నువ్వు శాశ్వతం..

11 Aug, 2019 08:39 IST|Sakshi

 కవర్‌ స్టోరీ

జీవితం క్షణభంగురమని పురాతన మతతత్వాలన్నీ చెబుతున్నాయి. మరణాన్ని నేరుగా జయించే మార్గమేదీ నేటి వరకు అందుబాటులో లేదు. అయితే, మరణానంతరం శాశ్వతంగా జీవితం కొనసాగించే మార్గం  మాత్రం ఉంది. అదే– అవయవదానం. అవయవదానం చేయండి. జీవితాన్ని శాశ్వతం చేసుకోండి.

ఆధునిక వైద్యశాస్త్రం సాధించిన అద్భుతమైన మైలురాయి అవయవ మార్పిడి పద్ధతి. అవయవ మార్పిడి ద్వారా దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయవ లోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి, వారికి స్వస్థత కలిగించే విధానం నానాటికీ మెరుగుపడుతూ వస్తోంది. అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంతగా కాకపోయినా, నెమ్మదిగా పెరుగుతోంది. అవయవ దాతల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉంది. అవయవ దానంపై లేనిపోని అపోహలు, మతపరమైన నమ్మకాలు, ఆచారాల వంటి వాటి కారణంగా చాలామంది అవయవ దానానికి ముందుకు రావడం లేదు. కొన్ని అవయవాలను జీవించి ఉండగానే సేకరించడం జరుగుతుంది.  దానివల్ల అవయవ దాతకు గాని, అవయవ గ్రహీతకు గాని ఎలాంటి నష్టం జరగదు. 
చాలా సందర్భాల్లో బ్రెయిన్‌ డెడ్‌ అయినా, సాధారణ కారణాల వల్ల మరణించినా, వారు ముందుగానే అవయవ దానానికి లిఖితపూర్వకంగా సంసిద్ధత వ్యక్తం చేసి ఉన్నట్లయితే, వారి అవయవాలను  సేకరించి, అవసరంలో ఉన్న ఇతరులకు అమర్చుతారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన అవయవాల ద్వారా గరిష్టంగా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడవచ్చు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన కణజాలం ద్వారా గరిష్టంగా యాభై మంది జీవన ప్రమాణాన్ని పొడిగించవచ్చు. అవయవ దాతలు సైతం మరణానంతరం తమ అవయవాలను పొందిన ఇతరుల ద్వారా మరికొంతకాలం వారి జ్ఞాపకాల్లో సజీవంగా ఉండవచ్చు.
ఆగస్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానం గురించి కొన్ని విశేషాలు...

అవయవదానంపైనా, అవయవ మార్పిడి చికిత్స విధానాలపైనా ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రజలకు కొంత అవగాహన ఏర్పడుతోంది. అయినా, ఇంకా ఎన్నో అపోహలు, అనుమానాలు, భయాలు వారిని పీడిస్తూనే ఉన్నాయి. అవయవదానానికి ఏయే అవయవాలు పనికి వస్తాయో, ఎలాంటి పరిస్థితుల్లో దాతల నుంచి అవయవాలను సేకరిస్తారో కూడా చాలామందికి తెలియదు. 
అవయవదానానికి ఏయే అవయవాలు, కణజాలాలు పనికి వస్తాయంటే...

గుండె
ప్రాణం నిలిచి ఉండాలంటే గుండె పనిచేస్తూ ఉండాల్సిందే. కొందరిలో గుండె వైఫల్యం కారణంగా, తీవ్రమైన వైరల్‌ జ్వరాల కారణంగా గుండె పనిచేయడం మానేసే పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి వారికి ఇతర చికిత్సలేవీ పనిచేయని పరిస్థితుల్లో గుండె మార్పిడి ఒక్కటే దిక్కు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రెయిన్‌డెడ్‌ కారణంగా మరణించిన వారి నుంచి సేకరించిన గుండెను వేరు చేసి అమర్చడం ద్వారా గుండె వైఫల్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలను కాపాడవచ్చు. తగిన గుండె దొరికేంత వరకు రోగుల ప్రాణాలను నిలిపి ఉంచేందుకు వైద్యులు కృత్రిమ గుండెను ఉపయోగిస్తారు.

అవయవదానంపై  అపోహలు వాస్తవాలు
అవయదానంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం సాగిస్తున్నప్పటికీ, చాలామందిలో ఇప్పటికీ అవయవదానంపై ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు ఏమాత్రం వాస్తవం కాదు. ముఖ్యంగా ప్రచారంలో ఉన్న అపోహలు, వాటి వెనుకనున్న వాస్తవాలు ఏమిటంటే...

అపోహ: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అవయవదానానికి పనికిరారు
వాస్తవం: ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారైనా తమ అవయవాలను నిక్షేపంగా దానం చేయవచ్చు. శరీరంలోని వ్యాధిగ్రస్తమైన అవయవాలను విడిచిపెడితే, మిగిలినవి అవయవదానానికి పనికి వస్తాయి. అలాగే, ఇతర అవయవాల్లోని కణజాలం కూడా దానానికి పనికివస్తుంది.

అపోహ: వయసు మళ్లిన వృద్ధులు అవయవదానానికి పనికిరారు
వాస్తవం: అవయవదానానికి వయసుతో నిమిత్తం లేదు. ఏ వయసులో ఉన్నవారైనా అవయవదానం చేయవచ్చు. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం 93 ఏళ్ల అమెరికన్‌ పౌరుడు మరణానంతరం అవయవదానం చేశాడు. అవయవదానానికి సంసిద్ధత వ్యక్తం చేయడానికి కనీసం పద్దెనిమిదేళ్లు నిండి ఉండాలి. దాదాపు ప్రపంచదేశాలన్నీ అనుసరిస్తున్న పద్ధతి ఇది.

అపోహ: అవయవదానం మత విశ్వాసాలకు విరుద్ధం
వాస్తవం: ప్రపంచంలోని చాలా మతాలు ఆధునికతను అర్థం చేసుకుంటున్నాయి. ఆధునిక శాస్త్ర పురోగతికి ఆటంకం కలిగించే నిబంధనలేవీ విధించడం లేదు. ఇతరుల పట్ల ప్రేమను, దాతృత్వాన్ని వ్యతిరేకించే మతాలేవీ ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇస్లామిక్‌ ఫిక్‌ కౌన్సిల్‌ నాలుగో సమ్మేళనం కూడా అవయవదానాన్ని నిస్వార్థమైన దాతృత్వంగా పరిగణిస్తూ, అవయవదానానికి ఆమోదం తెలిపింది.

అపోహ: అవయవదానం చేశాక శరీరానికి ఆచార ప్రకారం అంత్యక్రియల నిర్వహణ సాధ్యంకాదు
వాస్తవం: అవయవదానం చేసినప్పటికీ, పనికి వచ్చే అవయవాలను తొలగించి, అవసరంలో ఉన్న గ్రహీతలకు అమర్చిన తర్వాత దాత శరీరాన్ని వైద్యులు పూర్తి గౌరవంగా చూస్తారు. తగిన రీతిలో అంత్యక్రియలు నిర్వహించడానికి వీలుగా దానిని సిద్ధంచేసి, సంబంధీకులకు అప్పగిస్తారు.

అపోహ: అవయవదాతల నుంచి సేకరించిన అవయవాలను ఎవరైనా అమ్ముకుంటారేమో!
వాస్తవం: అవయవదాతల నుంచి సేకరించిన అవయవాలను అమ్ముకోవడాన్ని నిషేధిస్తూ దాదాపు ప్రపంచదేశాలన్నీ కట్టుదిట్టమైన చట్టాలను రూపొందించాయి. అవయవాలను అమ్ముకునే వారికి కఠిన శిక్షలు తప్పవు. దాతల నుంచి సేకరించిన అవయవాలను వైద్యులెవరూ అమ్ముకోరు.

అపోహ: అవయవదాత కోమాలోకి వెళితే కోమాలో ఉండగానే అవయవాలు తొలగిస్తారేమో!
వాస్తవం: ఇది పూర్తిగా అపోహ. కోమాలో ఉన్నవారిని సాధ్యమైనంత వరకు బతికించడానికే వైద్యులు అన్నివిధాలా ప్రయత్నిస్తారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు.

ఊపిరితిత్తులు
ఊపిరితిత్తులు శరీరంలోని రక్తానికి ఆక్సిజన్‌ సరఫరా చేస్తాయి. కార్బన్‌ డయాక్సైడ్‌ను బయటకు పంపుతాయి. నిరంతరం జరిగే ఈ ప్రక్రియకు కొన్ని కారణాల వల్ల అంతరాయం ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల్లో గడ్డలు ఏర్పడటం (సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌) వంటి పరిస్థితులు తలెత్తితే ఊపిరితిత్తులు శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్‌ను అందించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఊపిరితిత్తులు సామర్థ్యాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో బ్రెయిన్‌డెడ్‌ లేదా గుండె ఆగిపోవడం వల్ల మరణించిన వారి నుంచి సేకరించిన ఊపిరితిత్తులను రోగులకు అమర్చడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. పొగతాగే అలవాటు ఉన్నవారి ఊపిరితిత్తులు ఇందుకు పనికిరావని చాలామంది అనుకుంటారు గాని, అదంతా అపోహ మాత్రమే. పొగతాగే అలవాటు ఉన్నవారి ఊపిరితిత్తుల సామర్థ్యం బాగానే ఉన్నట్లయితే, అవసరమైన రోగులకు వాటిని అమర్చవచ్చు. ఒకే రోగికి ఒక మనిషి మృతదేహం నుంచి సేకరించిన రెండు ఊపిరితిత్తులనూ అమర్చవచ్చు లేదా అవసరంలో ఉన్న ఇద్దరు రోగులకు చెరొక ఊపిరితిత్తిని అమర్చడం ద్వారా రెండు ప్రాణాలను కాపాడటానికి కూడా వీలు ఉంటుంది.

పాంక్రియాస్‌
లివర్‌కు దిగువగా ఉండే పాంక్రియాస్‌ ఇన్సులిన్‌ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్‌ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. టైప్‌–1 డయాబెటిస్‌ రోగుల్లో ఇన్సులిన్‌ అతి తక్కువగా తయారవుతుంది. ఒక్కోసారి అసలు ఏమాత్రం తయారవదు. నిత్యం ఇన్సులిన్‌ ఇంజెక్షన్లపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు ఇచ్చినా రక్తంలో చక్కెర నియంత్రణకు రాని పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటప్పుడు పాంక్రియాస్‌ మార్పిడి మాత్రమే ఏకైక మార్గం. బ్రెయిన్‌ డెడ్‌ లేదా గుండె ఆగిపోవడం వల్ల మరణించిన వ్యక్తుల నుంచి సేకరించిన పాంక్రియాస్‌ను అవసరమైన రోగులకు అమర్చడం ద్వారా వారిని బతికించవచ్చు.

అవయవదానంపై ప్రభుత్వాల కృషి
అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు దేశ దేశాల్లో ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ దిశగా కృషి కొనసాగిస్తున్నాయి. ‘ఆర్గాన్‌ ఇండియా‘ అనే స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వ సహకారంతో అవయవదానంపై విస్తృతంగా ప్రచారం చేస్తూ, ప్రజలను అవయవదానం వైపు ప్రోత్సహిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ‘జాతీయ అవయవమార్పిడి కార్యక్రమం’ నిర్వహిస్తోంది. మరణానంతరం అవయవదానానికి సంసిద్ధులయ్యేలా ప్రజల్లో అవగాహన కల్పించడం, అవయవాలను అమ్ముకోకుండా ఉండేలా కట్టుదిట్టమైన చట్టాలను అమలు చేయడం, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటివాటిని ఈ కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తోంది.

అవయవదానం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ‘జీవన్‌దాన్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ‘జీవన్‌దాన్‌’ డైరెక్టర్‌ డాక్టర్‌ స్వర్ణలత హైదరాబాద్‌ కేంద్రంగా అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. భారత్‌లోని అవయవదాతల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. మన దేశంలో కిడ్నీదానం చేసేవారిలో 74 శాతం మంది, లివర్‌దాతల్లో 60.5 శాతం మంది మహిళలే. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా, అవయవదాతల్లో మహిళలే అగ్రస్థానంలో నిలుస్తుండటం విశేషం. భారత్‌లో ప్రతి 10 లక్షల జనాభాకు 0.58 మంది అవయవదాతలే అందుబాటులో ఉన్నారు. ఈ విషయంలో స్పెయిన్‌ ప్రతి 10 లక్షల జనాభాకు 36 మంది, క్రొయేషియా ప్రతి 10 లక్షల మందికి 32 మంది, అమెరికా ప్రతి 10 లక్షల మందికి 26 మంది అవయవదానంలో ముందంజలో ఉన్నాయి. 

కిడ్నీ
రక్తాన్ని వడగట్టి, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపే కీలక విధులు నిర్వర్తిస్తుంటాయి కిడ్నీలు. ఏదైనా వ్యాధి కారణంగానైనా, మరే కారణం వల్లనైనా కిడ్నీలు దెబ్బతిన్నట్లయితే, రక్తాన్ని వడగట్టి, వ్యర్థాలను బయటకు పంపే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఫలితంగా మూత్రం ద్వారా బయటకు పోవలసిన వ్యర్థాలు రక్తంలోనే పేరుకుపోయి, శరీరాన్ని దెబ్బతీస్తాయి. కిడ్నీలు రెండూ విఫలమైన స్థితిలో డయాలసిస్‌ ద్వారా రక్తంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతారు. అయితే, డయాలసిస్‌పై రోగి దీర్ఘకాలం జీవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దాతలు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే, వారి నుంచి సేకరించిన కిడ్నీని అమర్చడం ద్వారా రోగిని కాపాడవచ్చు. సాధారణంగా రక్త సంబంధీకుల నుంచి సేకరించిన కిడ్నీలను రోగులకు అమరుస్తుంటారు. కొన్నిసార్లు బయటి దాతల నుంచి సేకరించిన కిడ్నీలను కూడా అమరుస్తారు. బ్రెయిన్‌డెడ్‌ రోగుల నుంచి సేకరించిన కిడ్నీలయితే, ఒక్కోసారి రెండు కిడ్నీలను కూడా ఒకే రోగికి అమర్చే అవకాశాలు ఉంటాయి. ఇద్దరు రోగులకు అవసరమైతే ఒక్కో రోగికి చెరో కిడ్నీని అమర్చి రెండు నిండు ప్రాణాలను కాపాడేందుకు వీలుంటుంది.

ఎముకల కణజాలం
ప్రమాదాలు, వ్యాధులు, పుండ్లు వంటి కారణాల వల్ల ఎముకలు కోల్పోయిన వారికి దాతల శరీరం నుంచి సేకరించిన ఎముకల కణజాలాన్ని అమర్చడం ద్వారా వారు కోల్పోయిన ఎముకలు తిరిగి యథాస్థితో పెరిగేలా చేయవచ్చు. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి, అరిగిపోయిన కీళ్ల మార్పిడి చికిత్సల్లో అరిగిపోయిన కీళ్లు తిరిగి త్వరగా కోలుకోవడానికి కూడా ఎముకల నుంచి సేకరించిన కణజాలాన్ని ఉపయోగిస్తారు. పిల్లలకైనా, పెద్దలకైనా గూని కారణంగా వంపు తిరిగిపోయిన వెన్నెముకను నిటారుగా తీర్చిదిద్దడానికి కూడా ఎముకల కణజాలం ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి ఎముకల నుంచి సేకరించిన కణజాలం గరిష్టంగా పదిమంది రోగులకు పునరుజ్జీవనం కలిగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే, ఎముకలను కండరాలకు అతికించి ఉంచే టెండన్ల నుంచి సేకరించిన కణజాలాన్ని కూడా దెబ్బతిన్న టెండన్లను పునరుద్ధరించడానికి ఉపయోగిస్తారు.

కార్నియా
కంటి ద్వారా చూడాలంటే కంట్లోని కార్నియా, అందులో ఉండే సూక్ష్మభాగాలు సజావుగా ఉండాలి. పుట్టుక నుంచి గాని, మధ్యలో ఏదైనా కారణం వల్ల గాని అంధులుగా మారిన వారికి కార్నియా మార్పిడి చికిత్స ద్వారా తిరిగి చూపు తెప్పించడానికి అవసరం ఉంటుంది. మరణానికి ముందే నేత్రదానానికి సంసిద్ధత వ్యక్తం చేసిన దాతల నుంచి సేకరించిన కార్నియాను అమర్చడం ద్వారా అవసరంలో ఉన్న అంధులకు చూపు తెప్పించడానికి వీలవుతుంది. ఒక్కోసారి ఇతర కారణాల వల్ల మరణించిన వారి కార్నియాలను కూడా వారి బంధువుల అనుమతితో సేకరించవచ్చు. కార్నియా కణజాలాన్ని సేకరించి, అమర్చడం ద్వారా కూడా అవసరంలో అంధులకు చూపు తెప్పించడానికి వీలవుతుంది. 

చర్మం
ఇన్ఫెక్షన్ల కారణంగా, తీవ్రంగా కాలిన గాయాల వల్ల చర్మం బాగా దెబ్బతిని బాధపడుతున్న వారికి చర్మ కణజాల మార్పిడి చికిత్స ద్వారా వారు ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందేలా చేయవచ్చు. చర్మదాతల నుంచి చర్మంపై ఉండే పలచని పొరను సేకరించి, అవసరంలో ఉన్న రోగులకు ఉపయోగిస్తారు. చర్మం బాగా దెబ్బతిన్న రోగికి ముగ్గురు దాతల నుంచి సేకరించిన చర్మకణజాలాన్ని ఎక్కించడం ద్వారా చర్మం పూర్తిగా యథాస్థితికి వచ్చేలా చికిత్స చేస్తారు.

లివర్‌
శరీరంలోని అతి సంక్లిష్టమైన అవయవం లివర్‌. అంతేకాదు, శరీరంలోని అతిపెద్ద గ్రంథి కూడా ఇదే. లివర్‌ శరీరంలోని అనేక విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఆహారం ద్వారా పొందిన చక్కెరలు, కొవ్వులు, విటమిన్లు వంటి పోషకాలను నియంత్రిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రక్రియను నియంత్రిస్తుంది. జీవక్రియల అసమతుల్యతలు, జన్యు కారణాలే కాకుండా హెపటైటిస్‌–బి, హెపటైటిస్‌–సి వంటి వ్యాధులు లివర్‌ను పూర్తిగా దెబ్బతీసే పరిస్థితుల్లో లివర్‌ మార్పిడి అవసరమవుతుంది. మరణించిన వ్యక్తుల నుంచి సేకరించిన లివర్‌నే కాకుండా, జీవించి ఉన్న వ్యక్తుల నుంచి సేకరించిన లివర్‌ ముక్కను కూడా లివర్‌ మార్పిడి అవసరమైన రోగులకు అమర్చవచ్చు. కొంతకాలానికి దాతలోను, గ్రహీతలోను కూడా లివర్‌ పూర్తి పరిమాణానికి ఎదుగుతుంది. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. మరణించిన వ్యక్తుల నుంచి సేకరించిన లివర్‌ని అవసరాన్ని బట్టి ఇద్దరు రోగులకు అమర్చడానికి కూడా అవకాశాలు ఉంటాయి.

గుండె కణజాలం
పూర్తిగా గుండెమార్పిడి అవసరం లేని వారికి గుండె కణజాలాన్ని ఉపయోగించి చికిత్స చేస్తారు. అలాగే గుండె వాల్వులను కూడా అమర్చి చికిత్స చేస్తారు. పుట్టుకతో వచ్చే జన్యులోపాల వల్ల గుండెకు రంధ్రం ఏర్పడిన పిల్లలకు, గుండెవాల్వులు దెబ్బతిన్న పెద్దలకు ఇలా గుండె నుంచి సేకరించిన కణజాలాన్ని, వాల్వులను అమర్చడం ద్వారా వారి ప్రాణాలను కాపాడటానికి అవకాశాలు ఉంటాయి.

అవయవదానం కోసం యాప్‌
అవయవదానాన్ని సులభతరం చేసేందుకు బెంగళూరులో స్థిరపడ్డ ఒరియా యువకుడు ప్రతీక్‌ మహాపాత్రో ఒక యాప్‌ను రూపొందించాడు. అవయవాల అవసరంలో ఉన్నవారు అవయవదాతల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా ఈ యాప్‌ను రూపొందించిన ప్రతీక్‌ మహాపాత్రో బెంగళూరులోని ఆర్‌వీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ఫైనలియర్‌ చదువుకుంటున్నాడు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిజ్ఞానంతో అతడు రూపొందించిన ఈ యాప్‌ మైక్రోసాఫ్ట్‌ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది నిర్వహించిన ‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫర్‌ గుడ్‌ ఐడియా చాలెంజ్‌’లో మూడో స్థానంలో నిలిచింది.

ఇన్‌పుట్స్‌:  డాక్టర్‌ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

కథనం: పన్యాల జగన్నాథదాసు

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా