పర్‌ఫెక్ట్‌ ప్లాన్‌

16 Dec, 2018 10:51 IST|Sakshi

ట్రైన్‌ కదులుతుండగా హడావుడిగా బోగీలోకి ఎక్కి తన ముందు కూర్చున్న వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాడు అశోక్‌. ‘నీ పేరు శంకర్‌ కదూ. ఆ మధ్య ఓ మార్వాడీ హత్య కేసులో అరెస్ట్‌ అయినప్పుడు నీ ఫోటో పేపర్‌లో చూశాను. నీ కుడి చెంప మీద కత్తిగాటును బట్టి నిన్ను గుర్తుపట్టాను’’ అన్నాడు. ఆ మాటలకు శంకర్‌ తన సీట్లో ఇబ్బందిగా కదిలాడు.‘‘పోలీసులు పొరపాటున నన్ను అరెస్ట్‌ చేశారు. ఆధారాలు లేవని కోర్టు నన్ను వదిలేసింది’’ అన్నాడు సౌమ్యంగా.‘‘నువ్వు ఆధారాలు దొరక్కుండా మర్డర్‌ చేస్తావని నాకు తెలుసులే. నేను కొద్దిరోజులుగా నీ కోసమే వెదుకుతున్నాను. నువ్వు సరైన సమయానికే నాకు కనిపించావ్‌’’ అన్నాడు అశోక్‌ కాస్త నవ్వుతూ.

‘‘నాతోనా?... మీకేం పనీ?’’ అటూ ఇటూ చూస్తూ అడిగాడు శంకర్‌. ఆ బోగీలో చుట్టుపక్కల ప్రయాణికులెవ్వరూ లేరు. అశోక్‌ స్వరం తగ్గించి మెల్లగా చెప్పాడు.‘‘ఓ హత్య చెయ్యాలి. ఐదు లక్షలిస్తాను.’’శంకర్‌ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ‘‘ఎవర్ని చంపాలి?’’ అనడిగాడు మెల్లగా.‘‘నా భార్యను! చాలా ఈజీ. నా దగ్గర ఓ పర్ఫెక్ట్‌ ప్లాన్‌ ఉంది.’’‘‘అవునా! సరే మీ ప్లాన్‌ ఏంటో చెప్పండి!’’‘‘నేను ఈ మంత్‌ 31వ తేదీన బిజినెస్‌ మీటింగ్‌ కోసం ముంబై వెళ్లాల్సి ఉంది. రాత్రి సమయమంతా ప్రయాణం చేసి ముంబైకి చేరుకుంటాను. మా ఇల్లు నగరం పొలిమేరల్లో ఉన్న గుండమ్మ కాలనీ చివర్లో ఉంది. మా ఇంటి పక్కన ఒకే ఇల్లు ఉంటుంది. అది కూడా రెండ్రోజులుగా తాళం వేసి ఉంది.

 మరో పదిరోజులు దాకా ఆ ఇంటి గలవాళ్లు రారు. అందువల్ల రాత్రి సమయంలో మా ఇంట్లో ఏం జరిగినా ఎవరికీ తెలియదు. రోజూ రాత్రి తొమ్మిది కల్లా పని మనిషి పని ముగించుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత నా భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆ రోజు అర్ధరాత్రి మా ఇంట్లో దూరి ఆమెను చంపి ఇనపెట్టెలోని డబ్బు తీసుకుని వెళ్లిపో. దాంతో అది దోపిడీ కోసం జరిగిన హత్య అని పోలీసులు భావిస్తారు. ఆ సమయంలో నేను ఊర్లో ఉండను కాబట్టి నా పైన అనుమానం రాదు’’ ఏమంటావ్‌ అన్నట్లుగా కళ్లు ఎగరేస్తూ చూశాడు అశోక్‌.

‘‘అంతా బాగుంది కానీ నేను మీ ఇంట్లోకి ఎలా దూరాలి?’’ అడిగాడు శంకర్‌.మా ఇంటి ముఖద్వారానికి ఆటోమేటిక్‌ లాక్‌ సిస్టమ్‌ ఉంది. తలుపు లోపలే తాళం ఉంటుంది. కాబట్టి తాళం చెవితో బయటి నుంచి గానీ లోపలి నుంచి గానీ లాక్‌ వెయ్యొచ్చు, తియ్యొచ్చు. నా భార్య దగ్గర ఒక తాళం చెవి ఉంటే నా దగ్గర రెండున్నాయి. అందులో ఇప్పుడే నీకొకటి ఇస్తాను. నా భార్య బెడ్‌రూమ్‌ లోపలి నుంచి బోల్ట్‌ వేసుకుని పడుకుంటుంది. ఆమెను బెడ్‌రూమ్‌లోంచి బయటికి రప్పించే బాధ్యత నాది. తను బయటికి వచ్చేవరకూ అల్మారా వెనక దాక్కో! ఆ తర్వాత నీ పని కానిచ్చి నాకు ఫోన్‌ చెయ్యి. లాకర్‌ నంబర్‌ చెబుతాను. డబ్బు తీసుకుని పారిపో!’’ చాలా నెమ్మదిగా వివరించాడు అశోక్‌.‘‘కానీ... అర్ధరాత్రి సమయంలో బెడ్‌రూమ్‌లోంచి మీ భార్య ఎందుకు బయటికి వస్తుంది?’’ అయోమయంగా అడిగాడు శంకర్‌.

‘‘అదా..! ఏముంది నువ్వు సరిగ్గా అర్ధరాత్రి 11.30కి ఇంట్లోకి వెళ్లి దాక్కో. సరిగ్గా 12 గంటలకు లాండ్‌లైన్‌కి నేను ఫోన్‌ చేస్తాను. ఆ టైమ్‌కి నేను ఎక్కే ట్రైన్‌ ఓ స్టేషన్‌లో చాలా సేపు ఆగుతుందిలే!? ఒకవేళ ఆగకపోతే ట్రైన్‌లో ఎవరో ఒకరి ఫోన్‌ తీసుకుని ఫోన్‌ చేస్తాను’’ నవ్వుతూ చెప్పాడు అశోక్‌.‘‘ప్లాన్‌ బాగుంది!’’‘‘ఈ ప్లాన్‌ సక్సెస్‌ కావాలంటే... నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకో! నీ ఫింగర్‌ ప్రింట్స్‌ దొరక్కుండా చేతులకు గ్లౌజులు వేసుకో. ఆల్‌రెడీ పోలీస్‌ రికార్డ్‌లో నీ ఫింగర్‌ ప్రింట్స్‌ ఉన్నాయని గుర్తు పెట్టుకో. సిగ్నల్స్‌ ఆధారంగా నిన్ను పట్టుకునే అవకాశాలు ఎక్కువ అందుకే సెల్‌ ఫోన్‌ నీ కూడా తీసుకుని వెళ్లకు. ఇంట్లోంచి పారిపోయే ముందు ఇనప్పెట్టె్ట, తలుపులు బలంగా పగలగొట్టు. 

అప్పుడే దోపిడీ కోసం జరిగిన హత్య అని నమ్మకం కలుగుతుంది. అర్థమైందా?’’ శంకర్‌ భుజంపై చెయ్యి వేసి చెప్పుకొచ్చాడు అశోక్‌.‘‘అశోక్‌ అతనికి మరోసారి తన చిరునామా చెప్పి.. జేబులోంచి తన ఇంటి తాళం చెవి తీసి ఇచ్చాడు. సరిగ్గా వారం రోజులుంది ఈ ప్లాన్‌కి. పక్కగా పనైపోవాలి. నీకోసం ఐదు లక్షలు ఆ ఇనుప పెట్టెలోనే పెడతాను. ఇక మనం ఫోన్‌లో మాట్లాడుకోవడం కుదరదు. 31 వ తారీఖున నువ్వు నా భార్యని చంపిన మరుక్షణమే మా ల్యాండ్‌ లైన్‌ నంబర్‌ నుంచే నీకు డబ్బులుండే లాకర్‌ నంబర్‌ చెబుతాను.’’ జాగ్రత్తలన్నీ చెప్పాడు అశోక్‌.
∙∙ 
దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నిర్మానుష్యమైన రోడ్డుపైన యమపాశపు నీడ ఒకటి అశోక్‌ ఇంటివైపు నడిచింది. అశోక్‌ ట్రైన్‌లో చెప్పిన మాటలనే గుర్తు చేసుకుంటూ నడిచింది. తాళం తీసుకుని లోపలికి వెళ్లిన ఆ నీడ... నిజంగా మారి అల్మారా వెనక్కి చేరాడు. జేబులోని తాడును పదే పదే సరిచూసుకుంటూ లాండ్‌ఫోన్‌ రింగ్‌ కోసం ఎదురు చూడసాగాడు. అనుకున్నట్లుగానే అనుకున్న సమయానికి ఫోన్‌ మోగింది. బెడ్‌రూమ్‌ తలుపు తెరుచుకుంది. నిద్రమత్తులో కళ్లు నులుముకుంటూ వచ్చిన ఆమె.. ఫోన్‌ రిసీవర్‌ ఎత్తగానే శంకర్‌ చేతిలోని తాడు ఆమె మెడకు చుట్టుకుని బిగిసింది. పెనుగులాటకు పెద్ద సమయం పట్టలేదు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న శంకర్‌ ఆ రిసీవర్‌ అందుకుని ‘‘పనైపోయింది. లాకర్‌ నంబర్‌ చెప్పు’’ అన్నాడు గంభీరంగా.
∙∙ 
ఊహించినట్లుగానే ముంబైలో ఉన్న అశోక్‌కి హైదరాబాద్‌ పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. ఉన్నఫళంగా హైదరాబాద్‌ చేరుకున్న శంకర్‌.. ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ సూటి ప్రశ్నలకు ముందుగానే సిద్ధం చేసుకున్న సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు.‘‘మిస్టర్‌ అశోక్‌! నిన్న అర్ధరాత్రి మీ భార్య హత్య జరగటానికి కొద్ది సమయం ముందు ల్యాండ్‌ నంబర్‌కి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆ సంగతి టెలిఫోన్‌ ఎక్సే ్చంజీలో రికార్డ్‌ అయ్యింది. ఆ ఫోన్‌ మీరే చేశారా?’’ ‘లేదు సార్‌!’’‘‘అబద్ధం! ఆ ఫోన్‌ షోలాపూర్‌ స్టేషన్‌లో ఉన్న ఓ పబ్లిక్‌ బూత్‌ నుంచి వచ్చింది. ఆ సమయంలో మీరు ప్రయాణిస్తున్న ట్రైన్‌ కూడా అక్కడ ఆగింది. మీరు ట్రైన్‌ దిగి ఆ బూత్‌లోకి వెళ్లడం సీసీ ఫుటేజ్‌లో రికార్డ్‌ అయ్యింది’’ఆ మాటలు వినగానే అశోక్‌ గతుక్కుమన్నాడు. వెంటనే మాట మారుస్తూ... ‘‘అవును సార్‌! ఇప్పుడే గుర్తుకొచ్చింది. నా సెల్‌ సిగ్నల్స్‌ లేకపోవడంతో ఎదురుగా ఉన్న బూత్‌కి వెళ్లి ఫోన్‌ చేశాను. నా భార్య అప్పుడప్పుడు బయట తలుపు లాక్‌ చెయ్యకుండా పడుకుంటుంది. ఆ విషయం నాకు గుర్తుకొచ్చి ఆమెకు ఫోన్‌ చేశాను.’’
‘‘హో..! మరి ఫోన్‌లో ఏం మాట్లాడారు?’’

‘‘తలుపు లాక్‌ చేశావో లేదో చెక్‌ చేసుకో’’ అని చెప్పాను.‘‘అవునా? మరి తనేమంది?’’‘‘సరే చెక్‌ చేస్తాను అంది. కానీ అప్పటికే దొంగ లోపలికి వచ్చినట్లున్నాడు!?’’ చాలా అమాయకంగా ముఖం పెట్టి సమాధానమిచ్చాడు అశోక్‌.‘‘నేను అలా చెప్పానా?’’ హఠాత్తుగా భార్య గొంతు విన్న అశోక్‌ ఉలిక్కి పడ్డాడు.పక్క రూమ్‌లోంచి ఎదురుగా వస్తున్న భార్యను చూసి దెయ్యాన్ని చూసినట్లుగా అదిరి పడ్డాడు.భార్య మళ్లీ మాట్లాడటం మొదలు పెట్టింది... ‘‘ఎందుకండీ అంత షాక్‌ అవుతున్నారు? ఫోన్‌ చెయ్యలేదని ఒకసారి, చేసి మాట్లాడానని ఒకసారి ఎందుకండి అబద్ధాలు చెబుతున్నారు??’’

‘‘అదీ.. అదీ..’’ అంటూ నసుగుతున్న అశోక్‌ను ఉద్దేశించి ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌.. ‘‘చాలు ఆపు మిస్టర్‌! పూర్తి ఆధారాలతోనే నిన్ను ఇక్కడికి రప్పించాను. నిజానికి నువ్వు వేసిన ప్లాన్‌లోనూ పొరబాటు లేదు. నీ కిరాయి రౌడీ ఫాలో అవడంలోనూ పొరబాటు జరగలేదు. నిన్న రాత్రి నువ్వు ముంబై బైలుదేరి వెళ్లిన తర్వాత నీ భార్య బాత్‌రూమ్‌లో కాలు జారిపడిపోయింది. కాలు బెణకడంతో పని మనిషిని సాయంగా ఉండమంది. నిన్న నువ్వు ఫోన్‌ చేసినప్పుడు నీ భార్య బదులు మీ పనిమనిషి ఫోన్‌ లిప్ట్‌ చేసింది. అది తెలియక వాడు ఆమెని చంపేశాడు. ఆ శబ్దానికి బయపడిన నీ భార్య చాటుగా దొంగను చూసి మంచం కింద దాక్కుంది. ఫోన్‌లో లాకర్‌ నంబర్‌ చెప్పమని అడగడంతో ఇదంతా నువ్వే చేశావని అర్థమైంది. లాకర్‌ తెరిచి డబ్బు తీసుకుని వాడు ఇంటి నుంచి పారిపోగానే.. నీ భార్య మాకు ఫోన్‌ చేసి జరిగిందంతా చెప్పింది. పైగా నీ భార్య ఆ దొంగను గుర్తుపట్టింది కూడా. మా వాళ్లు ఆల్‌రెడీ వాడిని వెతికే పనిలో పడ్డారు’’ అంటూ అసలు విషయం చెప్పాడు విజయ్‌.తానొకటి తలిస్తే విధి ఒకటి తలచినట్లు తను వేసిన ప్లాన్‌ అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో కంగుతిన్నాడు అశోక్‌.

మరిన్ని వార్తలు