పెద్ద ఆకారాలూ చిన్న వికారాలూ

17 Jan, 2016 00:15 IST|Sakshi
పెద్ద ఆకారాలూ చిన్న వికారాలూ

 కామెడీ కథ
 చిన్నప్పట్నుంచీ నాకు బల్లి అంటే చెప్ప డానికి వీల్లేనంత భయం. దాని ఆకారం చూస్తే పరమ అసహ్యం. కొందరికి ఇదే విధంగా కప్పన్నా, ఉడతన్నా, బొజ్జెంకన్నా, తొండన్నా భయమూ - అసహ్యమూ కలగడం కద్దు. కాని ఒకరి భయాన్నీ, అసహ్యాన్నీ మరొకరు అర్థం చేసుకోవడానికే ప్రయత్నించకపోగా విడ్డూరంగా చూస్తారు. కొందరికి బల్లి అంటే భయం లేదు గనక ఎదుటివాళ్లు బల్లిని చూసి భయపడుతున్నారని తెలిస్తే తాటాకులు కట్టి ఏడిపించి ఎగతాళి చేసి గోల చేస్తారు. యిందుకే పిల్లికి చెలగాటం ఎలక్కు ప్రాణ సంకటం అన్నారు.

 ఈ ప్రాణసంకటంతో బాధపడే ఎలుకల్లో నేనొకదాన్ని. బల్లి నాకు పరమ శత్రువు. అది వుంటే గదిలో కాలు పెట్టను ఒకవేళ అంతగా ఆ గదిలోకి వెళ్లాల్సొస్తే పనివాళ్లను పిలిచి ఆ బల్లిని బయటికి తరిమించి అది వెళ్లిపోయిందో లేదో జాగ్రత్తగా చూసి మరీ లోపలడుగు బెడతాను. విధిలేని సందర్భాల్లో పులి బోనులో తల దూర్చినట్లు భయపడుతూ, లోపలికెళ్లి అది వున్న వేపు వెళ్లకుండా అది ఏవైపు తిరుగుతుంటుందో చూసుకుంటూ, అదీ నేనూ రాహుకేతువుల్లాగా ఎదురు బదురుగా తిరుగుతుంటాం.

 ఎంత దూరంలో వున్నాసరే దాని కదలిక నా కండ్లు కట్టేస్తుంది. అది కాస్త జరిగితే నాకు తెలీకుండానే నా శరీరం ఆటోమేటిగ్గా యింకో వైపు జరుగుతుంది. కాని యింత కాన్‌సన్‌ట్రేషన్ దానిమీద వుంచినా, నా అవస్థ ఎదుటివాళ్లు పసిగట్ట కుండా తంటాలు పడుతుంటాను.  ఓసారి క్లాసులో ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్య సాహసాలను వర్ణించి చెబుతోంది మా మేష్టరమ్మ.  ‘సడన్’గా నా ముందున్న బల్ల కింద బల్లి కదులు తున్నట్లు అనుమానం కలిగింది. నా గుండె గతుక్కుమంది. ఇంక అక్కడ క్షణం కూడా కూర్చోలేక ముళ్ల మీదున్నట్లు బాధ పడ్డాను.

 భయంతో వణుకుతున్న నేను మేష్టరమ్మ చూడకుండా పక్క పక్కలకు జరగడం నా వరసలో కూర్చున్న పిల్లలు పసిగట్టేశారు. ‘‘బల్లేమైనా కనిపించిందా!’’ అని రహస్యంగా అడిగి మెల్లిగా నవ్వు కున్నారు. నేను కూర్చున్న వరసలో కలకలం బయల్దేరడం మేష్టరమ్మ కంటబడ్డది. ‘‘ఏమిటది! పాఠం వినకుండా ‘న్యూసెన్స్’ చేస్తున్నారు!’’ అంటూ కోప్పడ్డది. వెంటనే నా వరసలోవున్న ఒకమ్మాయి లేచి నిలబడి ‘‘మరే... మరే... మేష్టరమ్మ గారండీ... మరే మరుండ్లా...’’

 ‘‘ఇంక చాలు. కూర్చో’’ అంటూ కసిరింది మేష్టరమ్మ. నే చెప్తానంటూ యింకో అమ్మాయి లేచింది. ‘‘అసలే... మేష్టరమ్మ గారండీ... అసలుండ్లా... అసలామ్మాయికే... అసలూ...’’‘‘ఆపు.. నీ అసలూ పెసలూ’’ కోపంతో అరిచింది మేష్టరమ్మ. క్లాసంతా ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయింది. కాళ్లకు వేసుకున్న ‘హై హీల్స్’ చెప్పులు టక్‌టక్ మనిపించుకుంటూ పెద్ద రథంలా ఒచ్చి మా ముందు నిలబడ్డది మేష్టరమ్మ. పిల్లలంతా బిగుసుకు పోయారు. నేను గుటకలు మింగడం మొదలెట్టాను. ‘‘ఎందుకు భయపడ్డావ్! ఏం జరిగింది చెప్పు’’ అంటూ కోపంగా వున్న మేష్టరమ్మ నా బెత్తంతో ముందున్న బల్లమీద గట్టిగా బాదింది.

 ఆ దెబ్బకు చెంగున మేష్టరమ్మ మీదికి దూకింది... అంతవరకూ నేను బల్లి అనుకుని భయపడ్డ కప్ప. మేష్టరమ్మ కెవ్వున కేకేసి భయంతోనూ, అసహ్యం తోనూ కేర్‌బార్‌మంటూ గెంతడం మొదలెట్టింది. పిల్లలందరం నవ్వు బిగబట్టుకోలేక చచ్చాం. కప్ప ఒక్కసారి హై జంప్ చేసి తపక్కున మేష్టరమ్మ తలమీదికెళ్లి చతికిలపడ్డది.
 ‘‘అమ్మో’’ అంటూ మళ్లీ ఒక్క పొలికేక పెట్టి, కంపరంతో ఎగరడం మొదలెట్టింది మేష్టరమ్మ. ఆ ఎగరడంలో ‘బేలెన్స్’తప్పి మేష్టరమ్మ తపక్కున కిందపడ్డది.

 మేష్టరమ్మను కిందపడేసిన కప్ప ఒక్క గంతులో వెళ్లి మేష్టరమ్మ కుర్చీలో కూల బడ్డది. కిందబడ్డ మేష్టరమ్మ కాలు బెణికి లేవలేకపోయింది. క్లాసులో వున్న పిల్లలందరం సాయంపట్టి లేవదీశాం. ఒకళ్లిద్దరు లేవదీసే శరీరం కాదు మేష్టరమ్మది. నవ్వు ఆపుకోడానికి అవస్థ పడుతున్న మా పిల్ల కోతుల ముఖాలు చూసి కప్పగంతుల్తో అలసిపోయి, ముచ్చెమటలు పట్టిన మేష్టరమ్మ ఒకింత సిగ్గుపడ్డది. మరుక్షణం తన సీట్లో కూర్చున్న కప్పను చూసి త్రుళ్లిపడి ‘‘ఛాఛాఛా... చూస్తారేం! నా సీట్లోనించి తీసేయండా డర్టీ క్రీచర్ని!’’ అంటూ కంపరంతో ఒళ్లు విదిలించుకుంది.

 మేష్టరమ్మ కప్ప దగ్గరకెళ్లడానికి భయ పడుతున్న పిల్లలంతా ఒకళ్ల ముఖాలు యింకోళ్లు చూసుకుంటూ నిలబడ్డారు. కప్పంటే భయంలేని నేను వెళ్లి కప్పను పెన్సిల్‌తో బయటికి నెట్టేశాను. మేష్టరమ్మ నన్ను చూసి ఆశ్చర్యంతో, ‘‘నీకు కప్పంటే భయంలేదూ’’ అన్నది. ‘లే’దన్నాను. ‘‘మరెందుకు యిందాక భయపడి పక్కకు జరిగావు’’ అని అడిగింది. ‘‘అదీ.. అదీ.. మేష్టరమ్మ గారండీ, అదుండ్లా అమ్మాయికీ... అదే...’’ ఆ ‘అది’ చెప్పేలోగా నేనే చెప్పేశాను బల్లి అనుకుని భయపడ్డానని.

 ‘‘వాట్! నీకు బల్లిని చూస్తే భయమా!’’ అన్నది మేష్టరమ్మ నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతూ.
 ‘‘మీకు కప్పంటే ఎంత బయ్యమో అంత బయ్యం అమ్మాయికి బల్లంటే...’’ అంది ఓ పిల్ల.
 ‘‘నాన్సెన్స్... బల్లిని చూసి భయపట్టం మీనింగ్‌లెస్. పాపం అది మోస్ట్ హారమ్‌లెస్ క్రీచర్. యింకా కప్పంటే భయపట్టంలో అర్థం వుంది’’ అంటూ కుంటుతున్న మేష్టరమ్మ వెళ్లి కప్ప వెళ్లిపోయిందో లేదో జాగ్రత్తగా పరిశీలించి మరీ కుర్చీ ఆక్రమించుకుంది.

మళ్లీ పాఠం చెప్పడానికి పుస్తకం తీసింది. కాని దృష్టి పుస్తకం మీద నిలవలేదు. తన చుట్టు పక్కలేవుంది చూపంతా. మళ్లీ ఆ కప్ప ఎక్కడ ఎగిరొచ్చి మీదపడుతుందోనన్న భయంతో పాఠం ముందుకు సాగలేదు. ఏ చిన్న కాగితం కదిలినా మేష్టరమ్మ అదిరి పడి పుస్తకం కింద పడెయ్యడం చూసి నవ్వు ఆపుకోలేక సమతమమయ్యాం. యింక లాభం లేదని గ్రహించిన మేష్టరమ్మ తన కాలు నొప్పి సాకుతో మమ్మల్ని యిండ్లకు పంపించే సింది.

 యింట్లో ఈ సంగతి విన్న నాన్న ‘‘ఛాఛా కప్పకు భయపడే టీచరు మీకేం చదువు చెప్తుంది. యింక నువ్వా స్కూలుకు వెళ్లనవసరంలా..’’ అని మర్నాడే నన్ను తీసుకెళ్లి అన్నయ్య వాళ్లు చదివిన ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాడు.  ఆడ పిల్లలూ, మగపిల్లలూ కలిసి చదివే ఆ స్కూలు వాతావరణం అలవాటైందాకా అవస్థపడ్డాను. మేరుపర్వతం లాంటి మా మేష్టరమ్మను చూసివున్న నా కండ్లకు తిరగలి పిడిలాగా వున్న మా కొత్త మేష్టరు నలుసులా కనిపించాడు.

 ఆ స్కూల్లో చేరిన కొత్తల్లో ఒకరోజు మా క్లాసుకు హెడ్‌మాస్టరొచ్చాడు. ఏనుగు పక్కన ఎర్రచీమలాగా కనిపించాడు హెడ్ మాస్టర్ పక్కన మా మాస్టరు. యిద్దరూ కొత్తగా చేరిన పిల్లల చదువు విషయం ఏదో మాట్లాడుతూ మా ముందుకొచ్చారు. అంతకుముందు చాలాసేపట్నుంచీ ఒక కుర్రాడు తన నిక్కరు జేబులోంచి బటానీలు తీసి తన చొక్కా జేబులో ఒక్కొక్కటీ వేస్తున్నాడు. హెడ్‌మాస్టరు దగ్గరికి రావడం చూసి బిగుసుకుపోయి నిలబడ్డాడు. ఆ కుర్రాడి చొక్కా జేబులో ఏదో కదలడం మాతోబాటు హెడ్‌మాస్టరు కంట కూడా పడ్డది.

 ‘‘ఏమిట్రా అదీ! నీ చొక్కా జేబులో ఏమిటి కదుల్తోంది’’ అంటూ హెడ్‌మాస్టర్ గర్జించాడు. ఆ కుర్రాడు ఉలిక్కిపడ్డాడు. తక్షణం లాంగ్‌జంప్ చేసి చెంగున హెడ్ మాస్టర్ మీదికి దూకింది, అంతవరకూ ఆ కుర్రాడి జేబులో బటానీలు తిన్న ఉడత పిల్ల. హెడ్‌మాస్టర్ ఒక్క వెర్రికేక పెట్టి పక్క నున్న మా తిరగలి పిడి మాస్టర్ను అమాం తంగా వాటేసుకున్నాడు. అంతవరకూ హెడ్‌మాస్టర్ ఒంటిమీద చెడా మడా ఎగిరి గంతులేసిన ఉడతపిల్ల టింగురంగా అంటూ హెడ్ మాస్టర్ బట్టతల మీదికెగిరి కూర్చుని గీకడం మొదలెట్టింది. యింక పిచ్చెత్తినట్టు కేకలు పెడుతూ, మా మాస్టర్ను పట్టుకుని కుప్పిగంతులెయ్యడం మొదలెట్టారు హెడ్‌మాస్టర్.

 అంతవరకూ గుడ్లప్పజెప్పి మాస్లర్ల దురవస్థ చూస్తూ నిలబడ్డ మా క్లాసు పిల్లల్లో ఒక పిల్లాడు ధైర్యం చేసి ముందు కొచ్చి, హెడ్ మాస్టరు తల గోకుతూ కూర్చున్న ఉడత పిల్లను పట్టి తీసేశాడు. ఆయాస పడుతూ బీభత్సంగా చెమటలు కక్కుతున్న హెడ్ మాస్టర్... పక్కకు తిరిగి నవ్వు ఆపుకోడానికి ప్రయత్నిస్తున్న పిల్లలందర్నీ చూసి అవమానంతోనూ, కోపంతోనూ ‘ఫూల్స్, యిడియట్స్, స్టుపిడ్స్... బుద్ధి ఉండక్కర్లా, ఉడతల్ని తెస్తారా క్లాసుకు? ఇకమీద ఎవరైనా ఉడతల్ని తెస్తే డిస్మిస్’’ అని మడిపడుతూ వెళ్లిపోయాడు.

 తర్వాత మా మాస్టరే చెప్పాడు... హెడ్‌మాస్టర్‌కు ఉడతంటే చచ్చేంత భయం అనీ, స్కూల్లో ఉడత లెక్కువగా ఉన్నాయనే భయంతో ఉడతల్ని పట్టేవాళ్లను పిలిపించి తన రూము చుట్టూ అంగరక్షకుల్లాగా ఉంచాడనీ. ఇక హెడ్ మాస్టర్ ని కట్టేశారు మా క్లాసు పిల్లలు. ఆయన పోతుంటే దూరాన్నుంచే ‘ఉడతా ఉడతా ఊచ్... సన్నబియ్యం సాచ్’ అంటూ గోల చేసేవాళ్లు.  కాని హెడ్ మాస్టర్ నాకంటే ఒక విధంగా అదృష్టవంతుడు. ఉడతలు ఇంట్లో మకాం పెట్టవు.

వాటిలాగే ఈ బల్లులు కూడా ఏ అరణ్యాల్లోనో ఉండ కుండా మనుషుల్తో బాటు యిండ్లలో వుంటూ అన్ని గదుల్లోనూ నిర్భయంగా తిరగడమే నా ప్రాణానికి సంకటంగా తయారయ్యింది. నేను పగలంతా బల్లుల్ని వేటాడితే, బల్లులు రాత్రుళ్లు కల్లో నన్ను వేటాడేవి. మనిషి సైజు బల్లులు... నన్ను కొరకొరా చూసేవి. తిట్టేవి. ఎగతాళిగా నవ్వుతూ వెక్కిరించేవి. చివరకు కోపంతో నామీద దూకడానికి ప్రయత్నించినప్పుడు కెవ్వుమని అరిచేదాన్ని. ఇంటిల్లిపాదీ నిద్ర లేవడమే కాకుండా ఇరుగు పొరుగువాండ్లు కూడా లేచి లైట్లేసుకుని పరుగెత్తుకొచ్చే వాళ్లు, మా ఇంట్లో దొంగలు పడ్డారేమో నని. అసలు సంగతి అమ్మా నాన్నా చెప్ప గానే నవ్వుకుంటూ వెళ్లిపోయేవాళ్లు. ఇంక ఆ రాత్రి నాకు నిద్ర పట్టేది కాదు.

 పెద్దయ్యాను. పెళ్లయ్యింది. పిల్లవాడు కూడా పుట్టాడు. కానీ నా బల్లి భయం మాత్రం పోలేదు. ఒకరోజు పూజకు కూర్చున్నాను. ఎప్పుడు చేరిందో నాకెదురుగావున్న గోడమీద బల్లి... గుండె జల్లుమంది. పూజ సింపుల్‌గా చేసి, మా అత్తగారు ఆరగింపు తెచ్చేలోగానే బయట పడ్డాను. మర్నాడు ప్రొద్దుటే పూజగది కొచ్చి ఒకసారి నాలుగు వైపులా చూశాను. బల్లి కనిపించలేదు. నిర్భయంగా పూజకు కూర్చున్నాను. గణపతికో టెంకాయ కొట్టి, అమ్మవారికి ఆరగింపు పెట్టి, కుంకుమా ర్చనకు కూర్చున్నాను.

మీనాక్షి అమ్మవారికి కట్టిన పట్టు పావడాలోంచి తొంగి చూసింది బల్లి. పీటతో సహా ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌లో జర్రున వెనక్కి వెళ్లి మా అత్తగారి మీద పడ్డాను. మా అత్తగారు భయంతో వణుకుతున్న నా భుజాలు పట్టి కుదిపారు. బల్లిని చూపించాను. ‘ఓసి నీ యింట వాన గురవా... బల్లిని చూశా ఇంతచేటు భయ పడ్డావ్’ అంటూ పడీ పడీ నవ్వారు అత్త గారు. ఈలోపుగా ఆఫీసుకు బయల్దేరిన మావారు దేవుడికి నమస్కరించుకోడాని కొచ్చారు. ‘వెంకటేశ్వరా... బల్లులు రాకుండా చేసే శక్తి మీ భార్యల దగ్గర లేదని తేలిపోయింది.

 మీరైనా ఈ బల్లుల్ని ఈ గదికి రాకుండా చూస్తేనే మీ భార్యలకు ఎప్పుడైనా ఓ టెంకాయ చిప్ప దొరుకు తుంది. లేదంటే పూజగది బంద్’ అంటూ నన్ను కాసేపు ఏడిపించి, బల్లిని తరిమేసి ఆఫీసుకెళ్లిపోయారు.  ‘ఓసి నీ భయం బంగారంగానూ’’ అంటూ మళ్లీ నవ్వారు మా అత్తగారు. అంతలో ఏ మూల నుంచో ‘మ్యావ్’ అని సన్నగా వినిపించింది. మా అత్తగారి నవ్వు ఆగిపోయింది. ఉన్నట్టుండి ఎందుకంత సీరియస్‌గా మారిపోయిందో నాకర్థం కాలేదు. కిచకిచమంటూ అటక మీద శబ్దం వినిపించింది. మరుక్షణం రెడు ఎలుకలు కిందికి దూకాయి. వాటి వెనకాలే వో గండుపిల్లి మా అత్తగారి ముందుకు దూకింది.

‘వోయమ్మ, చచ్చానేవ్’ అంటూ వెర్రికేక పెట్టి అమాంతంగా వచ్చి నామీద పడ్డది భయంతో. ఆవిడకు పిల్లంటే అంత భయమని నాకంతవరకూ తెలీదు.  నేను బల్లిని చూసినరోజు ఏదో ఒక హడావిడి జరిగి పనికి బ్రేక్ పడేది. ఒక సారి రికార్డింగ్ జరుగుతోంది. మైక్ ముందు పాడుతున్నాను. ఎప్పుడొచ్చిందో, ఎట్లా వచ్చిందో మైక్ వెనక నుంచి తొంగి చూసింది బల్లి. నా గొంతు భయంతో బిగుసుకుపోయి ‘కీక్’ అనటం విన్న సౌండ్ ఇంజినీరు కట్ కట్ అంటూ గోలెత్తాడు. ప్రాణం అరచేతిలో పెట్టుకుని ఒక్క దూకులో బయటపడ్డాను. ‘ఏమిటి బల్లేనా’ అంటూ వచ్చారు మావారు. ఈ లోగా ఆర్కెస్ట్రా వాళ్లంతా చుట్టూ చేరారు.

 చెప్పొద్దని కళ్లతో బతిమాలుకున్నాను మావార్ని. అబ్బే... ధర్మరాజును చంపి పుట్టారు మావారు. అబద్ధం చెప్పరు. నిజం చెప్పారు. అంతా ఒక్కసారి గొల్లున నవ్వారు. నా ప్రాణం చచ్చిపోయింది. మా సౌండ్ ఇంజినీరు మైక్ దగ్గరికెళ్లి కర్చీఫ్‌తో మైక్ మీద మన్ను దులిపాడు. తక్షణం జటాయువులాంటి రెక్కల్తో ఏరోప్లేన్‌లాగా ఎగిరి ఆయన రెండెకరాల నుదురు మీద సేఫ్‌గా లేండ్ అయింది ఓ బొజ్జెంక. కెవ్వున కేసేసి మెలికలు తిరిగి వెల్లకిలా పడ్డాడు సౌండ్ ఇంజినీరు. చటుక్కున మావారు కర్చీఫ్‌తో సౌండ్ ఇంజినీరు నుదురును ఎద్దులా దున్నుతున్న ఆ బొజ్జెంకను తరిమేశారు.

 నవ్వు ఆపుకోలేక ఆర్కెస్ట్రా వాళ్లంతా బయటికి పరుగెత్తారు. తర్వాత తెలిసింది... సౌండ్ ఇంజినీరుకు బొజ్జెంకంటే చచ్చేంత భయం ఒకసారి ఎవరిదో పిక్చరు షూటిం గుకు వెళ్లాను. అది ఒక బ్రహ్మాండమైన అరణ్యం సెట్టు. ఓ పాడుబడ్డ దేవాలయ మంటపం, దాని చుట్టూ అరణ్యం. ఆ సంవత్సరం తయారయిన అన్ని పిక్చర్లలోనూ అరణ్య రోదన ఘట్టాలన్నీ అక్కడే తీశారు. అది ఇంకా కొంతకాలం ఉంటే దాని ప్రతిభ స్థల పురాణంలో కెక్కేదే. కాని పాములు, తేళ్లు, ఎలకలు, పందికొక్కులు యిత్యాది అడవిమృగాలు చేరుతున్నాయని, ఇంకొన్నాళ్లు ఉంచితే పులులు, సింహాలు కూడా చేరవచ్చని భయపడ్డ స్టూడియో యజమాని సెట్టు పీకేయించాడు. అది తీసేముందు నేనూ వెళ్లాను.

ఆరోజు నాతోబాటు నా ఇష్టసఖి పాత్రధారి కూడా ఉంది. దేవాలయ మంటపంలో మొదటి షాటు. నా ఇష్టసఖి మేకప్ సరిచేసుకుంటుంటే మామూలు ప్రకారం నా కండ్లు మంటపం స్తంభాల మీదికెళ్లాయి. ఏదో పురుక్కోసం చరచర వస్తోంది నేనున్న వైపునకే పెద్ద బల్లి. ఒక్క దూకులో వచ్చి అరణ్యంలో పడ్డాను. ‘పాము ఏమో’ అంటూ అంతా మంటపం లోకి పరుగెత్తారు. ‘పామును చూశారా, ఏవైపు వెళ్లింది’ అంటూ ఇష్టసఖి ఆతృతగా అడిగింది. అటూ ఇటూ చూసి, ‘పాము కాదు బల్లి’ అన్నాను. గొల్లుమని నవ్వింది.

అంతా పరిగెత్తుకు వచ్చారు. మూతి ముడుచుకున్న డెరైక్టర్ ‘అదేం చేస్తుందమ్మా, మోస్ట్ హామ్‌లెస్ క్రీచర్’ అంటూ దాన్ని అరణ్యంలోకి తరిమారు.‘రెడీ స్టార్ట్’ అంటూ కేకేశాడు డెరైక్టర్. కష్టాల్లో ఉన్న నాకు నా ఇష్టసఖి ధైర్యం చెప్పే షాట్. డైలాగ్ మొదలెట్టింది. ‘అమ్మా... అధైర్య పడకండి. మీకు అండగా నేను’... డైలాగ్ పూర్తి కాలేదు. ఉన్నట్టుండి ఓ పోతులాంటి తొండ ఒక్క దూకు దూకి నా ఇష్టసఖి జడ పట్టుకుంది. ఒక్క గావుకేక పెట్టి, భయంతో వచ్చి నన్ను కావలించుకోబోయిందామె.

బల్లి గాభరాలో వున్న నేను తుళ్లిపడి వెనక్కి జరిగాను. భయంతోనూ, అసహ్యంతోనూ చెమటలు కక్కుతోన్న నా ఇష్టసఖి రెండు చేతులూ బారజాపి, వెర్రి కేకలు పెట్టి, అరుస్తూ ఏడవసాగింది. ఇంకోవైపు కూతురు అవస్థకు ఏడుపులూ పెడబొబ్బలూ పెడుతూ ఎగుర్తోంది నా ఇష్టసఖి తల్లి. డెరైక్టరు జడనొకసారి విదిలించాడు. తొండ వదల్లా. కర్రతో అదిలించాడు కదల్లా. ‘జడ కత్తిరించాల్సిందే’ అన్నాడు అసిస్టెంట్ డెరైక్టర్ అతివాగుడు అవతారం.
 నాకు చటుక్కున స్ఫురణకొచ్చింది. ‘ఆ అమ్మాయి జడమీద పూలకు బదులుగా పెట్టుకున్న సీతాకోక చిలకను తీసిపారేయండి’ అన్నాను. వెంటనే దాన్ని లాగి పారేశాడు ైడెరైక్టర్. దాంతో పాటే జడ వదలిపెట్టి కిందికి దూకింది తొండ. అందరూ నావైపు ఆశ్చర్యంగా చూశారు.

 అరిచి, ఏడ్చి అలసిపోయిన నా ఇష్టసఖి నన్నొచ్చి గట్టిగా కావలించుకొంది. వాళ్లమ్మ కూడా ‘నా బిడ్డను కాపాడావు తల్లీ, దానికి తొండను చూస్తే చచ్చేంత భయం’ అంటూ నా చేతులు రెండూ కండ్లకద్దుకుంది. నా ఇష్టసఖి రెస్టు కోరడం వల్ల నా సలహా మీద ఆరోజు షూటింగ్ కేన్సిల్ చేశారు. ఇంటికి బయలుదేరుతున్న నా దగ్గరికి ఇష్టసఖి పరుగెత్తుకొచ్చింది. ‘క్షమించండి. బల్లి భయంతో పరుగెత్తిన మిమ్మల్ని చూసి నవ్వినందుకు వెంటనే తగిన శాస్తి చేశాడు దేవుడు. భయంతో చచ్చిపోవాల్సిన నన్ను బ్రతికించారు’ అంటూ ఎంతో కృతజ్ఞతతో నమస్కరించి వెళ్లిపోయింది. బల్లి అంటే భయంతో గజగజలాడే నేను, తొండంటే భయపడే మరొక ప్రాణిని రక్షించగలిగానా? నాలో నేనే నవ్వుకున్నాను.
  భానుమతీ రామకృష్ణ
 

మరిన్ని వార్తలు