కండక్టర్ నమ్మకం

28 Dec, 2014 02:21 IST|Sakshi
కండక్టర్ నమ్మకం

తపాలా
అది వేసవికాలం ఉదయం 5.30.  ఎయిర్‌పోర్ట్‌లో జాబ్ చేస్తున్న రోజులు. శనివారం ఆలేరులో ఉంటున్న అమ్మ దగ్గరికి వచ్చాను, తిరిగి సోమవారం హైదరాబాద్‌కి బయలుదేరుతున్నాను. ఉప్పల్ రింగ్‌రోడ్‌లో ఆఫీస్ క్యాబ్ నన్ను పికప్ చేసుకుంటుంది.
 అమ్మ గోరు వెచ్చని పాల గ్లాసు చేతికి ఇస్తూ- ‘లంచ్ బాక్స్ బ్యాగ్‌లో పెట్టేశా, ఆరోగ్యం జాగ్రత్త, బాగా తిను, స్లోగా బైక్ డ్రైవ్ చేయి’ అంటుంటే పాలు గుటుక్కున తాగేసి ‘సరే అమ్మా వస్తాను’ అన్నా.
 
‘అన్నయ్య బై’ అంది దుప్పట్లోంచి తల బయటపెట్టి నా చెల్లెలు సాహితి.
 బస్టాపులో అడుగుపెడుతున్నానో లేదో హైదరాబాద్ బస్ కదులుతోంది, వేగంగా ఎక్కి కూర్చున్నా. విండో సీట్ దొరికింది. చల్లగా గాలి వీస్తుంది. ఆ గాలికి నా ఎడమ పక్క విండో సీట్‌లో కూర్చున్న అమ్మాయి తన ఎగురుతున్న జుట్టును సర్దుకుంటూ నా వైపు చూసింది. అందంగా ఉంది. వెళ్ళేలోపు పరిచయం చేసుకుందాం! నేను తనను చూసినప్పుడు తను చూడట్లేదు. తను నన్ను చూసినప్పుడు నేను చూడట్లేదు. కాసేపటికి ఇద్దరం అనుకోకుండా ఒకరినొకరం చూసుకున్నాం. తను సన్నగా నవ్వింది, నేను కూడా నవ్వాను.
 
అంతలో బస్ కండక్టర్ టికెట్ అన్నాడు. స్టైల్‌గా వెనక జేబులో చేయి పెట్టానంతే, గుండె గుబేలుమంది. తొందర్లో పర్స్ ఇంట్లోనే మర్చిపోయా, ఎలా ఇప్పుడు? మధ్యలో దిగిపోవాలా? నిల్చొని బస్ అంతా కలియచూశా తెలిసినవారు ఉంటారేమో అని. మై బ్యాడ్‌లక్. భువనగిరి దాకా మేనేజ్ చేసి నా ఫ్రెండ్ అష్విన్ గాడికి ఫోన్ చేస్తే వాడు డబ్బు అరేంజ్ చేస్తాడు కదా అని ధైర్యం తెచ్చుకుని కండక్టర్‌కి అసలు విషయం చెప్పా.
 
‘నేను రోజు ఇదే రూట్‌లో డ్యూటీ చేస్తా, డబ్బులు రేపు రింగ్‌రోడ్‌లో తెచ్చివ్వు’ అన్నాడు. ‘థాంక్యూ సర్’ అని ఫోన్ నంబర్ తీసుకున్నాను.
 తెల్లారి డబ్బులు తిరిగి ఇచ్చేశాను. నాకు హెల్ప్ చేసిన ఆ ఆర్టీసీ కండక్టర్‌ని ఎప్పటికీ మర్చిపోను. ఎప్పుడు బస్ ఎక్కినా ఈ సంఘటన గుర్తుకొస్తుంది.
 - సుద్దాల సమ్రాట్, ఉప్పల్, హైదరాబాద్

మరిన్ని వార్తలు