మోడల్

5 Mar, 2017 01:59 IST|Sakshi
మోడల్

1
నాగరాజు భోరుమని విలపిస్తున్నాడు.
‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఎన్నో కలలు కన్నాను’’ ఆ గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న శ్వేతను చూసి పెద్దగా ఏడుస్తున్నాడు నాగరాజు.
‘‘అసలేం జరిగింది?’’ అడిగాడు  ఇన్‌స్పెక్టర్‌ నరసింహ.
‘‘నాకు మాత్రం ఏం తెలుసు?’’ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు నాగరాజు.
‘‘శ్వేతను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. ఈ విషయం చెప్పడానికి సంకోచిస్తున్నాను. నాకు నేనే ధైర్యం చెప్పుకొని ఈరోజు ఎలాగైనా సరే ఆమెకు నా మనసులో మాట చెప్పాలని గులాబీపూలు, ఒక చిన్న గోల్డ్‌రింగ్‌తో ఇక్కడికి వచ్చాను. డోర్‌ బెల్‌ నొక్కితే... అటు నుంచి రెస్పాన్స్‌ లేదు. డోర్‌ను కొంచెం గట్టిగా తాకగానే తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూస్తే... రక్తపు మడుగులో శ్వేత పడి ఉంది. వెంటనే మీకు ఫోన్‌ చేశాను’’ అని చెప్పాడు నాగరాజు.
‘‘శ్వేతకు ఎవరైనా శత్రువులు ఉన్నారా?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ నరసింహ.
‘‘ఆమె మోడల్‌. చాలా తక్కువ కాలంలోనే పెద్ద పేరు తెచ్చుకుంది. ప్రొఫెషనల్‌ జెలసీ వల్ల ఆమెకు శత్రువులు ఉండే అవకాశం బలంగా ఉంది. శ్వేత అడ్డు తొలగిస్తే తమకు ఎదురు ఉండదని అనుకునేవారు కూడా ఉంటారు కదా!’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.
‘‘అలాంటి వారు ఉంటే పేరు చెప్పండి?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
‘‘శ్వేత మోడల్‌ అనే విషయం తప్ప ఆమె ప్రొఫెషన్‌ గురించి నాకు పెద్దగా తెలియదు’’ అన్నాడు నాగరాజు.
‘‘సరే...ఆ సంగతి మేము చూసుకుంటాం లే’’ అని బయటికి వెళ్లబోతూ యథాలాపంగా ఒక్కసారి వెనక్కి చూశాడు నాగరాజు.
‘క్లూ’ దొరికింది!
నాగరాజు దగ్గరికి వచ్చి ‘‘ఇక్కడి ఎందుకు వచ్చావో, ఏం తీసుకొని వచ్చావో ఒకసారి చెప్పు’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.
‘‘ఇంతకు ముందే చెప్పాను కదా సర్‌...’’ అని చిన్నగా విసుక్కుంటూనే...
‘‘నా లవ్‌ ప్రపోజ్‌ చేద్దామని వచ్చాను. ఒక చిన్న రింగ్, గులాబీ పూలతో వచ్చాను’’ అంటూనే గదిలోని టేబుల్‌ వైపు  చూసి నాలుక కర్చుకున్నాడు నాగరాజు.
తన లవ్‌ ప్రపోజల్‌ను శ్వేత తిరస్కరించిందనే కోపంతో ఆమెను హత్య చేసినట్లు నాగరాజు ఒప్పుకున్నాడు.
నాగరాజు హంతకుడని ఇన్‌స్పెక్టర్‌ అనుమానించడానికి కారణం ఏమిటి?

2
మోడల్‌ మేఘన హత్యకు గురయ్యింది.
హత్య జరిగిన గదిలో పోలీసులు ఆధారాల కోసం వెదికారు. ఏమీ కనిపించలేదు.
‘‘మేఘనకు శ్రీకాంత్‌ అనే బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడట. అతడిని ఎంక్వైరీ చేస్తే ఏౖదైనా తెలియవచ్చు’’  ఇన్‌స్పెక్టర్‌ నరసింహతో చెప్పాడు హెడ్‌కానిస్టేబుల్‌.
‘‘నేను ఆమెను ఈరోజు కలిసిన మాట వాస్తవమే... మధ్నాహ్నం పన్నెండు ప్రాంతంలో కలిశాను. కేవలం పావుగంటలో అక్కడి నుంచి వచ్చేశాను’’ అన్నాడు శ్రీకాంత్‌.
శ్రీకాంత్‌ని అనుమానించడానికి ఏమీ కనిపించలేదు.
మరొకసారి హత్యాస్థలికి వెళ్లి అణువణువూ వెదికాడు ఇన్‌స్పెక్టర్‌.
ఒక మూలన మేఘన ‘డైరీ’ దొరికింది.
 ఆ డైరీలో ఒక పేజీ  దగ్గర ఆగిపోయాడు ఇన్‌స్పెక్టర్‌.
ఆ తరువాత శ్రీకాంత్‌ని అరెస్ట్‌ చేయడం, అతడు నేరాన్ని అంగీకరించడం వెనువెంటనే జరిగింది.హంతకుడిని డైరీలోని ఆ పేజీ ఎలా పట్టించింది?

1
లవ్‌ప్రపోజల్‌ని సున్నితంగా తిరస్కరించి రింగ్‌ తీసుకోలేదు శ్వేత. ‘వీటిని వృథా చేయడం ఎందుకు’ అంటూ గులాబీలను మాత్రం ఫ్లవర్‌వాజ్‌లో పెట్టింది. ఈ విషయాన్ని మరచిపోయాడు నాగరాజు. తన లవ్‌ని ప్రపోజ్‌ చేయకముందే  పూలను ఫ్లవర్‌వాజ్‌లో ఎలా పెడతాడు?! నాగరాజుని ఇన్‌స్పెక్టర్‌ అనుమానించడానికి కారణం ఇదే.
2
‘ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్‌ జాన్‌తో అపాయింట్‌మెంట్‌’ అని డైరీలో ఉంది. డా.జాన్‌తో మాట్లాడితే  ఆ సమయంలో మేఘన తన దగ్గరే ఉంది అని చెప్పాడు. 12 గంటలకు డాక్టర్‌ దగ్గర ఉన్న మేఘనను, ఇంట్లో కలవడం ఎలా సాధ్యం? కంగారులో నోటికొచ్చిన టైం చెప్పి పోలీసులకు దొరికిపోయాడు శ్రీకాంత్‌.

మరిన్ని వార్తలు