రాక్షస క్రీడ

17 Jan, 2016 15:45 IST|Sakshi
రాక్షస క్రీడ

క్రైమ్ ఫైల్


 జూన్ 19, 2011... ఇండోర్ (మధ్యప్రదేశ్)...
 ‘‘ఏంటి రమ్మన్నారు?’’... లోపల అడుగు పెడుతూనే అన్నాడు ఇన్‌స్పెక్టర్.  ‘‘మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి సర్. ఇది చూడండి’’... అన్నాడు డాక్టర్, తన చేతిలోని కాగితాన్ని ఇన్‌స్పెక్టర్ చేతిలో పెడుతూ. దాన్ని ఓ క్షణం పరిశీలించాడు ఇన్‌స్పెక్టర్. తర్వాత తలెత్తి అన్నాడు... ‘‘అంటే చనిపోయిన ముగ్గురిదీ కాకుండా అక్కడ మరొకరి రక్తం ఉందన్నమాట’’. ‘‘అవును సర్. అది కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది. అంటే ఆ సందర్భంలో అతను కూడా తీవ్రంగా గాయపడి ఉండాలి.’’ తల పంకించాడు ఇన్‌స్పెక్టర్. అతనికి ముందురోజు చూసిన సంఘటన కళ్లముందు కదలాడింది.

 శ్రీనగర్ నుంచి ఓ మహిళ ఫోన్ చేసింది. ఓ ఇంట్లో హత్య జరిగింది రమ్మని ఆ ఫోన్ సారాంశం. వెంటనే తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నాడు ఇన్‌స్పెక్టర్. ఇంటి బయటే వణుకుతూ కనిపించింది ఒకామె. పాత ముతక చీర, ముడి వేసి జుత్తు,  మెడలో ఉన్న రోల్డ్‌గోల్డ్ చెయిన్... చూస్తేనే ఇంట్లో పనిమనిషి అయి ఉంటుందని అర్థమవుతోంది. ‘‘నువ్వేనా ఫోన్ చేసింది?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్. ‘‘అవును సర్’’ అంది వణుకుతున్న స్వరంతో.

 ‘‘ఏం జరిగింది?’’
 ‘‘నేను రోజూ పొద్దున్నే ఏడు గంటలకే ఈ ఇంట్లో పని చేయడానికి వస్తానండీ. ఈరోజు మా పిల్లోడికి ఒంట్లో బాలేదు. వాడిని ఆస్పత్రిలో చూపించి, పన్నెండు గంటలకి వస్తానని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాను. తీరా వచ్చి బెల్ కొడితే ఎవరూ తలుపు తీయలేదు. తర్వాత చూస్తే బయట గొళ్లెం పెట్టివుంది. తీసి లోపలికెళ్లి చూశాను. లోపల... లోపల...’’ మాట పూర్తి చేయలేకపోయింది. నుదుటికి పట్టిన చెమటని చీర చెంగుతో తుడుచుకుంది.
 విషయం అర్థమైంది ఇన్‌స్పెక్టర్‌కి. గబగబా లోపలికి వెళ్లాడు. అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా కడుపులో దేవినట్టయ్యింది.

 హాలు, రెండు బెడ్‌రూమ్‌లు, వంట గది... అన్నింట్లోనూ ఎక్కడ చూసినా రక్తమే. హాల్లో అయితే నేలకు ఎరుపు రంగు పూశారా అన్నంతగా ఉంది రక్తం. ఆ రక్తపు మడుగులో పడివుంది ఇంటి యజమానురాలు మేఘా దేశ్‌పాండే (42) మృతదేహం. బెడ్ రూమ్‌లో మంచమ్మీద ఆమె తల్లి రోహిణీ ఫాడ్కే (70) మృతదేహం ఉంది. ఆమె శరీరం నుంచి కారిన రక్తంతో దిండు, దుప్పటి, పరుపు నానిపోయాయి. వంట గదికి, హాల్‌కి మధ్య ఉన్న తలుపు దగ్గర మరో మృతదేహం ఉంది. అది మేఘ కూతురు ఆశ్లేషది. ఇరవయ్యొక్కేళ్ల ఆ అమ్మాయి శరీరం కత్తిపోట్లతో చీరుకు పోయింది. బుల్లెట్లతో తూట్లు పడింది. దాదాపుగా అందరి శరీరాల మీదా తీవ్రమైన గాయాలు ఉన్నాయి.
 ‘‘తప్పించుకునే ప్రయత్నం చేసి వుంటారు సర్. అందుకే శరీరాలు ఎక్కడెక్కడో పడివున్నాయి’’ అన్నాడు కానిస్టేబుల్.

 ‘‘అవును. పాపం పెద్దావిడ కదల్లేదు కాబట్టి ఆవిణ్ని అక్కడే చంపేశారు’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ జరిగిన తీరును అంచనా వేస్తూ. పనిమనిషిని అడిగాడు... ‘‘ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటారు?’’ ‘‘ఎవరూ ఉండరు సర్. అయ్యగారు పుణెలో బ్యాంకులో పని చేస్తారు. మేఘమ్మగారు వాళ్లమ్మ గారితోటి, కూతురు ఆశ్లేషమ్మతోటి ఇక్కడ ఉంటారు. అయ్యగారు అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటారు’’.... చెప్పింది.

 ‘‘ఈ మధ్య కాలంలో వచ్చి వెళ్లారా?’’
 ‘‘లేదండీ... రెండు మూడు నెలలకోసారి ఓ వారం రోజులు సెలవు పెట్టుకుని వస్తుంటారు. సొంత ఇల్లు కాబట్టి అమ్మగారు వాళ్లు ఇక్కడే ఉంటారు.’’ కేసు అంత తేలికగా విడిపోదని అర్థమైంది ఇన్‌స్పెక్టర్‌కి. బాడీస్‌ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించాడు. క్లూస్ టీమ్‌ని పిలిచి ఆధారాలు సేకరించ మన్నాడు. వెంటనే ఫోన్ చేసి మేఘ భర్త నిరంజన్ దేశ్‌పాండేని రప్పించాడు. అతడి ద్వారా ఇంట్లో ఉండాల్సిన ఐదు లక్షల విలువ చేసే నగలు, రెండు ఏటీఎం కార్డులు, లక్షన్నర నగదు మాయమైనట్టు తెలిసింది. కానీ ఎక్కడా వేలిముద్రలు కానీ, మరే చిన్న ఆధారం కానీ దొరకలేదు. దాంతో కేసు ఎలా డీల్ చేయాలా అని ఆలోచనలో పడ్డాడు. కానీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చాక అర్థమైంది... ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగిపోయాడు.
   
 ‘‘సర్’’ అంటూ హడావుడిగా క్యాబిన్‌లోకి వచ్చాడు కానిస్టేబుల్. ఏంటి అన్నట్టు చూశాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘మీరు చెప్పినట్టే ఎంక్వయిరీ చేశాం. ఒక వ్యక్తి తుపాకి తూటా తగిలిన గాయంతో హత్యలు జరిగిన ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ ఆస్పత్రిలో చేరాడట. అది కూడా హత్యలు జరిగిన కాసేపటికే.’’ చివ్వున లేచాడు ఇన్‌స్పెక్టర్. ‘‘వెరీగుడ్. హత్యలకు తుపాకీలను కూడా ఉపయోగించారు కాబట్టి వీడికి సంబంధం ఉండే చాన్స్ ఉంది. వాడి వివరాలన్నీ కనుక్కున్నారా?’’

 ‘‘హాస్పిటల్‌లో వాడు ఇచ్చిన అడ్రస్, ఫోన్ నంబర్ ఫేక్ అని తేలింది సర్.’’
 మళ్లీ ఆలోచనలో పడ్డాడు ఇన్‌స్పెక్టర్. ఎందుకో వాడు ఆ హత్యలతో సంబంధం ఉన్నవాడే అనిపిస్తోంది. కానీ ఎలా కనిపెట్టాలి వాణ్ని? చాలాసేపు మథనం జరిగిన తర్వాత బుర్రలో మరో ఆలోచన ఫ్లాష్‌లా మెదిలింది. కానిస్టేబుళ్లను పిలిచి ఏం చేయాలో చెప్పాడు. వాళ్లంతా దాన్ని ఫాలో అయిపోయారు. అంతే... రెండే రెండు రోజుల్లో కేసు మిస్టరీ విడిపోయింది.
   
 ‘‘శ్రీనగర్‌లో హత్యలు చేసింది హంతకుడు కాదు, హంతకి’’... తన చేతిలో ఉన్న పేపర్‌లో రాసిన ప్రధానవార్త శీర్షికను గట్టిగా చదివాడు ఇన్‌స్పెక్టర్. ఎదురుగా కూర్చుని ఉన్న యువతి తల దించుకుంది.
 ‘‘నేహావర్మ... చాలా మంచి పేరు. ప్లాన్ కూడా మంచిగానే వేశావ్. కాకపోతే అదృష్టం కలిసిరాక దొరికిపోయావ్.’’
 చురుక్కున చూసింది నేహ. ‘‘మీరు తప్పుగా అనుకుంటున్నారు సర్. నేనే నేరమూ చేయలేదు. అసలు వాళ్లెవరో కూడా నాకు తెలీదు’’... అరిచినట్టే అంది.

 నవ్వాడు ఇన్‌స్పెక్టర్. ‘‘పోనీ వాళ్లు తెలుసేమో చూడు’’ అన్నాడు. వెంటనే అతడు చూపించిన వైపు చూసింది నేహ. అంతే... ఆమె ముఖం పాలిపోయింది. బిక్కమొగం వేసి బిత్తర చూపులు చూడసాగింది.
 ‘‘షాక్ తిన్నావ్ కదా! నీకే అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు నాకెన్ని ఉండాలి? అందుకే మిమ్మల్ని ఇంత త్వరగా పట్టేశా. చాలా బాగా ప్లాన్ వేశారు. ఎక్కడా ఏ ఆధారమూ వదిలిపెట్టలేదు. కానీ పోలీసులు మీకంటే రెండు ఆకులు ఎక్కువే తిన్నారన్న విషయాన్ని మర్చిపోయారు’’ అంటూ నిజాన్ని ఎలా కనిపెట్టాడో వివరించాడు ఇన్‌స్పెక్టర్.

 హాస్పిటల్లో చేరిన వ్యక్తే నేరస్తుడై ఉంటాడన్న నమ్మకంతో సీసీ టీవీ ఫుటేజులు తెప్పించుకుని చూశాడు ఇన్‌స్పెక్టర్. ఆ వ్యక్తి రూపం ఎలా ఉంటుందో పట్టాడు. మరుక్షణం అతడి కోసం వెతుకులాట మొదలైంది. కానీ అతడు దొరికేలోపే మూడు ఏటీఎమ్స్‌లో నుంచి దేశ్‌పాండే కుటుంబస్తుల కార్డులతో ఎవరో డబ్బు డ్రా చేసిన విషయం బ్యాంకు వాళ్లు చెప్పారు. అది కూడా ఒకే సమయంలో. దాంతో నేరస్తుడు ఒక్కడు కాదు అన్న విషయం అర్థమైంది. వెంటనే ఆ ఏటీఎమ్స్‌లోని ఫుటేజులు కూడా సంపాదించారు.

ఆస్పత్రిలోని వ్యక్తితో పాటు మరో వ్యక్తి, ఒక అమ్మాయి డబ్బులు డ్రా చేశారు. వాళ్లు తర్వాత కచ్చితంగా నగలు అమ్మడానికి ప్రయత్నిస్తారు. అందుకే అన్ని బంగారం షాపుల దగ్గరా నిఘా వేశారు. ఓ షాపు దగ్గర ముగ్గురినీ పట్టేశారు.  ఇన్‌స్పెక్టర్ చెప్పింది విని ఖంగు తిన్నది నేహ. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక బొమ్మలా ఉండిపోయింది. ‘‘మౌనంగా ఉంటే కుదరదు మేడమ్. చెప్పు. అసలు దేశ్‌పాండే కుటుంబం నీకెలా తెలుసు? వాళ్లని అంత దారుణంగా ఎందుకు చంపారు?’’ ఇన్‌స్పెక్టర్ గర్జించేసరికి నోరు విప్పింది నేహ. ‘‘కొద్ది రోజుల క్రితం ఓ షాపింగ్ మాల్‌లో మేఘా దేశ్‌పాండేని చూశాను సర్. ఒంటి నిండా ఖరీదైన నగలున్నాయి. కావాలనే వెళ్లి పరిచయం చేసుకున్నాను. చాలా అందంగా ఉన్నారంటూ పొగిడాను.

నేనో బ్యూటీషి యన్‌నని చెప్పాను. నేను ఆవిడకి చాలా నచ్చాను. దాంతో నా దగ్గరే బ్యూటీ ట్రీట్‌మెంట్స్ తీసుకుంటానని చెప్పింది. ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది. చివరికి ఇంటికి సైతం వెళ్లేంతగా తనకి క్లోజ్ అయ్యాను. ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఉంటారని తెలిసి నా లవర్ రాహుల్, తన ఫ్రెండ్ మనోజ్‌తో కలిసి దోపిడీకి ప్లాన్ చేశాను. బెదిరించి అన్నీ దోచుకెళ్లాలని మొదట అనుకున్నాం. కానీ నేను వాళ్లకి బాగా తెలుసు కాబట్టి ప్రమాదమని తెలిసి చంపేశాం.’’

 ‘‘ఛీ. ముక్కూముఖం తెలియని నిన్ను నమ్మినందుకు... అంత దారుణంగా ప్రాణాలు తీస్తావా? తేలికగా డబ్బు సంపాదించడానికి మరో మార్గమే దొరకలేదా నీకు? నీలాంటివాళ్లు ఉండబట్టే నీడను కూడా నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.’’ ఆ మాటలు అంటున్నప్పుడు ఇన్‌స్పెక్టర్ ముఖం చూసివుంటే... అతని చూపుల్లోని అసహ్యానికి ఆ క్షణమే నేహ మనిషిగా చచ్చిపోయి ఉండేది. కానీ ఆమె అతనివైపు చూడలేదు. చూసే ధైర్యం చేయలేదు.     రెండు క్షణాల తర్వాత లేడీ కానిస్టేబుల్‌తో ఇన్‌స్పెక్టర్ అన్న మాటలు వినిపించాయి... ‘‘జాలి లేకుండా సాటి ఆడవాళ్లు ప్రాణాలు తీసింది. నువ్వూ జాలిపడాల్సిన పని లేదు.’’ మరుక్షణం లేడీ కానిస్టేబుల్ లాఠీ గాల్లోకి లేచింది. నేహ కళ్ల నుంచి మొదటి సారిగా కన్నీరు ఉబకడం మొదలయ్యింది.
 - సమీర నేలపూడి
 

మరిన్ని వార్తలు