కాపీ కొట్టినా వందమార్కులు పడతాయ్!

24 May, 2015 00:06 IST|Sakshi
కాపీ కొట్టినా వందమార్కులు పడతాయ్!

ఆ సీన్ - ఈ సీన్
‘సృజనాత్మక ప్రపంచంలో ఏదీ కొత్త కాదు. చెప్పడంలోనే కొత్తదనం ఉంటుంది...’ అనుకోవాలి. ఎందుకంటే కమల్‌హాసన్ వంటి సృజనకారుడి సినిమాను చూసినప్పుడు వాటిల్లో ఏవో హాలీవుడ్ సినిమాల ఛాయలు కనిపిస్తే ఇలాంటి వేదాంతమే వస్తుంది మరి. అయితే కాపీలో కూడా కమల్ పనితనం కనిపిస్తుంది. స్ఫూర్తి పొందిన సీన్లే అయినా... కథలో కొత్తదనం ఉంటుంది. అందుకు నిదర్శనం ‘సత్యమే శివం’.
 
‘కుటుంబంతో కలసి థ్యాంక్స్‌గివింగ్‌డే ను సెలబ్రేట్ చేసుకోవడానికి న్యూయార్క్ నుంచి షికాగో బయలుదేరతాడు నీల్‌పేజ్. విమానం ఎక్కి గాల్లో విహరిస్తూ మహా అంటే గంటన్నరలో ఇంటికి చేరతాను అనే భావనతో న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లోకి అడుగుపెట్టిన అతడికి అన్నీ దుశ్శకునాలే!  వాతావరణం బాగోలేక విమానాలన్నీ రద్దయిపోయాయి. అక్కడితో మొదలు..అతడిని ఈ ప్రయాణంలో బ్యాడ్‌లక్ వెంటాడుతుంది. విమానం క్యాన్సిల్ కావడంతో ఒక చెత్త హోటల్‌లో స్టే చేయాల్సి వస్తుంది.

అదే తన స్థాయికి తక్కువ అనుకొంటే.. ఒకే రూమ్‌లో తనతో పాటు డెల్ ఒకడు. చూడటానికి అసహ్యంగా ఉంటాడు..అలాంటి వాడితో రూమ్‌ను షేర్ చేసుకోవడానికే నీల్‌కు చిరాకు. అసలు దిగువస్థాయి మనుషులు అంటేనే అతడికి అసహ్యం. అందుకే మరుసటి రోజు ఉదయం విమానాన్ని నమ్ముకోకుండా ట్రైన్ కోసమని.. డెల్‌కు తెలీకుండానే తెల్లవారుజామునే తుర్రుమంటాడు. అయితే వెంటాడుతున్న బ్యాడ్‌లక్ నీల్ డబ్బును కూడా పోగొడుతుంది.

ఇలాంటి సమయంలో ట్రైన్ కోసమే వచ్చిన డెల్ ఆదుకొంటాడు. దీంతో ఎక్కడో మనసులో దాగిఉన్న మానవత్వం డెల్‌పై కృతజ్ఞతాభావాన్ని మేల్కొలుపుతుంది. అతడంటే కొంత ఆదరణ లభిస్తుంది. అయితే ఆ అభిమానం కేవలం డెల్ మీద మాత్రమే. మిగతా ప్రపంచంలో డర్టీ పీపుల్‌పై కాదు!’ అక్కడ నుంచి వారి ప్రయాణం మొదలు. కథ వారితో పాటు సాగుతుంది.
 ఈ కథాంశంలో నీల్‌పేజ్‌ను అన్బు గానూ, డెల్ పేరును నల్లశివం గానూ మార్చుకొంటే పై కథతో వచ్చిన తమిళ సినిమా ‘అన్బేశివం’ అవుతుంది.

యథాతథంగా చదువుకొంటే ‘ప్లేన్స్, ట్రైన్స్ అండ్ ఆటోమొబైల్స్’ సినిమా అవుతుంది. మొదట వచ్చింది మాత్రం హాలీవుడ్ సినిమానే. 1987లో జాన్‌హ్యూస్, స్టీవ్ మార్టిన్‌లు ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ‘ప్లేన్స్, ట్రైన్స్ అండ్ ఆటోమొబైల్స్’.  జాన్‌హ్యూస్ దీనికి రచయిత కమ్ దర్శకుడ కూడా. సినిమా నుంచి చాలా సీన్లను స్ఫూర్తిగా తీసుకొని కమల్ సృజించిన సినిమా ‘అన్బేశివం’. అన్బుగా మాధవన్ కనిపిస్తే.. శివం పాత్రలో కమల్ కనిపిస్తారు.
 
ఇది 2003లో విడుదలైంది. ఈ సినిమాకు దర్శకుడు సుందర్.సి అయినా..స్క్రిప్ట్‌ను రచించిన కమల్‌హాసనే సినిమా అణువణువునా కనిపిస్తాడు.ఒరిజినల్ సినిమాలో హీరోలిద్దరి ప్రయాణం న్యూయార్క్ నుంచి షికాగో అయితే.. కమల్ ఈ ప్రయాణాన్ని భువనేశ్వర్ నుంచి చెన్నైకి మార్చాడు. ఎదురయ్యే అవాంతరాలు మాత్రం హాలీవుడ్ నుంచి తెచ్చుకొన్నవే. హాలీవుడ్ సినిమాలో థ్యాంక్స్‌గివింగ్ డే సెలబ్రేషన్స్‌ను తమిళ వెర్షన్‌కు వచ్చే సరికి కుర్రహీరో పెళ్లి సంబరాలుగా మార్చారు.
 
స్ఫూర్తి పొందడం, లేదా కాపీ కొట్టడం.. మాతృక అయితే హాలీవుడ్‌సినిమా. దానికి నకలు ఈ తమిళ సినిమా...కానీ కాపీ కొట్టిన కమల్‌కు వందకువంద మార్కులు పడతాయి. ఎందుకంటే.. అనుకరణ కూడా అంత సులభం కాదు. ‘అన్బేశివం’ సినిమాని కేవలం అనుకరణగానే చూడలేం. రెండు ప్రధాన పాత్రల వ్యక్తిగత నేపథ్యాన్ని కమల్‌మార్చారు. అక్కడ నుంచి కమల్ పని మొదలైంది.
 
కమ్యూనిజం, అఫీయిజం(నాస్తికవాదం), ఆల్ట్రూయిజం(నిస్వార్థవాదం)ల గురించిన చర్చతో అంతిమంగా హ్యూమనిజం ఔన్నత్యాన్ని చాటే సినిమా ఇది. అన్బేశివం అంటే ‘ప్రేమే దైవం’. ఈ సినిమాను తెలుగులో ‘సత్యమే శివం’గా డబ్‌చేశారు. హాలీవుడ్ సృజనకారుడిని కమల్ ఫాలో అయ్యింది నిజమే కానీ.. ఈ రెండు సినిమాలనూ ఒకదాని తర్వాత మరోటి చూస్తే.. కమల్‌హాసనే ఈ సినిమాను బాగా తీశాడని స్పష్టం అవుతుంది. ఎందుకంటే.. హాలీవుడ్ సృజనకారుడు ఆగిన చోట నుంచీ కమల్ మొదలు పెట్టాడు.
 - బి.జీవన్‌రెడ్డి

మరిన్ని వార్తలు