మస్తు.. ఆకలి పస్తు

13 Oct, 2019 08:27 IST|Sakshi

కవర్‌ స్టోరీ

ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలామంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు. కొందరు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికీ అక్కడక్కడా ఆకలిచావులు నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో ఒక ఎనిమిదేళ్ల బాలుడు ఆకలితో అలమటిస్తూ కన్నుమూశాడు. ఆకలి సమస్యను నిర్మూలించడమే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఉన్న అతిపెద్ద సవాలు. ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా దాదాపు 150 దేశాలు ఆకలి సమస్య నిర్మూలన కోసం నిబద్ధతను ప్రకటిస్తూ విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి.

ఆధునిక వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అక్కడక్కడా కరువు కాటకాలు, అతివృష్టి అనావృష్టి పరిస్థితులు ఏటా ఎదురవుతూనే ఉన్నా, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆశాజనకంగానే ఉంటోంది. పంపిణీ, నిల్వ సజావుగా సాగితే ఆకలిచావులు సంభవించే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండదు. దురదృష్టవశాత్తు ఆహార ధాన్యాల పంపిణీ, నిల్వ సక్రమంగా సాగుతున్న దాఖలాలే తక్కువ. మనుషుల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు నానాటికీ పెరుగుతుండటం కూడా ఆకలి సమస్యకు కారణమవుతోంది.

భూతాపం పెరుగుతుండటం వల్ల కొన్నిచోట్ల వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు ఆహార ధాన్యాల ఉత్పాదనపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అయితే, ఆధునిక శాస్త్ర పరిశోధనలు ఈ పరిస్థితిని సమర్థంగానే ఎదుర్కోగలుగుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని మంచి దిగుబడులను ఇవ్వగల వంగడాలను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెస్తూనే ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొన్నిచోట్ల ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుంటే, మరికొన్ని చోట్ల సరైన సాధానాసంపత్తి కరువవడం వల్ల తిండిగింజలు వినియోగానికి దక్కకుండాపోతున్నాయి. ప్రపంచంలో కొందరు ఆకలితో అలమటిస్తుంటే, ఇంకొందరు నిర్లక్ష్యంగా ఆహార పదార్థాలను వృథా చేస్తున్నారు. ఆహార పదార్థాల వృథాను సమర్థంగా అరికట్టగలిగితే ఆకలి సమస్యను చాలావరకు అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆకలి సమస్యకు ప్రధాన కారణాలు
రెండు దశాబ్దాల కిందటి కంటే ప్రస్తుతం ఆకలి సమస్య చాలావరకు తగ్గింది. అయినా, ఇప్పటికీ చాలా చోట్ల ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 81.5 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పేదరికం, ఉద్యోగ భద్రత కొరవడటం, ఆహార కొరత, ఆహార పదార్థాల వృథా, సాధనా సంపత్తి లోపాలు, అస్థిరమైన మార్కెట్లు, భూతాపం కారణంగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులు, యుద్ధాలు, సంఘర్షణలు, అట్టడుగు వర్గాలపై వివక్ష వంటివి ఆకలి సమస్యకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రోజుకు 1.25 డాలర్లు (సుమారు రూ.89) లేదా అంతకంటే తక్కువ మొత్తం సంపాదన ఉన్నవారిని పేదలుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 750 కోట్లకు పైగా ఉంటే, సుమారు 140 కోట్ల మంది రోజుకు కనీసం రూ.89 సంపాదనైనా లేని పేదరికంలో మగ్గుతున్నారని ప్రపంచబ్యాంకు చెబుతోంది. వీరిలో ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాల్లోనే ఉన్నారు. పేదరికంలో మగ్గుతున్న వారిలో అత్యధికులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సన్నకారు రైతులేనని కూడా ప్రపంచబ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. ఇక ఉద్యోగాల్లోని అస్థిర పరిస్థితుల వల్ల అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు.

ఆహార ధాన్యాలను భవిష్యత్‌ అవసరాల కోసం నిల్వ చేసుకునేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా దేశాల్లో దాదాపు 40 శాతం మేరకు తిండి గింజలు వినియోగానికి పనికిరాకుండా నాశనమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఆకలి సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. యుద్ధ పరిస్థితులు, సంఘర్షణలతో అతలాకుతలమవుతున్న దేశాల్లోనూ జనం ఆకలితో అలమటిస్తున్నారు. మరోవైపు మార్కెట్లలో అస్థిరతల వల్ల ఆహార ధాన్యాలు, ప్రధానమైన పంటల ధరలు ఒక్కోసారి విపరీతంగా పెరగడం, ఒక్కోసారి విపరీతంగా పడిపోవడం వల్ల కూడా తాత్కాలికంగా చాలామంది ఆకలితో అలమటించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, 2009లో మొక్కజొన్న, గోధుమలు, వరి వంటి తిండిగింజల ధరలు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఆ ఏడాది కొద్దికాలం పాటు ఆకలితో అలమటించే వారి సంఖ్య 5 కోట్ల నుంచి ఏకంగా 10 కోట్లకు పెరిగింది.

ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటి జనాభా అవసరాలను తీర్చడానికి ఆహార ధాన్యాల ఉత్పాదన 70 శాతం మేరకు పెరిగితే గాని ఆకలి సమస్యను నివారించడం సాధ్యం కాదు. వ్యవసాయం కోసం సాగుభూముల లభ్యత ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశాలు ఎటూ లేవు. మెరుగైన వంగడాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా తిండి గింజల ఉత్పాదనను గణనీయంగా పెంచే ప్రయత్నాలను సాగించడంతో పాటు, ప్రత్యామ్నాయ ఆహార పద్ధతులను వ్యాప్తిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మన దేశంలో ఇదీ పరిస్థితి
మన దేశంలో పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే, 2006–07 నుంచి 2016–17 సంవత్సరాలలో లెక్కలను చూసుకుంటే, దశాబ్ది వ్యవధిలో మూడేళ్లు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ మూడేళ్లనూ మినహాయిస్తే, మిగిలిన ఏడేళ్లలోనూ రికార్డులు బద్దలు కొట్టేస్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడులు వచ్చినట్లు ప్రభుత్వం బాగానే ప్రచారం చేసుకుంది. దేశవ్యాప్తంగా 2006–07లో 21.7 కోట్ల టన్నుల తిండిగింజల దిగుబడులు వస్తే, 2016–17లో 27.5 కోట్ల టన్నుల దిగుబడులు వచ్చాయి. దేశంలో 2009, 2014, 2015 సంవత్సరాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి.

గడచిన రెండు దశాబ్దాలలో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు, ఆందోళనలు పెరిగాయి. ఈ రెండు దశాబ్దాల్లోనూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన 1.40 కోట్ల మంది రైతులు వ్యవసాయం నుంచి తప్పుకున్నారు. ఒకవైపు ప్రభుత్వం తిండిగింజల ఉత్పత్తిలో దేశం స్వయంసమృద్ధి సాధించినట్లు చెబుతున్నా, మన దేశంలో ఇంకా నిత్యం ఆకలిబాధలు పడుతున్నవారి సంఖ్య 27 కోట్లకు పైగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆకలి బాధితుల సంఖ్య మన దేశంలోనే అత్యధికం. తలసరి ఆహార లభ్యత విషయంలోనూ మనది వెనుకబాటే. ‘ఆక్స్‌ఫామ్‌‘ గత ఏడాది విడుదల చేసిన ‘ఫుడ్‌ అవైలబిలిటీ ఇండెక్స్‌’ నివేదిక ప్రకారం తలసరి ఆహార లభ్యతలో భారత్‌ 97వ స్థానంలో ఉంది.

అందుబాటులో ఉన్న ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016–17లో తిండిగింజల ఉత్పాదన 27.5 కోట్ల టన్నులైతే, అదే ఏడాది తిండిగింజల డిమాండు 25.7 కోట్ల టన్నులు అని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇది నామమాత్రపు మిగులు ఉత్పత్తి మాత్రమే. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తిండిగింజల ఉత్పత్తి స్థానిక అవసరాలతో పోల్చుకుంటే 80 శాతం కంటే తక్కువగా ఉంటే, ఆహార కొరత ఏర్పడినట్లు భావించాలి. తిండిగింజల ఉత్పత్తి 80–120 శాతం వరకు ఉంటే, స్వయంసమృద్ధి సాధించినట్లు భావించాలి. ఈ ఉత్పత్తి 120 శాతాన్ని దాటినప్పుడు మాత్రమే మిగులు ఉత్పత్తి సాధించినట్లు పరిగణించాలి. మనదేశం తిండిగింజల ఉత్పాదనలో స్వయంసమృద్ధి సాధించింది. అయితే, సమీప భవిష్యత్తులో కరువు ముంచుకొస్తే, ఇప్పుడున్న బొటాబొటి మిగులు ఏ మూలకూ సరిపోదని నిపుణులు చెబుతున్నారు. 

భారీ స్థాయిలో ఆహార వృథా
ప్రపంచవ్యాప్తంగా ఆహార వృథా భారీ స్థాయిలో జరుగుతోంది. సంపన్న దేశాలతో పాటు నిరుపేద దేశాల్లో సైతం ఆహార వృథా దాదాపు ఒకే స్థాయిలో జరుగుతోందని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 130 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. జనాభా వినియోగించే ఆహార పరిమాణంలో ఇది దాదాపు మూడో వంతు. వృథా అవుతున్న ఆహారం విలువ సుమారు 2.6 లక్షల కోట్ల డాలర్లు (రూ.184.31 లక్షల కోట్లు). ఎఫ్‌ఏఓ లెక్కల ప్రకారం సంపన్న దేశాల్లో సగటున ఏటా 67 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతుంటే, పేద దేశాల్లో సగటున 63 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది.

సంపన్న దేశాల్లో ఆహార వృథాకు, పేద దేశాల్లో ఆహార వృథాకు కారణాలు వేర్వేరు. సంపన్న దేశాల్లో విత్తనాలు వేసే నాటి నుంచి పంట కోసే వరకు గల దశల్లో 32 శాతం నష్టం జరుగుతుంటే, వినియోగదారుల వల్ల 61 శాతం మేరకు ఆహార వృథా జరుగుతోంది. పేద దేశాల్లో విత్తనాలు వేసే నాటి నుంచి పంట కోసే వరకు గల దశల్లో 83 శాతం నష్టం జరుగుతుంటే, వినియోగదారుల వల్ల జరుగుతున్న వృథా 5 శాతం మాత్రమే.
పేద దేశాల్లో తగిన కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడం, పంట కోతలో ఆధునిక పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల భారీ స్థాయిలో ఆహార నష్టం వాటిల్లుతోంది.

వినియోగదారుల వల్ల ఈ దేశాల్లో జరుగుతున్న ఆహార నష్టం తక్కువే అయినా, ఆధునిక వసతులు కొరవడటం కారణంగా చాలా వరకు ఆహారం వినియోగానికి పనికిరాకుండా పోతోంది. మన భారత్‌ పరిస్థితులనే తీసుకుంటే, దేశంలో తగినన్ని కోల్డ్‌ స్టోరేజీలు లేని కారణంగా ఏటా భారీ స్థాయిలో కూరగాయలు, పండ్లు వృథా అవుతున్నాయి. మన దేశంలో ఇలా ఏటా వృథా అయ్యే కూరగాయలు, పండ్ల విలువ సుమారు రూ.38,500 కోట్ల వరకు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 

ప్రపంచీకరణ ఫలితంగా ఆహార వృథా
ప్రపంచీకరణ ఫలితంగా నిష్కారణంగా ఆహారం వృథా అవుతోంది. ప్రపంచీకరణ ఫలితంగా సంపన్న దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ సూపర్‌ మార్కెట్లు విరివిగా పెరిగాయి. సూపర్‌ మార్కెట్లు షెల్ఫుల్లో అందంగా కనిపించే ఆహార పదార్థాలకే ప్రాధాన్యమిస్తాయి. కాస్త వంకర టింకరగా ఉన్న పండ్లు, కూరగాయలను షెల్ఫులకెక్కించేందుకు ఇష్టపడవు. అలాంటి వాటిని పశువుల దాణాగా పంపడం లేదా వృథాగా పడవేయడం చేస్తుండటంతో వినియోగానికి పనివచ్చే పదార్థాలు అనవసరంగా వృథా అవుతున్నాయి. సూపర్‌ మార్కెట్ల మరో లక్షణం ఏమిటంటే, ఇవి షెల్ఫుల నిండుగా పండ్లు, కూరగాయలను నిల్వ చేస్తాయి. షెల్ఫులు ఖాళీగా ఉండనివ్వవు. ఒక్కోసారి ఆశించినంత విరివిగా అమ్ముడుపోని పండ్లు, కూరగాయలు షెల్ఫుల్లోనే నాశనమైపోతుంటాయి. ‘బెస్ట్‌ బిఫోర్‌’, ‘యూజ్‌ బై’, ‘సెల్‌ బై’ వంటి తేదీల లేబుళ్లను గుడ్డిగా నమ్మే వినియోగదారులు ఆహార పదార్థాల లేబుళ్ల మీద తేదీలను మాత్రమే చూసి పారవేసే ఆహార పదార్థాలు కూడా తక్కువ కాదు. సాధారణంగా ‘బెస్ట్‌ బిఫోర్‌’ తదితర తేదీలను రిటైలర్లు తమ అంచనా మేరకు వేస్తారు. ఈ తేదీలు కాస్త దాటినప్పటికీ చాలా వరకు పదార్థాలు వినియోగయోగ్యంగానే ఉంటాయి. అయితే, చాలామంది వినియోగదారులు లేబుళ్ల మీద ముద్రించిన తేదీలనే గుడ్డిగా నమ్ముతూ విలువైన ఆహారాన్ని వృథా చేస్తున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో ఏటా ఇలా 8.80 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. 

పర్యావరణంపై ప్రతికూల ప్రభావం
ఆహార వృథా కారణంగా పర్యావరణంపై చాలా ప్రతికూల ప్రభావం పడుతోంది. పెరుగుతున్న భూతాపాన్ని ఆహార వృథా కూడా ఇతోధికంగా ఎగదోస్తోంది. ఆహార వృథా కారణంగా పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లుతోందో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ– ఒక ఆపిల్‌ పండు మన చేతికి అందటానికి కనీసం 125 లీటర్ల నీరు అవసరం. ఒక ఆపిల్‌ను పాడయ్యే వరకు నిల్వ ఉంచి పారేస్తే, 125 లీటర్ల నీటిని వృథా చేసినట్లే. ఒక్క ఆపిల్‌కే నీటి వృథా ఈ స్థాయిలో ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది టన్నుల్లో జరుగుతున్న ఆహార వృథా కారణంగా ఏ స్థాయి జలనష్టం జరుగుతోందో ఊహించవచ్చు.

ఆహార వృథా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 250 క్యూసెక్కుల మేరకు నీటి వృథా పరోక్షంగా జరుగుతోంది. ఈ నీటి పరిమాణం జెనీవా సరస్సులోని నీటి పరిమాణానికి మూడు రెట్లు. ఇదిలా ఉంటే, వృథా అవుతున్న ఆహార పదార్థాల కారణంగా ఏటా అదనంగా 330 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ పర్యావరణంలో కలుస్తోంది. ఇది భూతాపాన్ని తనవంతు పెంచుతోంది. వృథాగా పారవేసిన ఆహార పదార్థాలు కుళ్లిపోయే దశలో విడుదలయ్యే మీథేన్‌ వాయువు కూడా పర్యావరణంపై ఇదే తీరులో ప్రతికూల ప్రభావం చూపుతోంది. కేవలం బొగ్గు, చమురు ఇంధనాల వల్ల మాత్రమే కాదు, ఆహార వృథా కారణంగా కూడా భూతాపం అంతకంతకు పెరుగుతోంది. పర్యావరణ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా, ప్రపంచ దేశాలన్నీ ఆహార వృథాను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకుంటే, భవిష్యత్తులో గడ్డు పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు.

తలసరి ఆహారలభ్యత అంతంతే
తిండిగింజల ఉత్పాదనలో స్వయంసమృద్ధి సంగతి సరే, తలసరి ఆహార లభ్యతలో మనం సాధించిన పురోగతి అంతంత మాత్రమే. మన దేశంలో 1908 నాటికి తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 177.3 కిలోలుగా ఉంటే, 2016 నాటికి తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 177.9 కిలోలు మాత్రమే. చైనాలో తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 450 కిలోలు కాగా, బంగ్లాదేశ్‌లో ఈ పరిమాణం 200 కిలోలు ఉండటం గమనార్హం. అగ్రరాజ్యమైన అమెరికాలో తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 1100 కిలోలు. మనదేశంలో ఆకలితో అలమటిస్తున్నవారు కొందరైతే, పోషకాల సంగతి పట్టించుకోకుండా దొరికినదేదో తిని కడుపు నింపుకుంటున్న వారే ఎక్కువ. ఆహార నిపుణుల సూచనల మేరకు పోషకాహారం తీసుకునే పరిస్థితి చాలామందికి లేదు. తీసుకుంటున్న ఆహారానికీ, పోషక ప్రమాణాలకు వ్యత్యాసం మన గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం మేరకు, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం మేరకు ఉంటోంది. అర్ధాకలి, అరకొర ఆహారం వల్ల మన దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఎఫ్‌ఏఓ విడుదల చేసిన తాజా గణాంకాలు ఇవీ...

భారత జనాభాలో పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు : 14.5%
తక్కువ బరువుతో ఉన్న ఐదేళ్ల లోపు పిల్లలు : 20.8%
ఐదేళ్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఉన్నవారు : 37.9%
రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు : 51.4%

మరిన్ని వార్తలు