ఆత్మకథ; చదువుకోండి, నేర్చుకోండి, ఆచరించండి!

18 Aug, 2019 11:48 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

‘నేషనల్‌ కాలేజీ ఆఫ్‌ దొంగల్స్‌’ వార్షికోత్సవాలు బిహార్‌లోని చోర్‌పల్లిలో జరుగుచున్నవి.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కర్నాటకకు చెందిన అతి సీనియర్‌ దొంగ చోరప్పను ప్రత్యేకంగా ఆహ్వానించింది కాలేజీ కమిటీ.
 దేశంలోని అన్ని జిల్లాల దొంగ విద్యార్థులు హాజరయ్యారు.
చోరప్పతో విద్యార్థులకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
‘‘తాతా సార్‌! మీ వృత్తి జీవితం సాఫీగానే సాగిందా? ఒడిదుడుకులు  ఏమైనా ఫేస్‌ చేశారా?’’ సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన విద్యార్థి అడిగాడు. ఇతడు డి.సి(దొంగల కోర్సు) సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు.
‘‘ఏదీ తనంత తాను నీ దరికి రాదు. శోధించి అడ్రసులు సాధించాలి... ఆ పై కన్నాలు వేయాలి.  ఇంత పేరు మోసిన దొంగనైనప్పటికీ కెరీర్‌ మొదట్లో ఎన్నో స్ట్రగుల్స్‌ ఫేస్‌ చేశాను. నా పదహారవ ఏట మా నాన్నగారు మంచి ముహుర్తం చూసి ‘దొంగేట్రం’ ఏర్పాటు చేశారు. నాట్యకారులకు ‘అరంగేట్రం’ ఎలాగో మన దొంగలకు ‘దొంగేట్రం’ అలాగన్నమాట!

సరిగ్గా ఆరోజే నాకు జలుబు చేసింది.
‘జలుబు తగ్గాక దొంగేట్రం చేస్తాను నాన్నగారు’ అన్నాను.
ఆయన కోపంతో అంతెత్తున లేచారు.
‘నువ్వు నా బిడ్డవు. అంటే షేర్‌. ఆఫ్ట్రాల్‌ జలుబు ఈ షేర్‌ను ఏంచేస్తుంది!’’ అని గ్యాస్‌ కొట్టారు.
నేను ఆ గ్యాస్‌కు తబ్బిబ్బైపోయి రంగంలోకి దిగాను.
ఒక మాంచి ఇల్లు చూసుకొని దూరిపోయాను. ఇంటిల్లిపాది గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. ఏ మూల ఏ వస్తువు ఉందో అని వెదుకుతున్నాను. నాకు డస్ట్‌ ఎలర్జీ... దీనికి తోడు జలుబు... హాచ్‌... హాచ్‌... హాచ్‌ అని గట్టిగా తుమ్మాను.
నా తుమ్ముల దెబ్బకు ఇంటిల్లిపాది లేచారు.
‘‘ఎవరు నువ్వు?’’ అని అడిగారు.

టెన్షన్‌తో తుమ్ము వచ్చింది.
‘హాచ్‌’ అని తుమ్మాను.
‘‘కొంపదీసి దొంగవైతే కాదు కదా?’’ అని అడిగారు.
టెన్షన్‌ మరీ ఎక్కువై...‘హాచ్‌ హాచ్‌’ అంటూ అంతులేని తుమ్ములు తుమ్మాను.
‘వామ్మో... తుమ్ము దొంగ’ అని నన్ను చుట్టుముట్టారు.
‘ఇంకా దోచుకోలేదు’ అని ప్రాధేయపడినా వినకుండా నా షర్ట్‌ జేబులో, ప్యాంట్‌ జేబుల్లో వెదకడం మొదలుపెట్టారు. షర్ట్‌ జేబులో చెయ్యి పెట్టినంత వరకూ ఏమీ కాలేదు. ఎప్పుడైతే...ప్యాంట్‌ జేబులో నుంచి కర్చీఫ్‌ తీశారో... అప్పుడు మొదలైంది!
కర్చీఫ్‌తో నా జలుబు ఒకరి నుంచి ఒకరికి పాకింది. అంతే...ఇల్లంతా ‘హాచ్‌ హాచ్‌’ అని ఒకటే తమ్ములు! ఎవరి తుమ్ముల్లో వారు బిజీ బిజీగా ఉన్నారు. ఇదే అదనుగా అక్కడి నుంచి ఉడాయించాను. ఒకవేళ ఆరోజు వారికి దొరికిపోయి ఉంటే నా కేరీర్‌ ఆరోజే ముగిసిపోయి ఉండేది’’

ఇక నా రెండో ‘దొంగేట్రం’ గురించి...
నాకు గులాబ్‌జామ్‌లంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే నా కొంప ముంచినంత పనిచేసింది. అదెలాగో వినండి...
ఒకరోజు మిడ్‌నైట్, బంజారాహిల్స్‌లోని ఒక ఇంట్లో దూరాను. ఇంటావిడ ‘వంటలరత్న’ అనే విషయం నేను ఎరగను. ఆమె స్వీట్లతో రకరకాల ప్రయోగాలు చేస్తుందట.
నేను ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే టేబుల్‌పై గులాబ్‌జామ్‌లు ఘమఘమలాడుతున్నాయి.
‘కంట్రోల్‌’ అనుకున్నాను గట్టిగా.
కానీ కంట్రోల్‌ కాలేకపోయాను.
అయిదు నిమిషాల్లో మొత్తం లాగించేశాను.
అది గులాబ్‌జామ్‌ కాదని... కొత్తగా ప్రయోగం చేసిన ‘అలగ్‌ జామ్‌’ అని ఆ తరువాత తెలిసింది. అంతే... కడుపులో సుడులు! ఆ ఇంట్లో బంగారం ఎంత ఉంది? నగదు ఎంత ఉంది? అనే దానికంటే ‘టాయిలెట్‌’ ఎక్కడ ఉందనేదే నా ముఖ్య లక్ష్యం అయింది. నా అదృష్టం కొద్దీ అయిదు నిమిషాల్లోనే అది కనిపించింది.
‘యురేకా’ అంటూ అందులో దూరిపోయాను. కొద్దిసేపటి తరువాత...
బయటికి వచ్చాను. అయిదు నిమిషాల్లోనే మళ్లీ కడుపులో అల్లకల్లోలం!
అలా లోనికి వెళ్లడం, ఇలా బయటికి రావడం... ఈలోపు తెల్లవారింది. ఇంటి వాళ్లు ‘దొంగా...దొంగా’ అని అరిచారు.
నేను ‘పాము...పాము’ అని అరిచాను.
‘పాము ఎక్కడా?’ అని అందరూ భయపడుతున్న తరుణంలో... ‘ఇదే మంచి తరుణం’ అని అక్కడి నుంచి తప్పించుకుపోయాను.

ఇక ముచ్చటగా నా మూడో దొంగేట్రం.
అనగనగా సుబ్బారావు, సుబ్బలక్ష్మి దంపతులు. ఈ సుబ్బారావు బాగా మందుకొట్టి ఏ అర్ధరాత్రిపూటో ఇంటి తలుపులు దబదబా బాదేవాడు. సుబ్బలక్ష్మికి నిద్ర పాడైపోయేది. ఇక ఇలా కాదని భర్తకు ‘అప్పడాల కర్ర ట్రీట్‌మెంట్‌’ ఇవ్వాలని డిసైడైపోయింది.
ఒకరాత్రి తలుపులు సగం తీసి కాచుకొని కూర్చుంది. 
ఇది తెలియక ఆ రాత్రి నేను వారి ఇంటి తలుపు తట్టాను.
లోపలికి వచ్చిందో ఎవరో చూడకుండా తల మీద అప్పడాల కర్రతో  ఒక వేటు వేసింది. కళ్లు బైర్లు కమ్మాయి!
ఆ తరువాత ఆమె తీరిగ్గా ‘‘సారీ...’’ అని చెప్పి... ‘‘సారీ సంగతి సరే, ఇంతకు మీరేవరు? మా ఆయనేమో అనుకొని మీ తల మీద బాదాను... బాదడం సంగతి సరే, మా ఆయన రోజూ పీకలలోతు వరకు తాగి ఇంటికి వస్తున్నాడు... తాగాడు సరే, నోర్ముసుకొని పడుకోవచ్చు కదా... తలుపు ఒకటే బాదడం... బాదడం సరే... ఇంతకీ మీరెవరు?
సరే తాగాడనుకోండి...
ఏదో వారానికో రెండు వారాలకో అంటే అది వేరే విషయం. రోజూ తాగిరావడం ఏమిటి నాన్సెన్స్‌!
నాన్సెన్స్‌ సంగతి సరే, ఇంత రాత్రివేళ ఇక్కడ మీరేం చేస్తున్నారు? అసలు మీరెవరు? మీరెవరయితే నాకేంటిగానీ, ఇంతకీ ఆయన ఎక్కడున్నాడు?’’ ఆమె వాగ్ధాటి దెబ్బకు కరెంట్‌ తుస్సుమంది. ఇదే అదనుగా అక్కడి నుంచి సేఫ్‌గా తప్పించుకున్నాను.
...ఇలాంటి అనుభలెన్నో ఇంకా చాలా ఉన్నాయి. వీటి గురించి నా  ఆత్మకథ ‘చోరరత్నారకం’లో రాశాను. చదవండి.. నేర్చుకోండి.. ఆచరించండి..’’ అని తన ప్రసంగాన్ని ముగించాడు అతి సీనియర్‌దొంగ చోరప్ప.
– యాకుబ్‌ పాషా

మరిన్ని వార్తలు