దేశాన్ని నడిపించే శక్తి

22 Jan, 2017 00:06 IST|Sakshi
దేశాన్ని నడిపించే శక్తి

కాలానికి ఆధునికతను అద్దినది ప్రజాస్వామ్యమే. ఆ భావన ఒక ఆదర్శం స్థాయిలోనే మిగిలి పోకుండా, ఆకృతి దాల్చడానికి ఉపకరించేది రాజ్యాంగం. అందుకే ‘రాజ్యాంగం మార్గదర్శి. నేను ఏనాడూ దానిని విస్మరించను’ అంటాడు జార్జి వాషింగ్టన్‌. భారతదేశం అనే పురాతన భూమిని ఆధునిక రాజకీయ, ఆర్థిక, సామాజిక తాత్వికతలతో చెలిమి కట్టించడంలో మన రాజ్యాంగం నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైనది. ఆరున్నర దశాబ్దాల ఆధునిక భారత ప్రస్థానానికి రాజ్యాంగమే మార్గదర్శిగా నిలిచింది. ఇందుకు ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తాయి. మన దేశం వరకు రాజ్యాంగమంటే సమున్నత చట్టం.

‘భారత పౌరులమైన మేము...’ అంటూ భారత రాజ్యాంగం ఆరంభమవుతుంది. అంటే ఇది ప్రజల కోసం, ప్రజలు రాసుకుని, ప్రజలే అందించిన రాజ్యాంగమని ఆ మూడు ముక్కలు సూచిస్తున్నాయి. స్వేచ్ఛ, సమత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగానికి ఆత్మ వంటివి. భారత రాజ్యాంగం అంటే మొదట గుర్తుకు రావలసిన అంశం ఫెడరల్‌ వ్యవస్థ గురించి ఆలోచించే సంప్రదాయం లేని భారత్‌ను అదే వ్యవస్థలో ఒదిగి ఉండేటట్టు చేసిన సంగతి. అలాగే  సమత్వం కూడా. ఏనాడూ ఇక్కడి భావధార లో లేని సమత్వం అనే ఒక ఉదాత్త భావన ప్రయోజనం ఏమిటో రుచి చూపించింది.

 అంతకుమించి, వందల ఏళ్ల క్రితం మరచిపోయిన స్వేచ్ఛను దేశానికి తిరిగి ప్రసాదించినది రాజ్యాంగమే. అది మన దేశంలో యథాతథ స్థితిని కొనసాగనివ్వలేదు. అయినా దేశాన్ని ఘర్షణ స్థాయికి కూడా వెళ్లనివ్వలేదు. మన రాజ్యాంగం, అమలు, విజయాలూ, వైఫల్యాలూ వంటి అంశాల గురించి ఏదైనా మాట్లాడాలని అనుకుంటే, మొదట ఆ సమున్నత చట్టం అమలులోకి వచ్చిన జనవరి 26, 1950కి ముందు ఉన్న చారిత్రక దృశ్యాన్ని ఒక్కసారి వీక్షించాలి. సుదీర్ఘ విదేశీ పాలన, చిరకాలంగా ఇక్కడ ఉన్న అనర్థాలు, ఆ అనర్థాలకు సామాజిక వ్యవస్థ అల్లికలో వచ్చిన ఘర్షణలు తోడైన వాస్తవం, ఆర్థిక అసమానతలు, వివక్ష, అంతరాల పట్ల అవగాహన ఉండాలి.  

డాక్టర్‌ రాజేంద్రప్రసాద్, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, జవహర్‌లాల్‌లతో పాటు కేఎం మున్షీ, భోగరాజు పట్టాభిసీతారామయ్య, జేబీ కృపలానీ వంటి మహనీయులు అల్లాడి కృష్ణస్వామి వంటి ఎందరో రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్య్ర పోరాట యోధులు సభ్యులుగా ఉన్న రాజ్యాంగ పరిషత్‌ ఊహకు కూడా అందని కొన్ని సమస్యలను ఇప్పుడు దేశం వీక్షిస్తున్నది. కొన్ని కొత్త ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సమాయత్తం కావలసిన ఉన్నది కూడా. అలాంటి సమయంలో రాజ్యాంగం విఫలమైందన్న మాటను కొందరు విసిరినా, నిజమైన వైఫల్యం రాజకీయాలది, రాజకీయ నాయకత్వానిది తప్ప, రాజ్యాంగానికి కాదని చరిత్రలో ఇప్పటికే రుజువైంది.

 1960 దశకం వరకు జాతీయ పోరాట స్ఫూర్తి మన వ్యవస్థలను నడిపించింది. తరువాత నాయకత్వ స్ఫూర్తి ఆ బాధ్యతను స్వీకరించింది. 1975 తరువాత మాత్రం ఈ దేశాన్ని నడిపించినది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తే. 1975 జూన్‌ 25న ప్రకటించిన అత్యవసర పరిస్థితి పౌర హక్కులు, ఆదేశిక సూత్రాలు, పౌరుల స్వేచ్ఛలో రాజ్యం జోక్యం, న్యాయస్థానాలు– ప్రభుత్వ జోక్యం వంటి అంశాల గురించి గట్టి ఆలోచనలకు అంకురార్పణ చేసింది. 1990 నుంచి కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వాల జోరు మొదలైంది. ‘కేంద్ర ప్రభుత్వం’ అన్న మాట రాజ్యాంగంలో లేకున్నా, అలాంటి సంక్షుభిత రాజకీయ నేపథ్యంలో కూడా దేశ ఫెడరల్‌ వ్యవస్థకు జీవం పోసిన ఘనత మన రాజ్యాంగానిది.

 ప్రపంచీకరణ, 21వ శతాబ్దపు తొలి ఒకటిన్నర దశాబ్దాలు భారత రాజ్యాంగానికి నిశ్చయంగా కొన్ని సవాళ్లు విసిరాయి. ఇవి రాజ్యాంగ పరిషత్‌ ఊహించినవి కావనే అనిపిస్తుంది. అంతర్జాతీయ పరిణామాలు, వ్యక్తి స్వేచ్ఛ, ఆత్మ గౌరవ నినాదాలకు వెల్లువెత్తిన కొత్త నిర్వచనాలు; నేషన్, నేషనలిజమ్, యాంటీ నేషనలిజమ్‌ వంటి వాటిపై చర్చ, చర్యలు ఇందుకు సంబంధించినవే. ఈ విషయంలో ఒకవైపు అలాంటి భావనలకు స్వేచ్ఛను ఇస్తూనే, ప్రశ్నించడానికి వీలు కల్పిస్తూనే భారత్‌ను ఒకే దేశంగా కొనసాగడానికి అవరోధాలు లేకుండా చేస్తున్న మహోన్నత శక్తి మన రాజ్యాంగం.

రాజ్యాంగం తొలి సవరణ (జూన్‌ 18, 1951– 9వ షెడ్యూల్, 31ఎ, 31బి అధికరణల చేరిక; 15,19,85,87,174, 176, 341, 342, 372, 376 అధికరణలకు సవరణ) నుంచి, తాజా సవరణ (సెప్టెంబర్‌ 8, 2016, జీఎస్‌టీ బిల్లు)వరకు 101 పర్యాయాలు రాజ్యాంగం మార్పులు చేసుకుంది. ఇది బలహీనత అనిపించుకోదు. కాలానుగుణంగా మార్చుకునే అవకాశం భారత రాజ్యాంగానికి ఉంది. అయితే ఇది ఎంత సరళమో, అంత కఠినం కూడా. రెండు రకాల సవరణ విధానాలు ఇదే చెబుతాయి. కొన్ని సవరణలు పార్లమెంట్‌ ఒక్కటే చేయవచ్చు. కొన్ని సవరణలకు అసెంబ్లీల అనుమతి అవసరం. ఇది మొదటి నుంచి కనిపిస్తున్న క్రమమే. 1955 ఆవడి కాంగ్రెస్‌లో సామ్యవాద సమాజ స్థాపన లక్ష్యంగా చేసుకుంది. కానీ 1990లో ప్రపంచీకరణ నేపథ్యంలో సరళీకృత ఆర్థిక వి«ధానాలు దేశంలో ప్రవేశించడానికి రాజ్యాంగం ఆటంకం కాలేదు.

ఫెడరల్‌ వ్యవస్థ భగ్నం కాకుండా రాజ్యాంగం నిర్వహించిన పాత్ర ఘనమైనది. ఇందుకు చక్కని ఉదాహరణలు ఉన్నాయి. రాజ్యాంగం నిజమైన విజయం ఈ అంశంలోనే ఉంది కూడా. 275వ అధికరణ ఉంది. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వనరుల విభజనలో ఈ అధికరణే కీలకం. పదో ఫైనాన్స్‌ కమిషన్‌తో ఇది మరింత బలపడింది. అది ఎంత సుస్థిరమైందంటే, ఇప్పుడు ప్రపంచానికి ఈ వనరుల విభజనకు సంబంధించి ఈ అధికరణ ఆదర్శంగా మారిపోయింది. 356 అధికరణ మరొక పాఠం. రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన, లేదా కేంద్ర పాలన విధింపునకు అవకాశం ఇచ్చే అధికరణ ఇది. ఇది రాజ్యాంగంలో ఉన్న మాట వాస్తవం. ప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలోనే కేరళలో ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని తొలిసారి రద్దు చేయడం దగ్గర నుంచి ఈ అధికరణ వివాదాస్పదమే.

కానీ కర్ణాటకలో ఎస్‌ ఆర్‌ బొమ్మయ్‌ ప్రభుత్వం రద్దు తరువాత సుప్రీంకోర్టు ఈ అధికరణాన్ని విచక్షణా రహితంగా ఉపయోగించే ప్రమాదాన్ని తగ్గించింది. హిందీ వివాదం కారణంగా, అంటే భాష కారణంగా 1960లో తమిళనాడు ఈ దేశం నుంచి విడిపోతుందని భయపడ్డారు. తరువాత ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొన్నారు. అయినప్పటికీ మన రాజ్యాంగం కొన్ని అంశాల పట్ల మౌనం వహిస్తుందన్న వాదన ఉంది. అది నిజం కూడా. కానీ ఆ మౌనం గంభీరమైనదని తెలుసుకోవాలంటారు నిపుణులు. వివిధ కారణాల వల్ల మన రాజ్యాంగం ఆత్మ ఆధునికం. కానీ అది నిక్షిప్తమై ఉన్న శరీరం మాత్రం పురాతనం. 1820 నాటి పాలనే ఇప్పటికీ కొనసాగుతోందన్న కటువైన అభిప్రాయాలు అప్పుడప్పుడు వెల్లువెత్తడం అందుకే కూడా.

భారత రాజ్యాంగం శిలాశాసనం కాదు. సరళమైనదే. కానీ రాజ్యాంగాన్ని సమీక్షించుకునే అవకాశం మనం కోల్పోయాం. స్వాతంత్య్రం స్వర్ణోత్సవాల సందర్భంగా ఆ అవకాశం వచ్చింది. వారం రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరిపి, ఇందుకు సంబంధించిన తీర్మానం ఆమోదించింది. పీఏ సంగ్మా స్పీకర్‌. ఈ ఉదాత్త భావనలకు సంబంధించిన తీర్మానాన్ని ఎలా అమలు చేయాలో అందులో ప్రస్తావించుకోలేదు. అది తప్పిదమే. తరువాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం తీర్మానాన్ని అమలులోకి తేవడానికి ప్రయత్నించడంతోటే రాజకీయాలు మొదలైనాయి. ఇక్కడ రాజకీయాలు అన్న మాటే వాస్తవం. ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పార్టీ బీజేపీ కాబట్టి రాజ్యాంగ సమీక్షలో ఉదాత్త లౌకిక భావాలకు చోటు ఉండదని ప్రచారం మొదలైంది. నిజానికి ఇది అపోహ అని అప్పుడే చాలామంది నచ్చచెప్పే ప్రయత్నంచేశారు.

 రాజ్యాంగ సమీక్షా సంఘం ఏర్పాటయింది. దానికి అధ్యక్షులు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎన్‌ వెంకటాచలయ్య. బీపీ జీవన్‌రెడ్డి, ఫాలి నారిమన్‌ వంటి న్యాయకోవిదులు, సీఆర్‌ ఇరానీ (అప్పుడు స్టేట్స్‌మన్‌ పత్రిక సంపాదకుడు, ప్రస్తుతం లేరు) సభ్యులు. ప్రజాస్వామ్యం అనే అంశం గురించి ఏర్పాటు చేసిన సంఘంలో జస్టిస్‌ హెచ్‌ ఆర్‌ ఖన్నా, తెలుగువారైన జయప్రకాశ్‌ నారాయణ్‌ సభ్యులు. అయినా అపోహలు తొలగిపోలేదు. దీనితో రాజ్యాంగాన్ని శాస్త్రీయంగా సమీక్షించుకునే అవకాశం చేజారిపోయింది. ఇదొక చారిత్రక తప్పిదం. కాబట్టి జరిగిన తప్పిదాలకు రాజ్యాంగాన్ని బాధ్యురాలిగా చూపించడం కంటే, రాజకీయాలను కారణంగా చెప్పడం వాస్తవిక దృక్పథమవుతుంది.

రాజ్యాంగం ప్రకారమే జరిగిన అధికార వికేంద్రీకరణతో మొదట దెబ్బతిన్నది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. అయితే గ్రామాలు రిపబ్లిక్‌లుగా ఉండాలని గాంధీజీ భావించేవారు. ఈ రెండు వాస్తవాలు అంత తొందరగా జీర్ణం కావు. అలాంటి హోదా కల్పిస్తే కుల సమీకరణల దృష్ట్యా గ్రామాలలో పెడధోరణులు ప్రబలిపోతాయని అంబేడ్కర్‌ ఊహించారు. దీనితో కులవృత్తులు నాశనమైనాయి. రాజ్యాంగమే ప్రసాదించిన జీవించే హక్కుకు పరోక్షంగా గండి పడుతోంది. కానీ దీనిని మార్చవచ్చు. ఎందుకు మార్చుకోలేదు? అందుకు మళ్లీ రాజకీయాలనే తప్పు పట్టవలసి ఉంటుంది.

అందరికీ సమానావకాశాలు, విద్య, వైద్యం అందరికీ అందుబాటులో ఉండడం వంటి అంశాల వైఫల్యం కూడా రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధికి సంబంధించినవే కానీ, రాజ్యాంగ వైఫల్యం కాదు. రాజ్యాంగం రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. ఇది సమన్యాయ ఉద్దేశమే. కానీ నేటికీ 60 శాతం మంది సమన్యాయానికి సుదూరంగా ఉండిపోవడం ఒక చేదు వాస్తవం. ఒక పౌరుడికి విద్యావకాశాలు కల్పించకుండా, సంపద సృష్టిలో భాగస్వామిని చేయకుండా సమన్యాయం రమ్మంటే రాదు. స్త్రీ విముక్తికి సంబంధించి ఆదేశిక సూత్రాలలో స్పష్టమైన అంశాలే కనిపిస్తాయి. కానీ వాస్తవంలో కనిపిస్తున్నది వేరు. మరి 33 శాతం రిజర్వేషన్లకు అర్థం ఎక్కడ?

రాజ్యాంగ రచన పూర్తయిన తరువాత అంబేడ్కర్‌ వాస్తవిక దృక్పథంతో చెప్పిన పలుకులు ఇప్పటికీ గుర్తుంచుకోదగినవే. రాజ్యాంగ రచన పూర్తికావడంతోటే దేశంలో దారిద్య్రం, అసమానతలు, అంతరాలు సమసిపోవు. రాజ్యాంగ ముసాయిదానో లేదా, ప్రతినో చూసి పారిపోవు. ఆ దృశ్యం ఇవాళ్టికీ తాజాగానే ఉంది. అదొక విష్కంభం.
– డా. గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు