చోరీ

23 Apr, 2017 00:51 IST|Sakshi
చోరీ

పరంధామయ్య చాలా విచారంగా ఉన్నాడు. పెయింటింగ్‌లు సేకరించడం అతని హాబీ. అలా ఇంట్లో ఎన్నో పెయింటింగ్స్‌ ఉన్నాయి. అందులో ‘మదర్‌’ అనే విలువైన పెయింటింగ్‌ కూడా ఉంది. ఆ పెయింటింగ్‌ రాత్రి చోరీకి గురయ్యింది. ఇన్ని రోజులు జాగ్రత్తగా కాపాడుకున్న పెయింటింగ్‌ దొంగతనానికి గురికావడం పరంధామయ్య తట్టుకోలేకపోతున్నాడు. పోలీసులు వచ్చారు.

‘‘మా కుక్క పేరు  టైగర్‌. దాని  భయానికి మా ఇంటి వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారు’’ అన్నాడు పరంధామయ్య.‘‘మరి టైగర్‌ నిన్న రాత్రి మొరగలేదా?’’ ఆసక్తిగా అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.‘‘మొరగలేదు సరికదా... గుర్రు పెట్టి నిద్రపోయింది. దానికి మాంసం అంటే ఎంతో ఇష్టం. మాంసంలో మత్తుమందు పెట్టి ఉంటారు దొంగలు. టైగర్‌ అది తిని నిద్రపోయింది’’ అన్నాడు పరంధామయ్య.

‘‘ఇంతకుముందు ఎప్పుడైనా దొంగతనం జరిగిందా?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్‌. ‘‘పాతిక సంవత్సరాల నుంచి పెయింటింగ్స్‌ను సేకరిస్తున్నాను. ఎప్పుడూ ఇలాంటి దొంగతనం జరగలేదు. ఆ ఆనంద్‌ ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. వాడికి రాత్రంతా కూర్చొని చదివే అలవాటు ఉంది. ఏ తెల్లవారు జామునో నిద్రపోతాడు. వాడికి మదర్‌ పెయింటింగ్‌ అంటే  ఎంత ఇష్టమో’’ అన్నాడు పరంధామయ్య.‘‘ఆనంద్‌ ఎవరు?’’ ఆసక్తిగా అడిగాడు ఇన్‌స్పెక్టర్‌.

‘‘ఒకప్పటి నా ఫ్రెండ్‌. నాలాగే పెయింటింగ్స్‌ కలెక్ట్‌ చేసే అలవాటు ఉంది. చాలాకాలం తరువాత నా దగ్గరికి వచ్చాడు. వారం రోజులు ఉండి మొన్ననే వెళ్లిపోయాడు’’ అన్నాడు పరాంధామయ్య.‘‘నాకెందుకో ఇది ఆనంద్‌ పనే అనిపిస్తుంది’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.‘‘అలా అయితే టైగర్‌కు మత్తుమందు పెట్టాల్సిన అవసరం అతనికి ఏం ఉంది? ఆనంద్‌ తెలిసిన వ్యక్తి కాబట్టి టైగర్‌ మొరగదు. ఇది దొంగల పనే అనుకుంటున్నాను’’ అన్నాడు పరంధామయ్య. ఇన్‌స్పెక్టర్‌ ఆలోచనలో పడిపోయాడు. ఇంతకీ ఇది ఎవరి పని? దొంగలదా? ఆనంద్‌దా?

మరిన్ని వార్తలు