రారా కృష్ణయ్య..!

18 Aug, 2019 12:41 IST|Sakshi

కవర్‌ స్టోరీ

బృందావనమది అందరిదీ అవునో కాదోగాని, గోవిందుడు అందరివాడు. శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీమద్భాగవత పురాణంలో, మహాభారతంలో శ్రీకృష్ణుడి గురించిన విపులమైన గాథలు ఉన్నాయి. బాలకృష్ణుడిగా చేసిన చిలిపిచేష్టలు, ఆ చిన్నారి వయసులోనే తనను చంపడానికి మేనమామ కంసుడు పంపిన పూతన, శకటాసుర, ధేనుకాసురాది రాక్షసుల హననం, చివరకు తనను చంపదలచిన మేనమామ కంసుడినే వధించడం శ్రీకృష్ణుడి అవతార మహిమకు నిదర్శనాలుగా చెప్పుకుంటారు. 

మన్ను తిన్నావెందుకని నిలదీసిన తల్లి యశోదకు తన నోట చతుర్దశ భువనభాండాలను చూపిన బాలకృష్ణుడు తనను తాను సర్వంతర్యామిగా ఆనాడే ప్రకటించుకున్నాడు.యవ్వనారంభంలో రాధా మనోహరుడిగా, గోపికా మానస చోరుడిగా చేసిన రాసలీలలు, అష్టమహిషుల ప్రభువుగా అలరారిన శ్రీకృష్ణుడు మహాభారతంలో పాండవ పక్షపాతిగా, అర్జునుని సారథిగా, యుద్ధానికి వెనుకంజ వేసిన అర్జునుడికి గీతబోధ చేసిన గీతాచార్యుడిగా కనిపిస్తాడు. గోపాలుడైన గోవిందుడు ఆబాల గోపాలాన్నీ ఆకట్టుకున్నవాడు. అందుకే గోవిందుడు అందరివాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 24) సందర్భంగా ఈ ప్రత్యేక కథనం...

నల్లనివాడు పద్మనయనంబులవాడు గృపారసంబు పై
జల్లెడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువా డొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో!
మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ! చెప్పరే! 
శ్రీకృష్ణుని రూపురేఖల గురించి శ్రీమద్భాగవతంలో పోతనామాత్యుడు చేసిన వర్ణన ఇది. నల్లనివాడు కావడం వల్లనే అతడికి కృష్ణుడనే పేరు వచ్చింది. కృష్ణుడు ఉత్త నల్లనివాడేనా? చాలా అల్లరివాడు కూడా. బాల్యావస్థలో చిన్నికృష్ణుని అల్లరి చేష్టలను కూడా పోతనామాత్యుడు కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. చిన్నప్పుడు అల్లరి చేష్టలతో పెరిగిన కృష్ణుడే మహాభారతంలో రాజనీతి చతురుడైన పార్థసారథిగా, లోకానికి గంభీరంగా కర్తవ్యబోధ చేసిన గీతాచార్యుడిగా కనిపిస్తాడు.

అల్లరి కృష్ణుడిగానే అవతార మహిమలు
అల్లరి కృష్ణుడిగా పేరుమోసిన చిన్నారి వయసులోనే శ్రీకృష్ణుడు తన అవతార మహిమలను ప్రదర్శించాడు. ద్వాపరయుగంలో లోకంలో అధర్మం ప్రబలింది. బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు ధర్మపరిరక్షణ కోసం శ్రీమహావిష్ణువు భూమ్మీద అవతరించదలచాడు. దేవకీ వసుదేవులకు జన్మించదలచాడు. అప్పుడు యాదవ క్షత్రియుడైన శూరసేన మహారాజు మధురా నగరాన్ని పరిపాలించేవాడు. ఆయన కుమారుడే వసుదేవుడు. ఉగ్రసేన మహారాజు కుమార్తె అయిన దేవకితో వసుదేవునికి వివాహం జరిపిస్తారు. వివాహం తర్వాత చెల్లెలిని అత్తవారింట దిగవిడచడానికి కంసుడు స్వయంగా రథాన్ని నడుపుతాడు. రథం మార్గమధ్యంలో ఉండగానే ‘నీ చెల్లెలికి పుట్టబోయే ఎనిమిదో కుమారుడు నిన్ను సంహరిస్తాడు’ అని అశరీరవాణి పలకడంతో ఆగ్రహోదగ్రుడైన కంసుడు చెల్లెలు దేవకిని, బావ వసుదేవుడిని చెరసాలలో బంధిస్తాడు.

చెరసాలలో దేవకికి పుట్టిన ఆరుగురు బిడ్డలను నిర్దాక్షిణ్యంగా తన కత్తికి బలిచేస్తాడు. దేవకి ఏడోగర్భంలో ఉండగా విష్ణువు తన మాయతో ఆ పిండాన్ని నందుడి భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. రోహిణికి కొడుకుగా బలరాముడు పుడతాడు. దేవకికి చెరసాలలోనే గర్భస్రావం అయి ఉంటుందని కంసుడు సరిపెట్టుకుంటాడు. కొన్నాళ్లకు దేవకి ఎనిమిదోసారి గర్భందాలుస్తుంది. శ్రావణ బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రివేళ శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. కృష్ణుడిని పొత్తిళ్లలో పట్టుకుని వసుదేవుడు చెరసాల దాటి బయలుదేరుతాడు. దారిలో ఉన్న యమునా నది రెండుగా చీలి అతనికి దారి ఇవ్వడంతో నందుని ఇంటికి చేరుకుంటాడు వసుదేవుడు.

నందుని మరో భార్య యశోద పక్కనున్న శిశువును తీసుకుని, ఆమె పక్కన కృష్ణుడిని విడిచిపెట్టి, తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. ఉదయాన్నే దేవకి శిశువును ప్రసవించిందన్న వార్త విన్న కంసుడు బిడ్డను చంపడానికి చెరసాలకు వెళతాడు. పుట్టినది కొడుకు కాదు, ఆడశిశువు అంటూ దేవకీ వసుదేవులు వారిస్తున్నా, కంసుడు ఆ శిశువును లాక్కును నేలకేసి కొట్టబోతాడు. శిశువు యోగమాయగా పైకెగసి, ‘నిన్ను చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడు’ అని చెప్పి మాయమవుతుంది. దేవకీ వసుదేవులను కంసుడు ఇంకా చెరసాలలోనే ఉంచుతాడు.

మరోవైపు వ్రేపల్లెలోని నందుని ఇంట కృష్ణుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంటాడు. తనను చంపబోయే బాలుడు ఎక్కడున్నాడో వెదికి పట్టుకుని చంపాలంటూ కంసుడు తన చారులను నలువైపులా పంపుతాడు. కంసుడు పంపిన వారిలో పూతన తొలుత కృష్ణుడి జాడ కనుక్కుంటుంది. విషపూరితమైన పాలు ఇవ్వబోయిన పూతనను పాలుతాగే వయసులోనే కృష్ణుడు పరిమార్చుతాడు. దోగాడే వయసులో కృష్ణుడి అల్లరి ఎక్కువవడంతో యశోద అతణ్ణి రోకలికి కట్టేస్తుంది. రోకలిని ఈడ్చుకుంటూ దోగాడుతూనే వెళ్లి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం కలిగిస్తాడు. బుడిబుడి నడకల ప్రాయంలోనే కంసుడు పంపిన బక, ధేనుక, శకటాసురాదులను సంహరిస్తాడు. ఆరుబయట ఆటలాడుకుంటూ ఒకసారి బాలకృష్ణుడు మన్నుతినడంతో తోటి గోపబాలకులు యశోదకు ఫిర్యాదు చేస్తారు.

తినడానికి ఇంట్లో వెన్న మీగడలుండగా మన్ను తిన్నావెందుకని యశోద గద్దించితే, నోరు తెరిచి తన నోటనే ఏడేడు పద్నాలుగు లోకాలనూ చూపించి, ఆమెను సంభ్రమానికి గురిచేస్తాడు. తనను పూజించడం మానేసినందుకు గోకులంపై ఆగ్రహించిన ఇంద్రుడు కుంభవృష్టి కురిపించి, అల్లకల్లోలం సృష్టించినప్పుడు చిటికిన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, ఆ కొండ నీడన వ్రేపల్లె వాసులకు, గోవులకు రక్షణ కల్పిస్తాడు. కాళింది నదిని విషపూరితం చేస్తూ, జనాలను భయభ్రాంతులను చేస్తున్న కాళీయుని పడగపైకెక్కి తాండవమాడి కాళీయుని మదమణచి తాండవకృష్ణుడిగా చిన్నారి వయసులోనే జేజేలందుకుంటాడు. చిన్న వయసులోనే ఇన్ని మహిమలు చూపినా, మళ్లీ ఏమీ ఎరుగని వానిలాగానే తోటి గోపబాలకులతో కలసి ఆలమందలకు కాపలాగా వెళతాడు. వాళ్లతో కలసి అల్లరి చేస్తూ ఆటలాడుతాడు. ఎవరూలేని గోపాలుర ఇళ్లలోకి చొరబడి వెన్నమీగడలను దొంగిలిస్తాడు. ఇంటి మీదకు తగవులు తెచ్చి, మామూలు అల్లరిపిల్లవాడిలాగానే తల్లి యశోదతో చీవాట్లు తింటాడు.

అరుదైన గురుదక్షిణ
అల్లరిగా ఆటపాటలతో గడిపే కృష్ణబలరాములకు విద్యాభ్యాసం జరిపించాలనుకుంటాడు నందుడు. సాందీపని మహర్షి గురుకులంలో చేరుస్తాడు. కృష్ణబలరాములు సాందీపని మహర్షి గురుకులంలో చేరేనాటికి ఆయన పుత్రశోకంతో కుమిలిపోతూ ఉంటాడు. బాల్యంలోనే ఆయన కొడుకు ప్రభాస తీర్థంలో మునిగిపోతాడు.. గురువుకు శుశ్రూషలు చేసి మిగిలిన శిష్యుల మాదిరిగానే బలరామ కృష్ణులు విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటారు. విద్యాభ్యాసం పూర్తయి, గురుకులాన్ని విడిచిపెట్టే సమయంలో గురుదక్షిణగా ఏమివ్వమంటారని అడిగాడు కృష్ణుడు. గురుపత్ని విలపిస్తూ ప్రభాసతీర్థంలో మునిగి కనిపించకుండా పోయిన తమ కుమారుడిని తెచ్చివ్వగలరా అని అడుగుతుంది. బలరామకృష్ణులు ప్రభాసతీర్థానికి చేరుకుంటారు. ప్రభాసతీర్థంలో గురుపుత్రుడిని అపహరించుకుపోయిన పాంచజన్యునితో పోరాడి, అతనిని తుదముట్టించి, గురుపుత్రుని సురక్షితంగా తీసుకువచ్చి, అతడిని గురుదక్షిణగా సమర్పించి, గురుకులం వీడి ఇంటికి చేరుకుంటారు కృష్ణబలరాములు.

కృష్ణుడిని ఎలాగైనా తుదముట్టించాలన్న పట్టుదలతో కంసుడు పథకం పన్నుతాడు. ఉద్ధవుడిని దూతగా పంపి కృష్ణ బలరాములను మథురకు రప్పిస్తాడు. వారిని చంపడానికి చాణూర ముష్టికులనే మల్లులను ఉసిగొల్పుతాడు. కృష్ణుడు చాణూరుడిని, బలరాముడు ముష్టికుడిని సంహరిస్తారు. తర్వాత కృష్ణుడు కంసుడిని తుదముట్టించి, చెరలో ఉన్న తాత ఉగ్రసేనుని రాజ్యాభిషిక్తుడిని చేసి, తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను కూడా చెర నుంచి విడిపిస్తాడు. గురుకులంలో చెలికాడైన నిరుపేద బ్రాహ్మణుడు సుదాముడు పెద్దయిన తర్వాత తన ఇంటికి వస్తే, సముచిత రీతిలో ఆతిథ్యమిచ్చి, అతడి దారిద్య్రబాధను కడతేరుస్తాడు.

అష్టమహిషులు
కృష్ణుడు ఎనిమిదిమంది భార్యలను వివాహమాడాడు. రుక్మిణి కృష్ణుడిని ప్రేమించింది. ఆమెను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తలుస్తాడు ఆమె సోదరుడు రుక్మి. బలవంతపు పెళ్లి ఇష్టంలేని రుక్మిణి రహస్య సందేశం పంపడంతో కృష్ణుడు ఆమెను ఎత్తుకుపోయి రాక్షసవివాహం చేసుకుంటాడు. అడ్డు వచ్చిన రుక్మికి సగం శిరస్సు, సగం మీసాలు గొరిగి బుద్ధిచెబుతాడు. సత్రాజిత్తు వద్దనున్న శమంతకమణి పోయి, అతడి సోదరుడు ప్రసేనుడు సింహం నోటపడి మరణించడంతో ఆ నింద కృష్ణునిపై పడుతుంది. శమంతకమణిని జాంబవంతుని గుహలో కనుగొన్న కృష్ణుడు అతడిని యుద్ధంలో గెలవడంతో జాంబవంతుడు శమంతకమణితో పాటు తన కూతురు జాంబవతిని కృష్ణుడికి సమర్పిస్తాడు.

శమంతకమణిని తిరిగి తెచ్చివ్వడంతో సత్రాజిత్తు తన కూతురు సత్యభామతో కృష్ణుడికి వివాహం జరిపిస్తాడు. వసుదేవుడి చెల్లెలైన శ్రుతకీర్తి కూతురు భద్రను, మరో మేనత్త కూతురు అవంతీ రాజపుత్రిక మిత్రవిందను స్వయంవరంలో పెళ్లాడతాడు. కోసలరాజు నగ్నజిత్తు వద్ద ఏనుగులంత బలం ఉండే ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి కూతురునిస్తానని ప్రకటించడంతో, కృష్ణుడు ఏడు రూపాల్లో ఏడు వృషభాలనూ నిగ్రహించి, నగ్నజిత్తు కూతురు నాగ్నజితిని వివాహమాడతాడు. మద్ర దేశాధిపతి కూతురు లక్షణ స్వయంవరంలో కృష్ణుడిని వరిస్తుంది. ఈ ఎనిమిదిమంది ద్వారా కృష్ణుడికి పదేసిమంది చొప్పున కొడుకులు కలిగారు.

మహాభారతంలో కృష్ణుడు
మేనత్త కొడుకులైన పాండవులతో కృష్ణుడికి మొదటి నుంచి స్నేహబాంధవ్యాలు ఉండేవి. ముఖ్యంగా పాండవ మధ్యముడైన అర్జునుడితో శ్రీకృష్ణుడిది విడదీయరాని బంధం. నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారని ప్రతీతి. పాండవపత్ని ద్రౌపదిని సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. శ్రీకృష్ణుడి సలహాల మేరకే ధర్మరాజు మొదలుకొని పాండవులంతా నడుచుకునేవారు. ద్యూత వ్యసనుడైన ధర్మరాజు కృష్ణుడి సలహా తీసుకోకుండానే శకుని ఆహ్వానించగానే మాయజూదంలో చిక్కుకుని సర్వస్వాన్ని కోల్పోతాడు. జూదంలో ధర్మరాజు పణంగా ఒడ్డిన ద్రౌపదిని దుశ్శాసనుడు కురుసభలోకి ఈడ్చుకొచ్చి వలువలు వలిచే ప్రయత్నం చేసినప్పుడు ఆమె తలచినంతనే చీరలు ప్రసాదించి, మానసంరక్షణ చేస్తాడు.

మాయజూదంలో ఓటమిపాలై అరణ్య, అజ్ఞాతవాసాల్లో ఉన్న పాండవులకు శ్రీకృష్ణుడు అడుగడుగునా అండగా నిలుస్తాడు. తన రాజ్యానికి బెడదగా ఉన్న జరాసంధుని భీముడి సాయంతో తుదముట్టిస్తాడు. ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయం చేసినప్పుడు శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలమిస్తాడు. శిశుపాలుడు దీనిని ఆక్షేపించి, శ్రీకృష్ణుడిని దూషిస్తాడు. మేనత్తకు ఇచ్చిన వరం మేరకు శిశుపాలుడి వందతప్పులను సహించిన శ్రీకృష్ణుడు, అతడు వందతప్పులనూ పూర్తి చేయడంతో ఇక ఏమాత్రం ఉపేక్షించక తన చక్రాయుధంతో అతడిని సంహరిస్తాడు. పాండవుల అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తయిన తర్వాత వారి తరఫున రాయబారిగా కురుసభకు వెళతాడు.

దుర్యోధనుడు మొండికేసి సూదిమొన మోపినంత చోటైనా పాండవులకు ఇవ్వననడమే కాకుండా, కృష్ణుడిని బంధించడానికి తెగబడటంతో నిండుసభలోనే విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. విశ్వరూపాన్ని తిలకించడానికి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి తాత్కాలికంగా చూపునిస్తాడు. యుద్ధం అనివార్యమైనప్పుడు తాను పాండవులపక్షా నిలిచి, అర్జునుడికి సారథిగా కురుక్షేత్ర రణరంగానికి వెళతాడు. రణరంగంలో అయినవారిని చూసి, తాను వారిని తన చేతులతో సంహరించలేనంటూ అర్జునుడు వెనుకాడినప్పుడు కురుక్షేత్రంలో మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించి, గీతబోధ చేసి, అర్జునుడిని యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం బారి నుంచి ఉత్తర గర్భస్థ శిశువును తన చక్రాన్ని అడ్డువేసి కాపాడతాడు. ఉత్తరకు పుట్టిన కొడుకు పరీక్షిత్తు పాండవుల తర్వాత రాజ్యభారం వహిస్తాడు.

అవతార పరిసమాప్తి
కురుక్షేత్రం యుద్ధంలో వందమంది కొడుకులనూ పోగొట్టుకున్న గాంధారి, దీనంతటికీ కృష్ణుడే కారణమని తలచి అతడిపై ఆక్రోశం పెంచుకుంటుంది. యుద్ధంలో కురువంశం నాశనమైనట్లే యదువంశం కూడా నాశనమవుతుందని గాంధారి శపిస్తుంది. ఇది జరిగిన కొన్నాళ్లకు యాదవ యువకులు కొందరు కృష్ణుడికి జాంబవతి వల్ల పుట్టిన సాంబుడికి ఆడవేషం కట్టి, నిండుచూలాలి మాదిరిగా అలంకరిస్తారు. అటుగా వచ్చిన మునులను అడ్డగించి, ఆడవేషంలోని సాంబుడిని చూపి, పుట్టబోయేది ఆడబిడ్డో, మగశిశువో చెప్పాలంటూ ఆటపట్టిస్తారు. ఆగ్రహించిన మునులు యదుకులాన్ని నాశనం చేసే ముసలం పడుతుందని శపిస్తారు. సాంబుడికి వేషం తీసేశాక, అతడి దుస్తుల్లోంచి లోహపు ముసలం ఒకటి బయటపడుతుంది. దానిని చూసి యాదవులు భయపడతారు. దానినేం చేయాలని పెద్దలను అడిగితే, అరగదీసి సముద్రంలో కలిపేయమని సలహా ఇస్తారు.

వీలైనంత వరకు దానిని అరగదీసి సముద్రంలో కలిపేస్తారు. చిన్న ములుకులాంటి భాగం మిగిలిపోవడంతో దానిని ఒడ్డున పడేస్తారు. ముసలాన్ని అరగదీసిన ప్రదేశంలో రెల్లుగడ్డి మొలుస్తుంది. ములుకులాంటి భాగం ఒక నిషాదుడికి దొరకడంతో, అతడు దానిని తన బాణానికి ములుకులా అమర్చుకుంటాడు. కొన్నాళ్లకు యాదవులు తప్పతాగి వారిలో వారే కొట్లాడుకుని ఒకరినొకరు చంపుకుంటాడు. జరిగిన దారుణానికి తల్లడిల్లిన బలరాముడు యోగమార్గంలో దేహత్యాగం చేస్తాడు. కృష్ణుడు ఒంటరిగా ఒక చెట్టునీడన కూర్చుని వేణువూదుతూ కాలిని ఆడిస్తుండగా, అక్కడేదో మృగం ఉందని భ్రమించి నిషాదుడు బాణం సంధిస్తాడు.

ఆ బాణం వల్లనే కృష్ణుడు దేహత్యాగం చేశాడని, బాణాన్ని సంధించిన నిషాదుడు గతజన్మలో వాలి కొడుకైన అంగదుడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. వాలిని రాముడు చెట్టుచాటు నుంచి వధించడం వల్లనే ద్వాపరయుగంలో నిషాదుడిగా జన్మించిన అంగదుడు చెట్టుచాటునున్న కృష్ణుడిపై బాణం సంధిస్తాడని కొన్ని పురాణాల కథనం. శ్రీకృష్ణుడి నిర్యాణంతో ద్వాపరయుగం అంతరించి కలియుగం ప్రారంభమైందని కూడా పురాణాలు చెబుతాయి. అయితే, శ్రీకృష్ణుడు జరామరణ రహితుడని రామానుజాచార్యులు మొదలుకొని గౌడీయ వైష్ణవ గురువుల వరకు పలువురు ఆచార్యలు చెప్పారు. పరమాత్మ అవతారమైన శ్రీకృష్ణుడు ఆదిమధ్యాంత రహితుడని, పాంచభౌతిక దేహానికి అతీతుడని వైష్ణవుల విశ్వాసం.

పురాణాలు... చారిత్రక ఆధారాలు...
శ్రీకృష్ణుని ప్రస్తావన పురాణాల్లోనే కాకుండా, ఉపనిషద్వాంగ్మయంలోనూ కనిపిస్తుంది. ఉపనిషత్తుల్లో అత్యంత ప్రాచీనమైనదని భావిస్తున్న ‘ఛాందోగ్యోపనిషత్తు’లో కృష్ణుడి ప్రస్తావన కనిపిస్తుంది. కృష్ణుడి ప్రస్తావన ఉన్న తొలిగ్రంథం ఇదే. ఇందులో శ్రీకృష్ణుడు దేవకీసుతుడని, ఘోర అంగీరసుడికి శిష్యుడని ఉంది. ‘నారాయణ అధర్వశీర్ష’, ‘ఆత్మబోధ’ వంటి ఉపనిషత్తులు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడని, నారాయణుని అవతారమని చెప్పాయి. హరివంశం, విష్ణుపురాణం వంటి పురాణగ్రంథాల్లో కూడా కృష్ణుని గురించిన గాథలు కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలో మగధ రాజ్యానికి వచ్చిన గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్‌ తన రచనల్లో కృష్ణుడిని ‘హెరాకిల్స్‌’గాను, బలరాముడిని ‘అగాథకిల్స్‌’గాను ప్రస్తావించాడు. మధుర రాజైన శూరసేనుడు ‘హెరాకిల్స్‌’ను పూజించేవాడని మెగస్తనీస్‌ రాశాడు.

క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ది నాటి గ్రీకు రాయబారి హెలియోడోరస్‌ విదిశ ప్రాంతంలోని బేస్‌నగర్‌లో నెలకొల్పిన స్థూప శాసనంలో ‘దేవదేవుడైన వాసుదేవుని కోసం’ ఆ గరుడ స్తంభాన్ని భక్తుడైన తాను వేయించినట్లు పేర్కొన్నాడు. ఇండో–గ్రీకు పాలకుడైన అగాథోక్లెస్‌ క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దిలో కృష్ణబలరాముల బొమ్మలున్న నాణేలను ముద్రించాడు. ఆ కాలంలోనే వృష్టివంశానికి చెందిన ఐదుగురు వీరులు: కృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు పూజలందుకునేవారు. మధుర సమీపంలోని మోరా వద్ద లభించిన శాసనంలో ఈ ఐదుగురు వృష్టివంశ వీరులకు పూజలు జరిపేవారనేందుకు ఆధారాలు బయటపడ్డాయి. సుమారు అదేకాలంలో వ్యాకరణకర్త పతంజలి రచనల్లో కృష్ణుడు, సంకర్షణుడు, జనార్దనుడు, బలరాముడు, కేశవుడు వంటి దేవతల పేర్లు కనిపిస్తాయి.

కృష్ణుని ఆరాధన... ఆలయాలు...
దేశం నలుమూలలా కృష్ణుని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడిగా, కేరళలోని గురువాయూర్‌లో గురువాయూరప్పగా, గుజరాత్‌లోని నాథద్వారలో శ్రీనాథుడిగా, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బృందావనాలలో శ్రీకృష్ణుడిగా, గుజరాత్‌లోని ద్వారకలో ద్వారకాధీశునిగా, మహారాష్ట్రలోని పండరిపురంలో పాండురంగ విఠలునిగా, తమిళనాడులోని మన్నార్‌గుడిలో రాజగోపాలునిగా ఆరాధిస్తారు. మీరాబాయి, చైతన్య మహాప్రభువు, సూరదాసు, భక్త జయదేవుడు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు వంటివారు కృష్ణభక్తుల్లో సుప్రసిద్ధులు. భారతీయ సంప్రదాయ సంగీత సాహిత్యాలలో కృష్ణునికి విశేషమైన స్థానం ఉంది. కృష్ణుని గురించిన అనేక కీర్తనలు, కృతులు భారతీయ సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేశాయి.

భక్తజయదేవుని గీతగోవిందం, అష్టపదులు, సూరదాసు గీతాలు ఇప్పటికీ ఎక్కడో చోట కచేరీల్లో వినిపిస్తూనే ఉంటాయి. పోతన భాగవతంలో శ్రీకృష్ణుని వర్ణన నిరుపమానమైనవి. తెలుగునాట అన్నమయ్య వంటి పలు వాగ్గేయకారులు కూడా శ్రీకృష్ణుని స్తుతిస్తూ రాసిన కీర్తనలు నేటికీ వినిపిస్తూ ఉంటాయి. ఆధునిక కాలంలో భక్తివేదాంత స్వామి ప్రభుపాద ‘హరేకృష్ణ’ ఉద్యమాన్ని ప్రారంభించి, ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణా కాన్షియస్‌నెస్‌ (ఇస్కాన్‌) స్థాపించారు. ‘ఇస్కాన్‌’ ఆధ్వర్యంలో దేశ దేశాల్లో ఆలయాలు నడుస్తున్నాయి. ధార్మిక జీవనశైలి, భగవద్గీత, కృష్ణతత్వం ప్రచారం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ‘హరేకృష్ణ’ ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ ఉంది. పలువురు విదేశీయులు సైతం ‘ఇస్కాన్‌’ ఆలయాల్లో జరిగే వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు.

జన్మాష్టమి వేడుకలు
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. వైష్ణవ సంప్రదాయం పాటించేవారు ఇళ్లలో కూడా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. బాలకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి పాటలు పాడుతారు. ముంగిళ్లలో బాలకృష్ణుని పాదముద్రలను తీర్చిదిద్దుతారు. ఆ పాదముద్రలనే ఆనవాలు చేసుకుని బాలకృష్ణుడు తమ నట్టింట నడయాడుతాడని కొందరు భక్తులు నమ్ముతారు. ఇంట్లోని పూజమందిరంలో కృష్ణుని ప్రతిమను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. పాలు, అటుకులతో తయారుచేసిన మధుర పదార్థాలను, వెన్న మీగడలను కృష్ణునికి నైవేద్యంగా సమర్పించి, బంధుమిత్రులతో కలసి ఆరగిస్తారు.

కృష్ణాష్టమి రోజున పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత శ్రీకృష్ణ లీలలను పఠించడం లేదా ఆలకించడం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించితే చతుర్విధ పురుషార్థాలూ ప్రాప్తిస్తాయని ‘స్కందపురాణం’ చెబుతోంది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో చిన్నారులు ఉంటే కృష్ణుడిలా, గోపికల్లా వారికి వేషాలు కడతారు. కొన్ని చోట్ల ఉట్టికొట్టే వేడుక జరుపుతారు. భాగవత పారాయణ, భగవద్గీత పారాయణ, విష్ణుసహస్రనామ పారాయణ, కృష్ణాష్టక పారాయణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు