తిడిని తేలికగా తీసుకొని ముందుకు సాగుతున్నాడు.
 
 బెన్ స్టిల్లర్
 అమెరికా, కెనడాల్లో స్టార్ ఇమేజ్. డబ్బుకు కూడా లోటు లేదు. వారసులు కూడా సినిమా రంగంలోనే స్థిరపడ్డారు. అయితే జన్యుపరంగా, వారసత్వంగా వచ్చిన డిప్రెషన్ మాత్రం ఈ స్టార్ యాక్టర్‌ను ఇబ్బంది పెడుతోంది. సినిమాలతో బిజీ అయిపోవడమే అందుకు విరుగుడుగా భావిస్తున్నాడు ఈ నటుడు.
 
 

ఒవెన్ విల్సన్
ఎనిమిదేళ్ల కిందటే ఈయన ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తూ బయటపడ్డాడు. ఒవెన్ విల్సన్ తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడనీ, ఆ ఒత్తిడే ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పిందనీ వైద్యులు పేర్కొన్నారు. తన రచనతో కూడా హాస్యాన్ని పండించిన ఈ విదూషకుడిపై అనేక సంఘటనలు ఒత్తిడి పెంచాయనీ,  కుంగుబాటును కలిగించాయనీ తెలుస్తోంది. అయితే ఈయన క్రమంగా స్థిమితపడ్డాడు. ఆత్మహత్యాయత్నపు అనంతర జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో లీడ్ చేస్తున్నాడు.
 
 రస్సెల్ బ్రాండ్
 బై పోలార్ డిజార్డర్ బాధితుడీయన. దాని ప్రభావంతో చాలా ఇబ్బందులే పడుతున్నాడు. ఒక దశలో డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తున్నప్పుడే అరెస్టయ్యాడు. అయితే తర్వాత పరివర్తన చెందాడు. కానీ ఇప్పటికీ కుంగుబాటు బాధితుడుగానే ఉన్నాడు. అయినా సినిమాల్లో, టీవీల్లో విదూషక పాత్రలో రాణిస్తున్నాడు.

మరిన్ని వార్తలు